Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఈ తరం బామ్మ

[శ్రీ కలగ మారుతీ చంద్రశేఖర్ రచించిన ‘ఈ తరం బామ్మ’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

~

E@తరం బామ్మ

ఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు ఫణీంద్ర. కారు పార్క్ చేసి హాల్లోకి వస్తూనే “ఏమోయ్!” అంటూ భార్య నీరజని పిలిచాడు.

“ఆఁ.. వస్తున్నా!” అని ఫ్రిడ్జ్‌లో వాటర్ బాటిల్‌తో వచ్చింది నీరజ. నీళ్లు గడగడా తాగి “కాఫీ ఇస్తావా!” అన్నాడు.

“ఆల్రెడీ పెట్టాను. రెండు నిమిషాల్లో తెస్తాను” అని లోపలికి వెళ్లి ఇద్దరికీ కాఫీ తీసుకుని వచ్చి, హాల్లో సోఫాలో భర్త పక్కన కూర్చుంది.

“నీ పెద్ద కొడుకేన్నా ఫోన్ చేశాడా?”

“మీకు మాత్రం వాడు కొడుకు కాదా? ఏదన్నా కోపం వస్తే నా కొడుకూ.. మిగిలినప్పుడు మీ కొడుకూనా..” అని ఓ దీర్ఘం తీసింది.

“నేను అడిగింది మిల్లీ మీటర్ అంత.. నువ్వు చెప్పింది కిలోమీటరంతుంది. క్లుప్తంగా మాట్లాడటం ఇంకెప్పుడు నేర్చుకుంటావు?” అన్నాడు

అంతే! మూతి మూడు వంకర్లు తిప్పి కాఫీ కప్పులు తీసుకొని లోపలికి వెళ్ళింది నీరజ.

వెళ్ళిపోతున్న భార్యని చూసి నిట్టూర్చి సాత్విక్‌తో మాట్లాడాలని ఫోన్ తీశాడు.

***

ఫణీంద్ర, నీరజలకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు సాత్విక్ హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తున్నాడు. చిన్నవాడు రుత్విక్ ఎం.ఫార్మసీ చదువుతున్నాడు. సాత్విక్‌కి పాతికేళ్ళు. నాలుగు అంకెల జీతం. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. వాడి ముందు పెళ్లి మాటెత్తితే “పెళ్లికి ఇప్పుడేం తొందర నాన్నా!” అంటున్నాడు.

అది మొహమాటంగా అంటున్నాడో, లేక ఏదైనా ప్రేమాణంలో పడ్డాడో! తల్లీదండ్రి ఎంత అడిగినా.. అలాంటిదేమీ లేదంటాడు. ఆ నాన్చుడు వ్యవహారమే ఫణీంద్రకి నచ్చట్లేదు.

మొన్నామధ్య వచ్చిన రామశేషు గారి సంబంధం లక్షణంగా ఉంది. ఇద్దరి జాతకాలు అమోఘంగా కుదిరాయని చంద్రం మావయ్య చెప్పాడు. పైగా అమ్మాయి చక్కని చుక్కలా ఉంటుంది. ఫణీంద్ర దంపతులకు బాగా నచ్చింది. కోడలిగా ఊహించేసుకున్నారు కూడా! ఆ సంబంధం తెచ్చిందే చంద్రమామయ్యే. ఆయన అన్నా, ఆయన మాట అన్నా ఫణీంద్రకి అమిత నమ్మకం. పోస్టల్ డిపార్ట్‌మెంట్లో ఉద్యోగం, పౌరోహిత్యం, వాస్తు, జాతకాలు అంటూ ఆగకుండా ఈమధ్యే మ్యారేజ్ బ్యూరో కూడా పెట్టిన సకలకళా వల్లభుడు.

బంధువులందరిలో చంద్రం మామయ్య అంటే ఫణీంద్ర నీరజలకి ప్రత్యేక గౌరవం. చంద్రానికి నీరజ ఇచ్చే ఫిల్టర్ కాఫీ అంటే ప్రత్యేక అభిమానం. ఇంటికి వచ్చాడంటే అడక్కుండానే నాలుగైదు సార్లు కాఫీ ఇస్తుంది. అడగకుండా ఇచ్చినా కాఫీ వద్దనకుండా నిర్మొహమాటంగా గొంతులో పోసేస్తాడు చంద్ర మావయ్య.

రామశేషు సంబంధం చెప్పగానే అమ్మాయి ఫోటో చూసి తొలిచూపులోనే కోడల్ని చేసేసుకున్న నీరజ.. మరో డోసు ఫిల్టర్ కాఫీ తెచ్చిచ్చి.. ఎలాగైనా సంబంధం కుదిర్చే బాధ్యత చంద్రంపై పెట్టి అవుననిపించుకుంది నీరజ.

ఆ సంగతి విన్న ఫణీంద్ర “కాఫీ ప్రమాణం చేయించినంత తేలికకాదు నీ కొడుకుతో పెళ్లి ప్రమాణం చేయించడం” అన్నాడు.

“ఏం ఆ మాత్రం బాధ్యత మీరు తీసుకుని.. వాడి కాశీ ప్రయాణాన్ని ఆపించలేరా? అన్నీ నేనే చూసుకోవాలా?” మళ్లీ దీర్ఘం తీయటానికి సిద్ధమవుతున్న నీరజని బలవంతంగా ఆపుజేశాడు ఫణీంద్ర.

సాత్విక్ పెళ్లి కోసం రంగంలోకి దిగాలనుకున్నాడు ఫణీంద్ర. ఎందుకంటే రామశేషు కూతురు బాగా నచ్చేసింది. కోడలుగా చేసుకుంటే అమ్మాయిని చేసుకోవాలని డిసైడ్ అయిపోయాడు. అమ్మాయి కూడా హైదరాబాదులోనే సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. తల్లిదండ్రులు అక్కడే ఉంటారు. అమ్మాయి సాంప్రదాయబద్ధంగా ఒంటి నిండా బట్టలేసుకుని, ఈనాటి ఆడపిల్లల వింత పోకడలకు దూరంగా పద్ధతిగా ఉండటం నీరజకే కాదు.. ఫణీంద్రకి బాగా నచ్చింది. సాత్విక్‌కి అమ్మాయి ఫోటో, వివరాలు మెయిల్లో పంపి ఫోన్ చేయమని చెప్పి వారం దాటింది. ఒకటి రెండు రోజుల్లో తిరుగు మెయిలు వస్తుందని గంటకోసారి మెయిల్ ఓపెన్ చేసి చూస్తున్నా.. ఫలితం శూన్యాన్ని చూపిస్తోంది.

‘నీ కొడుక’ని.. ఫణీంద్ర నొక్కి వక్కాణించడంలో కారణం ఇంతుంది మరి.

మూతి ముడుచుకు లోపలికి వెళ్ళిన నీరజ రెండు నిమిషాల్లో ఏదో గుర్తొచ్చి హాల్లోకి వచ్చింది.

“ఏవండీ! మా పెదనాన్న మనవరాలు కాత్యాయిని పెళ్లిట. ముందుగానే వాట్సప్‌లో వెడ్డింగ్ కార్డు పంపారు. మా అన్నయ్య కూడా ఫోన్ చేశాడు. హైదరాబాద్ చిక్కడపల్లిలో పెళ్లిట. ఇదిగో చూడండి”.. అని వాట్సాప్‌లో చూపించింది.

“ఇదిగోండి! ఇప్పుడే చెప్తున్నా ఎప్పట్లా ఆఫీస్‌లో లీవ్ దొరకలేదు, వారం మధ్యలో కుదరదు.. వంటి కుంటి సాకులు చెప్పకుండా ముందే లీవుకి అప్లై చేయండి. శని, ఆదివారాలు కూడా కలిసి వచ్చాయి. సోమ, మంగళ కూడా లీవ్ పెట్టండి” అంది.

ఏమాటకా మాటే.. ఇలాంటి విషయాల్లో నీరజ బ్రెయిన్ షార్ప్‌గా పనిచేస్తుంది. టూర్ ప్రోగ్రాం అంతా విన్నాక..

“నీ కోడలికి మాత్రం నువ్వు ఇలాంటి ట్రైనింగ్‌లు ఇవ్వద్దోయ్.. ఆ కాలపు వాణ్ణీ కాబట్టి నేను సరే అంటున్నా.. ఈ కాలపు సాఫ్ట్‌వేర్ వాళ్ళకి మాటిమాటికి సెలవులు అంటే ఎలా కుదురుతుంది చెప్పు” అన్నాడు.

ఆ మాటకి మళ్లీ మూతి ముడుచుకుని లోపలికి వెళ్ళిపోతుందనుకున్న నీరజ నింపాదిగా నోరు విప్పి.. “అడిగితే కాదనరని తెలుసు..” అని (తనకి కావాల్సింది లౌక్యంగా అడగటం, ఆమోదింప చేసుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య) విషయం బయట పెట్టింది

“అలాగే స్వామి కార్యం, స్వకార్యం కలిసొచ్చేలా ప్లాన్ చేశావన్నమాట. సర్లే.. నీ పుత్రరత్నాన్ని కూడా పెళ్లికి రమ్మన్నానంటావ్!! ఓకే” అన్నాడు ఫనీంద్ర

“ఆ చెప్తాను ఆ రత్నం మీకు ఏమీ కానట్టు..” దీర్ఘం తీయబోతుంటే వద్దు “అంత దీర్ఘం వద్దు ఆపై ఈ దీర్ఘం వెంటనే కొడుక్కి వాయిస్ మెసేజ్ లో పంపు దడుచుకొని పెళ్లి పందిట్లో వాలిపోతాడు” అన్నాడు.

నీరజ మళ్ళీ మూతి మూడంకలు తిప్పి యథాప్రకారం లోపలికి వెళ్ళింది.

***

చిక్కడపల్లి అశోక్‌నగర్‌లో అపర్ణ ఫంక్షన్ హాల్లో పెళ్లి. ముహూర్తం రాత్రి 7:40కి. బంధువుల కోలహాలంతో హాలంతా సందడి సందడిగా ఉంది.

పిన్ని, బాబాయ్, అత్తయ్య, మామయ్య, అక్కయ్య, అన్నయ్య, తమ్ముళ్లు, చెల్లెళ్ల వరసలతో.. పలకరింపులతో.. హాల్లో పెళ్లి కళ ఉట్టిపడుతోంది. వీకెండ్ కావడంతో సాత్విక్ ఉదయాన్నే వచ్చి తల్లిదండ్రులతోనే ఉన్నాడు. పెళ్లిలో సాత్విక్ కళ్ళని కట్టిపడేసింది వంగపూవు రంగు చీర కట్టుకుని, అన్నిటికీ, అందరికీ తనే అయినట్టు.. అటూ ఇటూ తిరుగుతూ.. అందరినీ నవ్వుతూ పలకరిస్తున్న అమ్మాయి. తెల్లగా, సన్నగా పొడవైన జడ, చేతికి గాజులు వేసుకొని నాజూగ్గా ఉంది. అంతకు ముందు ఆమెను ఏ పెళ్ళిలోనూ చూసినట్టు గుర్తు రావటం లేదు సాత్విక్ కి. ఆమె మాటలో నడకలో పొందిక.. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది. ఎవరైనా తనని గమనిస్తున్నారేమో అనుకుని.. చుట్టూ చూసి దొంగచాటుగా ఆమెను చూస్తున్నాడు. అంతలో ఆమె అతనితో చూపులు కలపడంతో దొరికిన దొంగలా గబుక్కున తల తిప్పేసుకున్నాడు.

మగ పెళ్లి వాళ్ళు స్నాతకం జరుగుతోంది. పురోహితులు భజంత్రీలు, భజంత్రీలు అనటంతో.. నాదస్వరంలో ‘ఎంత ముద్దు, ఎంత సొగసు.. ఎవరివల్ల వర్ణింప తగునీ’ త్యాగరాయ కీర్తన వినిపించడంతో సాత్విక్ మనసు సీతాకోకచిలుకలా మారి అప్పుడే అటుగా వచ్చిన వంగపువ్వుపై వాలింది.

ఎవరీ అమ్మాయి? ఆమెను చూడగానే ఎందుకు తానెందుకు డిస్టర్బ్ అవుతున్నాడు? అసలు ఆమె ఎవరో తెలుసుకోవాలి? అనుకుని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. సాత్విక్‌ని చూడడంతో అప్పటివరకు మాట్లాడుతున్న ఫణీంద్ర టక్కున ఆపేశాడు.

“అమ్మా! నన్ను చూడగానే నాన్న ఎందుకు సైలెంట్ అయ్యాడు?” అన్నాడు.

“ఏమోరా! మీ ఇద్దరి మధ్య ఎటూ చెప్పలేక నాకు వచ్చాయి తిప్పలు. అవుననో కాదనో ఆ మెయిల్ ఐదో నువ్వు పెట్టొచ్చుగా!” అంది కొడుకుతో.

“మెయిల్ కంటే ముందు నిన్ను మరో ముఖ్య విషయం అడగాలి..” అనే అంతలో మధ్యాహ్న భోజనాలకి పిలుపు రావడంతో అందరూ లేచారు.

భోజనాలప్పుడు వంగపువ్వు కనిపించలేదు. సాత్విక్ కళ్ళు రెస్ట్‌లెస్‌గా ఆమెకోసం అన్వేషిస్తున్నాయి. పెళ్లి రాత్రి కావడంతో.. భోజనాలయ్యాక బంధువులు ముచ్చటలో మునిగిపోయారు. పెళ్లిళ్లు కావాల్సిన పిల్లల మీద చర్చలు మొదలయ్యాయి.

నీరజ పెద్దమ్మకి 80 ఏళ్ళు ఉంటాయి. నీరజ తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో పెద్దమ్మ దగ్గరే పెరిగింది. ఆవిడ కూడా నీరజని సొంత కూతురుతో పాటు సమానంగా చూసుకునేది.

“దొడ్డా! ఎలా ఉన్నావే?” అని దగ్గరకు వెళ్ళింది నీరజ.

“ఏమిటే.. నీరూ! ఫణిగాడు ఏమంటున్నాడు?” అంటూనే.. అటుగా వెళుతున్న మగపెళ్ళివాళ్ళు కనిపిస్తే

“ఏమిటే కనకం.. స్నాతకపు ఫోటోలు ఇంకా వాట్సాప్‌లో పెట్టలేదు. పెట్టండి” అంది.

“మా అమ్మాయితో చెప్పి పెట్టిస్తా!” అని కనక వెళ్లిపోయింది.

అందరూ దొడ్డా.. అని ముద్దుగా పిలుచుకునే ఆ పెద్దావిడ పేరు సూర్యకాంతం. పిల్లలందరూ ఆవిడ్ని హైటెక్ బామ్మ అని పిలుస్తారు. ఎందుకంటే కాలంతో పాటు తనని తాను మార్చుకుంటూ.. నేటి వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ వరకూ ఆమెకు తెలియని విషయం లేదు.

“నీరూ! నీ కొడుకు పెళ్లి సంబంధం చూస్తున్నావా?”

“నీకు తెలియందేముంది దొడ్డా! నా పెద్ద కొడుకు సాత్విక్‌కి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. వాడేమో అటు, ఇటు తేల్చకుండా నానుస్తున్నాడు” మాటలో మాటగా రామశేషు వాళ్ళ సంబంధం గురించి చెప్పింది నీరజ.

అంతా విన్నాక.. “ఆ పిల్ల ఫోటో నాకు వాట్సప్‌కి పెట్టలేదేంటే!” అని.. “సర్లే కాసేపు నీ కొడుకుని నా దగ్గరికి పంపు. నేను మాట్లాడతా” అంది.

కాసేపటికి సాత్విక్ వచ్చి “బామ్మా ! ఎలా ఉన్నావు?” అన్నాడు.

“ఏరా భడవా! ఊర్లో ఉండి కూడా రావటం లేదు. మొన్నామధ్య నా ఇన్‌స్టా సరిగ్గా ఓపెన్ అవ్వలేదు. నువ్వు వస్తే చూపిద్దాం అనుకున్నాను” అంది.

“కొత్త ప్రాజెక్టు వచ్చింది బామ్మా! కాస్త బిజీ బిజీగా ఉన్నా.. అయినా ఈ వయసులోనే ఇవన్నీ నీకు దీనికే?” అన్నాడు.

“ఒరేయ్ మనిషి పోయేదాకా నేర్చుకుంటూనే ఉండాలి రా! అప్డేట్ అవ్వాలి” అంది సాత్విక్ చెయ్యి నొక్కింది, కళ్ళజోడు సరి చేసుకుంటూ.

అంతలో అక్కడికి దగ్గర్లో కనిపించినామెని చూసి “ఎవరిది” అంది.

“నేను అత్తయ్యా! సుందరిని” అందామె దగ్గరకు వచ్చి.

“ఏమే.. నీ చిన్న కూతురుకి పెళ్లి చేశారా?”

“ఏం పెళ్లి లే! అత్తయ్యా! వయసులో ఉన్నప్పుడు మేము తెచ్చిన సంబంధాలు చెప్పింది దానికి ఒకటీ నచ్చలేదు. ఎన్ని సంబంధాలు తెచ్చినా ఏదో వంక పెట్టి తిరగ్గొట్టింది. ఇప్పుడు 35 ఏళ్లు వచ్చేసాయి. ఇప్పుడు ఒక్క సంబంధం రావట్లేదు” అని తన గోడు చెప్పుకుంది సుందరి.

“వీడెవరో గుర్తుపట్టావుటే సుందరీ! మన నీరు కొడుకు” అంది బామ్మ.

“అవునా ఎంత ఎదిగావురా! ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. పెళ్లయిందా?” అంది సుందరి .

“ఇంకా కాలేదు అత్తా!”

“చూడండర్రా! ఆడపిల్లలైనా.. మగ పిల్లలైనా.. వయసులో ఉన్నప్పుడే పెళ్లిళ్లు జరిగిపోవాలి. అదను లోనే పైరు కోసేయాలి.” అంది మళ్లీ ఓ ఉచిత సలహ విసిరేసింది. సాత్విక్ విన్నాడా? లేదా? అని కళ్ళద్దాల్లోంచి పక్కకు చూసింది.

అక్కడికి వచ్చిన వ్యక్తి “దొడ్డా! బాగున్నావా” అన్నాడు.

“ఎవరూ అది, భాస్కరం కదూ!” అంది.

“80 ఏళ్ళు వచ్చినా నీ జ్ఞాపకశక్తి మాత్రం తగ్గటం లేదే” అన్నాడు భాస్కరం.

“ఎవరి అదృష్టం వాళ్ళదిలే.. కానీ నీ పెద్ద కొడుక్కి పిల్లలు ఎంతమంది?” అంది

“ఏం చెప్పేది? పెళ్లయిన కొత్తలో పిల్లలు ఇప్పుడే వద్దు.. అంటూ తాత్సారం చేశారు. పెళ్లయి ఆరేళ్లయింది. ఇప్పుడు కావాలనుకున్నా కడుపు రావటం లేదు. డాక్టర్లు, మందులు, గుళ్ళూ గోపురాల చుట్టూ తిరుగుతున్నారు” అన్నాడు నిట్టూర్చి.

“ఎప్పుడు జరగాల్సింది అప్పుడు ఆ వయసులోనే సరైన కాలంలో జరగాలి” అంది బామ్మ.

ఈ విషయాలన్నీ సాత్విక్ వింటున్నాడు. అతని మనసు ఆలోచనలో పడ్డదన్న విషయం బామ్మ గ్రహించింది. ఆవిడకి కావాల్సిందీ అదే. సాత్విక్ మనసులో రాజేయ్యాల్సిన నిప్పు రాజేసింది. మంట అదే మండుతుందని బామ్మకి బాగా తెలుసు.

***

పెళ్లయిన తర్వాత తల్లిదండ్రులతో ఇంటికి వచ్చాడు సాత్విక్.

“పెళ్లి చేసుకుంటావో.. లేదో.. తేల్చి చెప్పరా! రామశేషు గారి సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది. వాళ్ళూ ఉండేది హైదరాబాదులోనే. నువ్వు ఏ విషయం చెబితే.. త్వరలో పెళ్లిచూపులకు వెళదాం” అన్నాడు ఫణీంద్ర.

పెళ్ళిలో వంగపువ్వు మీద మనసు పారేసుకున్న సాత్విక్.. బామ్మ దగ్గర దగ్గర విన్న సంఘటనలు తల్చుకొని.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తల్లి దగ్గర వంగ పువ్వు విషయం బయట పెట్టాడు.

“వివరాలు పంపిన సంబంధం సంగతి చెప్పరా అంటే.. పెళ్లిలో చూసిన అమ్మాయి నచ్చిందంటావేంట్రా!” అంది నీరజ నీరసంగా.

విషయం విన్న ఫణీంద్ర “ఆ రామశేషు వాళ్లకి ఏం చెప్పమంటావని.. చంద్రం మామయ్య ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు” అని గయ్యిమన్నాడు.

తండ్రి మాటలు వినలేక సాత్విక్ బయటికి వెళ్లాడు.

మొగుడు కాస్త శాంతించాక.. నీరజ వాళ్ళన్నయ్యకి ఫోన్ చేసి.. పెళ్ళిలో తళుక్కున మెరిసిన వంగపువ్వు వివరాలు తెలుసుకోమని చెప్పింది. పెళ్లొద్దన్న సాత్విక్ పెళ్లికి ఒప్పుకోవడమే పదివేలు అనుకున్న నీరజ.

ఓ గంట తర్వాత నీరజ వాళ్ళ అన్నయ్య ఫణీంద్రకి ఫోన్ చేశాడు. మొత్తానికి లూప్ లైన్‌లో ఆగిపోయిన గూడ్స్ బండికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రైల్వేలో పనిచేసిన ఫణీంద్ర. వెంటనే ఫోన్ చేసి చంద్రం మావయ్యని ఇంటికి పిలిపించాడు.

***

మూడో రోజు హైదరాబాదులో పెళ్లి చూపులకు వంగపువ్వు ఇంటి ముందు కారు దిగారు.

ఆడపిల్ల వాళ్లు సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లారు. ఇంటి బయట గోడకి ఉన్న నేమ్ ప్లేట్‌ని ఎవరు గమనించలేదు.

అందరూ కూర్చున్నాక పలకరింపులయ్యాక.. ముదురాకు పచ్చ బెంగాలీ కాటన్ శారీ, మ్యాచింగ్ బ్లౌజ్‌లో అక్కడికి వచ్చిన వంగపువ్వుని చూసిన సాత్విక్‌కి గుండె వేగం పెరిగింది.

“నీ పేరేంటమ్మా!” అడిగింది నీరజ.

“వంగపువ్వు” అనబోయి నాలిక కరుచుకున్నాడు సాత్విక్.

అక్కడున్న వాళ్లంతా అతన్నే చూశారు.

“పూజిత” అని పేరు చెప్పింది వంగపువ్వు.

ఆ పేరు సాత్విక్ పిచ్చపిచ్చగా నచ్చింది.

చంద్రం మామయ్య సాత్విక్‌ని చూసి ముసిముసిగా నవ్వాడు.

***

మరుసటి నెలలో చిక్కడపల్లిలో అదే ఫంక్షన్ హాల్‌లో సాత్విక్, పూజితల పెళ్లి ఘనంగా జరిగింది.

అప్పగింతలయ్యాక పూజిత తల్లిదండ్రులు పట్టుబట్టలు, తాంబూలం ఘనంగా ఇచ్చారు చంద్రం మావయ్యకి.

ఇవ్వరు మరి.. రామశేషు కూతురు పూజిత.. సాత్విక్ ఇష్టపడ్డ వంగపువ్వు ఒకరే అయితే.. ఇవ్వక ఏం చేస్తారు?

అసలు తండ్రి పంపిన మెయిల్‌లో ఉన్న పూజిత ఫోటో ఇప్పటికీ చూడనే లేదు. ఆ సంబంధమే రామశేషు కూతురు పూజిత, వంగపువ్వూ ఒకరేనని సాత్విక్‌కి తెలియకపోతే ఎవరేం చేస్తాం?

చంద్రం మావయ్య కాత్యాయిని పెళ్లిలో హైటెక్ బామ్మని కలవటం.. అప్పటికే సాత్విక్ విషయం బామ్మకు తెలియడంతో.. బామ్మ వేసిన స్కెచ్ వల్లే సాత్విక్ పూజిత పెళ్లి సుఖాంతమైందని ఫణీంద్రకు తెలియనంతవరకు ఎవరైనా ఏం చేస్తాం?

పెద్దవాళ్లు ఏ తరం వాళ్ళైనా అన్నితరాలకు హితైషులు, మార్గదర్శకులే అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా!

ఆ తరానికి చెందిన E@తరం బామ్మ ఇన్‌స్టాలో సాత్విక్ పూజితల పెళ్లి పిక్స్ చూస్తోందిప్పుడు.

Exit mobile version