[గీతాంజలి గారు రచించిన ‘ఏకాంతానిదే భాష?’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]
ఎక్కడో ఎత్తైన పర్వత సానువుల్లోనుంచి మెల్లగా,
ఉబికుబికి ఎగసి, దుఃఖంలా జారే జలపాతంలా..
నువ్వు జ్ఞాపకం వస్తూనే ఉంటావు.
నువ్వు పోవు ఎంతకీ నాలోంచి.
~
అవునూ.. మన మధ్యన నిశ్శబ్దం
ఇన్ని వేల పదాలతో మాట్లాడుతుంది ఎందుకు?
పాడుతుంది కూడా ఎందుకు?
దుఃఖిస్తుంది ఎందుకు?
నిశబ్దం మౌనంగా ఉండక ఇంత గొడవ, గొడవ చేస్తుందేందుకు?
అసలు నిశ్శబ్దానికి ఇంత చప్పుడెందుకు?
~
సరే., ఈ కొత్త వసంతం సంగతేంటి చెప్పు!
ఎలా జరిగింది ఇది?
ఏం మాయ ఇది?
నువ్వు ఇంతగా ఆవహించావెందుకు?
వ్యసనమైనావు ఎందుకు?
~
నిశబ్దం నిన్నింతగా గుర్తుకు చేస్తుంది ఎందుకు?
నిశబ్దం ఏకాంతంగా ఉండక
నిన్ను తోడు తెచ్చుకుంటుంది ఎందుకు?
హృదయం ప్రేమ నొప్పిలో ఈదుతున్నదెందుకు?
ఈ నిశబ్దం నువ్వు నాపై దిగులు పడడాన్ని చెబుతూనే ఉంటుంది
నీకై నా నిరీక్షణని కూడా!
~
ఈ ఏకాంతానిది ఏం లోకమో ఏమో కానీ., ఇక్కడ
ఒక్క నువ్వూ నేనూ పాటా కవిత్వం మాత్రమే ఉంటాం ఎందుకని?
~
ఈ నిశ్శబ్దానిది ఏ భాషనో ఏమో కానీ నువ్వు వినిపిస్తూనే ఉంటావు.
ఏం మాట్లాడుకుంటూ ఉంటావు అంతలా
నీ లోపలి తోటలో నన్ను నీ ఎదురుగా కూర్చో పెట్టుకొని?
~
పడే వర్షమేదో నిశబ్దంగా కురవొచ్చు కదా?
ఊహూ.. తబలా మీది వేళ్ళ చప్పుడులా ఏదో చెప్పబోతుంది.
~
ఈ వర్షమొకటి!
కురిసినప్పుడల్లా అణుచుకున్న దుఃఖంలా
నిన్ను నా ముందు నిలబెడుతుంది.
ఇంటి చూరు మీద పడుతూన్న వర్ష ధ్వని
నువ్వు నా దాకా పంపిన నీ ప్రేమ సంకేతమే కదా?
బహుశా మన మధ్యని నిశ్శబ్దానిది వియోగేకాంత దుఃఖ భాష!
~
చూడు వర్షాకాలం వెళ్ళిపోతోంది.
వచ్చే చలికాలం కూడా నన్ను నీ వైపుగానే తోస్తుంది .
నీ చలి జ్ఞాపకాలు కాల్చి పడేస్తాయి.
కాలం చలి మంట కూడా వేసుకోనివ్వదు.
~
అరే.. ఇంకా చెప్పవెందుకు?
ప్రేమంటే నువ్వూ నేనూ కాదా?
ప్రేమంటే ఇంత దుఃఖమా?
శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ త్వరలో రానున్నది. ఫోన్: 8897791964