తీరిక లేని కార్యక్రమాలు, దొరికే కాస్త సమయాన్ని హరించే ఓటిటిల ప్రభావాల మధ్య ఫిక్షన్ చదవడమనేది ఒక ఊరట! మనతో మనం అనుసంధానమయ్యే చక్కని అవకాశం! ఊహాశక్తిని ప్రేరేపించి, మన దృక్పథాలను విస్తృతం చేసి, సహానుభూతిని పెంపొందిస్తుంది ఫిక్షన్.
నాన్-ఫిక్షన్ వలె కాకుండా, కాల్పనిక రచనలు – భావోద్వేగాలను కల్పిస్తూ, దృశ్యాలను కళ్ళకు కడుతూ, మనకు సుదూరంగా జీవిస్తున్న వారి జీవితాలను స్పృశించేలా చేస్తాయి. వారి స్థానంలో ఉండి వాళ్ళ ప్రపంచాన్ని వాళ్ళ కళ్ళతో చూసేలా చేస్తాయి.
కాల్పనిక సాహిత్యం చదవడం సాంత్వన కలిగిస్తుంది. వేగంగా పరుగులు తీసే ఆలోచనలను నెమ్మదింపజేస్తుంది, మౌనంగా జరపాల్సిన ప్రతిఫలనాల క్షణాలను ముందుకు తెస్తుంది. భిన్న సంస్కృతులు, భిన్న భాషల సాహిత్యం చదవడం ఈ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది, కొత్త ప్రపంచాలు, నూతన విలువలు, విభిన్న సంప్రదాయాలకు తలుపులు తెరుస్తుంది. భిన్న సంస్కృతులపై మన అవగాహనను పెంచుతుంది, తాదాత్మ్యపు బాటలను వేస్తుంది, పక్షపాతపు అడ్డంకులను తొలగిస్తుంది.
కాల్పనిక సాహిత్యం చదవడం మానసిక ఆరోగ్యానికి ఒక ఔషధం లాంటిది. కఠినమైన వాస్తవాల నుండి కొంతసేపయినా తప్పించి, ఒత్తిడి తగ్గించడంలో పాఠకులకు సాయం చేస్తుంది. సాహిత్యంలోని కల్పిత పాత్రల జీవన పోరాటాలతో స్ఫూర్తిపొంది మన జీవిత సవాళ్లను ఎదుర్కుకోడంలో ధైర్యాన్ని పొందవచ్చు. కాల్పనిక సాహిత్యం మన భావోద్వేగాలను అదుపు చేసి, పునరుత్తేజం పొందేలా చేస్తుంది. మనం ఆరాధించే పాత్రల మాదిరిగానే మనం కూడా జీవితంలోని సంక్లిష్టతలను ధైర్యంగా, ఆశతో ఎదుర్కోగలమని గుర్తుచేస్తుంది.
అందుకే సంచిక వెబ్ పత్రికలో – త్వరలో ఇంగ్లీష్ బెస్ట్ సెల్లర్‌లు, థ్రిల్లర్‌లు, రొమాన్స్, మిస్టరీస్ వంటి ప్రసిద్ధ ఫిక్షన్, లోతైన ఇతివృత్తాలు, బలమైన పాత్రలతో కూడిన పుస్తకాల సమీక్షలు/పరిచయాలను ప్రముఖ సమీక్షకురాలు శ్రీమతి స్వప్న పేరి తెలుగులో అందించనున్నారు.
అలాగే, పాఠకులలో ఆసక్తిని రేకెత్తించే ప్రపంచ స్థాయి స్పేస్ స్పాట్‌లైట్లు, క్రాస్-కల్చరల్ పుస్తకాలు, అనువాద రచనలను పాఠకులకు పరిచయం చేస్తారు. కొత్త రచయితలు, తాజా స్వరాలతో కథనాలను అందిస్తున్న వర్ధమాన రచయితల పుస్తకాల సమీక్షలు, పరిచయాలు ఉంటాయి.
వచ్చే వారం నుంచి ప్రారంభం..