[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘ఏకాంతంలో..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
మెరుస్తూ, కురుస్తూ ఆ వర్షం..
పూర్తిగా మూసేసి ఉన్న నా గది
అద్దపు కిటికీ మీద తడుతూ..
గది లోనికి తనని రానివ్వమన్నట్టు
నన్ను అభ్యర్థిస్తున్నట్టుంది..!
తనని నా గది కిటికీ తెరిచి స్వాగతించలేను..
అందుకై ఆ వర్షాన్ని క్షమాపణలనడుగుతాను..
నా ఏకాంతానికి భంగం కలిగించ వద్దని అడగి
వైరాగ్యానికి తడి తగలనివ్వొద్దనీ వేడుకుంటాను.
అగ్నికి ఆజ్యంలా ఆ వానకు తోడై ఈదురు గాలి
దూరేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నట్టుంది.
శ్వాసకు అది ఆలంబనే అయినా.. విధ్వంసాన్ని
మోసుకొస్తున్న తనని గదిలోకి స్వాగతించలేను
దానికై తనకీ క్షమాపణలడుగుతాను..
నీవు శాంతంగా ఉన్నప్పుడు కలుద్దామని
అభ్యర్థిస్తాను..
వర్షపు తాకిడికి పచ్చటి చెట్టు నుండి
తమ పట్టును కోల్పోతున్న పూలు, ఆకులు..
అనాథల్లా గాలికి ఎగిరొచ్చి నా గది కిటికీ
అద్దానికి అతుక్కొని..
ఆశ్రయం కోసం నన్ను వేడుకుంటునట్టున్నాయి.
కానీ వాటికీ నేను ఆశ్రయం ఇవ్వలేను.
పోనీలే పాపం అని వాటికై కిటికీ తెరిస్తే..
నేనొద్దనుకుంటున్న ఆ వర్షం,గాలీ తోడై
నా ఏకాంతమైన గది లోనికి చేరిపోవూ..!
అన్ని తలుపులూ మూసేసే ఉంచుతాను.
నా గది బయట జరిగే చోద్యాలన్నిటినీ
చూస్తూ.. తామరాకు పైన నీటి బింధువులా..
నేను నా గదిలో, మదిలో ఏకాంతంగా
తిష్టవేసుకు కూర్చుంటాను.!!!
భానుశ్రీ తిరుమల అనే కలం పేరుతో రచనలు చేసే నా అసలు పేరు తిరుమల రావు పిన్నింటి. నా జననం శ్రీకాకుళం జిల్లా, కవిటి తాలుకా మాణిక్యపురంలో జరిగింది. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకూ సొంత ఊరిలోనే జరిగింది.
రామోజీ గ్రూప్ సంస్థలలోని ఆతిథ్య విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉన్నాను.
చిన్నప్పటి నుండి బొమ్మలు గీయడం, చిన్న చిన్న కవితలు రాయటం చేసేవాడిని. కొందరు గురువులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో ఇటీవల కొన్ని పత్రికలకు పంపిన కవితలు, కథలు అచ్చులో చూసుకొని ఆనందపడుతున్నాను. ఇప్పటి వరకు 20 చిన్న పెద్ధ కధలు,100 కవితలు రాశాను.