Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎంత చేరువో అంత దూరము-24

[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[మాలతి వెళ్ళలేదనే విషయం కలిగించిన ఆదుర్దాను దూరం చేస్తూ, ఊర్మిళ బర్త్ డే వస్తోంది అన్న విషయంపైకి  మనసు మళ్ళించుకుంటాడు ఆనంద్. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు పెడుతూ, గతాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆనంద్‍కి ఆరోగ్యం బాలేక ఊర్మిళ అతని ఇంటికి వచ్చి అతన్ని చూసుకుంటున్న రోజుల్లో, అమ్మణ్ణి ఒకసారి ఫోన్ చేస్తుంది. తను చదివిన నవలల్లోని హీరోయిన్‍ల పేర్లతో ఊర్మిళని పలకరిస్తూ, ఆనంద్‍ని విజయ్ అనీ, రాజశేఖరం అనీ సంబోధిస్తుంది అమ్మణ్ణి. ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఉండడం వల్ల, సౌండ్ తక్కువగానే ఉన్నా అవన్నీ ఆనంద్‍కి వినిపిస్తూనే ఉంటాయి. కాసేపు ఆలోచించాకా, అవన్నీ నవలలో నాయికానాయకుల పాత్రల పేర్లని ఆనంద్‍కి స్ఫురిస్తుంది. అమ్మణ్ణి అల్లిన కథ అర్థమవుతుంది. ఆ మర్నాడు వంటకి కూరల కోసం ఊర్మిళ ఫ్రిజ్ డోర్ తీస్తుండగా ఆమె పొడవాటి జడని చూసి ఆశ్చర్యపోతాడు ఆనంద్. అదంతా నీ జుట్టేనా అని అడిగితే, కేరళ మహిళలలో చాలామందికి కేశాలు పొడుగ్గానే ఉంటాయని జవాబు చెప్తుంది. ఆనంద్ నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నారని అడిగితే, ఏరియల్ ప్రకటనని ప్రస్తావిస్తాడు. ముందు అర్థం కాకపోయినా, అర్థమయ్యాకా కోపం వస్తుంది ఊర్మిళకు. నీకు సహస్రనామాలున్నాయంటూ అమ్మణ్ణి పిలిచిన పేర్లను చెప్తే ఏడిపిస్తాడు. కోపం పట్టలేక అమ్మణ్ణికి ఫోన్ చేసి తిడుతుంది ఊర్మిళ. అయితే లెటర్ వ్రాసి పెట్టి వెళ్ళి పోమని సలహా ఇస్తుంది అమ్మణ్ణి. ఫోన్ పెట్టేస్తుంది ఊర్మిళ. ఆనంద్‍ని చూడడానికి వచ్చిన మామయ్య – ఊర్మిళ ప్రవర్తన చూసి, ఆమెను పెళ్ళిచేసుకోమని సలహా ఇస్తాడు ఆనంద్‍కి. తన లీవ్ అయిపోవస్తుండంతో, ఊర్మిళకు ఇష్టం లేకపోయినా ఆమెను హాస్టల్‍కు పంపేస్తాడు. రెండు రోజులు గడిచినా, ఆమె ఫోన్ చేసి తన ఆరోగ్యం గురించి అడగకపోయేసరికి – ఏమయిందో అర్థం కాదు ఆనంద్‍కి. ఊర్మిళను మిస్ అవుతున్న భావన కలుగుతుంది. బాగా ఆలోచించగా, ఆమె నొచ్చుకుని హాస్టల్ విడిచి వెళ్ళిపోయిందేమోనన్న అనుమానం వస్తుంది. వెంటనే మహేష్‍ని తీసుకుని కారులో హాస్టల్‍కి బయల్దేరుతాడు ఆనంద్. – ఇక చదవండి.]

అధ్యాయం 24

ర్మిళ హాస్టల్ నుండి బయటకు వచ్చేసరికి ఆనంద్ కారును ఆనుకుని నిల్చుని ఉన్నాడు. ఆరడుగుల అందగాడు, ఒత్తయన జుట్టు వాడు, ఎవరి కోసం వచ్చాడా అని అక్కడి అమ్మాయిలలో కుతూహలం.

ఊర్మిళ బయటకు రాగానే మహేష్ కారు డోర్ తెరిచి పట్టుకున్నాడు. ఊర్మిళ వివర్ణమైన ముఖంతో బయటకు వచ్చి, ఆనంద్ వంక ఒకసారి చూసి కారు ఎక్కింది.

ఆనంద్ ఏదో ఆలోచిస్తున్నట్టు ఉన్నాడు. సంభాషణ ఏమీ సాగలేదు.

మహేష్ ఉండడం వల్ల కొంత, ఎవరి ఆలోచనల్లో వారు ఉండడం వల్ల కూడా కావొచ్చు.

ఇంటికి చేరాక కూడా అదే గంభీరత అతనిలో.

లోపలికి రాగానే అడిగాడు. “ఫోన్ చేయడానికి ఏమైంది నీకు!”

కోపంతో దవడ బిగుసుకుంది.

ఊర్మిళ కూడా భయపడలేదు. చిన్న స్వరంతో నయినా స్థిరంగా సమాధానం చెప్పింది. “ఎందుకు చేయాలి” అంది.

ఆనంద్ ఊర్మిళ వంక చూసాడు.

చిక్కి పోయింది. కారణం తెలీదు.

బామ్మ మాటలు గుర్తుకు వచ్చాయి.

‘చక్కనమ్మ చిక్కినా అందమే’ట.

‘‘ఒక మనిషి ఆరోగ్యం బాగా లేదు. చచ్చాడో, బ్రతికాడో అని ఒక్క ఫోన్ చేసావా!”

“దయచేసి అలాంటి మాటలు ఆపండి.”

“నువ్వు చేసిన దానికి ఇంకెలా మాట్లాడాలి?”

“నేనేమి చేసాను. దేనికీ నాదేనా తప్పు?”

 “ఒక్కసారి అన్నా నా పరిస్థితి గుర్తు తెచ్చుకున్నావా?” అంతే కఠినంగా అడిగాడు.

“ఓ అనాథ అమ్మాయి, అనాథ లాగా బ్రతికడం నేర్చుకుంటే మంచిది.”

“అంటే!”

“సహాయం చేసే వాళ్ళను విసిగించడం సభ్యత కాదు, అనే నిర్ణయానికి వచ్చాను.”

“ఆ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సింది.”

“ఇప్పటికి కూడా ఏమీ మించిపోలేదు” మొండిగా అంది.

“అంటే హాస్టల్‌కు వెళ్ళిపోవాలి అనే పూర్తిగా డిసైడ్ అయి ఉన్నావా?”

“వెళ్ళగొట్టే వరకు ఉండకూడదు కదా!”

“నేను వెళ్ళగొట్టలేదు. చదువుకోమని మాత్రమే చెప్పాను.”

“ఇది అబద్ధం” అంది.

“తెలివి నేర్చావ్!” అన్నాడు.

ఈ అధికారమే ఆమెకు నచ్చనిది.

“మీరు పరిచయం అయ్యారు, కదా!” అంది అతని మాట తిప్పి కొడుతూ.

“రేపు హోమ్ ట్యూటర్ వస్తాడు.”

“అవసరం లేదు. చదువు అవగానే ఉద్యోగం చేసి మీ డబ్బంతా ఇచ్చేస్తాను.”

“ఊర్మిళా!” ఆనంద్ కంఠం బాధగా పలికింది.

“ఇక్కడుంటే నీకు ఏమిటి అభ్యంతరం చెప్పు!”

“అభ్యంతరం ముందు మీ నుండి వచ్చింది.”

“ఓహ్!.. ఇట్స్ ఓ.కె. అయిపోయింది కదా!” అన్నాడు.

 ఆనంద్ లేచి వెళ్ళిపోయాడు, ఊర్మిళ స్తబ్ధుగా ఉండిపోయింది.

 ***

అప్పట్నుండి ఊర్మిళ మూడీ గానే ఉంటోంది.

అది కూడా ఆనంద్‌కు బాధగా ఉంది. కానీ, ఏమి చేయగలడు?

ఒక రోజు మామయ్య బంధువుల ఫంక్షన్ ఉందని హైదరాబాద్ వచ్చాడు. జరిగిన దంతా మామయ్యకు చెప్పాడు.

“అమ్మాయి అలిగింది.” అన్నాడు మామయ్య.

“చిన్నగా కాదు” అన్నాడు ఆనంద్.

“వెళ్ళి సారీ చెప్పెయ్యి రా!”

ఆనంద్ మాట్లాడలేదు.

“పెళ్ళి చేసుకొమ్మని అడుగు.”

“మామయ్యా! ఇది భావ్యంగా ఉందా! వయసు తేడా ఉంది. పెళ్ళయిన వాడిని, బిడ్డ తండ్రిని కూడా!”

“అయితే ఏమిటి రా! బట్టతల, బాన పొట్టతో ఉన్న యూత్ కంటే, నీవెంత యంగ్ లుక్స్ నీకు తెలుసా! కాస్త వయసు తేడా ఉంటే నేమి? ఒక రోజుల్లో ఈ మాత్రం తేడాతో ఎన్ని పెళ్ళిళ్ళు జరుగలేదు? అందం అప్రధానం ఆనంద్! అందమే ముఖ్యం అనుకుంటే లోకంలో చాలా మంది పెళ్ళిళ్ళు కాక మిగిలి పోయేవారు.”

“కానీ మాలతి వస్తే నా దగ్గర సమాధానం ఏముంది?”

“ఇంకా నీకు ఆశ చావలేదా, ఆనంద్! నీ లాంటి జంటిల్‌మన్ ఇలానా ఆలోచించేది. మాలతి మళ్ళిపోయిన గతం, నీ జ్ఞాపకాల్లోకి తప్పితే, జీవితంలోకి రాలేదు. ఊర్మిళ ముందున్న భవిష్యత్తు.”

 ఆనంద్ వింటున్నాడు.

“బామ్మ సామెత చెప్పేది, గుర్తుందా!” అంటూ నవ్వాడు మామయ్య.

 ఏమి సామెత అని అడక్కున్నా ఎలాగూ చెప్తాడు అని తెలుసు ఆనంద్‌కు.

“చుట్టం మీది ప్రాణం, బియ్యం మీది ప్రాణం అనేది బామ్మ.. మాలతి, ఊర్మిళ ఎప్పటికి అయినా ఒక ఒరలో ఇముడని రెండు కత్తులు. ఒక మగవాడు పంచుకోబడుతున్నాడంటే, ఎవరికో ఒకరికి చెంది ఉండడం అన్ని విధాలా శ్రేయస్కరం. నీవు ఇంక మాలతి సంగతి ఆలోచించకు!”

ఆనంద్ అంతా విన్నాడు. మళ్ళీ మొదటికే వచ్చాడు. “నాతో కాదు, మామయ్యా! సహాయం చేసాను. పెళ్ళి చేసుకో! అన్నట్టే ఉంటుంది. నా పరిస్థితులు నాకు ఉండగా, ఎలా అడగగలను?”

“నేను నా కూతురును నీ తరుపున అడుగుతాను.”

“వద్దు! అసలే ముఖం అలా మాడ్చి పెట్టుకుంది.”

“ఇలా ఇంటికి తీసుకొని వచ్చావు. పెళ్ళి ప్రసక్తి ఎత్తవద్దు అంటావ్. మీ ఇద్దరి మధ్య ఏమి నలుగుతున్నది.”

 ఆనంద్ మాట్లాడలేదు.

“నిన్ను ఊర్మిళ కృతజ్ఞతతో చేసుకుంటానంటూందేమో అనే ఫీలింగ్ నీకు.”

ఆనంద్ అవును, కాదు అనలేదు.

ఇంతలో గాలి అలవోకగా పట్టీల శబ్దం మోసుకొని వచ్చింది. ఇద్దరూ కామ్ అయ్యారు.

“నాకు కాస్త బయటకు వెళ్ళే పనిబడింది” అంది ఊర్మిళ.

“అదేమిటో నాకు చెప్పవచ్చుగా!” అన్నాడు ఆనంద్.

మామయ్య ‘సంసారాల మెకానిక్’ (దాసరి) లా ఇద్దరినీ గమనిస్తూన్నాడు.

ఊర్మిళ ముఖంలోమార్పేమి లేదు.

“అమ్మణ్ణి రూమ్ ఖాళీ చేసినప్పుడు ఓనరమ్మ ఇంట్లో సూట్‍కేస్ ఏదో పెట్టిందట. ఇప్పుడు వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో ఉంది. వెళ్ళి ఇచ్చి, కలిసి వస్తాను.”

“ఆ సూట్‍కేసు నిండా నవలలు ఉన్నాయా?” అన్నాడు.

ఊర్మిళకు చేతిలో ఏదన్నా ఉంటే, విసిరి కొట్టాలి అన్నంత కోపం వచ్చింది ఆ క్షణం.

“మహేష్‌ను రమ్మని ఫోన్ చేస్తాను” అన్నాడు.

“వద్దు! నేను ఆటోలో వెళతాను. కారు అవసరం లేదు” అంది.

 ఆనంద్ మరోసారి చెప్పినా, మహేష్‌ను వద్దంది.

 ఊర్మిళ అక్కడి నుండి వెళ్ళాక ఆనంద్ అన్నాడు. “చూడు మామయ్యా! కారు తీసికెళ్ళమంటే వద్దంటుంది. ఆటోలో వెళ్ళినా అదే ఖర్చు కదా!”

“ఏ అధికారంతో కారు తీసుకుని వెళుతుంది. నువ్వే అధికారంతో తీసికొని వెళ్ళమంటున్నావు.” అని,

“ఆనంద్! ఆ అమ్మాయికి ఆ హక్కు కలిపించు. ఈ రోజు నాకు కారు కావాలి అని దబాయించి మరీ తీసుకొని వెళుతుంది.” అన్నాడు మామయ్య.

“నువ్వెటూ టాపిక్ అటే తిప్పుతావు, మామయ్యా!”

“కూల్ డౌన్ మై బాయ్! నేనిప్పుడే తేల్చేస్తాను.”

మామయ్య ఊర్మిళ కు వినపడేలా, పిలిచాడు.

“పిలిచారా అంకుల్!” అంటూ ఊర్మిళ పైకి వచ్చింది.

“ఊర్మిళా! కారు తీసుకొని వెళ్ళవచ్చును కదమ్మా!” అన్నాడు.

 ఊర్మిళ సమాధానం ఇవ్వడానికి ముందు ఇబ్బంది పడింది. ఆ తర్వాత, “కాదు అంకుల్! మీ ఫ్రెండ్ ఇంత కారులో వచ్చింది, వాళ్ళు బాగా ఉన్న వాళ్ళా అని అడిగారు అనుకోండి, అమ్మణ్ణి ఏమి చెప్తుంది?” అంది.

“అవునమ్మా! అది చాలా నిజం. లోకానికి కొన్ని ప్రశ్నలకు మనం సమాధానం ఇచ్చుకోవాలి. అది మన బాధ్యత” అంటూ, ఆనంద్ వైపు చూసాడు.

ఆ తర్వాత ఊర్మిళ వెళ్ళిపోయింది.

“చూసావా! తన మాటల్లో ఎంత ఆలోచన దాగి ఉందో!” అన్నాడు మామయ్య.

ఆనంద్ మాట్లాడలేదు.

“దారీ, తెన్ను తెలియని జీవితంతో తను విసిగిపోయి ఉంటే నువ్వు అర్థం చేసుకోకుండా ఇంట్లో ఉంటే హాస్టల్‌కు పంపావు. హాస్టల్‌లో ఉంటే ఇంటికి తెచ్చావు. తన మూడ్ పాడు చేసావు. ఇప్పుడు హ్యాపీగా ఉంచేందుకు తన కోరిక ఏమిటో తెలుసుకో!”

“సరేలే! సన్యాసం పుచ్చుకోవాలి అనుకునే వాళ్ళకు కోరిక లేముంటాయి. అప్పుడు మాత్రం ఒక మాట జారింది. నాకు కూడా బోర్ కొట్టినప్పుడు ఇదేదో బాగుందే అనిపించేది. చదువు అయ్యాక తప్పక తన కోరిక తీర్చాలి అనుకున్నా.”

“ఏమిటి! వీడియో గేమ్స్ కావాలి అందా?”

ఆనంద్ నవ్వాడు. ఎంత అందంగా ఉన్నాడు, అనిపించింది మేనమామకు. ఆరడుగుల ఆనంద్ అతని భుజాలు దాటిన ఊర్మిళ – చూడ చక్కని జంట.

“వీడియో గేమ్స్ కాదు, మామయ్యా!” ఆయన మాటలకు నవ్వు ఆగట్లేదు ఆనంద్‌కు.

నవ్వు ఆపి చెప్పేసరికి, ఆయన తెల్లబోయాడు.

ఆ తర్వాత – “ఇంకేం! శుభస్య శీఘ్రం!” అన్నాడు.

“నేను ఈవినింగ్ ట్రైన్‌కు వెళ్ళాలి. నేను రాలేను కానీ, మంచి ముహూర్తం పెడతాను” అన్నాడు.

“నీదంతా చాదస్తం” అన్నాడు ఆనంద్.

***

ఆ రోజు ఊర్మిళను పిలిచి “రేపు నీకు ఇష్టమైన ఒక దగ్గరికి వెళదాం” అన్నాడు.

‘సరే’నంటూ తలాడించింది.

“ఏమిటా జీరో ఎక్స్‌ప్రెషన్స్?”

“ఎక్కడికో తెలియనిది ఏమి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలి?”

“సరే! అయితే రేపు నీకు సర్‌ప్రైజ్ ఇస్తాను.”

“దేవుడు నా జీవితంలో చాలా పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చాడు.”

“ఇది దాన్నుండి నీకు ఓదార్పు.”

“సరే!” అంది యథాలాపంగా.

మరునాడు ఊర్మిళ, ఆనంద్ కారులో బయలుదేరారు. ఆనంద్ ఓరకంట ఊర్మిళను గమనించాడుl

‘ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి’ అంటే ‘శారీ’ అన్నాడు. ఎక్కడి కెళ్ళేది తెలీకుండా తయారు కావడం కష్టమే మరి.

ఎక్కడికి వెళ్ళినా సెట్ అయ్యేలా తయారయ్యింది. ‘గుడ్’ అనుకున్నాడు. ఊర్మిళ వాళ్ళ పల్లెలో స్కూల్ లేక వాళ్ళ పెద్దమ్మ దగ్గర చదువుకుందట. ఆమెనే ఊర్మిళ కు ఆ పేరు పెట్టిందట. తెలుగు వాళ్ళ ఆచార వ్యవహారాలు అన్నీ ఆమెనే నేర్పిందట. వరదలు ఆ గ్రామాన్ని కూడా ముంచెత్తడంతో, ఆమె కూడా లేకుండా పోయింది. ‘సో సాడ్’ అనుకున్నాడు.

కారు వెళుతూంటే ఊర్మిళకు అర్థం కావట్లేదు. ‘మరీ ఇంత దూరం ఎక్కడికో!’ అనుకుంది. పెళ్ళికొడుకు దగ్గరికి కాకపోతే చాలు. అక్కడికే అయితే కారు దూకి అయినా పారిపోవాలి. ‘ఎక్కడికో అడిగేస్తేనో’ అనుకుంటుండగా కారు మలుపు తిరిగి, ఓ పెద్ద గేట్ ముందు ఆగింది.

తోవలో బోలెడు పళ్ళు, స్వీట్స్ కొన్నాడు ఆనంద్. మహేష్ అవి లోపలికి తెచ్చేస్తూంటే, ఆనంద్, ఊర్మిళ లోపలికి నడిచారు.

అప్పుడే ఊర్మిళ దృష్టిలో పడింది, అక్కడున్న బోర్డ్. మహాత్మా అనాథ బాల బాలికల ఆశ్రమం మరియు రూల్స్, రెగ్యులేషన్స్. ఊర్మిళ పెదవులు ఆనందంతో విచ్చుకున్నాయి. పళ్ళు, స్వీట్స్ కొంటూంటే వచ్చిన అనుమానం ఇన్ని కొంటున్నాడు ఏమిటా అన్న సందేహంగా మారింది. ఇందుకన్న మాట. వావ్! సూపర్ సర్‌ప్రైజ్ కదా!

ఆనంద్ ఆఫీస్‌లో మాట్లాడుతున్నాడు.

ఊర్మిళ పట్టలేని సంతోషంతో పిల్లలందరినీ దరి చేర్చుకుంది. కథలు, కబుర్లు చెప్పింది. పళ్ళు, స్వీట్స్ ప్రేమగా పెట్టింది. ఆఫీస్ రూమ్ నుండి ఊర్మిళ కనిపిస్తోంది ఆనంద్‌కు. ఆ సంతోషం అంతలా ఎప్పుడూ ఆమె ముఖంలో చూడలేదు. తనకేమీ కాని పిల్లలను చూస్తే ఇంత ఆనందం ఎలా వస్తుందో!

ఊర్మిళ బయటకు వచ్చింది “చాలా థాంక్స్! ఇక్కడికి తీసుకొని వచ్చినందుకు!” అంది సంతోషంతో.

“అంతేనా! కిడ్ వద్దా! నువ్వేదో అన్నావు.”

“అయితే..!!”

ఆనంద్ అందు కోసం తనను తీసుకొని వచ్చాడని తెలియగానే, ఊర్మిళ పట్టలేని సంతోషంతో అతని చేయి అందుకుని, తన రెండు చేతుల మధ్య ఆనంద్ చేతిని చుట్టేసింది.

ఆఫీస్ అతను అన్నాడు – “పిల్లలను చూడండి సార్! నచ్చక పోతే మళ్ళీ చక్కని పిల్లలు వచ్చినప్పుడు కబురు చేస్తాను.”

ఊర్మిళకు ఈ మాట అస్సలు నచ్చలేదు.

“బిడ్డ అంటేనే అందం. బిడ్డలో నచ్చక పోవడం ఏమిటి?” అంది.

“నీ వేదాంతం ఆపుతావా! నాకు మాత్రం అందమైన పిల్లలే కావాలి” అన్నాడు, ఆనంద్ కుర్చీలో నుంచి లేస్తూ.

ఇద్దరూ లేచి పిల్లలను చూసారు. మనసంతా తృప్తి నిండింది ఊర్మిళకు. అక్కడ ఉన్న పిల్లలని వదలలేక వదిలి వచ్చింది. కారు ముందుకు కదిలింది.

ఈ బాధామయ ప్రపంచంలోకి పిల్లలను కని తేవడం ఎందుకు? అన్నది ఊర్మిళ ఫీలింగ్. పెళ్ళి చేసుకోకుండా బిడ్డను పెంచుకోవాలి అని ఇష్టం అట. మాములు ఇష్టం కాదు. తన జీవితాశయమే అది అట. తనకు ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా, ఓ చిన్న బుజ్జికొండను పెంచుకుని, వాడిని స్త్రీలను గౌరవించేవాడి లాగా, స్త్రీ జాతి మాన ప్రాణ రక్షకుడిగా తీర్చిదిద్దాలన్నదే తన ధ్యేయం అట.

అప్పుడు ఆనంద్ అన్నాడు – “ఒకరే ఎందుకు? ఇద్దరు అయితే ఒకరికొకరు తోడు కదా!”

“నిజమే కానీ అంత స్తోమత నాకు లేదు సర్!” అంది అప్పుడు.

ఇప్పుడు ఇద్దరు బిడ్డలను ఆనంద్ ఎన్నుకుంటూంటే సంతోషంగా చూసింది.

“తీసుకుని వెళ్దామా!” అంది ఆరాటంగా.

“ఇలా తీసుకుని రాలేము. చాలా ఫార్మల్టీస్ ఉంటాయి” అన్నాడు ఆనంద్ నవ్వుతూ.

ఇంక మర్నాటి నుండి ఊర్మిళ ప్రపంచమే మారిపోయింది.

ఎన్నడూ లేనిది ఆనంద్‌ను డబ్బు అడిగి తీసుకుంది. ఆనంద్ ఆఫీస్ నుండి వచ్చే వరకు, ఇంట్లో బోలెడు బొమ్మలు ఉన్నాయి. అన్నీ చుట్టూ పెట్టుకొని కూర్చుంది.

ఆనంద్‌కు నవ్వొచ్చింది.

ఒక్కోళ్ళకు ఒక్కో పిచ్చి. ఊర్మిళకు పిల్లల పిచ్చి! మాలతికి అనుమానం పిచ్చి! ఆమె రమ్మంటే రాదు. ఈమె పొమ్మంటే పోదు.

అప్పుడే వచ్చిన ఆనంద్‌ను చూసి లేచి, మంచి నీళ్ళు తెచ్చిచ్చింది.

“థాంక్స్, చాలా చాలా థాంక్స్ సర్!” అంది మెరిసే కళ్ళతో.

“పిల్లలు వచ్చాక అవసరం అయిన దగ్గర అన్నమ్మ హెల్ప్ తీసుకో!” అన్నాడు.

“అలాగే సర్!” అంది.

బొమ్మలన్నీ చూస్తూ, “ఇంకా రాని పిల్లల కోసం ఇంత ఆరాటమా! ఇంత ప్రేమనా!” అన్నాడు.

“అదేంటి సర్! పిల్లలను తెప్పించిన వాళ్ళ కోసం ఆరాటం ఉండదా!”

“అది కృతజ్ఞత!” అన్నాడు.

ఉత్సాహంలో ఊర్మిళ సందడి కొత్తగా ఉంది. ఆనంద్ ఆశించని సమాధానం వచ్చింది.

“ఆరాటం, ప్రేమ కృతజ్ఞతలో ఉండవా? కృతజ్ఞతతో ప్రేమ మొదలవకూడదా?” అంటున్న ఆమె మాటలకు ఆనంద్ ముఖంపై జీవ రేఖ మెరిసింది. హృదయం నిండిన నవ్వొకటి పెదవులపై రాజసంగా కదిలింది.

 కళ్ళెత్తి సూటిగా ప్రశ్నిస్తూన్న ఊర్మిళ గవ్వ ల్లాంటి కళ్ళ వంక చూస్తూ ‘ఎంత అందమైన కళ్ళో!’ అనుకున్నాడు, మొదటిసారిగా!

‘మగువేగా మగవానికి మధుర భావన..’ (వీటూరి)

ఆనంద్ లేచి హాల్లోకి వెళ్ళాడు.

మనసును మంత్రం వేసినట్టుగా ప్రశాంతత –

త్వరలో అన్ని ఫార్మాల్టీస్ పూర్తి చేసి, పిల్లలను ఇంటికి తెచ్చుకున్నారు. మామయ్య కూడా వచ్చాడు. ఒకడు సంవత్సరంన్నర, మరొక బుజ్జోడు నెలల కందు –

ఊర్మిళకు అన్నమ్మ హెల్ప్. హోమ్ ట్యూటర్‌తో బ్రేక్ పడకుండా ఊర్మిళ చదువు..

ఆడపిల్లను తెచ్చుకోవాలి అంటే జాన్వీ గుర్తుకు వస్తుందేమోనన్న భయం. అందుకే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కాకుండా – ఇద్దరూ అబ్బాయిలే అయ్యారు. ఎవరికీ తెలియని వాస్తవం – వాళ్ళు అడాప్టెడ్ చిల్డ్రన్ అని.

***

మీటింగ్ ఎల్లుండికి వాయిదా పడడంతో, ఆనంద్ జాన్వీకి ఫోన్ కలిపాడు.

జాహ్నవి ఫోన్ రిసీవ్ చేసుకుంది.

“డాడ్ ఎలా ఉన్నారు?” అంది.

ఆ మాటలకు పరవశించింది ఆనంద్ హృదయం.

ఆనంద్ చెప్పింది విని “అలాగే!డాడ్!” అంది సంతోషంగా.

‘పిన్ని బర్త్ డే వస్తోంది’ అనుకుంది ఉత్సహంగా.

(ఇంకా ఉంది)

Exit mobile version