Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఈ యుగాది ఉత్సవం..

[ప్రియాజీ పల్లెపోగు గారు రచించిన ‘ఈ యుగాది ఉత్సవం..’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]

చైత్రశుద్ధ పాడ్యమి
కృతయుగ గమనానా..
వసంతం అడుగిడింది!
తెలుగు సంవత్సరాది
బేషరతుగా మొదలైంది!
తరువుల చిగురులు
ముద్దుగుమ్మల చెక్కిళ్లలా..
పచ్చగా విచ్చుకున్నవి!
ఉగాది కోయిలలు
కుహూలు పలుకుతూ..
పరవశమై తన్మయత్వంతో..
లేతచిగుళ్ళు ఆరగిస్తున్నవి!
తెలుగుజాతి వాకిట్లలో..
మామిడాకుల తోరణాలు
రెపరెపల సవ్వడవుతున్నవి!
ఆరుబయట ముంగిళ్లలో..
హరివిల్లు రంగవల్లులు!
నువ్వుల తైలంఁబూసిన
అభ్యంగన స్నానాలు!
నవదుస్తుల పులకరింతలు..
పరివారంల పలకరింతలు!
కోవెలలో కొలువైనా..
భగవంతునికి పూజలు!
పండితుల పంచాంగాల..
గ్రహాల స్థితిగతులు!
అష్టావధాన సహస్రావాధాన..
కవివర్యులకు సన్మానాలు!
అవే కదా.. అవే కదా..
తీయటి ఆనందాలు
ఉప్పైనా.. ఉత్సాహాలు
చేదైనా.. అనుభవాలు
వగరైనా.. సవాళ్లు
పులుపుల వలపులు
కారమైన సహనాలు..
షడ్రుచుల సమ్మేళనం!
విశ్వావసు నామ..
ఈ యుగాది ఉత్సవం!!

Exit mobile version