భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలు, ప్రాంతాన్ని బట్టి తలోరకంగా అనిపించి నప్పటికీ మొత్తం మీద ‘ఇది భారతీయం’ అనేట్లుగా ఉంటాయి. ఏ విదేశీయులైనా, మన సంస్కృతీ సంప్రదాయాలను యిట్టే గుర్తు పట్టేస్తారు. అదీ మన ప్రత్యేకత!
ప్రస్తుత సమాజం పాశ్చాత్య పోకడలకు మొగ్గు చూపుతుంటే, పాశ్చాత్యులు మాత్రం మన సంస్కృతీ సంప్రదాయాలవైపు చూడడం మనం గమనిస్తున్నాము. మన సంప్రదాయాల పట్ల మనకే గౌరవం లేకుండా పోతున్నదన్నది పచ్చి నిజం. కుల మతాలను పక్కన పెడితే, ప్రాంతాలను వేరుగా అధ్యయనం చేస్తే, అవి మన మంచికి, మన ఆరోగ్యానికి, మన క్రమశిక్షణకు, కుటుంబాల మధ్య ప్రేమానురాగాలు పెంపొందించుకోవడానికి, మంచి ఆలోచనలతోనే నిర్ణయించ బడ్డాయి. పరిశుభ్రతకూ,పర్యావరణ సంరక్షణకు పట్టం కట్టాయి. అవి అర్థం కాక కొందరూ, అర్థం కాకుండా ప్రయత్నం చేసిన కొందరివల్ల, కొందరు వాటిని స్వార్థానికి ఉపయోగించుకోవడం వల్ల మన సంప్రదాయాలకు గండి పడుతూ వచ్చింది. కొందరికి ఇది వ్యాపారంగా మారి సంప్రదాయాలను అపహాస్యం చేసే పరిస్థితి దాపురించింది. అందువల్ల సంప్రదాయాలను, మామూలు విషయాలుగా తీసుకోవడంతో, నిర్లక్ష్యానికి గురి అవుతున్నాయేమోనని భావించక తప్పదు. అలంటి సంప్రదాయాలలో ‘తద్దినం’ ఒకటి.
తద్దినం.. అంశాన్ని నేపధ్యంగా తీసుకుని, కథా రచయిత శ్రీ పాణ్యం దత్తశర్మ ‘భోక్తలు’ (దత్త కథాలహరి కథల సంపుటిలో) అనే కథను రాశారు.
ఇది చదివిన తర్వాత, ఇలాంటి కథలు తప్పనిసరిగా ప్రజల్లోకి (పాఠకుల్లోకి) వెళ్లవలసిన అవసరం ఉందని పాఠకుడిగా, కథా రచయితగా నాకు అనిపించింది.
విషయం అందరిదీ కనుక ఈ కథ, కథా ప్రియులందరూ చదవాలని నాకు అనిపించింది.
బ్రతికి ఉండగా తల్లిదండ్రులను పట్టించుకొనకపోయినా, సరిగా చూడకపోయినా వారి వృద్ధాప్యం ఒక నరకంగా వారు అనుభవించినా, చనిపోయిన తర్వాత మాత్రం కొందరు సంప్రదాయాలను తూ.చ. తప్పకుండా పాటించే ప్రయత్నం చేస్తారు. నిజంగా తల్లిదండ్రులపై ప్రేమ వున్న వారు, నిష్ఠగా – భక్తి శ్రద్దలతో చేయవలసినవన్నీ చేస్తారు. మరికొందరు బయటి జనం కోసం చేస్తారు, వారికి ఇష్టం లేకపోయినా, మమ.. అనిపిస్తారు. ఇక ఇప్పుడు భోక్తలుగా వచ్చే బ్రాహ్మణులకు ఇది డబ్బు సంపాదించుకునే వ్యాపార మార్గం అయిపోయింది. సంప్రదాయాలూ ఆచారాలు, పాటించవలసిన వారు, పాటింపజేయవలసిన వారూ వీరే అయినా ఆ తద్దినం క్రియను ఒక వేళాకోళం ప్రక్రియగా చేయడం ‘భోక్తలు’ కథలో మనం చూడవచ్చు. ఎంతో డబ్బు ఖర్చుపెట్టి, అవసరమైన సరంజామా కొని, రకరకాల వంటలు – పిండివంటలు, భోక్తలకోసం సిద్ధం చేస్తే, భోక్తలు శుచీ – శుభ్రత పాటించకుండా, ఆహార పదార్ధాలను ముట్టీ ముట్టనట్టు చేసి వండినదంతా చెత్తకుండీ పాలుచేయడం ఎంతవరకూ సమంజసం? తిండి తిప్పలు లేక ఎంతోమంది బీదవాళ్లు ఆకలి చావులు చస్తుంటే, అన్యాయంగా ఆహార పదార్థాలను వృథా చేయడం నేరం కాదా! తాంబూలాలు ఇచ్చేటప్పుడు మాత్రం అధిక సొమ్ము డిమాండు చేయడం వంటివి రచయిత కళ్లకు కట్టినట్టు ఈ కథలో చూపించారు. ఇదే అనుభవం రుచి చూసిన ఆ జంట, తర్వాతి సంవత్సరం, ఈ తద్దినం ప్రక్రియకు మిత్రుల సలహాతో, మరో మార్గం ఎన్నుకోవడం, అక్కడ కూడా వారు దగాపడడం ఎవరికైనా బాధ అనిపిస్తుంది, అంతమాత్రమే కాదు, ఆలోచింప జేస్తుంది కూడా!
ఈ కథకు రచయిత ఇచ్చిన ముగింపు గొప్పదీ, ఆహ్వానింపదగ్గదీను. కథలోని పాత్రలు – దత్తాత్రేయ, హిరణ్మయి తీసుకున్న నిర్ణయం రచయిత ఆలోచనకు, సహృదయతకు తార్కాణం. ఆ దంపతులు తమ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తర్వాతి కాలంలో ఇక తద్దినం కోసం భోక్తల అవసరం లేకుండా చేసుకున్నారు. ఆరోజు చేయవలసిన వంటకాలు అన్నీ చేసి, బయట ఆకలితో అలమటిస్తున్న పేదలకు, అవిటివారికి, భిక్షగాళ్లకు అందించడం అనే ఆలోచన గొప్పది, అందరూ ఆచరించదగ్గదీను!
రచయిత ఈ కథ రాసి గొప్ప సాహసమే చేశారని నా అభిప్రాయం. ఈ కథ చదివి ఎవరైనా భుజాలు తడుముకున్నారేమో, ఈ కథా రచయితకు అనుభవమయ్యే ఉంటుంది. ఇలాంటి కథలను పాఠకులు చదవాలి, పత్రికలూ ప్రాధాన్యతనివ్వాలి. ఇలాంటి కనువిప్పు కలిగించే కథలు రాసే కథకులు కూడా ముందుకు రావాలి. కథల పోటీల్లో ఇలాంటి కథలే ముందు వరుసలో నిలబడాలి. ఒక మంచి కథను చదివిన తృప్తిని అందించిన కథా రచయితకు హృదయపూర్వక ధన్యవాదాలు,శుభాకాంక్షలు.
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.