Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గమననియమాలతో మానవ గమనాన్నే మార్చిన సర్ ఐజాక్ న్యూటన్

[బాలబాలికల కోసం ‘గమననియమాలతో మానవ గమనాన్నే మార్చిన సర్ ఐజాక్ న్యూటన్’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

ప్రియమైన చిన్నారి నేస్తాలూ! యాపిల్ పండు చెట్టుపై నుంచి క్రింద పడితే యాపిల్ క్రిందకే ఎందుకు పడింది? పైకి ఎందుకు పోలేదు? అని అలోచించి ‘భూమ్యాకర్షణ సిద్ధాంతా’న్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరో మీకు తెలుసు కదూ! కరక్టే! న్యూటన్!

మరి న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్నీ, కాంతికిరణంలో రంగులున్నాయనీ ఎలా కనుక్కున్నాడో తెలుసుకుందాం.

ఐజాక్ న్యూటన్ 1642వ సంవత్సరంలో డిసెంబర్ 25వ తేదీన ఇంగ్లాండ్ లోని ఓ పల్లెటూరులో ఐస్‌కఫ్, ఐజాక్ న్యూటన్ అనే దంపతులకు జన్మించాడు. తండ్రీకొడుకుల ఇద్దరి పేర్లు కూడా ఐజాక్ న్యూటనే. లింకన్ జిల్లాలోని కొలెస్టరోదర్త్‌లో న్యూటన్ బాల్యం గడిచింది. అప్పుడే నాలుగు అడుగుల ఎత్తుగల నీటి గడియారాన్ని తయారుచేశాడు.

కేంబ్రిడ్జిలోని కళాశాలలో చేరిన తరువాత గణిత సూత్రాల అర్థాలను అధ్యాపకులకే వివరించాడు. తోకచుక్కల గురించి, వృత్తాల గురించి, చంద్రుని చుట్టూ ఉన్న కాంతి పరివేషాన్ని పరిశీలించి తెలుసుకున్న విషయాలను 1665వ సంవత్సరం  మే, 20న ఒక వ్యాసంగా వ్రాశాడు.

న్యూటన్ కాలేజీ రోజుల్లోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. ఇది కేవలం భూమికే కాదు మొత్తం విశ్వానికి వర్తిస్తుందనీ, గురుత్వాకర్షణ కారణంగానే గ్రహాలు స్థిరమైన కక్ష్యలో ఖచ్చితమైన కాలభ్రమణాలు చేస్తుంటాయనీ న్యూటన్ వివరించాడు.

గాజు పట్టకం ద్వారా సూర్యకిరణాన్ని పంపితే అది ఏడు రంగులుగా విడిపోతుందని ఆ మరుసటి ఏడాదే న్యూటన్ కనుగొన్నాడు. 1668లో న్యూటన్ పరివర్తన దూరదర్శినిని తయారుచేసి రాయల్ సొసైటీకి బహూకరించాడు. 1669లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రాచార్యుడిగా నియమితులయ్యారు. న్యూటన్ గమన నియమాల ఆధారంగానే రాకెట్లు రూపుదిద్దుకోవడం, మనిషి అంతరిక్షంలో ప్రయాణం చేయడం సాధ్యమయ్యాయి. మొదటి నియమం ఒక పదార్థ జడత్వాన్నీ బల స్వభావాలనీ, రెండో నియమం బలాన్ని కొలిచే పద్ధతినీ, బలప్రభావం వల్ల వస్తువులు కదిలే దిశలనూ, మూడో నియమం అంతరిక్ష శాస్త్ర రంగానికీ ఉపయోగపడ్డాయి.

గురుత్వాకర్షణ శక్తిని వివరిస్తూ ‘ప్రిన్సిపియా’ అనే గ్రంథాన్ని రచించాడు. ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎడ్మండ్ హేలీ ప్రోత్సాహంతో ‘ఫిలసోఫియా నేచురాలిస్ ప్రిన్సిపియా మేథమెటికా’ అనే పుస్తకాన్ని ప్రచురించాడు. న్యూటన్ ప్రవాహాల గురించి చేసిన పరిశోధనల్ని 1667లో గ్రంథరూపంలోకి తీసుకువచ్చాడు.

1703లో న్యూటన్ రాయల్ సొసైటీ అధ్యక్షుడిగా ఎంపికయినాడు. 1705 ఏప్రిల్ 16వ తేదీన న్యూటన్ ఇంగ్లాండ్ రాణిచే ‘సర్’ అనే బిరుదుతో గౌరవింపబడ్డాడు. 1727 మార్చి 2వ తేదీన రాయల్ సొసైటీ సమావేశానికి అధ్యక్షత వహించాడు. విజ్ఞానశాస్త్ర రంగంలో గమననియమాల ద్వారా మానవ గమనాన్నే మార్చివేసిన అసాధారణ ప్రతిభావంతుడు ‘సర్ ఐజాక్ న్యూటన్’ 1727వ సంవత్సరం మార్చి 20వ తేదీన ఇంగ్లాండులో శాశ్వతంగా కన్నుమూశాడు.

Exit mobile version