Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మోహాగ్ని కీలలలో Empire of passion

1895 కాలం లో జపాన్ లోని వో పల్లె. భర్త గిసాబురో (తాకాహిరో తమురా) ఒక రిక్షా నడిపేవాడు. భార్య సేకి (కజుకో యోషియుకి), ఇద్దరు పిల్లలు. పెద్దది అమ్మాయి షిన్ (మసామి హషేగావా) వేరే వూళ్ళో వుంటుంది. రెండో సంతానం చిన్న పిల్లవాడు. వో రెండేళ్ళుండవచ్చు. తోయోజి (తాత్సుయా ఫుజి) అనే యువకుడు ఆర్మీ నుంచీ సరాసరి ఆ వూరికి రావడంతో వాళ్ళ జీవితంలో సంభవించిన మార్పులే ఈ చిత్రం. తోయోజి కి సేకి పట్ల ఆకర్షణ. అక్కడక్కడే తచ్చాడుతూ వుంటాడు. ఈ విషయం భర్త దృష్టికి కూడా వస్తుంది. భార్య ఏమీ ఎరగనట్టు వున్నా, తను కూడా అతని ఆకర్షణలో పడుతుంది. తోయోజి భర్త లేని సమయాల్లో ఆమె ఇంటికి వెళ్ళడం, కబుర్లు ఇలా పరిచయం కాస్తా ప్రేమగా, మోహంగా మారుతుంది. ఈ మోహావేశాల్లో ఎందుకో మనిషి మరో మనిషిని పూర్తిగా స్వంతం చేసుకోవాలనుకుంటారు. ఇద్దరి మధ్య మూడో వ్యక్తి నీడ కూడా ముల్లు లా గుచ్చుకుంటూ వుంటుంది. తోయోజికి అదే అవుతుంది. ఆ భర్త పట్ల అసూయ. అతన్ని చంపి అడ్డు తొలగించుకుందామని ఆమెను ఒప్పిస్తాడు. మోహం ఇద్దరిలోనూ సమపాళ్ళలో వుండబట్టి ఆమె ఒప్పుకుంటుంది. మాట్లాడుకున్నట్టుగానే ఆమె అతనికి పీకలదాకా తాగించడం, అతను మత్తులో వున్నప్పుడు ఇద్దరూ కలిసి తాడుతో అతని గొంతు నులిమి చంపేయడం జరిగిపోతాయి. ఆ వెంటనే ఆమె భీతిల్లి ఏడ్వడం మొదలు పెడుతుంది, నేను ఇంత పనీ చేశానా అని. తర్వాత ఇద్దరూ ఆ శవాన్ని ఈడ్చుకుంటూ అడవిలోని వొక పాడుబడ్డ బావిలో పడేస్తారు. తర్వాత ఏమీ ఎరుగనట్టు నటిస్తారు. తన భర్త టోక్యోలో పని చేసి సంపాదించడానికి వెళ్ళాడని అందరితో చెబుతుంది భార్య.

spoiler alert. సినిమా ముందు చూడాలనుకునే వారు ఈ పేరాను దాటేసి చూసిన తర్వాత చదవండి. హత్య చెయ్యడం చేసేశారు గాని ఇద్దరి మనసుల్లోనూ భయం, అపరాధ భావన, పశ్చాత్తాపం అన్నీ ముసురుకుంటాయి. ఆ బావిలో శవం ఎవరి కంటా పడకూడదని అతను అడవిలో రాలిన ఎండుటాకులను ఎత్తి తీసుకెళ్ళి ఆ బావిలో పడేస్తుంటాడు. మామూలుగా ఆ ఎండుటాకులను ఏరి వంట చేరకుగా వాడుకుంటారు. ఆ అడవిప్రాంత యజమాని కళ్ళు గప్పి చాలా మంది ఆ పని చేస్తుంటారు. ఒకసారి అతను బావిలో ఆకులు పడెయ్యటం యజమాని కొడుకు చూస్తాడు. ఎందుకు పారేస్తున్నావు అని అడిగితే తడిసి పోయాయి, పొగలు వచ్చి వంటచెరకుగా పనికి రాదంటాడు. అప్పటికి అనుమానం రాని ఆ యజమాని కొడుకు వెళ్ళిపోతాడు. భర్త వున్నప్పుడు కలిస్తే లేని భయం ఇప్పుడు కలుగుతుంది ఇద్దరికీ. ఎవరి కంటా పడకూడదు, లేదంటే తమ మీద అనుమానం కలుగుతుంది, భర్తను ఎదో చేశారని. వొకసారి కూతురు వస్తే ఆమెను అడుగుతారు వూళ్ళో వాళ్ళు, మూడేళ్ళయ్యింది నీకు కబురేమన్నా చేసాడా మీ నాన్న అని. ఆమె లేదంటుంది. ఆమెకు కూడా ఇది అయోమయంగా వుంటుంది. వొకసారి ఏదో కోపంలో కూతురిని నువ్వెళ్ళిపో అంటుంది కూడా తల్లి. రుతువులు మారుతున్నాయి. కాలం గడిచిపోతోంది. వూళ్ళో అనుమానం పడేవారెవరో ఫిర్యాదు చేసినట్టుంది, నగరం నుంచి తనిఖీ చెయ్యడానికి వస్తాడో పోలీసాఫీసరు. ఈ బాధలు చాలవన్నట్టు భార్యకు పలు సందర్భాల్లో తన భర్త ఆత్మ (దయ్యం) కనిపిస్తుంది. ఏం మాట్లాడదు, అలా గుచ్చి గుచ్చి చూస్తుంటుంది అంతే. నీకే కనిపించడం ఏమిటి, నాకెందుకు కనబడడు, నీ భ్రమ అంటాడు అతను. కొన్నాళ్ళకి ఆ దయ్యం తమకు కనబడిందని వూళ్ళో మరికొందరు చెబుతారు. పోలీసుకు ఈ జంట మీదే అనుమానం. ఇద్దరూ పంజరంలో చిక్కుకున్న పక్షుల్లా గిలగిలా కొట్టుకుంటూ వుంటారు. నువ్వు నాతోనే వుండు, నాకు భయంగా వుందని ఆమె అన్నా; వీలు పడదు మన మీద అనుమానం గట్టి పడుతుంది అంటాడతను. మొదటిలో వాళ్ళలో వున్న మోహాన్నతా అపరాధ భావనా, భయమూ చెరిపేస్తాయి. ఆ తర్వాత కొన్ని మలుపులు; చివరికి ఆ గిల్ట్ వారిని ఎలా శిక్షిస్తుందో మిగతా కథ.

In the realm of senses తీసిన రెండేళ్ళ తర్వాత తీశాడు దీన్ని, నాగిసా ఒషిమా. మొదటి చిత్రం పోర్న్ లా వుంది అన్న వాళ్ళు ఇది చూసి కాస్త నిరుత్సాహ పడ్డారు. రెంటిలోనూ వివాహేతర సంబంధం, ప్రేమ, మోహం వున్నా రెంటిలోనూ ముగింపు భయంకరంగా వుంటుంది. మొదటి చిత్రం ఒక సాహసం అనుకుంటే, ఈ చిత్రంలో నాగిసా ఒషిమా నైపుణ్యం అచ్చెరువొందేలా వుంది. కొండల మీద వున్న ఒక పల్లె, కాలానుగుణంగా రుతువులతో పాటు మారే ప్రకృతి, అడవులు, మంచూ, ఏరూ, విసిరేసినట్లుగా వున్న ఇళ్ళూ వొకటేమిటి అన్నీ కన్నులకు ఇంపుగా వుంటాయి. దానికి దర్శకునితో పాటు యోషియో మియాజిమా చాయాగ్రహణాన్ని కూడా మెచ్చుకోవాలి. తోరు తాకేమిస్తు సంగీతం మన చేత రకరకాల భావోద్వేగాల ప్రయాణం చేయిస్తుంది. కథతో సమాంతరంగా. గొప్ప కథలలో, నాటకాలలో విదూషకుడు వుంటే ఇందులో వొక పిచ్చివాని పాత్ర వుంది. సామాజిక భాష కానిదాంట్లో వ్యాఖానం చేస్తూ. వొక పెళ్ళి సంబరంలో అతనూ వెళ్తాడు, కాని అతన్ని చూసి నవ్వి అతన్ని బయటకు పంపించేస్తారు. భయపడుతున్న సేకి వద్దన్నా అతని ఇంటికి వెళ్ళి అతని చాతీ మీద తల వాలుస్తుంది. పక్క మంచంలోనే ఆ పిచ్చి వాడు. అతను మెలకువ వచ్చి అల్లరి చెయ్యడం, అతను ఆ పిచ్చివాణ్ణి అవతలకు తీసుకెళ్ళి ఆమెను వెళ్ళిపొమ్మనడం వొక సరళ రేఖలో మధ్య తను నుంచుని ఆ చివరా ఈ చివరా ఇద్దరు ఉన్మత్తులను సంబాళిస్తుంటాడు. ఇక చిత్రంలో ఆ రిక్షా బండి చక్రం గిరగిరా తిరగడం పదే పదే కనిపిస్తుంది. అది లాగుతున్నది భర్త అయినా దాన్ని మోస్తున్నది వీళ్ళిద్దరు. అలాగే సింబాలిక్ గా ఆ బావి లోపలి నుంచి షూట్ చేసిన దృశ్యాలు చాలా ప్రభావవంతంగా వుంటాయి. ఆ బావి అంచులు ఒక సర్కిల్, బయట ఇద్దరి ముఖాలు, వాళ్ళు లోపలికి మెట్లను వదలడం ఇవన్నీ. ప్రకృతి లో ఏదీ దారి తెరిచే వున్న ఆకారం లో వుండదు, ముఖ్యంగా వర్తులాలు. ఇవి చర్చించడం కొంచెం కష్టమే, గానీ చూస్తే వొక అనిర్వచనీయమైన భావనకు లోను చేస్తాయి.

ఇతొకో నాకామురా వ్రాసిన నవల ఆధారంగా తీసారు ఈ చిత్రాన్ని. ఆమె ఇతర పుస్తకాలు తెలుసుకుందామనుకుంటే నాకు సమాచారం దొరకలేదు. ఈ చిత్రానికి గాను నాగిసా ఒషిమా కు కాన్ లో ఉత్తమ దర్శకుడుగా అవార్డు లభించింది.

Exit mobile version