[బాలబాలికల కోసం ‘జీవితాన్నంతా ప్రయోగశాలకు అంకితం చేసిన ఆల్‌ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]
అత్యంత ప్రతిష్ఠాకరంగా భావించే ‘నోబెల్ బహుమతుల’ గురించి, ఆ బహుమతి గ్రహీతల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటుంటాము కదా! మరి ఆ నోబెల్ బహుమతుల్ని స్థాపించిందెవరు? ఏ ఆశయంతో స్థాపించారో తెలుసుకుందామా?
ఆల్‌ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ 1833వ సంవత్సరం అక్టోబరు 21వ తేదీన స్వీడన్ లోని స్టాక్‌హోంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు ఇమాన్యుయెల్ నోబెల్. ఈయన పేలుడు పదార్థాలపై పరిశోధనలు చేస్తుండేవాడు. ఆల్‌ఫ్రెడ్ హైస్కూలు చదువును సెయింట్ పీటర్స్‌బర్గ్ లోనూ, ఉన్నత చదువును యూరప్, అమెరికాలలోనూ సాగించాడు.
ఆల్‌ఫ్రెడ్ తండ్రితో పాటు పేలుడు పదార్థాలపై పరిశోధనలు చేస్తూ 1863వ సంవత్సరంలో ‘నైట్రోగ్లిజరిన్’ అనే పేలుడు పదార్థాన్ని కనుకున్నాడు. కానీ తక్కువ పేలుడు పదార్థంతో భారీ విస్ఫోటనం కలిగించే పదార్థాన్ని కనుక్కోవాలన్న ఆలోచనతో ఆల్‌ఫ్రెడ్ ఇంకా పరిశోధనలు జరిపాడు. దీంతో వైజ్ఞానిక రంగంలో గొప్ప ఆవిష్కరణగా పేరు గాంచిన ‘గన్ పౌడర్’ కనుగొనబడింది. వీటితో ఇంకా పరిశోధనలు చేస్తుండగా ఓ రోజు పేలుడు సంభవించి ఆల్‌ఫ్రెడ్ తమ్ముడితో సహా నలుగురు మరణించారు. అయినప్పటికీ పరిశోధనలను ఏ మాత్రం అలక్ష్యం చేయక నైట్రోగ్లిజరిన్‌ను యూరప్ అంతా సరఫరా చేస్తూ వ్యాపారాన్ని కొనసాగించాడు.
నైట్రోగ్లిజరిన్ సరఫరాలో అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉండేవి. దీనితో నైట్రోగ్లిజరిన్‌ను ఘనపదార్థంగా మారిస్తే ప్రమాద రహితమవుతుందని భావించిన నోబెల్ ఆ దిశగా పరిశోధనలు చేసినప్పటికీ ఏవీ ఫలించలేదు. కానీ ఓ రోజు నౌకలో ‘కైసెల్ ఫర్’ అనే పదార్థం కారిపోయిన నైట్రోగ్లిజరిన్ పీల్చుకొని ఘనపదార్థంగా మారింది. ఈ ‘కైసెలర్’ను పరీక్షించి చూడగా దీనికి కూడా పేలుడు శక్తి ఉందని రుజువైంది. ఇదే క్రమంగా 1867వ సంవత్సరానికి ‘డైనమైట్’గా రూపొందింది. ఇంకా దీని తర్వాత మరింత శక్తివంతమైన జిలెటిన్, బాలస్టైన్ లను కూడా కనుగొన్నాడు. దాదాపు 355 ఆవిష్కరణలకు ఆల్‌ఫ్రెడ్ పేటెంట్ పొందాడు. ఈ పేలుడు పదార్థాల వలననే మనమీరోజు భారీ ప్రాజెక్టులను నిర్మించుకోవటానికీ, గనులను త్రవ్వటానికీ సాధ్యమైంది.
నోబెల్ తన జీవితాన్నంతా ధారపోసి ఆవిష్కరించిన పేలుడు పదార్థాలను కొంతమంది మానవాళి ప్రాణహానికి ఉపయోగించటం దురదృష్టకరమైన విషయం. ఈ విధమైన మానసిక అశాంతితో నోబెల్ 1896వ సం॥ డిసెంబరు 10వ తేదీన తుదిశ్వాస వదిలాడు. ఆయన స్మృత్యర్థం ప్రతి ఏటా ఈ రోజున నోబెల్ బహుమతులు ప్రధానం చేయబడతాయి.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.
