[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన డా. జొన్నలగడ్డ మార్కండేయులు గారి ‘ఎల్లాయమ్మ చిట్కా’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఎల్లాయమ్మ నర్సుగా ఆ గ్రామంలో మంచిపేరు తెచ్చుకుంది. గ్రామీణ ఆసుపత్రి ప్రసూతి కేంద్రంలో నర్సుగా పనిచేస్తోంది. ఆసుపత్రిలో చేరి ప్రసవమయ్యాకా తల్లిబిడ్డా క్షేమంగా ఇంటికివెళ్ళేదాకా ఆమె చూపే శ్రద్ధ అందరికీ నచ్చేది. తరువాత కూడా బిడ్డ తల్లి గురించి బాధ్యతగా ఇళ్ళకు వెళ్ళి ప్రేమగా క్షేమ సమాచారం అడుగుతుంది. గ్రామంలో అందరికీ ఇష్టురాలయింది.. పైగా అది ఆమె స్వగ్రామము కూడా.. అలా రొటీను డ్యూటీగా ఎల్లాయమ్మ బాలమ్మ ఇంటికి వచ్చింది.
బాలమ్మ కూతురు వనజకు ఇటీవలే కాన్పయింది. వనజకది తొలి కాన్పు. బాలమ్మకు ఒక్కగానొక్క కూతురు. బాలమ్మది వ్యవసాయ కుటుంబం.. పల్లెటూరు. అల్లుడుది బెంగుళూరులో ఐ.టి. కంపెనీలో ఉద్యోగం. కూతురి అత్తగారు మావగారు కూడా బెంగుళూరులోనే అల్లుడి దగ్గర ఉంటున్నారు.
“పల్లెటూరులో వైద్యసౌకర్యం ఉండదు. కాన్పు బెంగుళురులోనే చేద్దాం అత్తయ్యా!” అంది కోడలు.. బాలమ్మకు కొడుకు కూడా ఒక్కడే. ఐ.టి సాప్టువేరు. కోడలుకు కూడా బెంగుళూరులో ఉద్యోగం..
“కొడుకు, కోడలు ఇద్దరూ కూడా బెంగుళూరులోనే ఉద్యోగం చేస్తున్నారు. బెంగుళూరులో సొంత ప్లాటు కూడా ఉంది. దేవుడిచ్చిన అదృష్టం. బెంగుళూరు లోనే పురుడు పోయండి” వనజ అత్తగారు కూడా బెంగుళూరులోనె బాగుంటుంది అంది. కాని బాలమ్మ ఒప్పుకోలేదు.
“మాది పల్లెటూరు. తప్పుపడ్తారు. అదీగాక మా అత్తగారు, మావగారు ముసలివారు. వారిని చూసుకోవాలి. ఇల్లు, వ్యవసాయ పనులు వదిలి రాలేము.. మా ఊరిలో అన్ని ఫెసిలిటీసు ఉన్నాయి. ప్రసూతి కేంద్రం ఉంది. ఏం భయంలేదు, ఒక్కగానొక్క కూతురు తొలికాన్పు ముచ్చట నా ఇంట్లోనే జరుగుతుంది” అంది..
లాజిక్ బాగుంది సరేననుకున్నారు. వనజ పురిటికి పల్లెటూరు వచ్చింది. కవలపిల్లలు పుట్టారు. ఎల్లాయమ్మే కాన్పు నర్సు.
ఎల్లాయమ్మకు బాలమ్మ ఇంట్లో కుమారి అనే అమ్మాయి సోఫాను ఆనుకుని సోఫాలో తలపెట్టుకుని దిగులుగా కింద కూర్చుని కనిపించింది. ఆ అమ్మాయికి ఇటీవలే కాన్పయింది.. ఎల్లాయమ్మకు తెలుసు, దగ్గరకు వెళ్ళింది. బాలమ్మ ఎందుకో హడావుడి పడుతోంది. ఎల్లాయమ్మను చూసి సంబరపడింది.
“వనజను చూద్దువుగానిలే. కొంచెంసేపు కూర్చోవాలి. చిన్న పనుంది” అని కూర్చోమంది. ఎల్లాయమ్మ కుమారికి దగ్గరగా వెళ్ళి కూర్చుంది. కుమారికి కూడా ఇటీవలే కాన్పయింది, మగ పిల్లవాడు.
కుమారి వనజకు స్నేహితురాలు. క్లాసుమేటు.. కుమారి రమణమ్మకు కూతురు. రమణమ్మ భర్త బాలమ్మ పొలంలో పనిచేసే పాలేరు కూర్మయ్య భార్య. కాని పాలేరు, యజమానిగ పెత్తనం కాదది. బాలింతరాలు ఇంట్లో ఉంది. ఇంటిపనులలో సాయపడుతోంది. ఎల్లాయమ్మ అక్కడే బాలమ్మతో కలిసి తచ్చాడుతున్న రమణమ్మను కూడా పలకరించింది.
కుమారిని కూడా ఆప్యాయంగా పలకరించి తలను ఒడిలోకి తీసుకుని దిగులుకు కారణము తెలుసుకుంటోంది. కుమారితో మాట్లాడుతుండగా దాసు వచ్చాడు. చిరునవ్వుగ దాసునూ పలకరించింది.
దాసు చంటిపిల్లలకు బాలగ్రహం నుంచి రక్షకరేకు కడతాడు. పల్లెటూళ్ళో అతనికి మంచి ఆదరణ ఉంది. పిల్లలు పాలు త్రాగకపోయినా, మందకొడిగా కనిపించినా బాలగ్రహం ప్రభావమని నమ్ముతారు. దాసు విచిత్రంగా నమ్మిస్తాడు. తెలుసు గనుక బాలమ్మ హడావుడికి ఎల్లాయమ్మ ఏ భావం కనబడనీయలేదు. అభ్యంతరం పెట్టలేదు. వనజను పరీక్షించే పనికి కాసేపు ఓర్చుకోవాలి. కుమారి దిగులుకు ప్రాముఖ్యమిచ్చింది. దాసు గచ్చు మీద కూర్చుని సంచీలోంచి తాళపత్ర గ్రంథము తీశాడు.
“బాలకృష్ణునికి యశోద కాలంనుంచీ రక్షరేకు కట్టిన కుటుంబం వారసుడుని. అగ్నిపురాణంలోని బాలగ్రహాల పేర్లు, వాటి పీడ నుంచి రక్షణమంత్రాలు గల తాళపత్రగ్రంథము ఇది.. ఒక పీటకు పసుపు రాసి తెండి” అన్నాడు ఎల్లాయమ్మకేసి చూస్తూ బాలమ్మతో. బాలమ్మ తెచ్చిన పీట మీద గ్రంథం పెట్టాడు. దానికి సాంబ్రాణి గుగ్గిలం పొగవేసి బాలమ్మ చేత ఒక రూపాయి కాసు తాళపత్రాల మధ్య పెట్టించాడు. గ్రంథం చేతిలోకి తీసుకుని రూపాయి కాసు ఉన్న ఆ తాళపత్ర పేజీలో ఉన్న భాగాన్ని ఇలా చదివాడు.
“మందకొడితనం. తల్లిపాలు సరిగా త్రాగరు. విరేచనాలు. వెక్కివెక్కి ఏడుస్తారు, ఉలిక్కి పడతారు” అని చదివాడు.
“కుమారస్వామికి పాలిచ్చిన కృత్తికదేవతలది రక్షరేకు కడతాను. బలమైన బాలగ్రహం మీ కవల మనవల్ని పీడిస్తోంది” అన్నాడు.
బాలమ్మకు ఏడ్పు వచ్చినంత పనయింది. మొదట్లో పిల్లలిద్దరూ చిటికేస్తే చాలు హుషారుగా తలెత్తి చూసేవారు. ఇప్పుడు దాసు చెప్పిన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇద్దరు పిల్లలకు వనజ పాలు సరిపోవడము లేదు. పోతపాలు పట్టింది. అందుచేత అజీర్తి చేసి విరేచనాలు వెళుతున్నాయనుకుంది, కాని గ్రహపీడ అనగానే పడుతున్న ఆందోళనను దాసుతో చెప్పుకుంది. ఆ మాటలు వింటూ ఎల్లాయమ్మ నవ్వుకుంది.
బాలమ్మకు అత్తగారు, మావగారు ఉన్నారు. పెత్తనం బాలమ్మదే. మావగారు, భర్త పొలం పనులు చూసుకుంటారు. అత్తగారు మాత్రం పెద్దరికమును ధ్వనిస్తూనే ఉంటుంది. బాలమ్మ అత్తగారు స్వరం కలిపింది “నిజమే దాసూ! బాలగ్రహాలు మా మనవరాలు వనజకు పాలు రాకుండా చేస్తున్నాయి. మా కాలం నుంచీ చూస్తున్నాము ఈ గ్రహపీడలు” అని కుమారి కేసి చూసింది
“ఈ కుమారి పాలిస్తుంటే దాని పిల్లాడు పాలు త్రాగటము లేదు. తల్లిపాలు త్రాగని పిల్లలను కలికాలంలో చూడవలసివచ్చింది. కుమారికి పాపం రొమ్ములు పిల్లవాడుపాలు తాగకపోవడమువల్ల నొప్పులు పుడుతున్నాయి. నేను చిట్కావైద్యము చేస్తానంటే వచ్చింది. మీ ఇంగ్లీషు వైద్యం ఒప్పుకోదు” అని ఎల్లాయమ్మ కేసి చూసి నవ్వింది బాలమ్మ అత్తగారు.
ఎల్లాయమ్మ నవ్వి.. “అవునుటండి. కుమారి చెబుతోంది. నూటికో కోటికో కుమారిలాంటి బాలింతరాలికి ఈ సమస్య ఉంటుంది. పురిటిపిల్లవాడు సహజ ఆహారంగా తల్లిపాలున్న రొమ్మును యిష్టపడకపోవడము వింత. చాలా అరుదు. మీరు తమలపాకు వెచ్చ చేసి స్తనము మీద పెట్టి నొప్పి తగ్గించే చిట్కా అనుభవవైద్యము నాకు తెలుసు. సైకలాజికల్ పెద్దరికము గౌరవిస్తాను. నేను కూడా కుమారిని పరీక్షించాను. చిన్నసమస్య. పరిష్కరిస్తాను” అంది..
“పెద్ద మనసుతో ఆలోచిస్తే నాది కూడా ఒక చిట్కా, వింటారా?” అని బాలమ్మ అత్తగారిని పక్కకు తీసుకెళ్ళి ఏదో చెప్పింది.
ఈలోగా దాసు పచ్చటి తాటాకు మీద గంటముతో ఏదో రాసాడు. పసుపు రాసి చిన్న రక్షరేకులా తయారు చేసి కట్టే వీలుగా దారము చుట్టి సాంబ్రాణి గుగ్గిలము పొగవేసి పిల్లలను తీసుకు రమ్మన్నాడు. బాలమ్మ పిల్లలను తీసుకుని వచ్చింది. బాలమ్మ ఉద్దేశము అర్థం చేసుకున్నారు. అక్కడెవరూ ఉండకూడాదు. అర్థంచేసుకున్న కుమారి, ఎల్లాయమ్మ, బాలమ్మ అత్తగారు వనజ ఉన్న గదిలోకి వెళ్ళారు.
దాసు పిల్లలకు మోచేతికి స్వయంగా రక్షరేకులు కట్టాడు. “నల్లకుక్కకు పెరుగు అన్నం పెట్టండి. కృత్తికలే స్వయంగా వచ్చి పిల్లలకు ఆరోగ్యమిస్తారు” అని దాసు ఇచ్చింది పుచ్చుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నదాసుని కుమారి తల్లి రమణమ్మ తనింటికి కూడా రమ్మని చెప్పింది.
రక్షరేకులు కట్టించుకున్న కవల మనవలిద్దరిని వనజ ఉన్న గదిలో ఉయ్యాలలలో పడుకోబెట్టి బాలమ్మ వెళ్ళిపోయింది. బాలమ్మ అత్తగారు అక్కడే ఉంది. కుమారితో వనజ పిల్లలను ఒక్కక్కరుగా తీసుకుని స్తన్యమివ్వమని అడిగింది. వనజ నానమ్మకేసి, ఎల్లాయమ్మ కేసి ప్రశ్నార్థకంగా చూసింది.
“ఎల్లాయమ్మా! కుమారి కన్నపిల్లాడు ఎందుకు తల్లిపాలు త్రాగడం లేదో చిటికలో కనిపెట్టిన వైద్యం నీది. కాని నా కళ్ళు తెరిపించావు. నా మనవరాలి పిల్లలకు సరిపడా పాలు వనజ దగ్గర లేవని నువ్వు చెప్పావు. ఆకలి వేసి ఏడుస్తున్నారు. పోతపాలు ఇష్టంలేక తాగుతూ ఏడుస్తున్నారు. తప్పనిసరి అయినపుడు పాతతరం తమలపాకు వైద్యం సరే! తల్లిపాలు త్రాగకపోవడం ఉండదు. ఇవ్వడంలో తడబాటు లోపం కుమారిది. మాతృత్వానికి అర్థంగా కుమారికి వనజ పిల్లల ద్వారా సరిజేయించావు. మాతృమూర్తి ఆనందం అర్థము నాకు ప్రబోధమయ్యాయి” అంది బాలమ్మ అత్తగారు.
“సహజ ఆహారం పిల్లలకు నడిచి వచ్చింది. కుల పక్షపాతమెరుగని ఆరోగ్యకరమైనవి తల్లిపాలు. ఏ మాతృస్తన్యమైనా అమృతభాండమే! ఒక అమ్మగా అమ్మ పదానికి తృప్తి కలిగించే పనిచేసారు. అమృతవర్షిణిగా కుమారి చేత కవలపిల్లలకు కడుపు నింపిన నిజమైన అమ్మ మీరు. ఇప్పుడు కుమారి పిల్లవాడు కూడా పాలు త్రాగుతాడు. కుమారికి అత్రుత తప్ప ఇవ్వడంలో అవగాహన లోపం తొలగింది. పాలు ఇవ్వగల మాతృ హృదయం అమృతవర్షిణిగా వనజ పిల్లలకు పాలిచ్చి నిరూపించుకునే అవకాశం కలిగించిన ఆధునిక దృక్పథానికి ఆదర్శం మీరు” అంది ఎల్లాయమ్మ.
కుమారి వనజ పిల్లలకు పాలిస్తూ తన్మయత్వంలో మునిగింది. ఆ తరువాత కొసమెరుపుగ కుమారి కొడుకు కూడా అమ్మపాలు కోసము ఆత్రుత చూపడం ఎల్లాయమ్మది ఆధునిక వైద్యం. ఆహ్వానం. వనజ పిల్లలకు పాలిచ్చి లోపాన్ని సరిదిద్దుకుంది. దాసు కట్టిన రక్షరేకులు ముగ్గురు పిల్లలకు తల్లిపాలు త్రాగించిన ఘనతగ, మాతృమూర్తి వందనంగ బాలమ్మ, ఆమె అత్తగారు నమ్మారు.
డా. జొన్నలగడ్డ మార్కండేయులు కవి, కథా రచయిత. వృత్తి రీత్యా కళాశాలలో తెలుగు ఉపన్యాసకులు. వీరు వ్రాసిన కథలు అనేక పత్రికలలో ప్రచురింపబడ్డాయి.