Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎంత చేరువో అంత దూరము-3

[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[జాహ్నవి నీలిమ వాళ్ళింటికి వెళ్తుంది. మంచి నీళ్ళు తీసుకుని తండ్రి గదిలోకి వెళ్ళిన మాలతి – జాహ్నవి ఇంట్లో లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది కదా అని ఆయనతో అంటుంది. అవునంటారాయన. ఆయన గది అంతా సక్రమంగా సర్ది ఉంటుంది. ఆ గదిని చూస్తే ఆయన క్రమ పద్ధతి తెలుస్తుంది. ఇంతలో ఆయనకి ఫోన్ వస్తే, ఆ గదిలోంచి బయటకి వచ్చేస్తుంది మాలతి. ఆయన ఫోన్ మాట్లాడడం అయిపోయాకా, భోజనం తీసుకుని వెళ్ళాలని అనుకుంటూ సోఫోలో కూర్చుని రిమోట్‍తో టివి ఆన్ చేస్తుంది. టివిలో వస్తున్న పాట వినడంతో, ఆమె మనసు విచలితమవుతుంది. టివి ఆఫ్ చేసేస్తుంది. తన పుట్టినరోజు వేడుకకి వచ్చిన స్నేహితురాళ్ళని ఆహ్వానించి, పెద్దల హడావిడి తగ్గాకా, తన గదిలోకి తీసుకువెళ్తుంది నీలిమ. వాళ్ళు తెచ్చిన కేక్ కట్ చేస్తుంది. కాసేపు పిల్లలంతా సందడిగా గడుపుతారు. ఇంతలో ఎవరో ఏడుస్తున్న ధ్వని వినబడుతుంది. ఆమె తమ పిన్ని కూతురని, నాలుగు నెలల క్రితం ఆమె భర్త చనిపోయాడని, వాళ్ళ చిన్నారి బాబు తండ్రి కావాలని గొడవ చేస్తుంటే అక్క ఏడుస్తోందని చెప్తుంది నీలిమ. ఆ మాటలు విన్న జాహ్నవిలో దుఃఖం పొంగుతుంది. ఆ ఏడుపు వినవచ్చిన గది వైపు వెళ్తుంది. ఆ బాబుని చూస్తుంది. దుఃఖం ఆపుకోలేక తన వెనకాలే వచ్చిన నీలిమ భుజం మీద తల పెట్టి ఏడుస్తుంది. స్నేహితురాళ్ళంతా జాహ్నవిని ఓదార్చడానికి ప్రయత్నిస్తారు. సానుభూతి చూపిస్తారు. తనని తాను సంబాళించుకుంటుంది జాహ్నవి. పార్టీ ముగిసాక పిల్లలందరినీ వాళ్ళ కారులో ఇళ్ళ వద్ద దింపుతారు నీలిమ వాళ్ళ నాన్న. తండ్రి ఆలోచనలు మనసును కుదిపేస్తుండగా తనకిష్టమైన బొమ్మని హత్తుకుని ఆలోచిస్తూ మెల్లిగా నిద్రలోకి జారుతుంది జాహ్నవి. మర్నాడు నీలిమ ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడుగుతుంది. తామిద్దరికీ పర్సనల్ ఫోన్స్ లేవు కనుక ఉత్తరాలు రాయాలని అనుకుంటుంది జాహ్నవి. ఇంకో రోజు నీలిమ మాలతి సెల్‍కి ఫోన్ చేస్తే – తాను ఆమెకు సారీ చెప్పాలనీ, కొన్ని విషయాలు మాటల్లో చెప్పలేననీ, అందుకే ఉత్తరం రాస్తానని అంటుంది జాహ్నవి. నీలిమకి ఉత్తరం రాయడం మొదలుపెడుతుంది. ఎన్నో ఆలోచనలు జాహ్నవిని కలవరపెడతుండగా, నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. – ఇక చదవండి.]

అధ్యాయం 3

నీలిమ, జాహ్నవి నుండి మొదటి ఉత్తరం అందుకుంది. ఆనందోద్వేగాల నడుమ మడత విప్పింది. అక్షరాలు, ఆమె హృదయంపై అందమైన రంగవల్లులు దిద్దినట్టు అలుముకు పోతున్నాయి. తాము, తమ బాల్యం..

ఏ సీమ దానివో ఎగిరెగిరి వచ్చావు. తన ప్రియ నేస్తం, హైదరాబాద్ నుండి మైసూర్ వచ్చి తన చేయందుకుంది. నీలిమ కంటి కొలుకుల్లో నీళ్ళు నిలిచాయి. జానూ తనకు లెటర్స్ వ్రాస్తానందని, ముందే తల్లికి చెప్పి ఉంచింది. అందుకు కారణం కూడా చెప్పింది. జానూ తనతో షేర్ చేసుకోవాలనుకున్నకబుర్లు ఉన్నాయని, స్కూల్ మారడం వల్ల మిస్ అయిన సంగతులు కూడా ఇలా వ్రాసుకోవాలనుకున్నామని.. చెప్పింది.

ఆవిడకు కూతురంటే ఆరవ ప్రాణం. “అలాగేలేవే” అంది. దానికి తోడు కూతురిని బయటకెక్కడికీ పంపక పోవడం వల్ల ఆమె పట్ల మరీ సానుభూతి. ఉత్తరం ముగించిన నీలి, హడావిడిగా తల్లి దగ్గరకు వచ్చింది. “ఫోన్ ఇవ్వు” అంటూనే, ఫోన్ తీసుకొని వెళుతూన్న కూతురి వంక ఆశ్చర్యంగా చూసింది ఆమె.

తెల్లని నీలి ముఖం ఉద్వేగంతో రక్తం చిమ్మి, ఎర్రగా అయ్యింది. ఫోన్ తీసుకొని మాట్లాడుతూ, కళ్ళు తుడుచుకుంటూ వెళుతున్న కూతురును చూసి, “ఒకే ఊళ్ళో ఉండి ఉత్తరాలేమిటో! ఆ ఉద్వేగాలు ఏమిటో!” అనుకుంది. స్నేహితుల మధ్య వ్యవహారం నాకెందుకులే! అయినా జానూ, నీలి మంచి పిల్లలు. వాళ్ళ సంగతి నాకు తెలీనిదా – జానూ వాళ్ళుమ్మ గారు ఎవరి తోనూ కలవరు. ఒకటే కాలనీలో ఉన్నారు కదా! టెంపుల్‌కు కానీ, షాపింగ్‌కు కానీ తనతో వస్తారని ఆశించి భంగపడింది.

వీళ్ళ స్నేహమయినా ఇలా వృద్ధి చెందనీ, ఈ కట్టుబాట్ల మధ్య స్వేచ్ఛ కోల్పోయిన నీలిమకు జానూ స్నేహం ఓ గొప్ప ఉపశమనం అనుకుంది. అంతేకాని అమ్మాయిల వ్యవహారం పై ఓ కన్నేయాలనుకోలేదు. అనుకుని ఉంటే ఇంత కథ నడిచేది కాదేమో!

***

జాహ్నవి ఉత్తరాలు నీలికి చాలా చాలా నచ్చుతున్నాయి. సెల్‌లో మాట్లాడుతుంటే సమయం తెలియదు. గంటలయినా మాట్లాడవచ్చు. కానీ, ఉత్తరం ఐదు నిముషాల్లో ముగించినా, ఆ అనుభూతి మనసంతా అత్తరు అద్దుకున్నట్టు వదలనే వదలదు. తానంటే ఎంత ఇష్టమో జానూ మనసు విప్పి చెప్తుంటే, నీలి మనసు మరో లోకంలో తేలిపోతోంది. ఉత్తరాలు ఇంత ఆనందం ఇస్తాయని, మనసులను మరింత సన్నిహితం చేస్తాయనేది ఆ టీనేజ్ అమ్మాయిలు స్వయంగా అనుభూతిస్తున్నారు.

జాహ్నవి స్నేహం తనకెంత విలువైనదో అక్షర మాలికలు పేర్చింది నీలి.

ఇలా సాగుతుంటే.. జాహ్నవి వ్రాసిన ఓ బరువైన ఉత్తరం నీలిమను విచలితను చేసింది.

నీలూ,

నేను మన పవిత్రమైన స్నేహానికి ద్రోహం చేసాను. ఇది నిజం. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు కదూ! నేను ఎప్పుడైనా ‘నాన్న’ అనే పదం నీ ముందు ఉచ్చరించానా? లేదు, కదూ! చూసావా! ప్రియాతిప్రియమైన నీ దగ్గర కూడా నా మనసు కోణం విప్పలేదు. అందుకే నువ్వు నన్ను క్షమించాలి, నీలూ!

అదేంటో! చిన్నప్పటి నుండి కూడా నాకు మా ఇల్లు నచ్చేది కాదు. నచ్చక పోవడం అంటే ఇష్టం లేదని కాదు. ఏదో లోటు స్ఫురిస్తూ ఉండేది. ఫ్రెండ్స్ ఇళ్ళకు వెళ్ళేవాళ్ళం నువ్వూ, నేనూ.. కానీ ఇంటికి వచ్చాక, నా మనసంతా ఏదోలా ఉండేది. అందరి ఇళ్ళలో నాన్న ఉన్నాడు.

మాథ్స్ చెప్తూ, అల్లరి చేసినప్పుడు కోప్పడుతూ, అలిగినప్పుడు బుజ్జగిస్తూ, పేరెంట్స్ మీటింగ్‌కు వస్తూ, స్కూల్లో డ్రాప్ చేస్తూ.. అన్నింటిలో ‘నాన్నది’ ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ..

నా జీవితంలో అలాంటి ఓ ముఖ్యమైన అనుబంధాన్నుండి దూరంగా ఉన్నాను అనిపించేది. నా రిపోర్ట్ తీసుకోవడానికి తాతగారు మాత్రమే స్కూల్‌కు వచ్చేవారు. అమ్మ సంగతి తెలుసు కదా! తానెక్కడికీ వచ్చేది కాదు.

ఇవన్నీ క్రమంగా నాలో నా లైఫ్ చాలా అన్‌కామన్‌గా నడుస్తూంది అనే ఫీలింగ్ పెంచాయి. మీరేదైనా గిఫ్ట్ నాన్న కొన్నారు అని చెపితే, మీ బర్త్ డే పార్టీల్లో మీ నాన్నల హంగామా చూస్తే, నాకు తెలీకుండానే నా మనసు నేను చాలా కోల్పోయానని, కోల్పోతున్నానని గొడవ చేసేది.

కానీ.. ఏదైనా లోపలే నా ఫైటింగ్ అంతా. పైకి జాహ్నవి చాలా నార్మల్. ఆమె స్ట్రగుల్ ఎవరికీ తెలియదు. ప్రాణానికి ప్రాణమైన నీలికి కూడా. అయితే, నేనిలా నా గుండెను గుప్పిట్లో పెట్టుకోవడానికి కారణం ఉంది, అదేమిటో తెలుసా! నీకు మళ్ళీ లెటర్ లో చెప్తానే.. ఇప్పుడు మనసు బరువెక్కతూ ఉంది. నీ ప్రియ నేస్తం – జాహ్నవి.

ఇక్కడికి ముగించింది జాహ్నవి. క్రింద కన్నీరు కారుస్తూన్న ఎమోజీ ఒకటి పెట్టింది.

ఇంక నీలి రియాక్షన్ వేరే చెప్పాలా! రేపటి దాకా ఆగలేక పోతోంది. తన ప్రియ నేస్తం తన దగ్గర బాధను దాచి పెట్టేంత కారణం ఏమిటి? అప్పుడే తెలుసుకుని ఆమెను ఓదార్చాలన్న ఆరాటంలో, అమ్మ ఫోన్ చేతి లోకి తీసుకుంది. సరిగ్గా అప్పుడే లోపలికి వచ్చారు, మహేంద్ర. ఫోన్ యథాస్థానంలో ఉంచి, తన రూమ్ లోకి వెళ్ళి పోయింది నీలి. అంత భయం, గౌరవం ఆ ఇంటి యజమానికి, ఆ ఇంట్లో.. బయటా కూడా.

***

నీలి జాహ్నవికి ఫోన్ చేసి చెప్పింది. “ఒక రెండు రోజులు లెటర్ వ్రాయకే. నాన్న రోజంతా ఇంట్లోనే ఉంటారట. ఊళ్ళోనే ఉంటూ లెటర్స్ ఎందుకు, అంటూ ప్రశ్నిస్తే ఏమి చెప్పాలో అర్ధం కాదు నాకు. అసలే ఆయన అంటే భయం,” అంది. “ఔను లే! ఆయన ఆడపిల్లల విషయంలో ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటారో తెలుసు కదా!” అంది జాహ్నవి. “అవును, ఏ బాయ్ ఫ్రెండ్ లెటరో అనుకున్నాడంటే మా నాన్న.. ఇంక నా పని అయినట్టే” జాహ్నవి, నీలి నవ్వుకున్నారు. ఇలా ఉత్తరాల పర్వానికి కాస్త వెసులు బాటు వచ్చిన సమయంలోనే..

జాహ్నవి హృదయంలో స్కూల్లో జరిగిన ఆ ఘటన తీవ్ర సంచలనం కలిగించింది. ప్రిన్సిపాల్ మేడం క్లాస్ రూమ్ నుండి స్వర్ణను పిలిపించారు. నెల రోజులుగా స్వర్ణ స్కూల్కు రావట్లేదు. ఆ విషయం క్లాస్ లీడర్‌గా మిస్‌కు రిపోర్ట్ చేసింది జాహ్నవి. వాళ్ళ అమ్మగారిని పిలిపించారు. విషయం విని ఆవిడ నోరు వెళ్ళబెట్టింది. “దీనికి రోజు లంచ్ పెట్టి స్కూల్‌కు పంపుతున్నాను” అంటూ ఆవిడ ప్రిన్సిపాల్ ముందు మొత్తుకుంది. గొడవ స్కూల్ అంతా తెలిసి పోయింది. అందరూ బ్రేక్ పీరియడ్‌లో స్వర్ణ చుట్టూ మూగారు. “మరి ఎక్కడికి వెళ్ళావే నువ్వు? మీ అమ్మగారు అలా ఏడుస్తూ వెళ్ళి పోయారేమిటి”

“నేనూ -” అని కాస్త ఆగి, “మా నాన్న దగ్గరికి వెళ్ళానే” తల పైకెత్తి అతిశయంగా చెప్పింది స్వర్ణ. ఆ సమాధానంతో జాహ్నవి నిటారుగా అయ్యింది. ఆమె సర్వేంద్రియాలు అప్రయత్నంగా అలర్ట్ అయ్యాయి. విననట్టే వింటూంది, స్వర్ణ మాటలను. “మా బామ్మ పడ్డారు. కాలుకు కట్టు వేసారు. పాపం, నాన్న ఒక్కళ్ళు అయ్యారు, బామ్మని కూడా చూసుకోవాలి కదా! అందుకే రోజూ పొద్దున్నే స్కూల్‌కు అని చెప్పి ట్రైన్ ఎక్కి, గంటన్నర జర్నీ చేసి నాన్న దగ్గరికి వెళ్ళేదాన్ని. నేనిలా అప్పుడప్పుడు వెళుతూనే ఉంటాను తెలుసా!

ఇప్పుడు చాలా రోజులు స్కూల్ డుమ్మా అవడం వల్ల వ్యవహారం బయట పడింది.”

స్వర్ణ మెరిసే కళ్ళతో మళ్ళీ మొదలు పెట్టింది. “నేను వెడితే మా బామ్మ నాకు మీగడ పెరుగు వేసి అన్నం పెడుతుంది, తెలుసా! నేనెప్పుడు వస్తానో అని ఇంట్లో నా కోసం అప్పాలు చేసి ఉంచుతారు. మా నాన్న ఎంత మంచివారు తెలుసా, మళ్ళీ పెళ్ళి చేసుకోనే లేదు.” గర్వంగా అని, “నా పెళ్ళి కోసం డబ్బు దాచి పెడుతున్నారు” అంది మురిపెంగా.

జాహ్నవి ఎటో చూస్తూనే, పట్టనట్టుగానే విన్నది. ఓరకంట స్వర్ణ ఫీలింగ్స్‌ని పట్టుకుంది. కళ్ళతో కాదు, మనసు కెమెరాతో. స్కూల్ నుండి ఇంటికి వచ్చినా అవే స్వర్ణ మాటలు, వదలని ఆలోచనలు.. మున్నీని వార్డ్‌రోబ్ నుండి తీసి చెక్కిలికి అనించుకుంది. తాతగారు ఇల్లు సర్దిస్తూంటే.. సామాన్లలో పడి ఉంది, మున్నీ. అమ్మ గదిలో ఏ మూలో తన లోకంలో తాను ఉంది. హిస్టీరిక్‌గా బిహేవ్ చేస్తూండేది. తాతగారు తనని పిలిచి, “జానమ్మా! నీ బొమ్మ తీసి దాపెట్టుకో” అన్నారు.

“దానితో నీ ఆటలు చూస్తాననుకున్నాడు కాబోలు, మీ నాన్న” అంటూ ఏదో ఆయన గొణుక్కుంటూ ఉంటే, తాను మున్నీని చంకన వేసుకుంది. అంతే ఆ రోజు వినడమే నాన్న అన్న పదం. మళ్ళీ ఎక్కడా వినిపించ లేదు. తాను పెరుగుతూంటే నాన్న జ్ఞాపకాల ఆనవాళ్ళే ఇంట్లో మాయం అయ్యాయి.

ఆ ఇంటి నాలుగ్గోడల్లో వినిపించక పోయినా, మ్రోగుతూనే ఉంటుంది, తన గుండెల్లో.. నాన్న అనే పదం.

“మా నాన్న ఎంత మంచివారూ! నా కోసం మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు తెలుసా!” – స్వర్ణ

“మా నాన్న కూడా మంచివాడు.. చాలా మంచివాడు” అనుకుంది జాహ్నవి. జరిగిన ఈ సంఘటన కూడా నీలికి వ్రాయాలి. దానితో షేర్ చేసుకోవాలి అనుకుంది, నిద్ర పోబోతూ.

***

మరునాడు స్కూల్ అయ్యాక, ఇంటికి వచ్చి తన హోమ్ వర్క్ పూర్తి చేసింది జాహ్నవి. తన హోమ్ వర్క్ బుక్స్ స్వర్ణకు ఇవ్వమన్నారు మిస్. మూడు రోజులు వరుసగా సెలవులు వచ్చాయి. మాలతికి చెప్పి, స్వర్ణకి బుక్స్ ఇచ్చేందుకు బయటకు నడిచింది.

ఆ రోజు తర్వాత స్వర్ణపై ఆసక్తి పెరిగింది. ఆమెకు నోట్ బుక్స్ ఎలా అయినా అందించవచ్చు. కానీ కుతూహలం జాహ్నవిని స్వర్ణ ఇంటికి వెళ్ళేలా చేసింది. కాస్త లావుగా, సామాన్యంగా కనిపించే స్వర్ణ.. వయసులో తమ కంటే రెండేళ్ళు పెద్దట. కుటుంబ కలహాల వల్ల స్కూల్‌లో జాయిన్ చేయడం ఆలస్యం అయ్యిందని వినుత చెప్పింది.

వినుత వాళ్ళ అమ్మకు, స్వర్ణ వాళ్ళ కుటుంబం పరిచయమేట.

స్వర్ణ వాళ్ళ అమ్మ, తాను పనిచేసే సంస్థ యజమాని డబ్బు, హోదా చూసి ఆకర్షితురాలు అయ్యిందట. డబ్బును చూసి, హోదా చూసి ఆకర్షితమెలా అవుతారు. తన కర్థం కాకున్నా వింటూండి పోయింది.

వాడికలా తన డబ్బు, దర్పం చూపి, తన క్రింద పని చేసే ఆడవారిని ఆకర్షించడం మాములేనట. విషయం బయటకు వచ్చి, ఆ స్త్రీలను భర్త వదిలేస్తే, వాళ్ళకు భార్య స్థానం కల్పిస్తాడట. ఆమె పిల్లలు ఆమెతో వస్తే వారిది కూడా పోషణాభారం నెత్తిన వేసుకుంటాడట. అలా వాళ్ళ జీవితాలు వీధి పాలు కాకుండా కాపాడుతాడట.

అన్నీ కొత్త సంగతులే జాహ్నవికి. దీన్నెలా అర్థం చేసుకోవాలి. అతడు మంచివాడా, చెడ్డవాడా? ఇలాంటి ఫ్యామిలీస్ కూడా ఉంటాయా? జాహ్నవి సహజంగా ఇలాంటివి ఆలోచించదు కానీ తండ్రిని కలుసుకునే స్వర్ణ క్యారెక్టర్ ఆమెను విపరీతంగా ఆలోచింప జేస్తున్నది.

బస్ రాగానే చేతిలో పట్టుకున్న నోట్ బుక్స్‌తో బస్ ఎక్కేసింది. స్వర్ణ ఇన్నాళ్ళు స్కూల్‌కు రాకపోవడం వల్ల ఆమెకు అన్ని సబ్జెక్టుల్లో నోట్స్ వ్రాసుకునే పని చాలానే ఉంది. స్వర్ణ విషయాలు మరింత తెలుసు కోవాలన్న ఆసక్తి జాహ్నవిలో.

స్వర్ణ వాళ్ళ ఇల్లు చాలా సామాన్యంగా ఉంది. వాళ్ళమ్మ గారు, సాదరంగా ఆహ్వానించారు. స్వర్ణ, “రా, జాహ్నవి,” అంటూ తన రూమ్ లోకి పిలిచింది. స్టడీస్ గురించి మాట్లాడుకున్నారు. నోట్ బుక్స్ తిప్పేస్తూ, “నీ రైటింగ్ ఎంత బాగుంటుంది, జాహ్నవీ!” అంది స్వర్ణ.

“హు, చాలా పెండింగ్ అయిపొయింది. ఏమిటో తప్పలేదు నాకు” అంది మళ్ళీ. “బామ్మకు, నాన్నకు హెల్ప్ అయ్యాను. ఆ తృప్తి ముఖ్యం. అసలు మా నాన్న దగ్గరికి వెళితే ఎంత బాగుంటుంది, తెలుసా!”

“అసలు నా ప్లేస్ అదే కదా!”

“అంటే..?” అంది జాహ్నవి, కనుబొమ్మలు పైకెత్తి, తనకు అర్ధం కానీ, తెలియని విషయాల లోతు అర్ధం చేసుకోవాలన్న ఆరాటం.

స్వర్ణ తనలా తండ్రికి దూరం అయ్యింది కదా, తన వర్షన్ ఏమిటో తెలుసుకోవాలన్న కోరిక.

“అవును, జాహ్నవి! మనకు ఇంటి పేరు ఎవరిది ఉంటుంది, చెప్పు. నాన్న ఇంటి పేరే కదా! ఎక్కడైనా గమనించు, పోలికలు ఎక్కువగా కనిపించేది నాన్న వైపు వారివే.”

జాహ్నవి కళ్ళు ఆమెకు తెలీకుండానే మరింత వెడల్పయ్యాయి. తత్వోపదేశం సాగుతోంది.

“అసలు మా నాన్న దగ్గరికి వెళితే ఎంత బాగుంటుందనుకున్నావు. మా అత్తయ్య నాకు పూల జడ కుడుతుంది. మా అత్తయ్యతో మా బావ, వదిన వచ్చారంటే జోకులే జోకలు. మా బాబాయ్‌కి నేనంటే ఎంత ఇష్టమో! జాహ్నవి!”

“ఇది అచ్చు మా బాపు లాగనే అంటాడు బాబాయ్. ఇది మాట్లాడితే విజ్జి లాగా అంటే మా మేనత్త లాగే మాట్లాడుతానంటాడు నాన్న. నేనెవరో, నా లక్షణాలు ఏమిటో వాళ్ళ నోటి నుండి వింటూంటే ఆ ఫీలింగే వేరు. అసలు మనమంటే ఏమిటో మనకు తెలిపేది, మన వ్యక్తిత్వానికి, మనకు తెలీకనే ఓ లక్షణం మరెవరి నుండో రావడం, అదే జాహ్నవీ, జీన్స్ అంటారే అది, మన గురించి మనకు తెలియడం వెరీ థ్రిల్లింగ్ కదా!”

స్వర్ణ, జాహ్నవి కంటే రెండేళ్ళు పెద్ద. కుటుంబ పరిస్థితులు, జీవన స్థితిగతులు ఆ అమ్మాయిని ఆరిందాలా చేసాయి. నవలా నాలెడ్జి కూడా బాగానే సంపాదించిందేమో!

స్వర్ణ మాటలు కొత్త ఆలోచనలకు తలుపు తడుతున్నాయి. తనకు తెలీని ప్రపంచం చాలానే ఉందనిపించింది జాహ్నవికి.

కాసేపటికి ఇంటి దారి పట్టింది.

అత్తలు, బాబాయ్‌లు, కజిన్స్.. ఎంత మంది స్వర్ణకు.

తనకూ ఉన్నారా..!?

ఎవ్వరు ఎక్కడున్నారో.. ఉన్నారో లేదో!

మనసు తరంగాల మౌన ఘోష..

అడుగులు బస్టాప్ వైపు, యాదృచ్ఛికంగా.

***

ఏదైనా జరిగితే అమ్మకు చెప్పాలి. అలాగే ఇది కూడా చెప్పాలనుకుంది.

ఆ రాత్రి భోజనాల బల్ల దగ్గర జరిగిందంతా మాలతికి చెప్పింది. వేరే ఉద్దేశ్యం లేదు. అమ్మకు పిల్లలు అన్నీ చెప్పినట్టు గానే చెప్పింది. కానీ, మాలతికి కంగారు వేసింది.

‘స్వర్ణ’ సంఘటన జాహ్నవిని ప్రభావితం చేయదు కదా!

ఆమె కళ్ళు జాహ్నవి ముఖంలో ఏదో వెదుకుతున్నాయి.

జాహ్నవి దొరుకుతుందా! దొరికితే ఆమె జాహ్నవి అవుతుందా!

“అమ్మా, నువ్వు చేసే పాలక్ పనీర్ వినుత చాలా మిస్ అవుతుందిట,” అంది.

మాలతి తేలిగ్గా ఊపిరి పీల్చుకొని,”రేపు బాక్స్‌లో కట్టిస్తాను లే!” అంది. అందరిలా ఓ పిచ్చి తల్లి, మాలతి కూడా.

జాహ్నవికి మాత్రం స్వర్ణ మాటలు ఒక్కొక్కటిగా తలుపుకు వస్తూనే ఉన్నాయి..

“వాడు మా పోషణ భారం నెత్తిన వేసుకున్నంత మాత్రాన, అమ్మకు పుస్తె కట్టినంత మాత్రాన, వాడు మా నాన్న అయిపోతాడా?”

“వాడు ఇంట్లోకి వచ్చాడంటే, నేను ఎవరింటికైనా వెళ్ళి గడుపుతాను.”

“జాహ్నవీ! ఎప్పటికైనా నా పెళ్ళి మా నాన్నే చేస్తాడు. వీడు పీటల మీద కూర్చొని చేసేందుకే లేదు. మా అమ్మా, నాన్ననే చేయాలి.”

“అసలు మా బామ్మ నన్ను లాక్కొని, మా అమ్మను నెట్టేసిందట. కానీ, నాన్ననే తల్లి నుండి పిల్లను వేరు చేయకూడదు అని, నన్ను ఇచ్చేయమన్నారట. నా కోసం అందరూ ఎంత ఏడ్చారోనట.”

“జాహ్నవి! నాకయితే నన్ను మా నాన్ననే ఉంచేసుకుంటే బాగుండేదనిపిస్తుంది. ఇప్పుడు చూడు, వాడి ముఖం చూడాలంటేనే ఎంత రోతగా ఉందో! చిన్నప్పుడు తెలిసేది కాదు. తెలిసాక భరించలేక పోతున్నాను.”

“థాంక్, గాడ్!” స్వర్ణ లాంటి బాధలు నాకు లేవు అనుకుంటుంది, జాహ్నవి, ఆమె ఒక్కో మాట స్ఫురణ లోకి వచ్చినప్పుడు. క్రమంగా ఆ ఆలోచనల నుండి మనసు దూరం జరిగింది. కానీ, స్వర్ణ సాహసం మాత్రం మనసు పై చెరగని ముద్ర వేసింది.

***

జాహ్నవికి నీలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. “నాన్న మళ్ళీ బిజీ, లెటర్ వ్రాయి” అని. అంతే కాదు, “నీవు ఎందుకు అలా చివరికి నాతో కూడా నీ బాధ పంచుకోలేక పోయావో గెస్ చేయలేక పోతున్నానే” అంది. చదువు ప్రాముఖ్యం, వ్యక్తిగత విషయాల్లో మరుగున పడకుండా చూసుకునే జాహ్నవి, నీలిని హెచ్చరించింది. “ఇవేవి నీ స్టడీస్‌ను డిస్టర్బ్ చేయట్లేదు కదా!” అంది. “హు! నా చదువు ఎవరిక్కావాలే! ఆడపిల్ల చదువు కదా!” అంది నీలి.

“అలా అనకే, ముందు నీ చదువుకు నీవు విలువ నివ్వడం నేర్చుకో!” అంటూ మెత్తగా మొట్టికాయలు వేసి, “లెటర్ ఇప్పుడే పోస్ట్ చేస్తాను.” అంది జాహ్నవి. “ఓహ్.. అయితే వ్రాసే ఉన్నావన్న మాట. వెంటనే ఆ పని చేయి” అంది నీలి ఆత్రంగా.

(ఇంకా ఉంది)

Exit mobile version