[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘ఏకమయ్యే లోకం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
ఆ బ్రహ్మకైన చిక్కని బొమ్మవు
ఏ చిత్రానికీ దక్కని కొమ్మవు
ఏ శిల్పానికీ ఒదగని రూపం
మరే లోకాలూ చూడని అందం
ఆ విశ్వామిత్రుడు ఇంకో స్వర్గాన్ని సృష్టిస్తే
నీ కోసం మరో ప్రపంచాన్నే కనుగొన్నాను
ఏ దిక్కులు చుక్కలూ అక్కడ లేవు
మరే చిక్కులూ చీకాకులూ కాన రావు
ఆ లోకంలో శోకాలకు తావులేదు
శాపాలకూ పాపాలకూ చోటులేదు
నీవు నేనుగా నేను నీవుగా
ఏకమయ్యే లోకమది
మనకై వెలసిన స్వర్గమది
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.