అత్యంత అవసరమైన పరిశోధనాత్మక వ్యాసాలు శీలా సుభద్రాదేవి ‘కథారామంలో పూల తావులు’
కవయిత్రిగా, ప్రత్యేకించి ‘గోవుమాలచ్చి’ వంటి అపూర్వ కథారచయిత్రిగా, శీర్షికా నిర్వాహకురాలుగా, వ్యాసకర్తగా సుభద్రాదేవి గారు పరిచయం అక్కరలేని సుప్రసిద్ధులు.
ఒక గాఢమైన చింతన నుండి, ఒక చిత్తశుద్ధిగల సంవేదన నుండి వస్తాయి ఇలాంటి రచనలు. ‘వందేళ్ల కథకు వందనాలు’ పేరిట 118 మంది కథకుల కథలను పరిచయం చేసిన గొల్లపూడి మారుతీరావు కేవలం 12 మంది రచయిత్రుల కథలనే స్వీకరించటం సుభద్రాదేవిగారి ఆలోచనకి ప్రేరణ. ‘1910-80కి మధ్య ఒకరిద్దరు తప్ప కథారచయిత్రులు లేరా అనే ఆశ్చర్యం కలిగి’ సుభద్రాదేవిగారు ఈ పరిశీలనకీ, పరిశోధనకీ పూనుకుని అపూర్వమైన గ్రంథాన్ని మనముందుంచారు. ముఖ్యంగా నవలా రచయిత్రులుగా ప్రసిద్ధి వహించిన 21 మంది కథాసంపుటాల్ని సేకరించి, చదివి నిబిడమైన పరామర్శని అందించారు. ఆ విధంగా ఈతరం కథలకు, విమర్శకులకు ముందుతరం కథా రచయిత్రుల్ని పరిచయం చేశారు.
ఇల్లిందల సరస్వతీదేవిగారి కథల్లోని దార్శనికత మొదటి వ్యాసంగా వచ్చింది. ‘ఇయంగేహేలక్ష్మి’ ఫీచర్‌లో తెలుగునాట, ప్రత్యేకించి మహిళాలోకంలో ఎంతో ప్రసిద్ధి వహించినవారు ఆమె. ‘బలీయసీ కేవల మీశ్వరాజ్ఞ’, ‘అడ్డుతెరలు’ వంటి కథలు మా వంటి కథా పఠనం తపనవున్న వారికి బాగా పరిచయం. సరస్వతీదేవిగారు కేం.సా.అ. పురస్కారం అందుకున్న తొలి రచయిత్రి. అయినా ఆమెకు దక్కవలసిన గౌరవం దక్కలేదని తమ మనసులోని మాటని నిష్కర్షగా తెలిపారు సుభద్రాదేవిగారు.
కల్యాణ సుందరీ జగన్నాథ్ కథలు చదవని రచయితలూ, సాహితీపరులు ఈనాటికీ చాలా భుజకీర్తులు గడించుకుంటున్నారు. కథానికల్లో తెలుగు నుడి, పలుకుబడి ఎలా తెలుస్తుంది వారికి? మంచి విశ్లేషణతో గొప్ప కథల్ని పరామర్శ చేశారు సుభద్రాదేవిగారు.
అలాగే, ఆచంట శారదాదేవి, కె.రామలక్ష్మి, డా. పి.శ్రీదేవి, యశోదారెడ్డి, ద్వివేదుల విశాలాక్షి, నిడదవోలు మాలతిగార్ల కథా హృదయాన్ని తమ వ్యాసాల్లో ఆవిష్కరించారు ఈ వ్యాస రచయిత్రి. వాసిరెడ్డి సీతాదేవిగారి ‘మిసెస్ కైలాసం’, ‘మీ ఓటు నాకే’ వంటి వ్యంగ్య ప్రధానమైన కథల్నీ, ‘నేల విడిచిన సాము’ వంటి మధ్యతరగతి జీవుల ఇక్కట్ల కథల్నీ విశ్లేషించారు. మాదిరెడ్డి సులోచన కథల్లోని మానవ నైజ చిత్రణ గురించీ, వసుంధరాదేవి కథల్లోని మనోవిశ్లేషణాత్మకత గురించీ, సుజాతాదేవి బడుగు జీవుల వెతల కథాత్మకత (‘చేపలు’ ప్రసిద్ది చెందిన కథ) గురించీ విషయ పుష్టి కలిగిన వ్యాసాల్ని అందించారు.
డి. కామేశ్వరి ఆనాటి ‘వానచినుకులు’ కథతో సుప్రసిద్ధులు. ఆ తర్వాత ‘కాదేదీ కథకనర్హం’ అని … తొమ్మిది అంశాల మీద ఆమె తొమ్మిది కథలు రాసి ‘ఒప్పించారు’! కామేశ్వరిగారి కథాత్మని అంచనావేస్తూ సుభద్రాదేవి గారు ఎంతో సమంజసమైన ముగింపుని ఇలా ఇచ్చారు.
“అరవై ఏళ్ళ సాహిత్య జీవితంలో సమాజంలో రూపాంతరం చెందుతూ వస్తోన్న సమస్యల నన్నింటికీ ప్రతిస్పందిస్తూ కథనశైలిని తగు విధంగా వస్తురూపానికి అనుగుణంగా, సాహిత్యరంగంలో సృజన ప్రక్రియలలో వస్తున్న పరిణామాలకు అనుగుణంగా తన కథన చాతుర్యాన్ని మెరుగుపరుచుకుంటూ రాసిన కథలను ఎంపిక చేసుకుంటూ ఇంతవరకూ పన్నెండు సంపుటాలను వెలువరించారు. యువతరంతో పోటీపడుతూ కలాన్ని ఝుళిపించుకుంటూ సాహిత్యరంగంలో ఎనభయ్యారేళ్ళ వయసులోనూ ముందుకు దూసుకెళ్తున్న నిత్యచైతన్యశీలి డి. కామేశ్వరి”.
ఇంద్రగంటి జానకీబాల మధ్యతరగతి జీవితచిత్రణ, తురగా జానకీరాణి సంక్షిప్త జీవనచిత్రణ, విస్మృత కథారచయిత్రి వేదుల మీనాక్షి కథల్లో స్వాతంత్ర్యానంతర దేశ పరిస్థితుల నేపథ్య చిత్రణ, పరిమళా సోమేశ్వర్ కథల్లో ఉద్యోగినుల మనోవిశ్లేషణ, నల్లూరి రుక్మిణి తమ సమన్యాయ సామాజిక నిబద్దత, అచ్యుతవల్లి కథల్లో సంప్రదాయ ఆధునికతల సమ్మేళనం, జె. భాగ్యలక్ష్మి రచనల్లో మహిళా ప్రగతి అంతస్సూత్రం, మందరపు పద్మ, లలిత – జంట రచయిత్రుల – పెళ్ళికాని ఆడపిల్లల మూగవేదన…ఇలా, ఇందరి కథారచన ఔన్నత్యాన్ని వ్యాసపరంపరగా వెలువరించారు సుభద్రాదేవిగారు.
సంపుటిలో ‘రచయిత్రుల కథానికా సాహిత్యంపై వెనుకబాటుతనం ప్రభావం’, ‘రచయిత్రుల కథానికలలో భాషా పరిశోధనం’ అని రెండు విమర్శనాత్మక వ్యాసాలు ఉన్నాయి.
“సామాజిక పరిధిని, పరిస్థితుల స్వభావాన్ని అర్థం చేసుకొని 1975 తర్వాత సాగిన ఉద్యమాలలో స్త్రీ భాగమైంది. నిరాశా, నిస్పృహ, లైంగిక అణచివేతా, పెత్తందారీతనం నుండి ఇటు సవర్ణుల దౌర్జన్యాలూ అటు దళిత పురుషాధిక్యాల నుండి అణచివేతకు గురైన స్త్రీ గతంలో తన బాధలకు కర్మసిద్ధాంతాన్ని ముడిపెట్టి ఒదిగిపోయిన స్త్రీ, నేడు వీటన్నిటినీ నిరసిస్తూ ఆత్మగౌరవంతోపాటూ, స్వావలంబనతో జీవితం సాగించటానికి పోరాటం ఆరంభించింది. స్వేచ్ఛ, సమానత్వం, స్వయంశక్తి వంటి మౌలిక హక్కుల కోసం పోరాటం సాగిస్తోంది. సామాజిక జీవన పరిణామంలో కొట్టుమిట్టాడే అనేకానేక సమస్యలన్నీ నేడు కథాంశాలైనాయి. ఈ దశలో అస్తిత్వ పోరాటాలు సాహిత్యంలో ఊపు అందుకొన్నాయి.
జెండర్ పరంగా స్త్రీ వెనకబాటుని అంతవరకూ సాహిత్యంలోకి తెచ్చినా తర్వాత్తర్వాత స్త్రీ సమస్యలు అన్ని వర్గాలవారికీ, అన్ని వర్ణాలవారికీ, అన్ని ప్రాంతాల వారికీ సమానం కావనే నిజం బయటపడింది. విద్య, వైద్యం, కనీసావసరాలూ అందుబాటులోలేని నిమ్నకుల స్త్రీల కవిత్వంలోని వైరుధ్యాలు వివిధ కళల రూపంలో మొదట కవయిత్రుల కలాల నుండి వచ్చినా రానురాను రచయిత్రులు ఒక్కటొక్కటి తమ గొంతు విప్పి తమ ఆలోచనల్ని కథలరూపంలోకి తెచ్చారు.
కవయిత్రులు కూడా స్త్రీ దృక్పథంలో రావాల్సిన మార్పునే కాక అంతకు ముందు అక్షరబద్దం కాని విషయాలను నిస్సంకోచంగా కథారూపంలోకి తీసుకువస్తున్నారు. బహుకొద్ది సంఖ్యలో రచనారంగంలోకి వచ్చిన బహుజన దళిత మైనారిటీ కవయిత్రులు కూడా అన్ని ప్రాంతాల నుండి తమ తమ సమస్యల్ని కథలుగా మలచి పాఠకుల దృష్టికి తీసుకువస్తున్నారు. ఈ దృష్టికోణంతో సాహిత్యం ఇంకా రావాల్సి ఉంది….” మొదటి వ్యాసంలో అన్నారు. అలాగే రెండవ వ్యాసంలో రచయిత్రుల కథల్లో భాషా ప్రయోగం, పరిణామం, వికాసం గురించి వాస్తవికత ఆధారంగా విలువైన అంచనాని ఇలా ఇచ్చారు.
“ఒక పద్ధతిలో కథంతా నడవటం తగ్గి, కథానికలోని దిగువ తరగతికి చెందిన పనిమనిషి లేదా ఉత్పత్తి రంగాలకు చెందిన పేద, పల్లెపట్టులకు చెందిన పాత్రలకు ఆ పాత్రకు తగినరీతిలో సంభాషణల ద్వారా ఆ ప్రాంతీయతనీ, ఆ పాత్రల సామాజిక వర్గ స్వరూపాన్ని బహిర్గతం చేసే కథనరీతి యిప్పుడు వ్యాప్తిలోకి వచ్చింది…..”
“…. రాష్ట్రంలోని మూడు ప్రధాన ప్రాంతాలకు చెందిన యువరచయిత్రులు తమతమ ప్రాంతీయ అస్తిత్వాన్ని తమ రచనల ద్వారా చాటుకుంటున్నారు”. ముఖ్యంగా దళిత, మైనారిటీ ఉత్పత్తిరంగాలకు చెందిన రచయిత్రులు ఆయా మాండలిక భాషల్లో సమాజంలో తాము అనుభవిస్తున్న పీడనలను అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు…….
… 80 దశకం తర్వాత వచ్చిన అనేకానేక సామాజిక ఉద్యమాల ప్రభావం, ఇతరేతర వర్గాలకు, వర్ణాలకు చెందిన రచయిత్రుల సంఖ్య కూడా పెరగడం, ఎవరికి వారు తమ తమ అస్తిత్వాలను సాహిత్యంలో ప్రకటించుకోవాలనే భావంతో ప్రతీ ప్రాంతంలోనూ ప్రాంతీయ స్పృహ పెరగడంతో ఇటీవల కథానికలలో భాషాపరిణామంలో వేగం పుంజుకుంది…”
సంపుటి చివర సుభద్రాదేవిగారి ఇంటర్వ్యూ ఉన్నది. స్త్రీవాద సాహిత్యం, ధోరణులు, మార్పులు, ఇప్పుడు నడుస్తున్న గాలివంటి అంశాలపై ఆమె ఆలోచనీయమైన అభిప్రాయాల్ని తెలియజేశారు. మొత్తం సాహితీలోకం మెదడుకు మేతగా సాగిన విలువైన ప్రేరణాత్మక ఇంటర్వ్యూ ఇది. ‘కథారామంలో పూలతావులు’ ఆహ్లాదకరమైన తెమ్మెరని పంచుతోంది. సుభద్రాదేవిగారికి అభినందనలు!
విహారిగా సుప్రసిద్ధులైన శ్రీ జే.యస్.మూర్తి గారు 1941 అక్టోబర్ 15 న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. విద్యార్హతలు: ఎం.ఏ., ఇన్సూరెన్స్ లో ఫెలోషిప్; హ్యూమన్ రిసోర్సెన్ మేనేజ్మెంట్, జర్నలిజంలలో డిప్లొమాలు, సర్టిఫికెట్స్, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో ప్రసంగాలు, వ్యాస పత్ర ప్రదానం.
తెలగులోని అన్ని ప్రసిద్ధ పత్రికల్లోను 350 పైగా కథలు రాశారు. టీవీల్లో, ఆకాశవాణిలో అనేక సాహిత్య చర్చల్లో పాల్గొన్నారు.
15 కథా సంపుటాలు, 5 నవలలు, 14 విమర్శనాత్మక వ్యాససంపుటాలు, ఒక సాహిత్య కదంబం, 5 కవితా సంపుటాలు, రెండు పద్య కవితా సంపుటాలు, ఒక దీర్ఘ కథా కావ్యం, ఒక దీర్ఘకవిత, ఒక నాటక పద్యాల వ్యాఖ్యాన గ్రంథం, ‘చేతన’ (మనోవికాస భావనలు) వ్యాస సంపుటి- పుస్తక రూపంలో వచ్చాయి. 400 ఈనాటి కథానికల గుణవిశేషాలను విశ్లేషిస్తూ వివిధ శీర్షికల ద్వారా వాటిని పరిచయం చేశారు. తెలుగు కథాసాహిత్యంలో ఇది ఒక అపూర్వమైన ప్రయోజనాత్మక ప్రయోగంగా విమర్శకుల మన్ననల్ని పొందింది.
ఆనాటి ‘భారతి’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి పత్రికల నుండి ఈనాటి ‘ఆంధ్రభూమి’ వరకు గల అనేక పత్రికలలో సుమారు 300 గ్రంథ సమీక్షలు చేశారు.
విభిన సంస్థల నుండి పలు పురస్కారాలు, బహుమతులు పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1977) గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడెమివారి Encyclopedia of Indian Writers గ్రంథంలో సుమారు 45 మంది తెలుగు సాహితీవేత్తల జీవనరేఖల్ని ఆంగ్లంలో సమర్పించారు. మహాకవి కొండేపూడి సుబ్బారావుగారి స్మారక పద్య కవితా సంపుటి పోటీలోనూ, సాహిత్య విమర్శ సంపుటి పోటీలోనూ ఒకే సంవత్సరం అపూర్వ విజయం సాధించి ఒకేసారి 2 అవార్డులు పొందారు.
అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి (లక్ష రూపాయల) జీవిత సాధన ప్రతిభామూర్తి పురస్కార గ్రహీత. రావూరి భరద్వాజ గారి ‘పాకుడురాళ్లు’ – డా. ప్రభాకర్ జైనీ గారి ‘హీరో’ నవలలపై జైనీ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన తులనాత్మక పరిశీలన గ్రంథ రచన పోటీలో ప్రథమ బహుమతి (రూ.50,000/-) పొందారు. (అది ‘నవలాకృతి’ గ్రంథంగా వెలువడింది).
కవిసమ్రాట్ నోరి నరసింహ శాస్త్రి సాహిత్య పురస్కార గ్రహీత.
6,500పైగా పద్యాలతో-శ్రీ పదచిత్ర రామాయణం ఛందస్సుందర మహాకావ్యంగా ఆరు కాండములూ వ్రాసి, ప్రచురించారు. అది అనేక ప్రముఖ కవి, పండిత విమర్శకుల ప్రశంసల్ని పొందినది. ‘యోగవాసిష్ఠ సారము’ను పద్యకృతిగా వెలువరించారు.
వృత్తిరీత్యా యల్.ఐ.సి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుండి జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు.