Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎలా ఉన్నావు?

[డా. కాళ్ళకూరి శైలజ రచించిన ‘ఎలా ఉన్నావు?’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

లోకం తోటలో
ఒక చిన్న చోటు దొరికించుకున్నావా?

అరి పాదాలు చిన్నబోయే లాంటి మెత్తని
మృత్తిక మురిపంగా నవ్వే బాటలో,
తొలి కిరణం తుషార బిందువులో లయమై ధూపమయే చోట..

పుప్పొడి పసిడి రజను మోసుకుంటూ
పూ ప్రాంగణాన దోగాడే తుమ్మెద రెక్కల చప్పుడు వింటూ..
మైమరచి ఎపుడైనా ఆగిపోయావా?

వానపాము తీరికగా దొలిచిన మన్నుండలు
వాన చినుకుకు రాజమార్గం వేసిన వైనం చూస్తూ,
సింధుభైరవి రాగంలో వ్యాకులపడే మయూర నీలిమ
మనసంతా ఒకసారైనా నింపుకున్నావా?

ప్రేమకు అంకితమై,
మాట మౌనంతో చేసే స్నేహం
నిన్ను నీకు చేరువ చేసే క్షణాలనెపుడైనా ఊహించావా?

అమ్మ పొత్తిళ్ళనొదిలాక మరలా
ఆ నిత్యలానంద
‘ఎరుక లేమి’ని ఎదలో ఏనాడైనా పొదువుకున్నావా?

వేల పచ్చల అడవి లానో,
శతాబ్దాల ముడుతలు దాచిన కొండ లానో,
ఋతు గీతానికి చరణమయే పక్షుల్లానో
నీవు నీవుగా
వేరెవరిని తృణీకరించక

ఎంత విభిన్నంగా ఉన్నావు?
ఎన్నిటిని సరికొత్తగా ఆవిష్కరించావు?

ఎలా ఉన్నావు?
ఇంతకూ ఇపుడెలా ఉన్నావు?

Exit mobile version