[‘ఏమందువు!’ అనే శీర్షికతో పద్య కవితని అందిస్తున్నారు శ్రీమతి పారనంది శోభాదేవి.]
ఒక దినమ్మా? వత్సరమ్మా?
ఎపటిదో యీ వెదకునాయా
సమ్ము! మరలన్ మరల నదియే
మనసు పథమగు నలసితిన్!
మనసు చూపిన చిత్రమంతకు
నంతకున్ నవనవముగా నవ
కమ్ముతోడ సజీవమై నను
తేల్చివైచు సుమాళిసోనన్.
వెంటనో, పార్శ్వములనో నీ
సంగమెప్పుడు నెరిగి యుంటిని?
మరిమరిగ నద్దాని నెంచుదు
మాయయో యిది మహిమయో!
తెలియనీవిది విడిచి మర్మము
మరలిపోనీవెందునైనన్
విరి వికాసము నందుటన్ వలె
నా గవేషణ యందుకొన నిన్!
ఆశయే ఫలితమ్మనందువ ?
సాగుటే గమ్యమ్మనందువ ?
పథికశ్రమ పాథేయమందువ?
ప్రశ్నయే యుత్తరమనందువ!