“సారస్వత కళానిధి” ఆచార్య వెలువోలు నాగరాజ్యలక్ష్మిగారు తెలుగు సాహితీలోకంలో సుప్రసిద్ధ సారస్వత మూర్తి. తెలుగు సంస్కృత భాషల్లో ఉన్నత విద్యావంతురాలు. కళాశాల ప్రాచార్యులుగా ప్రముఖులు. ఆధునికాంధ్ర కవిత్వంలో వ్యక్తిత్వ వికాసం, భగవద్గీత వ్యక్తిత్వ వికాసం, కవిత్రయ మహాభారతంలో మేనేజ్మెంట్ రీతులు- వంటి ఉత్తమ గ్రంథాలతో భావిభారత పౌరుల వ్యక్తిత్వ నిర్మాణం పట్ల సదాశయ స్ఫూర్తిని ప్రచోదితం చేస్తున్న నిబద్ద గుణశీల. ప్రవచనకర్తగా, వక్తగా, సభా వేదికల నుండి, ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసార మాధ్యమాల ద్వారా అనన్య ప్రాచుర్యం, విజ్ఞుల ఆదరణ కలిగిన విదుషీమణి. డాక్టర్ నాగరాజ్యలక్ష్మిగారి అపూర్వ సృజనగా- ‘ప్రకృతి విలాసం’, ‘మన పుణ్య నదులు’, ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’-సాహిత్య రూపకాలు వెలువడి ఆమెయే ప్రయోక్తగా ప్రదర్శింపబడి ప్రముఖ సాహితీవేత్తలచే, విమర్శకులచే విశేష ప్రశంసల్ని పొందాయి. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి గారు అనేక ప్రతిష్ఠాత్మక పదవుల్ని నిర్వహించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్వర్ణ పతకం, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభా పురస్కారం, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, ఆచార్య దివాకర్ల వేంకటావధాని, రాయప్రోలు సాహిత్య పురస్కారాలు వంటి ఎన్నో సత్కారాల్ని పొందారు.
‘అభిశప్త కథలు’ డాక్టర్ నాగరాజ్యలక్ష్మి గారి ప్రయోగాత్మక రచన మాత్రమే కాక సామాజిక ప్రయోజనాత్మక రచన కూడా. బాలల సంరక్షణ సమితి సభ్యురాలుగా తాను చూసిన, చూసి ఆవేదన చెందిన, పరిష్కరించిన కొన్ని సామాజిక అవాంఛనీయతల్ని, బాధ్యతగా నిర్వహించిన కార్యక్రమాల్ని వాస్తవిక సంభవాల ఆధారంగా ఈ కథా కథనాల్ని వెలువరించారు ఆమె.
ఈ సంపుటిలో ఇరవై ఒక్క కథలు ఉన్నాయి. ఈ కథలోని అభిశప్తలు అందరూ వ్యక్తుల అలసత్వానికి, ఉపేక్షకు, వ్యవస్థల దౌర్భాగ్యానికి, మొత్తం సమాజపు దుర్మార్గాలకు, దారుణాలకు బలి అయిన వారే. వారందరూ మైనర్లే. అనాథలంతా, అభాగ్యులంతా! ఈ కథలన్నిటా ప్రధాన పాత్ర సునంద. ఆమె బాలల సంరక్షణ సమితి సభ్యురాలు. ఆ సంస్థ నిర్వహించే బాధ్యతాయుత కార్యక్రమాల్ని రచయిత్రి మొదటి కథలోనే ఇలా చక్కగా వివరించారు: “నిరాశ్రయులు దారిద్ర్యరేఖకు అట్టడుగున ఉన్నవారు తమ పిల్లలను బాలల సంరక్షణ సమితి ద్వారా ప్రభుత్వ సదనాలలో కానీ, స్వచ్ఛంద సంస్థల నిర్వహణలో నడపబడుతున్న బాలల సంరక్షణ సంస్థలలో కానీ చేర్చడానికి అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. అలా వచ్చిన బాలబాలికలను పరిశీలించి వారి తల్లిదండ్రులు, కుటుంబ పరిస్థితులు విచారించి సమితి సభ్యులు వారికి తగిన సంరక్షణ కేంద్రాలను జిల్లా స్థాయిలో నిర్ణయించి వారికి సిఫార్సు చేసి పంపిస్తారు. అనాథ బాలబాలికలను వారి బంధువులు, బాధ్యత కల వ్యక్తులు కానీ వెంట బెట్టుకొని వచ్చి బాలల సంరక్షణ సమితి అప్పగిస్తారు”.
‘అభిశప్త’ కథలో శిరీష అనాథ. 12 ఏళ్లకే తల్లిదండ్రులిద్దరూ కన్నుమూశారు. ఎవరో బంధువులు దురాశతో ఆమెను చేరదీసి ఊడిగం చేయించ సాగారు. 15 సంవత్సరాలు వచ్చేసరికి అందం, అమాయకత్వం నిండిన నీడలేని యువతి అయింది. ఫలితంగా కామాంధుల విలాస క్రీడలకు ఆట వస్తువు అయింది. వీధిన పడే పరిస్థితి వచ్చింది. రైల్వే పోలీసుల ప్రమేయంతో బాలల సంరక్షణ సమితి చేరింది. ఆరోగ్య పరీక్షలు చేయించారు. హెచ్.ఐ.వి పాజిటివ్ అని తేలింది. వసతి, మందులు ఇప్పించడం వంటి సౌకర్యాలు కల్పించారు.
కానీ ఉన్నట్టుండి ఒకరోజు శిరీష ఒక లేఖ రాసి వసతిగృహం వదలి విడిపోయింది. పురుష జాతి మీది తన ఆగ్రహాన్ని దుర్మార్గులైన పెద్దల ఆకర్షించి వారిని కూడా హెచ్.ఐ.వి పాలు చేస్తానని తీర్మానించుకొన్నట్టు ఆ లేఖ సారాంశం! “ఇలా స్త్రీ జాతి బతుకుతున్న జనారణ్యంలో ఎవరిని తప్పు పట్టాలి? ఈ చరిత్ర ఎలా మారుతుందని ఆశించాలి? అభిశప్త శిరీష వంటి అమాయకపు యువతులకు సమాజం పట్ల, వ్యవస్థ పట్ల, దేశం పట్ల ఎంతవరకు విశ్వాసం, గౌరవం మిగిలి ఉంటాయి? ఈ పిచ్చి తల్లిని ఎవరు తమ ఒడిలోకి చేర్చుకుంటారు? ఈ సందేహాలను నివృత్తి చేసేది ఎవరు?” అంటూ కథ ముగిసింది. నిజానికి ముగియలేదు. సమాజం, మనుషులు అంతర్వీక్షణం చేసుకొని జవాబు ఇవ్వవలసిన ప్రశ్నలతో కథ- ‘సశేషమే’!!!
‘పడిలేచిన కెరటం’ కథలో లావణ్య పై కిరణ్ తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేసి దయనీయమైన స్థితిలో వదలి పారిపోయాడు. ఆ పిల్లకు బాలల సంరక్షణ సమితి ఆఫ్టర్ కేర్ సర్వీసెస్ అనే ప్రభుత్వ బాలల సంక్షేమ శాఖ కల్పించిన సదుపాయాల ద్వారా చదువుకునే అవకాశం కల్పించింది. తద్వారా ఆమె విశ్వవిద్యాలయంలో పట్టా పుచ్చుకుని గోల్డ్ మెడల్ సాధించి న్యాయశాస్త్రంలో పీహెచ్‌డి కూడా చేసింది. అన్యాయానికి బలి అయిన వారికి చేయూతనిచ్చి నిలబెట్టి ధైర్యం చెప్పి జీవితాన్ని అందిస్తే చాలామంది లావణ్య లాగా పడిలేచిన కెరటాలై ఉన్నత స్థాయిలో జీవిత లక్ష్యాన్ని చేరుకుంటారు – అనేది సందేశం!
‘జీవనజ్యోతి’ కథలో పిల్లలు లేని దంపతులు బాలల సంరక్షణ సమితి ద్వారా పిల్లలను దత్తత తీసుకునే విధానం, అమలు తీరును తెలియజేస్తుంది.
‘కంచే చేను మోస్తే’ కథలో ఒక చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్లో ఆడపిల్లలపై జరిగే అకృత్యాలు, వాటికి పరిష్కారంగా బాలల సంరక్షణ సమితి చేపట్టిన చర్యల వివరణ వచ్చింది.
యవ్వనారంభ దశలో 10వ తరగతి చదువుతున్న కాలు జారిన రాములమ్మ కూతురు కలియుగంలో కుంతిలా మారింది. ఆమె కన్న బిడ్డను బాలిక సంరక్షణ కేంద్రంలో చేర్పించి అభం శుభం తెలియని ఆమెకు చదువే జీవితానికి దిక్సూచిగా ఒక దృఢమైన లక్ష్యాన్ని అందించింది సమితి.
‘నిర్ణయం’ కథానిక బాల్య వివాహాల నిరసన, తిరస్కారం, ఆ దురాచారానికి బలి కాబోతున్న సరళని బాలల సంరక్షణ సమితి వారు ఆదరించటం, రామినేని ఫౌండేషన్ వారి సహకారంతో ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడే రేట్లు చేయటం ఇతివృత్తం. ఆమె ‘సరళ ఫ్యాషన్ డిజైనర్స్’ యజమానురాలుగా అభివృద్ధి పథంలోకి అడుగ పెడుతున్నది!
‘న్యాయం కోసం’, ‘ ఇది కథ కాదు’ కథానికల్లో పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వయసు మీరిన వారు ఆడపిల్లలపై జరిపే అకృత్యాల్ని, వాటికి విరుగుడునీ చూపటం జరిగింది.
‘మబ్బులు విడిచిన సూర్యుడు’, ‘ఇది కథ కాదు – రెంటిలోనూ తల్లిదండ్రుల నిర్లక్ష్యం పర్యవసానంగా పిల్లల భవిష్యత్తు ఏ విధంగా చెడిపోతుంది ఎంతో ఆర్థంగా చిత్రించడం జరిగింది. అలాగే ‘వెలుగుదారి’, ‘మసకబారిన బాల్యం’ కథానికల్లో ఈనాటి విద్యా విధానంలో రావలసిన మార్పుల్ని, తల్లిదండ్రుల దృక్పథంలో వాంఛనీయమైన పరిణామాల చిత్రణ ఎంతో ఆర్థంగా జరిగింది. ‘అమ్మ దొరికింది’ కథలో పుష్కరాల్లో తప్పిపోయిన రవి బాలల సంరక్షణ సమితి ఆదరణతో ఈనాడు 24 ఏళ్ల వయసులో పోలీస్ ఆఫీసర్‌గా అసలు తల్లిదండ్రుల్ని తిరిగి కలుసుకోవటం ఇతివృత్తం. ‘విముక్తి’ కథానికలో వెట్టిచాకిరీ నుండి ఒక ఆడపిల్లకి విముక్తి కలిగించడం ప్రధాన అంశం. ‘అనుబంధం’ కథానిక పిల్లల కోసం ఆరాటపడే దంపతులకు బాలల సంక్షేమ సమితి పిల్లల్ని పెంచుకోవడానికి అందజేయడం, ఫాస్టర్ కేర్ పద్ధతిలో వారి సంరక్షణ బాధ్యతల్ని అప్పజెప్పడం, తద్వారా బిడ్డకు తల్లిదండ్రులకు మధ్య అనుబంధాన్ని స్థిరపడేటట్లు చేసి పరస్పర ప్రేమ ఆప్యాయతలు కలిగింప చేయటం కథాంశంగా సాగింది.
‘అభిశప్త’ కథలు సంపుటిలో ‘కర్తవ్యం’, ‘విధి’, ‘బ్రతుకు బండి’ అనేవి కరోనా మహమ్మారి తెచ్చిన కష్ట పరంపరని మాత్రమే కాక మానవ సంబంధాల్లో తీసుకువచ్చిన సానుకూల పరిణామాల్ని కూడా చిత్రించాయి.
‘అభిశప్త’ కథలు సమకాలీన సమాజ సంక్లిష్టతలను, అమానవీయతలను, వ్యవస్థలకు మనుషులకు మధ్యన గల సంఘర్షణల్నీ, ఈనాటికీ సంఘంలో సాగిపోతున్న అక్రమ, అసంబద్ద, అనైతిక, అనాగరిక రీతీ రివాజుల్నీ పారదర్శకంగా ఆవిష్కరించాయి. అవాంఛనీయ ధోరణులను ఎత్తి చూపడమే కాక వాటికి అందుబాటులో ఉన్న నివారణ పద్ధతులను, ప్రభుత్వ ప్రోత్సాహకాలను, సంస్థలను, ఆ సంస్థలో చొరవతో సామాజిక నిబద్ధతతో పనిచేస్తున్న సునంద వంటి కార్యకర్తల గుణ శీలాన్ని కూడా ఎంతో సంఘటనాత్మకంగా ఆవిష్కరించాయి.
డాక్టర్ నాగరాజ్యలక్ష్మి గారి కథాకథన విధానం, శైలీ శిల్పాలు- నిజానికి నాటక నిర్మాణ పద్ధతిలో సాగాయి. అందువలననే అవి సన్నివేశం వెంట సన్నివేశాన్ని చకచక జరుపుతూ అద్భుతమైన దృశ్యాత్మకతను సాధించుకున్నాయి. నాటక రూపమైన కథలుగా రూపొందాయి. సంపుటిలోని కథలన్నిటా డాక్టర్ నాగరాజ్యలక్ష్మి గారి సామాజిక అధ్యయనం, సమస్యా పరిశీలనం స్ఫుటంగా ద్యోతకమవుతోంది. ఇంతవరకు రచయితలు ఎవరూ స్పృశించని లేక ప్రత్యేకంగా గుర్తించని వివక్షతకు గురి అవుతున్న బాలబాలికల జీవితాల్లోని చీకటి కోణాలను డాక్టర్ నాగరాజ్యలక్ష్మి గారు ఎంతో పరిణత మనసుతో ఆవిష్కరించారు. ఆ విధంగా ఒక ముఖ్యమైన సామాజిక అవసరాన్ని, సాహిత్య అవసరాన్ని కూడా ఆమె నిబద్ధతతో, నిమగ్నతతో నెరవేర్చారు. వారికి హృదయపూర్వక అభినందనలు. ఆ నిరంతర అధ్యయన శీలికీ, జీవితాసుభవశాలికీ హృదయపూర్వక అభినందనలు!!
విహారిగా సుప్రసిద్ధులైన శ్రీ జే.యస్.మూర్తి గారు 1941 అక్టోబర్ 15 న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. విద్యార్హతలు: ఎం.ఏ., ఇన్సూరెన్స్ లో ఫెలోషిప్; హ్యూమన్ రిసోర్సెన్ మేనేజ్మెంట్, జర్నలిజంలలో డిప్లొమాలు, సర్టిఫికెట్స్, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో ప్రసంగాలు, వ్యాస పత్ర ప్రదానం.
తెలగులోని అన్ని ప్రసిద్ధ పత్రికల్లోను 350 పైగా కథలు రాశారు. టీవీల్లో, ఆకాశవాణిలో అనేక సాహిత్య చర్చల్లో పాల్గొన్నారు.
15 కథా సంపుటాలు, 5 నవలలు, 14 విమర్శనాత్మక వ్యాససంపుటాలు, ఒక సాహిత్య కదంబం, 5 కవితా సంపుటాలు, రెండు పద్య కవితా సంపుటాలు, ఒక దీర్ఘ కథా కావ్యం, ఒక దీర్ఘకవిత, ఒక నాటక పద్యాల వ్యాఖ్యాన గ్రంథం, ‘చేతన’ (మనోవికాస భావనలు) వ్యాస సంపుటి- పుస్తక రూపంలో వచ్చాయి. 400 ఈనాటి కథానికల గుణవిశేషాలను విశ్లేషిస్తూ వివిధ శీర్షికల ద్వారా వాటిని పరిచయం చేశారు. తెలుగు కథాసాహిత్యంలో ఇది ఒక అపూర్వమైన ప్రయోజనాత్మక ప్రయోగంగా విమర్శకుల మన్ననల్ని పొందింది.
ఆనాటి ‘భారతి’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి పత్రికల నుండి ఈనాటి ‘ఆంధ్రభూమి’ వరకు గల అనేక పత్రికలలో సుమారు 300 గ్రంథ సమీక్షలు చేశారు.
విభిన సంస్థల నుండి పలు పురస్కారాలు, బహుమతులు పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1977) గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడెమివారి Encyclopedia of Indian Writers గ్రంథంలో సుమారు 45 మంది తెలుగు సాహితీవేత్తల జీవనరేఖల్ని ఆంగ్లంలో సమర్పించారు. మహాకవి కొండేపూడి సుబ్బారావుగారి స్మారక పద్య కవితా సంపుటి పోటీలోనూ, సాహిత్య విమర్శ సంపుటి పోటీలోనూ ఒకే సంవత్సరం అపూర్వ విజయం సాధించి ఒకేసారి 2 అవార్డులు పొందారు.
అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి (లక్ష రూపాయల) జీవిత సాధన ప్రతిభామూర్తి పురస్కార గ్రహీత. రావూరి భరద్వాజ గారి ‘పాకుడురాళ్లు’ – డా. ప్రభాకర్ జైనీ గారి ‘హీరో’ నవలలపై జైనీ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన తులనాత్మక పరిశీలన గ్రంథ రచన పోటీలో ప్రథమ బహుమతి (రూ.50,000/-) పొందారు. (అది ‘నవలాకృతి’ గ్రంథంగా వెలువడింది).
కవిసమ్రాట్ నోరి నరసింహ శాస్త్రి సాహిత్య పురస్కార గ్రహీత.
6,500పైగా పద్యాలతో-శ్రీ పదచిత్ర రామాయణం ఛందస్సుందర మహాకావ్యంగా ఆరు కాండములూ వ్రాసి, ప్రచురించారు. అది అనేక ప్రముఖ కవి, పండిత విమర్శకుల ప్రశంసల్ని పొందినది. ‘యోగవాసిష్ఠ సారము’ను పద్యకృతిగా వెలువరించారు.
వృత్తిరీత్యా యల్.ఐ.సి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుండి జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు.
You must be logged in to post a comment.
అలనాటి అపురూపాలు- 161
మిర్చీ తో చర్చ-8: మిర్చీ తో సమ్మె!
నిద్ర లేచిన చైతన్యం
మహతి-65
ఎవరిని అడగాలి
తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-6
ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు -1
సిల్క్ థ్రెడ్ జువెల్లరీ
శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-12
సంచిక విశ్వవేదిక – కోవిడ్ ముగిసిన వేళ – పని జీవితంలో మార్పులు
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®