[శ్రీమతి బి. కళాగోపాల్ రచించిన రచించిన ‘ఏమంటావు రేవతీ!?’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
ఇక ఏమంటావు రేవతీ?
తగ్గేదేలే అంటూ మీసం తిప్పే డైలాగులకి
జబ్బలు చరిచి తొడలుగొట్టే హీరోయిజంకి దాసోహమంటూ
నిలువెత్తు కటౌట్లల్ల మెరిశేటి తన అభిమాన హీరో
సుట్టూ బౌన్సర్లతో దర్పం ఒలకబోస్తుంటే సూసి
మేను ముర్సిపోవాలన్న *మారిజువానా మత్తు తలకెక్కిన
పిల్లాడి కోరిక కాస్తా అసురసంధ్య మృత్యువాటికలో
పూలపామై నిన్ను కాటేశాక *మార్జోలీన్ పుండులా
సల్పుతున్న తొక్కిసలాట నెత్తుటి గాయంలో జివజివలాడుతున్న
నీ ప్రాణం మొదటి రోజు మొదటి ఆట సూడని
నీ బిడ్డడ్ని పప్పుగాడంటూ గేలిచేస్తారంటావా?
నిప్పులకుంపటిపై అంబలికుండ లెక్క రగిలిపోతున్న
అభిమానులంతా అంతా నీవల్లే అన్న నిందను
తమ ఆరాధ్య *డెమీగాడ్ ఎక్కడ భరించాల్సివస్తుందోనని
సోషల్ ఘోషలో వెర్రెత్తుతున్నారంటావా?
ఊచకోతకి మారుపేరైన హీరో అలియాస్ విలన్ అంటే
ఏ పులో సింహమో కానేకాదంటే తమ అభిమాన హీరో
గౌరవం ఎక్కడ తగ్గి పోతుందోనన్న సోయిదప్పిన
అభిమానానికి ఎదురుదెబ్బలు తప్పయంటావా?
ఇంకా ఏమేమి అంటావో నిజం చెప్పు రేవతీ!?
పిల్లాడి స్కూలు ఫీజును గుర్తు చేస్తున్న క్యాలెండర్
పేలని ఫిరంగిలా గురిపెట్టి భయపెడ్తుంటే
పెంచిన టిక్కెట్ల ధరలకు తల ఒగ్గినవాళ్లుగా
పిల్లాజెల్లల్ని ముడేస్కవోయి ఐటెంసాంగ్స్ సూసేంత
అభివృద్ధికి మనం ఎగబాకినాక రేప్పొద్దున ఇంకో
అభిమాన తారతో కల్సి సూసే స్టేజీషో అంటే
గాడి తప్పుతున్న మరో రేవతి మరణముఖచిత్రమేనని
తల్లిలేని వేదనలో తన పిల్లాడు
ఇల్లు తప్పిపోయి దిమ్మరిలా తిరుగుతుంటే
పరిహారమిచ్చి చేతులు దులుపుకున్నా
పోయిన ప్రాణం ఖరీదు వెలకట్టలేనిదని
జెరభద్రం! జాగ్రత్త సుమీ!
అంటూ మమ్మల్ని అదిలిస్తాంటివా రేవతీ?!
***
*మారిజువానా=గంజాయి మాదకద్రవ్యం
*మార్జోలిన్ పుండు= చర్మంపై వచ్చే ఒక రకమైన పొలుసుల పుండు, వ్రణం
*డెమీగాడ్=దేవునిగా ఆరాధ్యించే మానవుడు
శ్రీమతి బి. కళగోపాల్ గత దశాబ్ద కాలంగా కవితలు కథల్ని రాస్తున్నారు. పుట్టింది నిజామాబాద్ జిల్లాలో. ఎం.ఎ ఇంగ్లీషు, బిఎడ్ చేసిన వీరు ఆంగ్ల సహ ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. ఇంతవరకు వీరివి 450కి పైగా కవితలు వివిధ వార, మాస సాహిత్య పత్రికలలో ప్రచురితమయ్యాయి. కవితా సంపుటి ‘మళ్లీ చిగురించనీ..’ 2015లో 74 కవితలతో ప్రచురించారు. అంతేగాక స్థానిక నిజామాబాద్ రేడియో ఎఫ్.ఎం.లో 20 కథానికలు ప్రసారమయ్యాయి. 25 వ్యాసాలు వివిధ పత్రికల్లో వచ్చాయి. 50 కథలు వివిధ పత్రికల్లో అచ్చు అయ్యాయి. వాటిల్లో 20 కథలు వివిధ సందర్భాల్లో అవార్డులను పొందాయి. వీరి కవితలు కూడా అనేక సందర్భాల్లో పలు అవార్డులను పొందాయి. రాధేయ, ఎక్స్ రే, భిలాయ్ వాణి, కలహంస, భూమిక, సాహితీకిరణం, ద్వానా, వాల్మీకి, మల్లెతీగ వారి కవితా పురస్కారాలు పొందారు. సోమేపల్లి, వట్టికోట ఆళ్వారు స్వామి, జలదంకి పద్మావతి కథా పురస్కారాలను పొందారు.