సుకుమార్ సౌందర్య మీద కక్ష సాధింపు చర్య మొదలు పెట్టాడు. “మీరు ఎంత చెప్పండి ఆ గజ్జిముండతో నేను నటించను. ఆ దూలిష్టుదాన్తో నటించమని నన్ను బలవంతం చేయకండి.”
“బా… బా….బాబ్బూ? మీరు అలా అంటే ఎలాగ? ఐదు రీళ్ళు తీసాము కూడా” నిర్మాత బ్రతిమాలే ధోరణితో అన్నాడు.
“ఆ ఐదు రీళ్ళు తగలబెట్టి మళ్ళీ తీయడానికి ప్రయత్నం చేయండి. నేను డబ్బు తీసుకోకుండా నటించి మీ నష్టం నేను భర్తీ చేస్తాను” సుకుమార్ స్థిరంగా అన్నాడు.
నిన్న మొన్నటి వరకూ ఒకర్ని విడిచి మరొకరు వదలకుండా తిరిగిన సుకుమార్, సౌందర్యకి ఎందుకొచ్చింది ఈ తగవు? సౌందర్యను తప్పించి వేరే క్రొత్త హీరోయిన్ని పెట్టి పిక్చరు తీస్తే పిక్చరు దెబ్బతింటుందేమో? సౌందర్య నటన అందరూ మెచ్చుకుంటారు. అంత సన్నిహితంగా మెలిగిన వీళ్ళిద్దరూ ఎడమొగాలూ-పెడమొగాలూ పెట్టుకుని ఇలా తిట్టుకోడానికి కారణం ఏంటి? ఆ కారణం కనుక్కుని ఇద్దరి మధ్యా రాజీ కుదర్చాలి” నిర్మాతలు డైరక్టర్లు ఆలోచిస్తున్నారు.
“మీకు ఎన్ని పర్యాయములు చెప్పాలి? ఆ ముసలి పీనుగను తప్పించి మంచి కుర్రహీరోయిన్ పెట్టి పిక్చరు తీయండి. అలా కాని పక్షంలో నన్ను విసిగించకండి” చిటపటలాడాడు సుకుమార్.
“మీకు పుణ్యం ఉంటుంది. ఈ పిక్చరికి రాజీపడి నటించండి. తరువాత మీ యిష్టం” నచ్చజెప్పబోతున్నారు అందరూ. వాళ్ళు బ్రతిమాలుతున్న కొద్దీ బిగుసుకు పోతున్నాడు సుకుమార్. తలుపు చాటునుండి వారి సంభాషణ వింటున్న సౌందర్యకి మరి వారి మాటలు వినాలని అనిపించలేదు. తిరిగి సుకుమార్‌తో వాదనకి దిగడానికి కూడా మనస్కరించలేదు. మరి అక్కడ ఉండాలనిపించలేదు. గిరుక్కున వెనక్కి తిరిగింది.
సుకుమార్ అన్నంత పని చేశాడు. తిరిగి పిక్చరు తిరిగితీస్తే ఆ పిక్చర్‌కి తాను ఏ పారితోషికం తీసుకోకుండా నటిస్తానని మాటిచ్చాడు. సుకుమార్ తీసిన రీళ్ళు తగలబెట్టించాడు.
ఈ సంఘటన జరగడంతో కోదండపాణికి ఓ వేపు సంతోషం. మరో ప్రక్క సౌందర్య మీద జాలి కలుగుతున్నాయి. ‘దీనికి మంచి శాస్త్రి జరిగింది. చిక్కుల్లో చిక్కుకుని దిక్కూ మొక్కూలేని ఆ లేచిపోయి వచ్చిన దాన్ని చేరదీసి ఆశ్రయం కల్పించి ఓ స్థాయికి తీసుకు వస్తే తన మీదే ఆ దూలిష్టిదానికి చులకన భావమా? మంచి పని జరిగింది’ అన్న సంతోషం ఒక ప్రక్కయితే ‘పాపం ఆ చపలచిత్తురాలు. తన నాశనానికి తనే కారణమయింది. తన గోతిని తనే తవ్వుకుంది. ఇలాంటి బలహీనమైన మనస్తత్వంగలది జీవితంలో చిత్తుగా ఓడిపోయింది’ అని మరో ప్రక్కజాలి.
సౌందర్య పిక్చర్లో నటించకపోవడానికి రకరకాల పుకార్లు పుట్టించి పత్రికలు వ్యాసాలు వ్రాసాయి. ఆమె మీద చెడుగా ప్రచారం చేసి వ్రాసాయి పత్రికలు.
ఒక వేపు సంపాదన కుంటుబడ్డం, విలాస జీవితానికి అలవాటు పడ్డ సౌందర్యకి కష్టకాలం కచ్చింది. సుఖాలకి అలవాటుపడ్డ ప్రాణం ఆ కష్టాలకి విలవిల్లాడింది. సుకుమార్ సాంగత్యం వల్ల అలవాటయిన హాట్ డ్రింక్సు అలవాటు మానుకోడానికి ఆమె ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ సాధ్యం కావటం లేదు.
కారు, బ్యాంకు బేలన్సు కర్పూరం పూసలా హరించుకుపోతున్నాయి. మార్వాడి దగ్గర బంగళా తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంది సౌందర్య. ఆ డబ్బు కూడా అయిపోవచ్చింది. ఒకవేపు అప్పులు-మరో ప్రక్క చింతలు ఆమెను వేధించసాగాయి. అయితే తన కష్టాల్ని మూడో కంటి వాళ్ళకి తెలియజేయడం ఆమెకి ఇష్టం లేదు
క్యారెక్టరు ఆర్టిస్టు పాత్రలనైనా వేయడానికి తను సిద్ధపడాలి. దీన్నే అంటారు పూలు అమ్ముకున్న చోట కట్టెలమ్ముకోడం అని. అంత బ్రతుకూ బ్రతికి చివరికి తను ఇలా దిగజారిపోయింది. ఒక సినీ ఫీల్డులో తనకి ఎగస్ట్రాల పాత్రలు ఇస్తారు. తను హీరోయిన్గా వున్న సమయంలో ఈ ఎగస్ట్రాల జీవితం ఎంత హీనంగా ఉంటుందో తన కళ్ళారా చూసింది. పైకి నవ్వుతున్నా వారి గుండెల్లో మంటలు కళ్ళ ద్వారా తనకి అగుపడేవి. చమర్చిన కళ్ళల్లో వాళ్ళ కన్నీరు చూసి తను జాలిపడేది. వారికి సినీ ప్రపంచంలో తగినంత గుర్తింపులేదు-ప్రాధాన్యత లేదు. తగిన గౌరవ మర్యాదాలు లేవు. ప్రొడ్యూసర్సు-డైరక్టర్లు, హీరోలు దగ్గర నుండి కాపీ టిఫిన్లు సప్లయ్ చేసే కుర్రాళ్ళవరకూ అందరూ వీళ్ళమీద అజమాయిషీ చెలాయిస్తారు.
ఓ మారు ఓ ఎగస్ట్రా పొరపాటున తన బట్టలమీద కాఫీ వొలకబోసింది. ఇష్టపూర్వకంగా చేయకపోయినా అనుకోకుండా అలా జరిగింది. అంతే వెంటనే ఆ అమ్మాయి చీవాట్లు తిని కన్నీళ్ళు పెట్టుకోవల్సివచ్చింది. వీళ్ళు ఆటబొమ్మలు. వీళ్ళ జీవితాల్లో కొంతమంది ఆటలాడుకుంటారు. కోరికలు తీర్చుకుంటారు. ఆ తరువాత వాడిన పూలలా విసిరేస్తారు. ఇలాంటి వాళ్ళకి ఉనికి ఉండదు. అస్తిత్వం అంతకన్నా ఉండదు. మర బొమ్మలు మాత్రమే.
అప్పుడే కాదు ఇప్పుడు ఎప్పుడూ ఈ సినీ ప్రపంచంలో హీరోయిన్లకున్న విలువ ఎగస్ట్రాలకు లేదు. అటువంటి సమయంలో మెగా నటిగా అందరి చేతా శభాష్ అనిపించుకున్న తను ఎగస్ట్రాగా నటించగలదా? గడిచిన వైభవోపేతమైన జీవితం తనకి బాధ కలిగించదా?
ఆ సుకుమార్ మేకరూపంలో ఉన్న పులి లాంటివాడు. చాలా దుర్మార్గుడు. పగబట్టిన నాగుబాము. తనని వెంటాడుతూ తనని ఇంత దిగజారిపోయి స్థితికి తీసుకువచ్చి సినీరంగంలో తన అస్తిత్వం లేకుండా చేసాడు అని ఆలోచిస్తోంది సౌందర్య. అయితే ఇప్పుడు ఎంత ఆవేశపడ్డా లాభం లేదు. ఇప్పుడు తన బ్రతుకు రోడ్డునబడింది. ఆవేశం ఆత్మాభిమానం చంపుకుని ఎగస్ట్రా అవతారం ఎత్తాలి. ఈ సినీ ప్రపంచంలో జీవితం గడవాలంటే మరోమార్గం లేదు.
స్టూడియోల చుట్టూ తిరగడం ఆరంబించింది సౌందర్య. “అయ్యో! మహనటికి ఎన్ని పాట్లు. ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలవుతాయి అంటారు అందుకే. మీకు ఎలాంటి స్థితి వచ్చిపడింది.”
అందరూ అనే సానుభూతి మాటల్ని తట్టుకోలేకపోతోంది సౌందర్య. అలాంటి మాటలు ఆమెకి చికాకు పర్చేవి.
ఇప్పుడు తనకి కావల్సింది సానుభూతి కాదు. సినిమాలో వేషం, అని గట్టిగా అరవాలనుకుంది కాని అలా అరవలేక పోయింది. “అవన్నీ ఇప్పుడు ఎందుకులెండి. మన చేతిలో ఏదీలేదు. విధి మనల్ని ఎలా ఆడిస్తే అలా అడ్డమే మన కర్తవ్యం. సానుభూతి చూపించే బదులు నాకు మీరు తీస్తున్న సినిమాలో చిన్న వేషమైనా ఇవ్వండి లేక ఇప్పించండి. బస్! అంతే చాలు.” అంది సౌందర్య.
“మీరు మా సినిమాలో అలాంటి పాత్రలు వేస్తారా?” ఓ నిర్మాత విస్మయంగా అడిగాడు. అంతకు పూర్వం అతను తీసిన సినిమాలో సౌందర్య హీరోయిన్. ఆ సినిమా వంద రోజులు ఆడింది కూడా ఆ రోజుల్లో. ఈ రోజుల్లో వంద రోజులు సినిమా ఆడకపోయినా – జనాలు రాకపోయినా ఆడిస్తారు. అప్పుడు మాత్రం అలా కాదు.
“తప్పదు చిన్నా పెద్దా అన్న విషయం చూడకుండా మనకిచ్చిన పాత్రకి న్యాయం చేకూర్చడమే ముఖ్యమని నా భావన.”
“మేము తీస్తున్న సినిమాలో సుకుమార్ సార్ హీరో అతను ఒప్పుకుంటాడో లేడో? “ఓ నిర్మాత అన్నాడు.
సౌందర్య ఆ మాటలు వినగానే ముఖం చిట్లించింది. ఆ సమయంలో ప్రక్కగదిలో ఉన్న సుకుమార్ ఆ మాటలు వింటున్నాడు. ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడు. ‘తను హీరోగా వేస్తున్న చిత్రంలో సౌందర్య అతి చిన్న పాత్ర వేయాలి. అప్పుడు తను ఆమె భావాలు చూడాలి. ఆమె తన గత వైభవాన్ని తల్చుకుని బాధపడూ ఉంటే తను హాయిగా నవ్వుకోవాలి’ శాడిజం మనస్తత్వంతో ఆలోచిస్తున్నాడు సుకుమార్.
తాము తీయబోయే సినిమాలో సౌందర్యపాత్ర ఏమిటో వివరిస్తున్నాడు నిర్మాత. సౌందర్య వింటోంది.
తీయబోయే సినిమాలో హీరో ఇంట్లో పనిమనిషి పాత్ర అది. హీరో భార్య పుట్టింటికి వెళ్తే హీరో విరహంలో ఉన్నప్పుడు అతని కోరిక తీర్చడానికి పడకగదిలో వెళ్ళడానికేనా సిద్ధపడే పనిమనిషి పాత్ర అది.
నిర్మాత చెప్పిన విషయాలు వింటున్న సౌందర్య రోషంతో అవమానంతో అసహ్యంతో చివ్వున తల పైకెత్తింది. ఎదురుగా ద్వారం దగ్గర కొంటెగా హేళనగా నవ్వుతున్న సుకుమార్ కనిపించాడు. ఆమె మనస్సు కుత కుత లాడిపోతోంది.
“మీ సినిమాలో ఆ పాత్ర నేను వేయలేను” నిర్మాతకి నిక్కచ్చిగా చెప్పేసి బయటకి నడిచింది సౌందర్య. “చింతచచ్చినా పులుపు చావలేదు” వెనక నుండి వికటంగా నవ్వుకుంటున్న నవ్వులు వినబడ్డాయి.
“మీరు నన్ను ఒప్పించడానికి ప్రయత్నించారు కాని ఆ దూలిష్టు చిత్తకార్తి కుక్కలాంటి దాన్తో నేను నటించదల్చుకోలేదు” సుకుమార్ మాటలు అస్పష్టంగా ఆమె చెవుల్లో పడ్డాయి.
‘ఛీ… ఛీ… ఏం మనుష్యులు? ఏం ప్రపంచం? తన లాంటి చపలచిత్తురాలికి ఇలాంటి స్వార్థపరులూ నివురు గప్పిన నిప్పులాంటివాళ్లే తగిన వాళ్ళు’ అనుకుంటున్న ఆమెలో పశ్చాత్తాప భావాలు తొంగి చూశాయి.
ఏనాడూ సౌందర్యకి పస్తులుండే పరిస్థితి రాలేదు. తన చిన్నప్పుడు తండ్రి దగ్గరయినా పంచభక్ష పరమాన్నం తినలేక పోయినా తిండికి మాత్రం లోటు ఉండేది కాదు. సారధి కూడా తనకి ఏలోటూ లేకుండా చూసుకునేవాడు. అతని దగ్గర ఉన్న సమయంలో కూడా తనకి తిండికి ఏ లోటూ లేదు. అయితే తనకి పుట్టినింట్లో జీవితం, మెట్టినింట్లో జీవితం అంత సంతృప్తి నీయలేదు. కలవారి కుటుంబ జీవితాల్లో తమ మధ్య తరగతి కుటుంబ జీవితాన్ని సరిపోల్చుకుంటున్న తనని అసంతృప్తి కార్చిచ్చులా దహించి వేసింది. అదే తన పతనానికి నాంది అయింది.
మోహన్ చేత మోసగింపబడిన తనని కోదండపాణి చేరదీశాడు. తనని ఓ స్థాయికి తీసుకు వచ్చి హోదా కల్పించాడు. అక్కడ తన జీవితం సాఫీగా సాగుతున్నా లైంగికానందం కొరవై దాన్ని వెతుక్కుంటూ బయలుదేరిన తను కోదండపాణి నుండి వేరయి స్వాంతంత్ర్య జీవితం గడపడం ఆరంభించింది.
ఆ జీవితంలో తనకి ఎంతో ఆనందం. డైనింగు టేబులు చుట్టూ తినడానికి వివిధ పిండి వంటలూ-పదార్ధాలు-పళ్లాలలో. పడక గదిలో తనకోరికలు తీర్చుకోడానికి పెళ్ళికాని చాకులాంటి యువ హీరో సుకుమార్ సాంగత్యం.
అలాంటి జీవితం, ఈనాడు తను గడుపుతున్న దుర్భర జీవితం తల్చుకుంటే మనుస్సులో బాధ తప్ప మరే మిగల్లేదు. అప్పుడే తిండి తిని రెండు రోజులయింది. మంచి నీళ్ళు త్రాగి తనింట్లో తాను ఉందామనుకున్నా ఆస్కారం లేకుండా తన బంగళా సుధాకర్ పేరున రిజిష్టర్ చేసింది. ఇప్పుడు తన తగ్గర చిల్లి గవ్వ లేదు. చాలా ఆకలిగా ఉంది. ఇంటిలో విలువైన వస్తువులన్నీ అమ్మేసింది. తరువాతే ఇంటి మీద అప్పు చేసింది. ఇక అమ్మడానికి ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయి కనుక? ఆలోచిస్తున్న సౌందర్య ఇంట్లో ఒక్క క్షణం ఉండలేకపోయింది. పరిచయం వున్న ముఖాలు కనిపిస్తే వారిని సహాయం అడగచ్చు అనుకున్న ఆమె ఇంటికి తాళం పెట్టి తాళాలు, ఆ దస్తావేజు కాగితాలు న్యాయవాది కుమార్‌కి ఇచ్చింది. అతనితో కూడా తను ఎక్కడికి వెళుతుంది చెప్పకుండా బయలుదేరింది
“సౌందర్యా… ఓ సౌందర్యా!”
ఆ పిలుపు విని వెనక్కి తిరిగి చూసింది మేకప్‌మేన్ వీర్రాజు. ఆమెకి వొళ్లు మండింది. తను మహానటిగా ఉన్నప్పుడు ‘అమ్మగారూ… అమ్మా!!’ అని పిల్చేవాడు. అంతే కాకుండా తన దగ్గర చేతులు కట్టుకుని నిలబడే వీర్రాజుకి ఎంత సాహసం? ఏ మర్యాదా లేకుండా ఏకవచన సంభోదన చేస్తున్నాడు అని ఆలోచిస్తున్న ఆమెకి మిక్కిలి కోపం వచ్చింది వీర్రాజు మీద. అయితే వెంటనే తన పరిస్థితి గుర్తుకు వచ్చి ఆవేశమంతా చప్పున చల్లారి పోయింది.
“సౌందర్యా! నీ పరిస్థితి ఇప్పుడు ఎలా మారిపోయింది? అందుకే ఈ సినీ ప్రపంచం ఓ జూదం లాంటిది. వైకుఠపాళీ ఆటలాంటిది. అదృష్టం బాగుంటే నిచ్చెనలు ఎక్కి పైకి వెళతాము, లేకపోతే చిన్న పెద్ద పాముల్లాంటి మనుషులు మనని పతనావస్థకి కాచుకుని ఉంటారు. ఈ ఆటలో ఓడిపోయాక అడ్రస్సులు లేకుండా పోతాము. నీవు చాలా నీరసంగా ఉన్నావు తిండి తిన లేదా? పద…!” అంటూ ఆమె చేతిని చనువుగా పట్టుకుని హోటల్ వేపు దారి తీసాడు వీర్రాజు.
ఆమె అతడ్ని వారిద్దామనుకున్నా వారించలేకపోయింది. దానికి కారణం ఆకలి. ఏ బాధనయినా భరించవచ్చు కాని ఆకలి బాధను భరించలేము. అందుకే తన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మారు మాట్లాడకుండా మౌనంగా నడిచింది ఆమె అతని వెంట.
ఆవురావురుమని తింటున్న సౌందర్య వంక ఒక మారు జాలిగా, మరో మారు కాంక్షతో చూస్తున్నాడు వీర్రాజు.
వీర్రాజుకి పెళ్ళవలేదు. పెళ్ళవలేదన్నమాటేకాని అతనికి ఆడదాని పొందులేదన్న విషయం మాత్రం నిజం కాదు. అతనిది విచిత్రమైన స్వభావం. అంగడిలో అన్ని సరుకులూ దొరుకుతూ ఉన్నట్టే ఆడదాని సుఖం అంగడిలో వస్తువును కొనుక్కున్నట్టు కొనుక్కోవచ్చు అనేదే అతని సిద్ధాంతం. ‘ఈ అంగడి బొమ్మలు అందుబాటులో ఉంటే పెళ్ళి పెళ్ళాం పిల్లలూ ఈ జంజాటం ఎందుకు? ఉన్నన్నాళ్ళూ దిల్ఖుషీగా జీవితం గడిపేయక’ అనేదే అతని మనస్తత్వం. పాత రోత-క్రొత్త వింత అనే మనస్తత్వం గల అతను రోజుకో వెరేటిని చూస్తాడు.
బాధల్లోకెల్లా గొప్ప బాధ క్షుద్భాద. కూటికోరకే కొటి విద్యలు. పొట్ట పోషించుకోడానికే నానా అగచాట్లు. అధికారి నుండి కూలి చేసుకునే వాడి వరకూ పొట్ట పోషించుకోడానికే పనిచేస్తారు. అది ఏ పని అన్నది అప్రస్తుతం. అలాంటి సమయంలో వీడు అధికారి వీడు కూలి; వీడు చిన్న, వీడు పెద్ద అన్న తేడా ఉండదు. కొంత మంది నీతి మార్గంలో పయనించి డబ్బు సంపాదిస్తే మరి కొందరు అనైతికమార్గం ఎంచుకుంటారు. ఆ పొట్ట పోషించుకునే మార్గం బందవగానే సౌందర్య జీవితం రోడ్డున పడింది.
“ఇప్పుడు నీవు ఎక్కడుంటావు?” వీర్రాజు అడిగారు.
“నీ ఇంట్లో” విసుగ్గా చిరాకుగా అంది సౌందర్య. ఆమె మాట తీరుబట్టి ఆ ప్రస్తావన ఆమెకి నచ్చలేదని తెల్సింది వీర్రాజుకి. అయితే అతను ఆమె మాటల్ని మరోలా అర్థం చేసుకున్నాడు. అతని వదనంలో సంతోష రేఖ తళుక్కుమంది. కళ్ళనిండా ఆనందం నింపుకుని “ఎంత అదృష్టం. నీవు వుంటానంటే జీవితాంతం నిన్ను నా ఇంట్లోనే ఉంచుకుంటాను. నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తాను. నీ కాళ్ళుపడ్తాను” అలా చెప్పుకుపోతున్నాడు అతను.
అతని వింత మాటలు వింటున్న సౌందర్య వీర్రాజు వేపు విస్మయంగా చూస్తూ ఆలోచనలో పడింది. తన బ్రతుకు బజారు పాలవుతున్న సమయంలో ఈ వీర్రాజు తనని కలిసి తనతో ఉండమంటున్నాడు. ఉండడానికి తనకే అభ్యంతరం లేదు. తను ఏనాడో చెడిపోయింది. క్రొత్తగా చెడిపోయింది ఏంలేదు. సినిమాలో ఎగస్ట్రాలు వేసే పాత్రలు వేస్తూ చీవాట్లు తింటూ, అవమానాలు పాలయ్యేకంటే తన మీద మోజు పడున్న వీర్రాజు దగ్గర ఉండటమే మంచిది. ప్రస్తుతం తనకో మగతోడు ఉండాలి.
“ఏంటి ఆలోచిస్తున్నావు సౌందర్యా! నా మాట మీద నీకు నమ్మకం లేదా?”
“ఉంది. అయితే నన్ను నీతో ఉండిపోమంటావు అంతేనా?” అంది.
“నీకు నచ్చిన్నన్నాళ్ళు ఉండచ్చు.”
“అయితే ఒక్క షరతు.”
“ఏంటి?”
“నా మీద నీ అజమాయిషీ ఉండకూడదు. నీ మీద నాకు ఏ అధికారం లేనట్లే నా మీద కూడా నీకు ఏ అధికారం లేదు. ఎవరి భావాలు వారివి. ఎవరి అభిరుచులు వాళ్ళవి. నా మీద నీవు అధికారం చలాయిస్తే నేను సహించేది లేదు” కరాఖండీగా చెప్పింది సౌందర్య వీర్రాజుతో.
“అలాగే!” అతను తన అంగీకారం తెలియచేశాడు. ఆరోజు నుండి సౌందర్య మకాం వీర్రాజు ఇంటికి మారింది. ఆమెకి కావల్సింది కడుపు నిండా తిండి. అది అతని ఇంట్లో ఆమెకి లభిస్తోంది. అతనికి కావల్సింది శారీరక సుఖం. అది అతనికి సౌందర్య వల్ల లభిస్తోంది.
రాను రాను వీర్రాజుకి తన మీద మోజు తీరిపోయిందని గ్రహించింది సౌందర్య. ఆమె ఆశ్చర్యపడలేదు. అతనికి వెరైటీ పిచ్చి.
అయితే తన పరిస్థితి ఏఁటి? ఆలోచిస్తున్న ఆమెలో గుబులు చోటు చేసుకుంది.
“సౌందర్యా మనం మా అక్కయ్య గారి ఊరు వెళదాం” అన్నాడు వీర్రాజు ఓరోజున.
“ఎందుకూ? అంది సౌందర్య.
“ఇక్కడ బోరుగా ఉంది” అన్నాడు.
తనకి కూడా మనశ్శాంతిగా ఉంటుంది స్థలం మారుతే అనుకుంది సౌందర్య. అనుకున్న వెంటనే బయలుదేరారు.
బస్సు దిగగానే ఉదయం పన్నెండు అయింది. హోటల్లో భోజనం చేసి బయలుదేరారు.
ఓ ఇంటి ముందు ఆగింది ఆటో. ఓ నడి వయస్సు ఆవిడ ఎరురుపడింది. “ఏఁఅక్కయ్యా! బాగున్నావా?” ఆమెను పలకరించాడు వీర్రాజు.
వీర్రాజు వాలకం కని బెట్టినట్టు ఆవిడ నవ్వుతూ…. “ఆ…. బాగున్నాను రా తమ్ముడూ” అంది.
“మళ్ళీ పెళ్ళి చేసుకున్నావా?” సౌందర్యని చూస్తూ అడిగింది.
“నా గురించి తెలుసుండీ అలాగ అడుగుతావేఁటి అక్కా!” వెటకారంగా నవ్వుతూ అన్నాడు. అతడ్ని చాటుగా పిల్చింది ఆవిడ.
“అయితే కొట్టుకొచ్చిన సరకన్నమాట. ఈవిడ్ని ఎక్కడో చూసినట్టుంది” అంది.
“చూడడవేఁటి అక్కా! ఈవిడ సామాన్యమైన సరకు అనుకున్నావేఁటి? మహానటి సౌందర్య” అన్నాడు. వాళ్ళ గుసగుసలు ఆగిపోయాయి.
వీర్రాజు సౌందర్యని ఆవిడకి పరిచయం చేశాడు. అవిడ పేరు రమణమ్మ. దారి తప్పిన అమ్మాయిలందర్నీ ఒక దగ్గరకి చేర్చి వాళ్ళ శరీరాల్తో వ్యాపారం చేస్తోంది ఆమె.
రమణమ్మ విస్మయం నుండి తేరుకుని “బావుంది. ఆవిడ సినిమాలు నేను చూస్తూ ఉంటాను. అందుకే పరిచయం ఉన్న ముఖం అనిపించింది. ఈవిడ నటన చాలా బాగుంటుంది. నా అభిమాన నటి కూడా ఈవిడ” అంది రమణమ్మ సంబరపడిపోతూ. సంబరపడిపోదా. ఫలానా మహానటి తన కంపెనీలో ఉందంటే ఎంత గొప్ప, ఎంత పేరు. ఇక తనకి బిజినెస్సే బిజినెస్సు అవుతుంది అనుకుంది మనస్సులో.
ఓ సినిమా నటి వచ్చిందని తెలియగానే అక్కడ ఉన్న అమ్మాయిలందరూ బిలబిలమంటూ వచ్చి ఆమె చుట్టు చేరారు. సౌందర్య క్రొత్తగా చూస్తోంది.
సౌందర్య చూపుల్ని అర్థం చేసుకున్న రమణమ్మ “వీళ్ళందరూ మా అమ్మాయిలు” అంది మురిపెంగా.
“నీ అమ్మాయిలా? అమ్మాయిల్లాంటి వాళ్ళా?” వీర్రాజు గలగల మని నవ్వుతూ అన్నాడు.
తను ఎక్కడికి వచ్చి చేరిందో సౌందర్యకి అర్థం చేసుకోడంలో ఎక్కువ సమయం పట్టలేదు. విధి తనతో ఇలా ఆడుకుంటోంది ఏంటి? చివరికి ఇలా సానికొంపకి వచ్చి చేరింది. తనేఁ పతివ్రత కాదు, కాని ఓనాడు తన స్థాయి ఏంటి? ఇప్పుడు తనున్న పరిస్థితి ఏంటి తల్చుకోడానికే బాధ వేస్తోంది. వీర్రాజు తనని వదిలించుకోడానికే ఇక్కడికి తీసుకువచ్చాడు.
తను పతివ్రత కాకపోయినా ఇలాంటి సాని కొంపలంటే తనకి అసహ్యం. ఇలాంటిచోట్ల తనకి నచ్చినా నచ్చకపోయినా ఇష్టం ఉన్నా లేకపోయినా యంత్రంగా విటులకి తన శరీరం అప్పగించాలి. శవంలా పడి ఉండాలి. రకరకాల రోగాల్ని తగుల్చుకోవాలి. పోలీసులకి శరీరం అప్పగించాలి. రైడింగ్ చేస్తే న్యాయస్థానాల చుట్టూ తిరగాలి. సినీ ప్రపంచంలో అయితే అదంతా గుట్టుగా గౌరవంగా జరిగిపోతుంది. ఇక్కడ అలా కాదు. అందరి ముందూ తలవొంచుకోవాలి. చీదరిస్తూ ఉంటే- హేళన చేస్తుంటే భరించాలి. కోర్టు విధించిన జరిమానా కట్టాలి.
‘సినీ ప్రపంచంలోని అందరూ చరిత్రహీనులు కారు. అలా అని అందరూ చరిత్రవంతులు కారు. అక్కడా వుంది ఈ వ్యభిచార వ్యాపారం. అక్కడా క్లాసుగా గుట్టుగా సాగుతే ఇక్కడ మాస్‌గా జరుగుతోంది. అక్కడ విటులు క్లాసు అయితే ఇక్కడ విటులు కొంత మంది మాస్. అక్కడ లక్షలు-వేలు ముడ్తే, ఇక్కడ వంద ఏభై ముడ్తుంది. వీర్రాజు తనని ఇలాంటి చోటికి తీసుకువచ్చేడేంటి? ఇప్పుడే తేల్చేయాలి.’ అనుకున్న సౌందర్య నాలుగడుగులు గదిలో వేసింది. ఆమె కాళ్ళుటక్కున ఆగిపోయాయి అక్కడ జరుగుతున్న సంభాషణ విని.
“ఒసే రమణా! నేను నీవిచ్చిన దరకి సౌందర్యను అమ్మను, నాకు దండిగా డబ్బులు ముట్టాలి. నేను తెచ్చిన సరుకు ఇలాంటి అలాంటి సరుకనుకున్నావా? సినీమా నటి, అందులోనూ మహానటి కూడా. అలాంటి సౌందర్య నీ కంపెనీలో ఉందంటే విటులు తండోప తండాలుగా నీ గుమ్మందగ్గర క్యూలో నిలబడ్డారు. సౌందర్యకి అంత డిమాండ్ ఉంది తెలుసా?”
“ఎల్లెలురా రంకు మొగుడా! ఇంతకన్నా ఒక్క పైసా ఎక్కువిచ్చేది లేదు. కన్నెపిల్లలయితే నీవన్నట్టే ఎక్కువ రేటు ఇచ్చి ఉండేదాన్ని కాని వయస్సు మీరినది, వాడి-వేడి, తళుకు బెళుకు తగ్గిపోయింది. ఎంత సినీమా యాక్టరయినా – మహానటి అయినా ఏంటి లాభం? కుర్రకారులు ఇష్టపడరు. ఆఁ కొంతమంది మాత్రం ఇలాంటి వాళ్ళ గురించి వెర్రెత్తి పోతారు. అందుకే ఈ మాత్రం డబ్బి ఇచ్చేనా కొందా మనుకుంటున్నాను. లేకపోతే ఇదెవరికి కావాలి?” రమణమ్మ అంటోంది.
వాళ్ళ సంభాషణ వింటున్న సౌందర్యకి తెలివి తప్పినంత పని అయింది. ‘తను సాలిగూట్లో వచ్చిపడింది. తనకి ఇక స్వేచ్ఛ స్వతంత్రం ఉండవు. రమణమ్మ పంపిన వాడికల్లా వాళ్ళు అప్పగించాలి’ అనుకుంది సౌందర్య.
ఈ వీర్రాజుకి రమణమ్మ అక్క కాదన్న మాట తనలాగే అతనికి శరీర సుఖం అందించిన ఓ ఆడదన్న మాట అనుకున్న సౌందర్య వీర్రాజుని నిలదీసింది.
సౌందర్యను భూతులు తిట్టాడు వీర్రాజు. “పతివ్రతలా మాట్లాడకు. నలుగురి మగవాళ్ళని మార్చిన దానివే కదా! మాట్లాడితే మక్కలిరగ దంతాను” ఆడ పులిలా బొబ్బలు పెట్టింది. రమణమ్మ.
అంత వరకూ తనని పొగిడిన రమణమ్మ అసలు స్వరూపం బయటపడింది.
“నీకు తినడానికి తిండి కావాలి, మగతోడు కావాలి. నీకు ఈ కంపెనీలో ఈ రెండూ పుష్కలంగా లభిస్తాయి. నాకు నీ మీద మోజు తగ్గిపోయింది. రమణమ్మ చెప్పినట్లు వింటే విన్నావు లేకపోతే చూడు ఆ రౌడీలు నీకు దేహశుద్ధి చేస్తారు” హెచ్చరించాడు వీర్రాజు సౌందర్యని. ఆమె తల పైకెత్తి చూసింది. అతి భయంకరమైన-క్రూరమైన ఆకారంలో రౌడీలు ఆమె వంక ఎర్రగా గుర్రుగా చూస్తున్నారు.
“దీన్ని తీసుకెళ్ళి చీకటి కొట్లో పడేయండి” రమణమ్మ రౌడీలకు పురమాయించింది. వారు అతి కిరాకతకంగా సౌందర్యను ఈడ్చుకు పోతున్నారు. ఆమె గింజుకుంటోంది. కొంత మంది విటులు వినోదంగా ఈ దృశ్యం చూస్తున్నారు.
(ఇంకా ఉంది)
విజయనగరం వాస్తవ్యులైన శ్రీ గూడూరు గోపాలకృష్ణమూర్తి హిందీ ఉపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. వారు రాసిన కథలు వివిధ వార్తపత్రికల్లో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు సంకలనంగా వెలువడ్డాయి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మానవత్వమా జోహార్లు!
నిశ్చల చిత్రం
‘భూమానందం’ – ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి ‘పారిజాతావతరణము’ పుస్తకానికి ముందుమాట
జైత్రయాత్ర-16
కశ్మీర రాజతరంగిణి-1
నన్ను మాట్లాడనివ్వండి
పరామర్శ
కాంచన శిఖరం-13
ఆచార్యదేవోభవ-33
పార్ధల
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®