Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎర

[డా. సన్నిహిత్ రచించిన ‘ఎర’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

రైలు లయబద్ధంగా సాగిపోతోంది. హైదరాబాద్‌‌లో బయలుదేరి ముంబై వైపు వెళుతోంది ట్రైన్‌. కిటికీలో నుండి కదులుతున్న ప్రకృతిని చూస్తున్న ఆ అమ్మాయి వదనం అప్రసన్నంగా ఉంది. దానికి కారణం కుటుంబ సమస్యలు. ముంబై ఐ.ఐ.టి.లో ఎం.టెక్‌ చదువుతోంది ఆ అమ్మాయి. పేరు హాసిని. హైదరాబాద్‌ లోని సొంత ఇంటికి వచ్చింది. తల్లిదండ్రులతో రెండు రోజులు గడిపి తిరిగి ముంబై వెళ్తోంది. అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లి. ఆర్థిక సమస్యలతో సంసారాన్ని ఈడ్చడానికి సతమతమవుతోన్న తండ్రి. మధ్యతరగతి కుటుంబం ఆమెది. తొందరగా తను చదువు కంప్లీట్‌ చేసి మంచి జాబ్‌ తెచ్చుకుంటే తప్ప వాళ్ళ కష్టాలు ఈడేరవు. అందుకే చాలా వ్యాకులతతో ఉంది.

సమయం సాయంత్రం ఆరు దాటింది. సెకండ్‌ క్లాస్‌ కంపార్ట్‌‌మెంట్‌‌లో ప్రయాణీకుల హడావిడి బాగానే ఉంది. ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు. సెల్‌ ఫోన్‌‌లో మాట్లాడుతున్న వాళ్ళు, గేములు ఆడుతున్న వాళ్ళు, పాటలు వింటున్న వాళ్ళు, అక్కడక్కడ బుక్స్‌ చదువుతున్న వాళ్ళు.. ఇలా చాలా హడావుడిగా ఉంది కంపార్ట్‌మెంట్‌. అయితే సమస్య అది కాదు. హాసినిని తమ చూపులతో చంపేస్తున్న ముగ్గురు కుర్రాళ్ళు. తన బాధలో తనుంటే వీళ్ళ చూపుల గోల ఏంటో అర్థం కాలేదు ఆమెకి. వాళ్ళ వైపు చూడటం మానేసింది. కిటికీలో నుండి బయటకు చూడసాగింది.

ఇంతలో వాళ్ళ గేంగ్‌‌లో ఒక కుర్రాడు వచ్చి “ఎక్కడిదాకా వెళ్తున్నావు?” అని అడిగాడు.

“నీకెందుకు.. దూరంగా పో” అని కసిరింది. వాడు గట్టిగా నవ్వి “అట్టాగే..” అని చెప్పి వెళ్ళిపోయాడు. జనం కాసేపు వీళ్ళ వైపు చూసి ‘మనకెందుకులే’ అనుకుని తమ సెల్‌ ఫోనుల్లో మునిగిపోయారు. ‘వెధవలు.. మళ్ళీ దగ్గరకు రారు.’ అనుకుని నవ్వుకుంది ఆ అమ్మాయి. కానీ వాళ్ళు అలా వదిలే రకం కాదని ఆమెకు తెలీదు.

***

గతంలో.. ఒక రోజు..

క్లాసులో శ్రద్ధగా లెసన్‌ వింటోంది హాసిని. “హెచ్‌.ఓ.డీ. (హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్) నిన్ను రమ్మంటున్నారు” అని ప్యూన్‌ వచ్చి చెప్పడంతో అతని రూంకి వెళ్ళింది.

ఆమెను చూసి హెచ్‌.ఓ.డీ. “కమాన్‌ హాసినీ.. కమాన్‌” అని నవ్వారు.

“చెప్పండి సార్‌..” అంది వినయంగా.

“ఏం చెప్పమంటావు? నీ ప్రోజెక్ట్‌ వర్క్‌ కంప్లీట్‌ కాలేదని ఫేకల్టీ ఎడ్వైజర్‌ కంప్లెయింట్‌ చేస్తున్నారు. ఏంటి ప్రోబ్లెం?” అన్నాడు ఆయన.

“ఏమీ లేదు సార్‌.. నేను తీసుకున్న అయిడియానే ప్రోబ్లెం ఆయనకు.. అమ్మాయిలకు పనికి వచ్చే ఒక యాప్‌ని డెవలప్ చేద్దామని అనుకుంటున్నాను. అది అసలు సాధ్యం కాదని ఆయన అంటున్నారు. నాకేమో ఆ ప్రోజెక్ట్‌ అయిడియా సక్సెస్‌ అవుతుందని గట్టి నమ్మకం. అందుకే అందులోనే రీసెర్చ్‌ కంటిన్యూ చేస్తున్నాను. దయచేసి నా పెయిన్‌ అర్థం చేసుకొండి సార్‌. ఎంత కష్టమైనా సరే నా ప్రోజెక్ట్‌ రీసెర్చ్‌‌ని ప్రూవ్‌ చేస్తాను” అంది దృఢంగా!

“ఓకే అమ్మా.. నీ నమ్మకం చూస్తే ముచ్చట కలుగుతోంది. ఫేకల్టీ ఎడ్వైజర్‌‌కి నేను చెబుతాను.. ఆల్‌ ద బెస్ట్‌!” అని ఎంకరేజ్‌ చేసాడు హెచ్‌.ఓ.డీ.!

“థాంక్యూ సార్‌..” అని చెప్పి వచ్చేసింది. తర్వాత తన ప్రోజెక్ట్‌ వర్క్‌‌ని ఎలా ప్రోగ్రెస్ చెయ్యాలా అన్న ఆలోచనలో పడిపోయింది.

సాయంత్రం హాస్టల్‌ కి వచ్చిన ఆమెను చుట్టు ముట్టేసారు ఫ్రెండ్స్‌.

“ఏంటే! హెచ్‌.ఓ.డీ. సార్‌ నీ ప్రోజెక్ట్‌ ఎక్స్‌‌టెన్షన్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట కదా.. కంగ్రాట్స్‌!” అని అభినందించారు.

 “అది సరే.. థాంక్యూ.. కానీ ఆ ప్రోజెక్ట్‌ సక్సెస్‌ అవాలంటే మీ అందరి సహకారం కావాలి” అంది హాసిని.

“ఓ.. దానికేముంది.. తప్పకుండా కోపరేట్‌ చేస్తాం..” అంటూ కోరస్‌‌గా చెప్పారు వాళ్ళు.

“సరే.. ఇక పని మీద దృష్టి పెడతాను” అని చెప్పిది హాసిని. అందరూ బయటకొచ్చి హాస్టల్‌ ముందున్న కాఫీ షాప్‌‌లో కూర్చుని సెలబ్రేట్‌ చేసుకున్నారు ఆ హేపీ మొమెంట్స్‌‌ని.

అయితే ఆమె ఆనందించినట్టు తర్వాతి కాలంలో పని సాఫీగా సాగలేదు. ప్రోజెక్ట్‌ ముందుకు సాగడానికి టెక్నికల్‌‌గా ఎన్నో అడ్డంకులు రాసాగాయి. ఆమె అనుకున్న కాన్సెప్ట్‌కి సరి అయిన సమాచారం దొరకడం లేదు. ఇంటెర్నెట్‌ అంతా వెదికినా ఫలితం లేకుండా పోయింది. ఇలా ఆమె తన స్ట్రగుల్‌లో ఉండగా “ఇంటికి ఒకసారి వచ్చి వెళ్ళమ్మా..” అని తల్లి కోరడంతో హైదారాబాద్‌ వచ్చింది. తల్లిదండ్రులతో గడిపి, భారమైన మనసుతో తిరిగి ఇప్పుడు ముంబై వెళుతోంది. ఎంత రిస్క్ తీసుకుని అయినా తన ప్రోజెక్ట్ అయిడియాని సక్సెస్ చెయ్యలి, మంచి జాబ్ సంపాదించి తన కుటుంబానికి ఆసరాగా నిలవాలి అన్న పట్టుదలతో ఉంది.

***

ప్రస్తుతం.. అర్ధరాత్రి పన్నెండు దాటింది. ట్రైన్‌ వేగంగా సాగిపోతోంది. కంపార్ట్‌‌మెంట్‌‌లో జనాలు నిద్రలో జోగుతున్నారు. హాసినికి నిద్ర పట్టడం లేదు. కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నిస్తోంది. ఇంతలో తన బెర్త్‌ దగ్గరకి ఎవరో వచ్చినట్టు అనిపించి కళ్ళు తెరిచింది. అంతే అదిరిపడింది. తన మొహానికి దగ్గరగా మొహం పెట్టి చూస్తున్నాడు ఇందాక వచ్చి అల్లరి పెట్టిన రౌడీ వెధవ. “ఏయ్‌.. ఏంట్రా ఇది?” అని గట్టిగా అరిచింది. వెంటనే వాడు తన బెర్త్‌ దగ్గరకి వెళ్ళిపోయాడు. కొంతమంది నిద్ర లేచి “ఏంటమ్మా గోల..” అని విసుక్కున్నారు. ఇక ఆమెకి నిద్ర పట్టలేదు. భయంగా అనిపించింది.

టైమింగ్స్ ప్రకారం ఈ ట్రైన్‌ తెల్లవారుజాము నాలుగ్గంటలకి ‘దాదర్‌’ స్టేషన్‌‌కి చేరుకుంటుంది. ఆమె అక్కడ దిగి ప్లాట్‌‌ఫాం మారి ‘కాంజుర్‌ మార్గ్‌’ వెళ్ళే లోకల్‌ ట్రైన్‌ పట్టుకోవాలి. కాంజుర్‌ మార్గ్‌‌లో దిగి అక్కడి నుండి ఆటోలో వెళితే ఐ.ఐ.టి.కి చేరుకోవచ్చు. లేదా ‘దాదర్‌’లో దిగిన తర్వాత టేక్సీ తీసుకుని తిన్నగా ఐ.ఐ.టి.కి వెళ్ళవచ్చు. కానీ కొంచెం టైము ఎక్కువ పడుతుంది, పైగా ఆ రూట్‌ చాలా చీకటిగా ఉంటుంది. పరిస్థితి బట్టి రెండింట్లో ఏదో ఒక ఆప్షన్‌ ఎంచుకోవాలని ఆమె అనుకుంది. నిద్ర పోకుండా అలాగే బెర్త్‌ మీద కూర్చుంది. పొద్దున్న నాలుగు అవుతుండగా దాదర్‌ స్టేషన్‌ వచ్చింది. నిశ్శబ్దంగా ఆమె తన బేగ్‌ తీసుకుని ట్రైన్‌ దిగింది. లోకల్‌ ట్రైన్‌ కోసం ప్లాట్‌‌ఫాం మారుదాం అనుకుంటుండగా, ఆ ముగ్గురు కనిపించారు. వాళ్ళు కూడా అదే స్టేషన్‌‌లో దిగారు. అంటే వాళ్ళు తనని గమనిస్తూ ఉన్నారని, వెంబడిస్తున్నారని అర్థమయింది ఆమెకు. ఒక్క క్షణం ఆమె ఆలోచనలో పడింది. తన ప్రోజెక్ట్‌ సక్సెస్‌ అవాలంటే ఇప్పుడు రిస్క్‌ తీసుకోవాలి.. తప్పదు. తన కాన్సెప్ట్‌ని ప్రూవ్‌ చెయ్యాలంటే తనే లైవ్‌ డెమో పీస్‌గా మారాలి. కానీ దాని వల్ల తన ప్రాణాలకే ముప్పు వస్తుంది. అయినా సరే రిస్క్‌ తీసుకోవాలనే అనుకుంది ఆమె. వెంటనే తన సెల్‌ ఫోన్‌ తెరిచి యాప్‌ని ఏక్టివ్‌లో పెట్టింది. తర్వాత గాఢంగా నిశ్వసించి అడుగు ముందుకు వేసి స్టేషన్‌ బయటకు వచ్చింది.

“టేక్సీ..” అని పిలిచింది. ఒక టేక్సీవాడు ఆమె ముందుకు వచ్చి “కహా జానా చాహతా హై మేడం..” అని అడిగాడు

“ఐ.ఐ.టి..” అంది

“బహుత్‌ దూర్‌ హై మేడం..” అన్నాడు

“జాదా పైసా దేంగే..”

“ఠీక్‌ హై మేడం.. ఆయియే” అన్నాడు. టేక్సీ లోకి ఎక్కింది హాసిని. ఇంతలో జబర్దస్త్‌‌గా ఆ ముగ్గురు వెధవలు వచ్చి టేక్సీలో ఎక్కి కూర్చున్నారు. టేక్సీ డ్రైవర్‌ కంగారు పడ్డాడు.

డ్రైవర్‌ని చూస్తూ “నోరు మూసుకుని పద” అని అరిచాడు ఒక రౌడీ వెధవ. టేక్సీ ముందుకు ఉరికింది. హాసినికి ఒక పక్క భయం, ఇంకో పక్క ఉత్సుకతగా ఉంది. ఏం జరగబోతోంది? తన ప్రయోగం ఫలించబోతోందా? లేకపోతే తన ప్రాణానికి, మానానికి హాని కలుగబోతోందా? ఇదే సందిగ్ధత ఆమె మనసులో. అయినా సరే తను రిస్క్‌ చేసి ఇందులో దిగింది కదా. ఇక తెగించి ఎదుర్కోవాలి అని గట్టిగా నిర్ణయించుకుంది. కారు తన మార్గంలో దూసుకు వెళుతోంది. సిటీ అవుట్‌స్కట్స్‌‌కి చేరుకుంది. అంతా చీకటి. ఇంకా తెల్లవారలేదు. అక్కడక్కడ రోడ్‌సైడ్ ఉన్న లైట్స్‌ పంచుతున్న వెలుగు సరిపోవడం లేదు. ఒక ఫ్లయ్‌ ఓవర్‌ పక్కకు చేరుకుంది ఆమె ప్రయాణిస్తున్న కారు. అక్కడి నుండి రైట్‌ తీసుకుని వెళితే ఐ.ఐ.టి వస్తుంది. కానీ రౌడీ వెధవలు “కారు ఆపరా..” అని అరవడంతో డ్రైవర్‌ కారుకి సడన్ బ్రేక్ వేసాడు.

హాసినిని జబ్బ పట్టుకుని కారు లోనుండి కిందకు దించారు వాళ్ళు. కారు డ్రైవర్‌ అక్కడి నుండి సర్రున వెళ్ళిపోయాడు. కొంచెం దూరంలో పొదలు ఉన్నాయి. వాటి వెనక్కు ఆమెను లాక్కుని తీసుకెళ్ళారు ఆ రౌడీ వెధవలు. గింజుకున్నట్టు నటిస్తూ తన సెల్ ఫోన్‌ని కొంచెం దూరంలో ఉన్న లేంప్ పోస్ట్ కిందకి విసిరేసింది. రౌడీలు అది గమనించలేదు. ఆమెను అలాగే పట్టుకుని పొదల వెనక్కు లాక్కుపోయారు. జింకను బలమైన సింహం నోట కరిచి లాక్కు వెళ్ళినట్టు ఆమెను ఈడ్చుకుపోయారు. ప్రతిఘటిస్తునట్టు నటించింది హాసిని. వాళ్ళు మరింత రెచ్చిపోయి ఆమె మొహం మీద బలంగా కొట్టారు. పెదవి చిట్లి రక్తం కారసాగింది. పొదల వెనక్కు వెళ్ళాక ఆమె ఒంటి మీద బట్టలను చింపడం మొదలు పెట్టారు. ఎంత కావాలనుకుని వచ్చినా ఇప్పుడు ఎందుకో ఆమెకు భయం కలిగింది. ఆ ముగ్గురు దుర్మార్గులతో ఒంటరిగా పోరాడుతోంది హాసిని. అయినా వాళ్ళ పశుబలం ముందు ఆమె నిలవలేక పోయింది. కరడు గట్టిన వాళ్ళెక్కడ, లేత తమలపాకులాంటి ఆమె ఎక్కడ! నెమ్మదిగా ఆమె బలహీనం అవసాగింది. కళ్ళు మూతలు పడసాగాయి. ఆ రౌడీ వెధవలు ముగ్గురూ ఆమెను చెరచడానికి రడీ అవుతున్నారు. ఇంతలో.. ఇంతలో.. ఏదో మాయ జరిగినట్టు.. ఎవరో పంపినట్టు.. సడన్‌‌గా పోలీసులు ప్రత్యక్షమయ్యారు అక్కడు. బిత్తరపోయారు రౌడీ వెధవలు. తప్పించుకు పారిపోదామని ప్రయత్నించారు. అంతే.. ముగ్గురి కాళ్ళల్లో బుల్లెట్లు దిగాయి. నేల మీద కూలబడి మూలిగారు దెబ్బ తిన్న ఊర కుక్కల్లాగ. కానిస్టేబుల్స్‌ వాళ్ళని జీప్‌ లోకి ఎక్కించారు. లేడీ కానిస్టేబుల్‌ హాసినికి బట్టలు తొడిగించింది. గాయపడ్డ లేడి పిల్లలా ఉన్న హాసినిని తనతో పాటే ఇన్నోవాలో తీసుకెళ్ళాడు సర్కిల్‌ ఇనస్పెక్టర్‌. హాస్పిటల్‌‌కి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించి , తర్వాత ఐ.ఐ.టి హాస్టల్‌‌లో డ్రాప్‌ చేసాడు. “మీరు డెవలప్ చేసిన ఏప్ ద్వారా పంపిన మెసేజ్ మాకు అందకపోయి ఉంటే మీ ప్రాణాలకే నష్టం జరిగేది. చాలా సాహసం చేసారు.. గ్రేట్ మళ్ళీ కలుద్దాం” అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఆమెను చుట్టి ముట్టిన ఫ్రెండ్స్‌ “కంగ్రాట్స్‌.. నీ ప్రోజెక్ట్‌ సక్సెస్‌ అయింది” అని అభినందించారు. బలహీనంగా నవ్వింది హాసిని.

***

విశాలమైన ఆ ఆడిటోరియం విద్యార్థులతో నిండిపోయి ఉంది. ముందు వరసలో ప్రొఫెసర్స్‌, పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులు ఆసీనులై ఉన్నారు. స్టేజ్‌ మీద హాసిని నిలబడి పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ చేస్తోంది. అందరూ ఆసక్తిగా వినసాగారు.

“అందరికీ నమస్కారం. ముందుగా నా ప్రోజెక్ట్‌ సక్సెస్‌‌కి సహకరించిన ఫ్రెండ్స్‌‌కి, ఫేకల్టీకి హ్రుదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజుల్లో ఒంటరిగా దొరికిన అమ్మాయిలపైన దుండగుల అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి. అమాయకులైన అమ్మాయిలు ఈ రాక్షసుల దాష్టీకానికి బలి అయి మరణిస్తున్నారు. ఇలాంటి వార్తలు విన్నప్పుడల్లా నా మనసు బాధతో మూలిగేది. దీనికి ఏదైనా పరిష్కారం కనుక్కోవాలని నాకు అనిపించింది. ప్రమాదంలో ఉన్న అమ్మాయికి వెంటనే సహాయం అందేలా ఒక యాప్‌‌ని డెవలప్‌ చెయ్యాలని కోరిక కలిగింది. ఇప్పటి దాకా ఉన్న యాప్‌లకి భిన్నంగా, ఎక్కువ ఉపయోగపడేలా ఉండాలన్నది నా ఆశయం. కానీ అది వెంటనే సాధ్యం కాలేదు. చాలా రీసెర్చ్‌ వర్క్‌ చేసాకే ఆ యాప్‌ డెవలప్‌ అయింది..” అని చెప్పసాగింది.

“దాని గూర్చి కొంచెం వివరిస్తారా..” స్టూడెంట్స్‌‌లో నుండి ఎవరో అడిగారు.

“తప్పకుండా..” అని తన స్పీచ్‌‌ని కొనసాగించింది.

“Wi-Fi అంటే మనందరికీ తెలుసు కదా. వైర్‌‌లెస్‌ ఫెడిలిటీ. ఒక వైర్‌‌లెస్‌ నెట్‌‌వర్క్‌ ఒక లిమిటెడ్‌ ఏరియాలో ఉన్న డివైస్‌ లకు ఇంటెర్నెట్‌ సదుపాయం కలిగిస్తుంది. ఇందులో రేడియో వేవ్స్‌ ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుంది. ఒక రూటర్ ఉంటుంది. దాని నుండి ఇంటెర్నెట్‌ డేటా రేడియో తరంగాల ద్వారా మన సెల్‌ ఫోన్‌‌కి , టీవీకి లేదా లాప్‌‌టాప్‌‌కి వస్తుంది. ఇది మన అందరికీ తెలిసిందే. అయితే Li-Fi అనేది కూడా ఉంది. లై-ఫై అంటే లైట్‌ ఫెడిలిటీ. ఇది కూడా వైర్‌‌లెస్‌ కమ్యూనికేషనే. కాకపోతే ఇంటెర్నెట్‌ డేటా LED బల్బ్ లాంటి ఒక లైట్ సోర్స్ నుండి కాంతి తరంగాల ద్వారా మన సెల్‌ ఫోన్‌‌కి, టీవీకి లేదా లాప్‌‌టాప్‌‌కి వస్తుంది. అదీ తేడా. అయితే ఈ టెక్నాలజీ మన ఇండియాలో ఇంకా అంత ప్రాచుర్యం లోకి రాలేదు. అందుకే నేను రెండింటినీ అనుసంధానం చేసి ఒక యాప్‌ తయారు చెయ్యాలి అని సంకల్పించాను. ఆ యాప్ పేరు ‘Li-Wi-Fi’. ప్రమాదంలో ఉన్న అమ్మాయిలు తమ సెల్‌ ఫోన్‌‌లో డౌన్ లోడ్ చెయ్యబడి ఉన్న ఈ యాప్‌ ద్వారా ఎలర్ట్‌ పంపిస్తే, అది దగ్గర్లో ఉన్న పోలీస్‌ స్టేషన్‌‌కి, కాంటాక్ట్స్‌‌లో ఉన్న మిత్రులకి చేరుతుంది. వెంటనే వాళ్ళు స్పందించి తగు చర్యలు తీసుకునేలా చేస్తుంది. ప్రమాదం సంభవించిన ప్రాంతంలో LED లైట్ వెలుతురు, దానికి కనెక్ట్ చెయ్యబడి ఇంటెర్నెట్ ఉంటే చాలు. ఈ యాప్ పని చేస్తుంది. అది సక్సెస్‌ అయింది. మీ అందరికీ ధన్యవాదాలు” అని ముగించింది. చప్పట్ల వర్షం కురిసింది (ఈ కాన్సెప్ట్ పూర్తిగా రచయిత ఊహ. భవిష్యత్తులో మనకు అందుబాటులోకి రావచ్చు).

ఒక పోలీస్‌ ఉన్నతాధికారి లేచి స్టేజ్‌ మీదకి వచ్చారు. మైక్‌ తీసుకుని మాట్లాడటం మొదలు పెట్టారు – “ఫ్రెండ్స్‌ .. అంతా విన్నారు కదా, తాను డెవలప్‌ చేసిన యాప్‌ గురించి. అయితే మీ అందరికీ తెలియని విషయం ఒకటి ఉన్నది. ఆ యాప్‌ అసలు పని చేస్తుందా లేదా అన్నది ప్రూవ్‌ చెయ్యడం కోసం తనే రిస్క్‌ తీసుకుని ఒక ప్రమాదం లోకి వెళ్ళింది. తన మాన ప్రాణాల్ని పణంగా పెట్టి ఈ యాప్‌‍కి లైవ్ డెమో ఇచ్చింది. ఇది మరి పెద్ద సాహసమే కదా. హాసిని చూపించిన ఈ తెగువను, ధైర్యాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆమె చూపిన ధైర్య సాహసాలకు, తెలివితేటలకు నేను ముగ్ధుడిని అయ్యాను. మీ అందరి ముందు ఆమెను సన్మానిస్తున్నాను” అని చెప్పి హాసినికి శాలువా కప్పి షీల్డ్‌ అందించాడు. చప్పట్లతో హర్షాతిరేకాన్ని ప్రదర్శించారు స్టూడెంట్స్‌. తర్వాత ఒక సీనియర్‌ ప్రొఫెసర్‌ లేచి మైక్‌ అందుకుని “హాసినీ.. వుయ్‌ ఆర్‌ ప్రౌడ్ ఆఫ్‌ యు. నువ్వు డెవలప్ చేసిన యాప్ ఆక్సెప్ట్ అయింది. టాప్ లెవెల్ మల్టీ నేషనల్ కంపెనీలో నీకు జాబ్ ఆఫర్ వచ్చింది అని మాకు ఇప్పుడే తెలిసింది” అని గట్టిగా చెప్పారు. ఆడిటోరియంలో అరుపులు, కేకలు. హాసినికి ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అందరి వైపు కృతజ్ఞతగా చూసింది!!!

Exit mobile version