శ్రీమతి ఉమాదేవిగారు ఉపాధ్యాయినిగా – తమదైన ప్రత్యేకతని నిరూపించుకున్న విదుషీమణి. ఉత్తమ కథారచయిత్రిగా ఆమె-సామూహిక చైతన్యంగల గిరిజన, బహుజన, ఆదివాసీ జన జీవిత చిత్రణ చేసి మానవ సంబంధాల్నీ, మానవీయ విలువల్నీ ఉన్నతీకరించి సాహితీలోకంలో విలక్షణమైన స్థానాన్ని గడించారు. ఎందరో అభిమానులకు గౌరవాస్పదురాలు అయినారు.
ఉమాదేవిగారు పదవీ విరమణ సందర్భంగా – ఈ అపూర్వమైన, వినూత్నమైన పుస్తకాన్ని వెలువరించారు. ‘మా పిల్లల ముచ్చట్లు’ ఆత్మకథనానికి ట్యాగ్ లైన్ – ‘ఒక టీచర్ అనుభవాలు’ అని ఎంతో వినమ్రంగా చేర్చారు.
పుస్తకం మొత్తంలో ఉమాదేవిగారి సున్నితమైన వ్యథాభరితమైన మనసూ, జీవనరేఖ అంతర్లీనంగా పర్యాప్తి చెందాయి.
‘ఒకే కాలంలో వివిధ ప్రాంతాల్లో బ్రతుకుతున్న పిల్లల ఆర్థిక, సామాజిక స్థితిగతుల్లో, వారి విద్యా సామర్థ్యాలలో, సౌకర్యాలలో, వారి భాషలో, భావ వ్యక్తీకరణలో, ఆత్మవిశ్వాసంలో…. మొత్తం జీవన విధానంలో ఎంత వ్యత్యాసముందో కదా’ అన్న బాధావ్యథలు ఆమెను నిరంతరం వేధిస్తూ ఉన్నాయి. ఆయా అనుభవాల్లో సకృత్తుగా తగిలే సంతోష వీచికలూ, సాంద్రంగా గాయపరచే విషాదకర ఘటనలూ, కంటతడి పెట్టించి అలజడి కలిగించిన సన్నివేశాలు – ఆమెను కలవరపరుస్తూనే ఉన్నాయి. వీటన్నిటి నడుమా-ఆమెను ఒక్కింత గర్వపడేట్టు చేసిన క్షణాలూ ఉన్నాయి. ఇదిగో-వీటన్ని సమాహారంగా, ఈ అక్షర దృశ్యాల్ని ఈ కథనాల్లో మనకందించారు.
ఉపాధ్యాయినిగా-ఉమాదేవిగారు బహుపాత్రల్లో బాధ్యతల్ని నిర్వహించారని నిరూపిస్తుంది, ఈ పుస్తకం. ‘కొన్ని అనుబంధాలెప్పుడూ ముచ్చటగానే వుంటాయి’ అనే కథనంలో – అన్నా చెల్లెలు, అక్కాతమ్ముడు-వీరిమధ్యన గల మమతానురాగాల వాస్తవాల్ని వ్యక్తీకరించినప్పుడు ఉమాదేవిగారిలోని మనస్తత్వవేత్త, మానవత్వ పరిశీలకురాలు-నిలువెత్తు సంతకంగా మనముందు నిలుస్తారు. ఆ శైలిలోని ఆర్ద్రత-మన గుండెల్నీ తడిచేస్తుంది. ‘ఒక పసికుసుమం’, ‘నా బాధ్యతను గుర్తుచేసిన చిత్రం’, ‘పంచుకుని తినడం’ వంటివి ఎన్నెన్నో-పిల్లల నిత్య జీవితాల్లోని సంభవాల్ని ఆవిష్కరించాయి.
సామాజిక బాధ్యతని గురించీ, సామాజిక న్యాయం గురించీ ఆవేదన పడే ‘మనిషి’గా ఉమాదేవిగారిని ఎన్నెన్నో కథనాల్లో చూస్తాము. ‘కంచం-గ్లాసు’ అన్న ఖండికలోని ఈ వాక్యాలు చదివి, ఆలోచనలో పడనివారూ, అంతర్ముఖీనులై అలజడి చెందనివారూ ఉంటారని నేననుకోను.
“పిల్లలకు మధ్యాహ్నం అన్నం పెట్టాలని తీర్మానించిన ప్రభుత్వం అన్నం కంచాలను ఎందుకివ్వరు? మంచినీళ్ళ గ్లాసులను ఎందుకివ్వరు? లేదా తెచ్చుకున్న పలు, గ్లాసులు బడిలోనే ఉంచుకొనేలా ఎందుకు అరలు కట్టరు? ఇక గ్లాసుల సంగతికి వస్తే నాకు తెలిసి ఎనభై శాతం బడులల్లో పిల్లలు పంపుదగ్గర నించుని చేత్తో నీళ్లు పట్టుకుని తాగుతారు. లేదా పళ్ళెంలో నయినా పట్టుకుని తాగుతారు.
మన బిడ్డలు ప్లేటుతోనో, దోసిళ్లతోనో పట్టుకుని మంచినీళ్లు తాగడం ఎప్పుడయినా చూసామా?”
ఇలాంటిదే ‘ఒక కంచం కథ’. ఈ అనుభవాన్ని ఉమాదేవిగారి మాటల్లో – యథాతథంగా, పొందుపరుస్తాను. లేకుంటే, ఆ ఘటన అంతస్సారం స్పష్టంగా మన మనసుకు పట్టదు. చూడండి:
‘ప్రభుత్వ బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడుతూ కంచాలు మాత్రం ఇళ్ల దగ్గర నుంచి తెచ్చుకొమ్మనడం ఏమి న్యాయమో అర్థం కాదు. బ్యాగు చిరిగిపోయో, మర్చిపోయో పిల్లలెవరయినా అన్నం ప్లేట్ తెచ్చుకోకపోతే ఆ రోజు పిల్లలు భోజనానికి చాలా ఇబ్బంది పడతారు. ఊర్లో కనీసం విస్తర్లు కూడా దొరకవు. దొరికినా పిల్లల దగ్గర డబ్బులు వుండకపోవచ్చు. ఒక రోజు ఒక అబ్బాయి ఇలాగే ఎందుకో ప్లేట్ తెచ్చుకోలేదు. వాడికి బాగా ఆకలి వేస్తున్నది. అట్లాగే గోడకి ఆనుకుని నిల్చున్నాడు. సరే విషయం తెలుసుకున్న నేను ఒక అబ్బాయిని పిలిచి “ఒరే నాన్నా… త్వరగా అన్నం తిని నీ ప్లేట్ కడిగి తీసుకురా! వీడు ప్లేట్ తెచ్చుకోలేదు. పాపం వాడికి బాగా ఆకలి వేస్తుందంటా” అన్నాను. నా వంక అదోలా చూసి తలవంచుకుని అన్నం తినేసి ప్లేట్ కడుక్కుని క్లాసు వెళ్ళిపోయాడు. ఆ సంగతి నాకు తెలియక ఇంకా ప్లేట్ తెస్తాడని చూస్తూ “ఏరా వాడింకా రాలేదేంటి?” పక్క పిల్లాడిని అడిగాను. “వాడు ఎప్పుడో తినేసి క్లాసులో కూర్చున్నాడు మేడమ్!” అన్నారు పిల్లలు. నేను ఆశ్చర్యంగా వాడిని పిలిచి “ప్లేట్ ఏదిరా” అంటే మాట్లాడకుండా కూర్చున్నాడు. నేను మళ్ళీ మళ్ళీ పట్టుదలగా అదే ప్రశ్న వేశాను. వాడు మాట్లాడలేదు. మిగతా పిల్లలు “వాడు అంతే మేడమ్, వాడు ప్లేట్ ఇవ్వడు” అని తీర్మానించారు. నేను కాస్త అయోమయంగా చూస్తూ ఇంకో అబ్బాయి ప్లేట్ తెప్పించి అన్నం పెట్టించాను. కానీ ఈ అబ్బాయి చెయ్యి వదలలేదు.
“చూడు! వాడికి విపరీతమైన ఆకలి వేస్తోంది, ఎదురుగా భోజనం ఉంది, నీ చేతిలో ప్లేట్ ఉంది. వాడికి నీవు ప్లేట్ ఎందుకు ఇవ్వలేదు?” నాకు అంతకంతకూ కోపం, పౌరుషం ఎక్కువైపోతున్నది. “ఉమా మేడమ్, మీరు ఇక లోనికి రండి. మీరు ఎంత పౌరుష పడ్డా వ్యవస్థను మార్చలేరు. ఆకలేసిన ఆ పిల్లాడు హరిజనవాడ పిల్లాడు. ప్లేట్ ఉన్న పిల్లోడు కోక్యా తండా పిల్లోడు. ఎవరినీ మనం మార్చలేము” అన్నారు. నా అయోమయం అంతా వదిలిపోయి మెదడు మొద్దుబారిపోయింది. నేను అన్నం తినలేకపోయాను. ఇంత చిన్న పిల్లల్లో కూడా కుల జాడ్యం ఎంతబలంగా నాటుకుపోయింది అనుకున్న నాకు ఎంత దుఃఖం కలిగిందంటే ఆ సంఘటన ఎప్పుడు తల్చుకున్నా మనసంతా బాధగా ఉంటుంది.”
ఇలా, ‘ఒక టీచర్ అనుభవాలు’. పుస్తకమంతా ఆలోచనీయమైన వాస్తవాలే. విద్యారంగంలో ఉమాదేవిగారి కృషి, భవిష్యత్ తరాలకు కూడా ఆమె స్ఫూర్తిదాయకమైన బోధన, శిక్షణ, జ్ఞాన వితరణ ఎంతో విలువైనవి, శ్లాఘనీయమైనవి. ఉపాధ్యాయినిగా నిజానికి తెలుగు జాతి గర్వపడే జీవన విధానాన్ని అనుసరించిన మహనీయమూర్తి ఆమె. ఉమాదేవిగారికి అభినందనలు.
ఎంతో సామాజిక ప్రయోజనం కలిగిన పుస్తకాలను తాముగా ప్రచురిస్తూ లోకోపకారం చేస్తున్న డా॥ వరప్రసాద్ రెడ్డిగారు, ఉమాదేవిగారి ఈ రచనను ప్రచురించి, తెలుగు సాహితీలోకానికి కానుకగా ఇచ్చారు. ‘ఒక చిన్న పిల్లల విశ్వవిద్యాలయంగా తలపింపచేశారు. ఎంతో అంకితభావం ఉంటేనేగాని సర్వం తానై, ఇంత కృషి, ఇంత ప్రగతి సాధించగలిగేవారు కారు’ అన్నారు డా॥ వరప్రసాద్ రెడ్డిగారు. అక్షరసత్యం! వారూ, వీరూ – ఇరువురూ పుణ్యులూ, ధన్యులూ!!
విద్యారంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ, ఆ రంగంపట్ల శ్రద్ధాసక్తులు కలిగిన వారందరూ – తప్పక చదవాల్సిన పుస్తకం ‘మా పిల్లల ముచ్చట్లు’!
విహారిగా సుప్రసిద్ధులైన శ్రీ జే.యస్.మూర్తి గారు 1941 అక్టోబర్ 15 న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. విద్యార్హతలు: ఎం.ఏ., ఇన్సూరెన్స్ లో ఫెలోషిప్; హ్యూమన్ రిసోర్సెన్ మేనేజ్మెంట్, జర్నలిజంలలో డిప్లొమాలు, సర్టిఫికెట్స్, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో ప్రసంగాలు, వ్యాస పత్ర ప్రదానం.
తెలగులోని అన్ని ప్రసిద్ధ పత్రికల్లోను 350 పైగా కథలు రాశారు. టీవీల్లో, ఆకాశవాణిలో అనేక సాహిత్య చర్చల్లో పాల్గొన్నారు.
15 కథా సంపుటాలు, 5 నవలలు, 14 విమర్శనాత్మక వ్యాససంపుటాలు, ఒక సాహిత్య కదంబం, 5 కవితా సంపుటాలు, రెండు పద్య కవితా సంపుటాలు, ఒక దీర్ఘ కథా కావ్యం, ఒక దీర్ఘకవిత, ఒక నాటక పద్యాల వ్యాఖ్యాన గ్రంథం, ‘చేతన’ (మనోవికాస భావనలు) వ్యాస సంపుటి- పుస్తక రూపంలో వచ్చాయి. 400 ఈనాటి కథానికల గుణవిశేషాలను విశ్లేషిస్తూ వివిధ శీర్షికల ద్వారా వాటిని పరిచయం చేశారు. తెలుగు కథాసాహిత్యంలో ఇది ఒక అపూర్వమైన ప్రయోజనాత్మక ప్రయోగంగా విమర్శకుల మన్ననల్ని పొందింది.
ఆనాటి ‘భారతి’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి పత్రికల నుండి ఈనాటి ‘ఆంధ్రభూమి’ వరకు గల అనేక పత్రికలలో సుమారు 300 గ్రంథ సమీక్షలు చేశారు.
విభిన సంస్థల నుండి పలు పురస్కారాలు, బహుమతులు పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1977) గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడెమివారి Encyclopedia of Indian Writers గ్రంథంలో సుమారు 45 మంది తెలుగు సాహితీవేత్తల జీవనరేఖల్ని ఆంగ్లంలో సమర్పించారు. మహాకవి కొండేపూడి సుబ్బారావుగారి స్మారక పద్య కవితా సంపుటి పోటీలోనూ, సాహిత్య విమర్శ సంపుటి పోటీలోనూ ఒకే సంవత్సరం అపూర్వ విజయం సాధించి ఒకేసారి 2 అవార్డులు పొందారు.
అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి (లక్ష రూపాయల) జీవిత సాధన ప్రతిభామూర్తి పురస్కార గ్రహీత. రావూరి భరద్వాజ గారి ‘పాకుడురాళ్లు’ – డా. ప్రభాకర్ జైనీ గారి ‘హీరో’ నవలలపై జైనీ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన తులనాత్మక పరిశీలన గ్రంథ రచన పోటీలో ప్రథమ బహుమతి (రూ.50,000/-) పొందారు. (అది ‘నవలాకృతి’ గ్రంథంగా వెలువడింది).
కవిసమ్రాట్ నోరి నరసింహ శాస్త్రి సాహిత్య పురస్కార గ్రహీత.
6,500పైగా పద్యాలతో-శ్రీ పదచిత్ర రామాయణం ఛందస్సుందర మహాకావ్యంగా ఆరు కాండములూ వ్రాసి, ప్రచురించారు. అది అనేక ప్రముఖ కవి, పండిత విమర్శకుల ప్రశంసల్ని పొందినది. ‘యోగవాసిష్ఠ సారము’ను పద్యకృతిగా వెలువరించారు.
వృత్తిరీత్యా యల్.ఐ.సి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుండి జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సినిమా క్విజ్-72
ప్రముఖ ఉర్దూ కథలకు చక్కటి తెలుగు అనువాదం – గోరింటాకు
కాంచన శిఖరం-4
ఇది నా కలం-2 : చాందినీ బల్లా
శ్రీపర్వతం-54
సంచిక – పద ప్రతిభ – 59
కావ్య పరిమళం-30
దారి
ఆవేశం చల్లారి ప్రశ్నించడం మానివేసిన అక్షరం – గోలి మధు ‘సంఘర్షణ’ పుస్తక సమీక్ష
రక్తపుటేరుల రాజ్యం!
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®