Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎగరలేని పక్షి కివి

[వివిధ జంతువుల ప్రత్యేకతలను చిన్న వ్యాసాలుగా బాలబాలికలకు అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.]

పిల్లలూ!

న్యూజిలాండ్‌లో నివసించే పక్షి ‘కివి’. ఇది వారి జాతీయ చిహ్నం. నిప్పుకోడి జాతికి చెందింది. కోడి పుంజు పరిమాణంలో ఉంటుంది. దీని శరీరం పెద్దదిగాను, తల, కళ్ళు చిన్నవిగాను ఉంటాయి. కాళ్ళు బాగా ధృఢంగా ఉంటాయి. కాబట్టి వేగంగా పరుగెత్తుతుంది. గోళ్ళు వాడిగా ఉంటాయి. మగపక్షి కన్నా ఆడ పక్షే పెద్దదిగా ఉంటుంది.

దీని ముక్కు సన్నగా, పొడవుగా, కొనదేలి, బలంగా ఉంటుంది. ముక్కు ద్వారా వాసనను పసికట్టి ఆహారాన్ని సంపాదించుతుంది. ఇది వాన పాముల్ని, నత్తలని, వివిధ రకాల కీటకాలని, పురుగులని తింటుంది. రాత్రి సమయంలో ‘కివి కివి’ అని అరుస్తూ తిరుగుతుంది. కివికివి అని అరుస్తుంది కాబట్టే దీనికా పేరు వచ్చింది. సంవత్సరానికి ఒక గుడ్డును పెడుతుంది. ఈ గుడ్డు 7 నుండి 12 సెంటీమీటర్ల పొడవు, 1450 గ్రాములు బరువు వుంటుంది. మాములుగా ఆడపక్షులే గుడ్లను పొదుగుతాయి కదా! కానీ కివిలలో పెంగ్విన్‌లాగా మగపక్షి కూడా గుడ్డును పొదుగుతుంది. ఇదొక విశేషం. 80 రోజుల తరువాత పిల్ల బయటకు వస్తుంది.

మరో విశేషం. మన కివీస్ అని ఎవరిని అంటాం? న్యూజిలాండ్ క్రికెట్ క్రీడాకారులని.

కివీస్‌కీ, కంగారూస్‌కీ మధ్య క్రికెట్ పోటీ అని రేడియోలో, టి.వి.లో చెపుతారు. పేపర్లో వ్రాస్తారు. అంటే ఆ జంతువుల మధ్య కాదు కదా! రెండు దేశాల క్రికెటర్స్ మధ్య పోటీ అని. అంటే ఆ రెండు దేశాల ప్రత్యేకత ఆయా జంతువులే! చూశారా? దేశాలకు, జంతువులకు మధ్య అవినాభావ సంబంధం.

Exit mobile version