Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆసక్తిగా చదివించే ‘ఎనభైలో ఇరవై’ కథలు

[శ్రీ వేమూరి సత్యనారాయణ గారి ‘ఎనభైలో ఇరవై’ కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

సత్యం గారుగా పిలవబడే వేమూరి సత్యనారాయణ గారు తన ఎనభైవ పుట్టినరోజు సందర్భంగా ఇరవై కథలతో వెలువరించిన కథాసంపుటి ‘ఎనభైలో ఇరవై’.

~

పారిజాతం ఓ సామాన్య గృహిణి. భర్త ఆమెపై తరచూ చేయి చేసుకుంటుంటాడు. ఆ గాయాల గుర్తులు ఆమె శరీరంపై కనబడుతూనే ఉంటాయి. పక్కింటి పార్వతమ్మ వచ్చి పలకరించి ఆ గాయాలని చూసి, పారిజాతం భర్తని తిడుతుంటే, భర్త తనని కొట్టినా, ఆ తరువాత చూపే ప్రేమ కోసమే ఆ దెబ్బల్ని భరిస్తానని చెప్తుంది. ఆశ్చర్యపోయిన పార్వతమ్మ తన భర్త నుంచి అటువంటి ప్రేమని పొందాలని ఆ రాత్రి అతనితో వాదనకి దిగుతుంది. ఆమె ఆశించిన ప్రేమ దొరికిందో లేదో తెలియాలంటే 1971 నాటి ‘పారిజాతం’ కథ చదవాలి.

ఇంటర్వ్యూకి వెళ్ళిన రవికుమార్ అనే ఓ యువకుడు, అక్కడో యువతిని చూసి, ఆమె విపరీతంగా నచ్చేసి, ఊహాలోకాల్లో సంచరిస్తాడు. మధురమైన ఊహల నుండి వాస్తవ ప్రపంచంలోకి తెస్తూ, అతన్ని లోపలికి రమ్మని పిలుపొస్తుంది. అక్కడి ఆఫీసర్ కూర్చోమనకుండానే ప్రశ్నలు వేయడం మొదలుపెడతాడు. “మీ పేరు?” అని అడగగానే, “ఎన్నోసార్లు చెప్పిన సమాధానాల్నే మళ్ళీ చెప్పడానికి ఉపక్రమించాడు” అంటారు రచయిత. ఈ ఒక్క వాక్యంతో రవికుమార్ పరిస్థితిని పైపై మెరుగుల జీవితమంటూ చెప్పేస్తుంది ‘గోల్డ్ కవరింగ్’ కథ.

కొన్ని కథలు చదువుతుంటే, ఇతివృత్తం తెలిసాక, తర్వాత ఏమవుతుందో ఊహించడం కష్టం కాదు. కథలో భాగంగా కొన్ని సన్నివేశాలో, సంభాషణల్లో దొర్లే పదాలో కథ ఎలా ఉండబోతోందో చెప్పేస్తాయి. బావని ఏప్రిల్ పూల్ చేయాలనుకున్న మరదలు, అందుకు వంతపాడిన మిత్రులు! కానీ ఎవరు ఫూల్ అవుతారు? తనకిష్టమైన మరదలు మరొకరితో సన్నిహితంగా ఉంటోందని వచ్చిన ఉత్తరంలోని వాక్యాలూ, తర్వాత మరదలి గదిలో క్యాలెండర్‍లో తేదీ.. తాము ఊహించినది నిజమవుతోందని పాఠకులు అనుకునేలా చేస్తాయి. ‘నాలుగో నెల మొదలైంది!’ అన్న శీర్షిక 1974 నాటి ఈ కథకి అద్భుతంగా నప్పింది.

మనిషికి పిచ్చి పట్టడం అదృష్టమా? దురదృష్టమా అన్న ప్రశ్నతో కథలోని కథ మొదలవుతుంది ‘నా జవాబే తప్పు’ లో. పరంధామయ్య వేగంగా ఎదిగి అంతకన్నా వేగంగా పతనమవుతాడు. అతని పెద్ద పాలేరు కొడుకు రాముడు జీవితం కొట్టిన దెబ్బకి క్రుంగిపోతాడు. పిచ్చివాళ్ళైన ఈ ఇద్దరూ కలిసి ఉండడం విచిత్రం. ‘వాళ్ళిద్దరి జీవితాల మొదలులాగ వున్న వాతావరణం, వారిద్దరి జీవితాల చివరిభాగంలా మారిపోయిట్లు!’గా అయిపోయిందంటూ ముగుస్తుంది 1976 నాటి ఈ కథ.

చుట్టం దేవుళ్ళు’ కథ ప్రేమించి పెళ్ళి చేసుకున్న బావామరదళ్ళ కథ. ప్రేమ పెళ్ళి చేసుకున్న దంపతుల మధ్య కాలం ఎంత వేగంగా గడుస్తుందో చెప్పడానికి – ‘ఆ మధ్యకాలంలో అయిదుసార్లు జీతమిచ్చారు కంపెనీవాళ్ళు’ అని చెప్పడం బావుంది. చక్కగా సాగిపోతున్న కాపురంలో అపార్థాలు చెలరేగితే అనుకోకుండా వచ్చిన స్నేహితులో/చుట్టాలో కలహాలకి తాత్కాలికంగా అడ్డుకట్ట వేస్తారు. దొరికిన ఆ సమయంలో అపార్థాలు చాలా వరకూ తొలగిపోతాయి. లవ్ మీన్స్ నెవర్ హావింగ్ టు సే సారీ అంటుంది 1976 నాటి ఈ కథ

అసెంబ్లీలో తారాబలం’ కథలో జయసుధ, జయప్రద, మురళీమోహన్, శ్రీధర్, రావుగోపాలరావు, రాజబాబు, సత్యం (సంగీతపాయనా, ఫోటోలాయనా కూడా), కె. రాఘవేంద్రరావు అసెంబ్లీకి ఎన్నికవుతారు. అసెంబ్లీ సమావేశాలలో తారల సమస్యలు, ప్రభుత్వ స్పందనా.. చదువుతుంటే నవ్వొస్తుంది. కినిమా అనే సినిమా పత్రికలో డిసెంబర్ 1977 సంచికలో ప్రచురితమైంది ఈ కథ. సినిమా నటుల్నీ, రాజకీయాల్ని కలిపి సరదాగా అల్లిన కథ.

పునర్జన్మలపై కృషి సాగిస్తున్న గంగరాజనే ఓ సైంటిస్ట్ కథ ‘ఓటమి’. తన చెల్లికి కాబోయే భర్త, తన అనుంగు మిత్రుడు నాగేంద్రబాబు పూర్వజన్మ వివరాలూ; తన చెల్లెలు కవిత పూర్వజన్మ వివరాలూ – వారిద్దరి కోరిక మీద తెలుసుకుంటాడు గంగరాజు. నాగేంద్ర గత జన్మ వివరాలు అతనికి చెప్పినా, చెల్లెలి గత జన్మ వివరాలు ఆమెకు చెప్పలేకపోతాడు. ఎందుకో పాఠకులకు చూచాయగా అర్థమవుతుంది. ప్రముఖ చిత్రకారుడు చంద్ర వేసిన బొమ్మకి అల్లిన కథ ఇది.

పాదదాసి’ కథ గోపాలం, భూపాలం అనే ఇద్దరు మిత్రులు, వాళ్ళ భార్యలు శారద ఇందిరలది. మగాళ్ళిద్దరూ ఓ రాత్రి ఆలస్యంగా ఇంటికొస్తారు. అప్పటికే వాళ్ళ భార్యామణులు అన్నాలు తినేసి నిద్రకి ఉపక్రమిస్తారు. అది చూసి హతాశులైపోతారు గోపాల భూపాలాలు. తర్వాత వాళ్ళ ప్రశ్నలకు ఇందిర చెప్పే సమాధానాలకి ‘భూ – గో’పాలాలు దిమ్మెరపోతారు. పంతం తీరేడప్పుడైనా భార్యని ఓ మనిషిగా చూడండి అంటుంది ఇందిర చివర్లో. కథలో రచయిత ఎక్కడా చెప్పని ఓ వేదన ఈ వాక్యాల్లో గోచరించి పాఠకుల్ని విచలితుల్ని చేస్తుంది. 1993 లో ప్రచురితమైన ఈ కథలో రచయిత వాక్యాలతో చేసిన ప్రయోగాలు – ఆధునిక యువ రచయితల రచనాశైలికి ఏమీ తీసిపోదు.

ఓ సినిమా ప్రభావం సమాజం మీద, రచయితల మీద ఎలా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణగా రాసిన కథ ‘ఇప్పుడేది దారి?’ ‘అత్తారింటికి దారేది’ సినిమా క్లైమాక్స్‌లో పవన్ కల్యాణ్ పాత్ర తన మేనత్తతో మాట్లాడడానికి రైల్వే స్టేషన్‌ని ఖాళీ చేయిస్తాడు. అక్కడ, అప్పుడు, అంతే శక్తివంతుడైన మరో వ్యక్తి ఉండి ‘ఖాళీ చేయనివ్వ’ను అని అంటే ఎలా ఉంటుందో అన్న ఊహతో అల్లిన కథ ఇది. 2015లో ప్రచురితమైన ఈ కథకి టైటిల్ సముచితంగా ఉంది.

ఆనాటి వాన చినుకులు’ ఒక భావుకుడి కథ. ఓ రిక్షా వెనుక రాసిన ‘..నాటి వాన చినుకులు’ అన్న పదాలని పట్టుకుని వాటి వెనుక ఉన్న వ్యక్తిని, ఆ కథను తెలుసుకోవాలని తపించిన వ్యక్తి కథ ఇది. “ఇలా ఎన్ని కథల్ని కంటుందో ఈ వాక్యం” అన్నారు సత్యం గారు ఈ కథలో. నిజంగానే ఈ వాక్యం ఎన్నో కథల్ని కనింది, ‘ఆనాటి వాన చినుకులు’ పేరిట 24 కథలతో 2018లో ఓ సంకలనం వెలువడడానికి కారణమయింది. ఆర్తి నిండిన కథ.

కాలుష్యం’ చక్కని కథ. సమాజంలో జరుగుతున్న అన్యాయాలూ, అత్యాచారాలపై కథలు రాసే ఓ రచయిత, తనకి ఆప్తులైన వ్యక్తుల అసలు పేర్లతో, కథ వ్రాస్తే, అతనికి అభ్యంతరం ఎదురవుతుంది. కల్పిత పాత్రకి తన పేరు పెట్టినందుకు అభ్యంతరం కాదని, కథలో చెప్పిన ముగింపుకని అంటుంది ప్రశాంతి. ఎక్కడో ఏదో జరిగిందని మనం విశ్వసించే మనుషుల్ని, నమ్మకాల్ని బలిపెట్టలేను అంటుంది. ఈ కథకి ముగింపేమిటా  అని ఆలోచనలో పడతాడు రచయిత.

ఈ కథ నాది కాదు’ అనే కథకి ఓ. హెన్రో రాసిన ‘ది లాస్ట్ లీఫ్’ ప్రేరణ. అమెరికా వెళ్ళినప్పుడు తాను చూసిన సంఘటనకీ, ‘ది లాస్ట్ లీఫ్’ ప్రేరణతో కథని అల్లి అందించారు రచయిత. ఈ కథలో అది చెట్టయితే, ఓ.హెన్రీ కథలో ఒక తీగ (క్రీపర్). ఈ కథని తన స్నేహితురాలు హరిత కథగా చెప్తుంది స్నేహ. అందులో తానూ ఓ పాత్ర అయినప్పటికీ ఇది హరిత కథే అయి, టైటిల్ జస్టిఫై అవుతుంది.

ఆస్తి అన్న పదానికి గొప్ప అర్థం చెప్పిన కథ ‘ఆస్తి’. సంపద నిజమైన ఆస్తి కాదు, పరిస్థితులు తారుమారయినప్పుడు, క్రుంగిపోక, నిరాశ చెందక స్థిరంగా ఉండగలిగే స్ఫూర్తే తండ్రి తనకిచ్చిన ఆస్తి అని గోపాలకృష్ణ చెప్తాడు ఈ కథలో.

ప్రేమను పంచుతూ బతికిన, ప్రేమను పంచటం నేర్పిన తల్లి సంవతర్సీకం సందర్భంగా ఆ కుటుంబం చేసుకున్న కార్యక్రమం ఒక గొప్ప ఆలోచనతో ఓ వేడుకగా మారుతుంది. ‘వియ్ ఆర్ నాట్ గ్రీవింగ్ హర్ డెత్, వియ్ ఆర్ సెలెబ్రేటింగ్ హర్ లైఫ్’ అని ఆమె మనుమడు రాసిన వాక్యం ఆమె గొప్పతనాన్ని చెప్పకనే చెబుతుంది. హృద్యమైన కథ ‘అమ్మకు ఆహ్వానం’.

కథకుడు’ కథలో అసలు కథకుడు ఈ కథ చెబుతున్న రచయితా లేక, తన క్యాబ్ ఎక్కే కస్టమర్లకు బోలెడు కల్పిత కథలు చెప్పి, సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన క్యాబ్ డ్రైవరా? మరి రమేష్ నిజమైన వ్యక్తేనా? లేక కథలో ఓ పాత్రా? కథ చదివాకా, పాఠకులే నిర్ణయించుకుంటారు.

బాగుపడడం, పైకి రావడమంటే ఏమిటో స్పష్టం చేస్తుంది ‘రూపాంతరాలు’ కథ. విలువలున్న వ్యక్తి పతనమవుతే, ఆ పతనాన్ని ఆపి, మళ్ళీ పైకి తేవడానికి మరో విలువలున్న మనిషే అవసరమవుతాడు. రామకృష్ణ శివరామకృష్ణ అయి, మళ్ళీ రామకృష్ణ అవుతాడు. ఈ మధ్యలో ఎన్నో కోల్పోతాడు, చివరికి అసలు విషయం గ్రహించి పూర్వపు మనిషవుతాడు.

“ఒకోసారి ఒక సహజ పరిణామం పెద్ద సమస్యకి దారితీస్తుంది మరి” అని ముగించిన కథ ‘సలహా’. ఓ నవల చదువుతుండగా అందులోని ‘మనసు మాట శరీరం వినటం, శరీరం మాట మనసు వినటం’ అన్న ప్రస్తావన రచయిత ఆలోచల్లో దూరి ఈ కథ రాసేలా చేసింది.

“సుబ్బారావుకి ప్రతీది కొత్తగా ఉంది. ప్రతీదీ గొప్పగా ఉంది. ప్రతీదీ అద్భుతంగా ఉంది. ప్రతీదీ అనుభూతులనందిస్తోంది”. ఈ వాక్యాలు చదివితే సుబ్బారావు ప్రేమలో ఉన్నాడన్న సంగతి పాఠకులకి అర్థమవుతుంది. తాను ప్రేమించిన అమ్మాయికి ప్రియుడు కాలేకపోతాడు. కథ మొదలయ్యే వాక్యాన్ని, కథానుగుణంగా మార్చి, చక్కని ముగింపు వాక్యం చేశారు రచయిత ‘లవ్‍లీ’ కథలో.

చలపతి చక్రభ్రమణం’ కథ లారీ డ్రైవర్ అయిన చలపతి కథ. చిన్న యాక్సిడెంట్‌కి కారణమై, కోర్టు విధించిన జరిమానా కట్టలేక జైలుకి వెళ్ళేందుకు సిద్ధమవుతాడు. లారీ యజమాని సాయం చేయడు. నిరాశానిస్పృహలకి లోనయైన చలపతి వచ్చి నది ఒడ్డున కూర్చుంటాడు. ఎన్నెన్నో ఆలోచనల మధ్య అక్కడ ఓ ఎలుక చేసిన జీవనపోరాటం చూసి, స్ఫూర్తి పొంది ఇంటికెళ్తాడు. అనుకోకుండా మనసు మార్చుకున్న లారీ యజమాని డబ్బిచ్చి, జరిమానా కట్టేయమంటాడు. కట్టేస్తాడు చలపతి. మరో ప్రయాణంలో రోడ్డు మీద ఓ ఎలుక అడ్డం పడటంతో, నది ఒడ్డున చూసిన ఎలుక గుర్తొచ్చి, దాన్ని తప్పించబోయి, ముందున్న రిక్షాని గుద్దేస్తాడు చలపతి. “ఈ కథ మళ్ళీ మొదలైంది” అంటూ ముగిస్తారు కథని. ఈ కథ వెనుక కథ తెలుసుకోవడం ఆసక్తిగా ఉంటుంది.

చివర్లో రచయిత 70వ దశకంలో రాసిన నాలుగు చిన్న కథల్ని – ఈ సంపుటి కోసం మార్పులు ఏమీ చేయకుండా – యథాతథంగా చేర్చారు. వీటిని ఏ కాలపు కథల్ని ఆ కాలపు కథల్లానే చదవాలని సత్యం గారు తన ముందుమాటలో కోరుకున్నారు.

~

సత్యం గారి అన్ని కథల్లోనూ సంభాషణలు సందర్భోచితంగా ఉంటాయి, చిన్న విట్ (wit) కూడా ఉండి, చదువుతున్నప్పుడు పాఠకుల పెదాలపై సన్నని నవ్వొకటి పూస్తుంది. కథల్లోని చివరి వాక్యాలు చాలా బావున్నాయి. ఆర్టిస్ట్ అన్వర్ చిత్రించిన ముఖచిత్రం, కథలకు గీసిన బొమ్మలు ఆకర్షణీయంగా ఉండి, పఠనానుభూతికి తమ వంతు దోహదం చేస్తాయి.

***

ఎనభైలో ఇరవై (కథలు)
రచన: వేమూరి సత్యనారాయణ
ప్రచురణ: వేమూరి బుక్స్, హైదరాబాద్
పేజీలు: 216
వెల: ₹ 230/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్.-27. ఫోన్: 9000413413
విజయవాణి ప్రింటర్స్, చౌడేపల్లి: 9440804072
రచయిత: 9848321703
ఆన్‍లైన్‌లో:
https://www.amazon.in/Enabhailo-Iravai-Vemuri-Satyanarayana/dp/B0DTT4DQ3G

 

~

వేమూరి సత్యనారాయణ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ :
https://sanchika.com/special-interview-with-mr-vemuri-satyanarayana/

 

Exit mobile version