Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎప్పటికీ రహస్యాలే!

[డా. కోగంటి విజయ్ రచించిన ‘ఎప్పటికీ రహస్యాలే!’ అనే కవితని అందిస్తున్నాము.]

డ్డి పరకపై జారిపోక నిలిచే మంచు బిందువు
మాటలు రాకున్నా పలకరించే పువ్వు
అలుపెరుగక పరిమళించే పసి నవ్వు –
భాష అవసరం లేని అనుభూతి కావ్యాలు!

పాతపడని సూర్యోదయపు పరవశత్వం
వసివాడని సూర్యాస్తమయ సౌందర్యం
ఒక చిన్ని పువ్వుతో జరిపే తేనెటీగ తనివి తీరని సంభాషణ
ముసిగా నవ్వుతూ సుడులు తిరిగే
ఊరి చివర కొండ వాగు మంద్ర గీతం –
రంగుల అవసరమే లేని నిత్య వర్ణ చిత్రాలు

ప్రతి గుండె లయలోనూ తెలుపని ఉద్వేగం
ప్రతి చూపు వెనకా నిలచి ఉన్న అభ్యర్థన
కదలని పెదవులు పలవరించే మాటల నిశ్శబ్దం –
భావనలు విప్పి చెప్పని సంగీత ప్రవాహాలు

ఇవి ఎప్పటికీ
అంతుచిక్కని రహస్యాలే!

Exit mobile version