[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘ఎండలకేం? బంగారుకొండలు!’ అనే కథని అందిస్తున్నాము.]
ఉగాది పండుగ. సుబ్బరామయ్య రైతు బజారు నుంచి నిన్ననే మామిడి మండలు, వేపపూత, కొత్తబెల్లం, కొత్త చింతపండు తెచ్చిపెట్టాడు. మామిడి పిందెలు సరేసరి.
పండుక్కు కూతురు అల్లుడు నవీ ముంబయి నుంచి వచ్చారు. కొడుకు కోడలు వీళ్ల దగ్గరే ఉంటారు. అలా అనకూడదేమో! వీళ్ళే వాళ్ళ దగ్గరుంటారు. ఓ.కె.?
పండగ భోజనం పూర్తయింది. అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సుబ్బరామయ్య ఇలా అన్నాడు.
“అమ్మయ్య! ఎండలు మెల్లగా ముదురుతున్నాయి. శ్రీరామనవమి తర్వాత సూరిబాబు ఫుల్ జోష్‌లో ఉంటాడు. ఇక ఎండలే ఎండలు! నాకెంతిష్టమో వేసవంటే!”
అల్లుడు విచిత్రంగా చూశాడాయనవైపు. “అదేంటి అంకుల్, విచిత్రంగా మాట్లాడుతున్నారు? ఎండలంటే ఇష్టమా మీకు?”
సుబ్బరామయ్య భార్య మావుళ్లమ్మ నవ్వింది. “ఆయనంతే అల్లుడు! అంతా రివర్సు వ్యవహారం!” అన్నది.
హాల్లో ఎ.సి. లేదు. ఒక బెడ్ రూంలోనే ఉంది. రెండో బెడ్ రూంలో లేదు. కాని హాల్లో పెద్ద సైజు సింఫనీ కూలర్ పెట్టారు. ఈ మధ్యనే దానికి మ్యాట్స్ మార్పించి, నీళ్లు పోసి వాడుతున్నారు. ఎ.సి. సర్వీసింగ్ చేయించారు అర్బన్ క్లాప్ వారితో. చెల్లెలికి బావకు ఎ.సి రూం ఇచ్చేశారు. ముసలాళ్లకు ఎ.సి. అవసరం లేదు.
“మా చిన్నతనంలో మా ఉర్లో మట్టి మిద్దెలు. రాతి గోడలు. వేడిని గ్రహించేవి కాదు. చల్లగా ఉండేవి. పెరట్లో పెద్ద వేప చెట్టుండేది. దానికింద పశువులపాక. పశువులు మేత కెళితే, పాకలో ఈతచాప పరుచు కొని హాయిగా ఆడుకునేవాళం” అన్నాడు సుబ్బరామయ్య.
“మా ముంబయికి రండి నాన్నా తెలుస్తుంది” అన్నది కూతురు రసజ్ఞ. “ఉక్కపోత, వేడి. వంటిట్లో గంటసేపు ఉండలేరు. ఈ నాలుగు నెలలూ నరకమే!”
“మల్లెమొగ్గలూ, మల్లే మొగ్గల్” అని అరుచుకుంటూ వెళుతున్నాడు వీధిలో.
మావుళ్లమ్మ చటుక్కున లేచి బయటకు వెళ్లింది. పావుకిలో మల్లె మొగ్గలు కొనుక్కుని వచ్చింది, కొంగులో పోసుకొని. వాటి సువాసన హాలంతా వ్యాపించింది. స్టీలు పళ్లెంలో పోసి టీపాయ్ మీద పెట్టింది. కోడలు కావేరి దారం ఉండ తెచ్చుకొని మాల గుచ్చసాగింది. నాలుగైదు మూరల దండ తయారైంది.
“సాయంత్రం తలా ఒక మూర పెట్టుకుందాం. ఫ్రిజ్‍లో పెట్టమ్మా. మిగిలింది దేవుడి పటానికి. కొంచెం విడి పూలు ఉంచావా, మామయ్య అష్టోత్తరపూజకు?” అన్నది అత్తగారు. తలూపింది కావేరి.
“నెలాఖరుకు మామిడిపండ్ల సీజన్ మొదలవుతుంది. ఇక తాటిముంజెలూ వస్తాయి” అన్నాడు సుబ్బరామయ్య.
“చింత చిగురు రాలేదాండీ రైతు బజారులో?”
“నీకన్నీ తొందరే. నాలుగు తొలకరి చినుకులు పడాలి, అప్పుడే చింత చెట్లు చిగురిస్తాయి.”
“చింత చిగురు పప్పు ఎంత బాగుంటుందో?” అన్నాడు సుపుత్రుడు.
“అన్నీ కావాలి. కాని ‘ఎండాకాలం’ మాత్రం వద్దంటే ఎలారా వెధవా? ఋతుధర్మం అనేది ఒకటుంది. అది తన పని తాను చేసుకోపోతుంది. ఎండలు బాగా కాస్తే కదా సముద్రంలో నీరు వేడెక్కి పైకెళ్లి మేఘాలుగా మారి, ఆ నీటియావిరికి గాలి తగిలి, వర్షాలు కురిసేది?”
“నిజమే అంకుల్! సెలవులు కూడా వేసవిలోనే కదా వచ్చేవి. పిల్లలు సమ్మర్‌ని బాగా ఎంజాయ్ చేస్తారు!” అన్నాడు అల్లుడు.
“అదేమిటో, పెళ్లిళ్లన్నీ ఎండల్లోనే జరుగుతాయి” అంది మావుళ్లమ్మ.
“ఇప్పుడు తెలిసిందా, ఎండలంటే ఎందుకు నాకంత యిష్టమో?”అన్నాడు సుబ్బరామయ్య.
కొడుకున్నాడు. “నాన్నా మీ తరం వారికి ‘సహనం’ అనే మంచి గుణం ఉంది. మాకది లేక ఛస్తున్నాం. జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించడం మాకు రావటం లేదు.”
“కేరళ టూర్ ప్యాకేజీ బుక్ అయిందా బావా?” అల్లుడు.
“అయింది బావా! వచ్చే వారం మన ప్రయాణం. శబరి ఎక్స్‌ప్రెస్‌లో ఎర్నాకుళం వరకు సెకండ్ ఎసి చేశాను. అక్కడి నుంచి ట్రావెల్స్ వారి బాధ్యత.”
“చూశారా, టూరిజంకు కూడా మహర్దశ ఎండల్లోనే!” అని నవ్వాడు పెద్దాయన!
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.