[11 జూన్, 2025న జ్యేష్ఠ పున్నమి సందర్భంగా మరింగంటి సత్యభామ గారు రచించిన ‘ఏరువాక పున్నమి’ అనే కవితని అందిస్తున్నాము.]
పరమపావని భూలక్ష్మిని పూజించి
భువి దున్ని సాగునకు ఓంకారము
ధాన్యరాశులు పండుటకు శ్రీకారము
శుభసస్య సంపదలనిచ్చు కేదారము
దైవకృప వలన వానల్లు కురిసి
పంటసిరులందుకొనట సాకారము
ఓయీ మా అన్నా ప్రియ నేస్తమైన
రైతు కష్టమునకిదే తొలి ధరిత్రి అర్చన
అదే అదే ఏరువాక సాగురోజు
జ్యేష్ఠ మాసపు పున్నమి సాగు ఆరంభమే
ఈ శుభ తరుణము
ఆకాశానా నల్లని మబ్బులు చల్లని
చినుకుల తల్లిని తడిపి వరుణ
దేవుడు కరుణించేనన్నా పరమపావన
మాగాణమే నీ ఆవాసముగ భావించి
అహర్నిశలు కృషి చేసి కంటిపాపలా
కాపాడి పండిన సస్యరాశుల ఇంట
చేర్చే కృషీవలుడు ప్రాతఃస్మరణీయుడే
ఆ క్రతువునకు ముందు
రైతుబాంధవులందరూ కలసి
ఏరువాక సాగు శుభసమయమున
హల పున్నమినాడు హాలికులందరూ
గోవులకు ఎడ్లకు కాలువ స్నానము చేయించి
పూలమాలలు వేసి గంట కట్టి
కాలి గజ్జెలు అలంకారము చేసి
కొమ్ములకు గిట్టలకు పసుపుకుంకము పెట్టి
గోపూజలను చేసి
హలమునకు కాడికీ సాగుపనిముట్లకు
పసుపుకుంకుమలతో పూజలను చేసి
హారతులనిచ్చి గోవులకు ఎడ్లకూ
ప్రేమగా పొంగళ్ళు
ఆరగింపుగ పెట్టి తినిపించి మనసార
వరిమడుల కనులార తిలకించి మొక్కి
తొలి దుక్కు దున్నేటి సమయమున
ఎడ్ల పక్కన నడచి ప్రేమార నిమిరి
రైతులు ఇల్లాళ్ళు పిల్లపాపలతో
ఏరువాకమ్మకు కోటిదండాలనచు
పాడుచూ జనపదులు ఉత్సహము
ఊపందుకొనగా
ఓషధులు పంటలను ఇచ్చేటి స్వామి
హలపున్నమి నాటి పూర్ణచంద్రబింబమునకు
హారతులనిచ్చి చలిమిడీ వడపప్పు
నివేదనము చేసి సస్యకారక శశిని పూజించి
పంచభూతాత్మకం సస్యక్షేత్రమె
దైవక్షేత్రముగ భావించి భూమాత
మమ్ములను కరుణించు తల్లీ
నీ సేవయే మాకు యజ్ఞము యాగము
మా పూజలన్నియు నీకే భూమాతా
కనికరముతో మమ్ము కాపాడుమమ్మ
మాకు పంటల సిరులనీయమ్మా
అని పాడుతూ దుక్కి దున్ని ధాన్య
బీజములు చల్లేటి రైతన్నకే మా వందనాలు