[శ్రీ యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘ఏ జన్మలోని ఋణమో..!-3’ అనే వేదాంత కథ అందిస్తున్నాము.]
కర్మ హాజ్ నో మెనూ! యు గెట్ సెర్వెడ్ వాట్ యు డిజర్వ్‌డ్!!
అవును! వింటి నుండి విడవబడ్డ బాణం, నోటి నుండి బయటపడ్డ మాట, తుపాకీ నుండి వెలువడిన తూటా ఫలితాన్ని ఇస్తాయే గానీ వెనక్కి తిరిగిరావు!
నిజాయితీతో చేసిన పనికి (కర్మ) ఫలితం ఒకచోట లభించక పోయినా మరోచోట అంతకన్నా మంచి ఫలితాన్ని కాలమే నిర్ణయిస్తుంది!
ఒక చెత్త చాప్టర్ జీవితానికి ఆఖరుదే కానక్కర లేదు. కొత్త ప్రారంభానికి మొదటిది కూడా కావచ్చును!!
***
స్వామి ప్రణవానంద సేవాశ్రమంలో చాలా త్వరగానే అలవాటు పడిపోయాము నేనూ, సువర్ణా. తెల్లవారుఝామునే నేను గోశాలకు వెళ్లిపోతున్నాను. అప్పటికే పనివాళ్లు సూర్రావు కాపు, గన్నియ్య, నానీ, అప్పారావు వచ్చేసి వున్నారు. వంటశాల నుండి టీ తీసుకుని పల్లా వీరబాబు వచ్చేటప్పటికి పక్క గ్రామం నుండి మన్నియ్య, ఏసేబు, జాన్, బాబూరావులు వస్తారు. అందరూ టీ తాగాక గోశాలలో పేడ కళ్ళు తీసి కొంత గోబర్గాస్ ప్లాంట్ దగ్గర వేసి మిగిలింది పెంట కుప్ప లో వేసి గోశాల శుభ్రంగా తుడిచి కడుగుతారు. షెడ్లలో నుంచి ఆరు బయట చెట్ల క్రిందికి గోవులను మార్చారు. ఆ తొమ్మిది మంది పనివాళ్ళలో ఐదుగురు పచ్చగడ్డి క్షేత్రానికి వెళ్లిపోయారు. మిగిలిన వాళ్ళు పాలు తీసే కార్యక్రమం మొదలెట్టారు. అప్పటికి శ్రీరాంసింగ్ వచ్చి వున్నాడు.
సూర్రావు కాపు సాయి అని పేరెట్టుకున్న బుల్లి గిత్తను ఇప్పి తల్లి సాయమ్మ దగ్గరకు తీసుకెళ్లి పాలు కుడిపాడు (తాగించాడు). దాని కడుపు నిండిన తర్వాత మిగిలిన పాలను పితికి, వాటిని శ్రీ రాంసింగ్‌కు నివేదన చేసాడు. పాలిచ్చే ప్రతీ ఆవు దగ్గరకు వాటి బుల్లి దూడలని తోలుకెళ్లి పాలు తాపిచ్చి తర్వాత ఆవుల పొదుగులకు మిషిన్ కనెక్ట్ చేసి పాలు తీసారు.
పాల కాన్లు వంట శాలకు తీసుకెళ్లి వంట మాస్టారు కురసాల శ్రీనివాసుకు అప్పజెప్పారు. వాటిని కొలుసుకున్న అతను ఆనందంగా నాతో “డెబ్భై లీటర్లు వచ్చాయి రెడ్డిగారూ! సాయంత్రం మరో యాబై లీటర్లు వస్తాయి. ఏమి మంత్రం వేశారో తెలీదు. రోజుకు నలభై ఐదు వచ్చే పాడి నూట ఇరవైకి పెరిగింది. ఆశ్రమవాసులకు కావాల్సినంత పెరుగు మజ్జిగ దొరుకుతుంది. హాస్టల్ పిల్లలకు మంచి పాలు తాపిస్తున్నాము. అంతా మీ చేతి మహిమ” అన్నాడు.
“మంత్రాలకు చింతకాయలు రాలవు శ్రీను గారూ! నా చేతిలో ఏమీ మాయలు లేవు. నాకు మంత్రాలు కూడా రావు! గోవులను ప్రేమించాలి. గోపూజ అంటే వాటికి పసుపు కుంకుమలు పులమటం, నూతన వస్త్రాలతో అలంకరించడం కాదు. వాటికి కడుపు నిండా మేత పెట్టి, కడుగు – నీరూ తాగించాలి. మనం పెట్టేదానికి పది రెట్ల ఫలితాన్ని మనకిస్తాయి. వాటికి మనల్ని నమ్మి ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలీదు. నా టార్గెట్ ఒక్కటి శ్రీను గారూ! మాతాజీకి ఇచ్చిన మాట ప్రకారం సరిగ్గా మూడు సంవత్సరాలలో పాడి మూడు వందల లీటర్లు దాటించాలి!” అన్నాను
“అన్ని ఏమి చేసుకుంటాము సార్?” అడిగాడు శ్రీను.
“సగం పాలు మన ఆశ్రమానికి ఎక్కుతిక్కలుగా సరిపోతాయి. మిగిలిన సగం చింతపల్లి లోని పాల కేంద్రానికి పోస్తాము. ఆ వచ్చిన డబ్బుతోనే గోశాల నిర్వహణ చేస్తాము. జీరో మెయింటనెన్స్ అన్నమాట! అప్పుడు గోవులు, వాటి పాలన చూసేవారూ, మానేజ్మెంట్ వారు కూడా సంతోషంగా వుంటారు” చెప్పాను.
“మీ ఐడియా అదిరింది సార్!” అన్నాడు.
సమయం ఉదయం ఎనిమిది అయ్యింది. అల్పాహారానికి బెల్ కొట్టేసారు. ఆ రోజు ఆదివారం. ఇడ్లీ చేశారు. ఎవరికి ఎన్ని కావలిస్తే అన్ని వడ్డిస్తున్నారు. ఆశ్రమానికి ఇడ్లీల దాత శ్రీ అద్దేపల్లి రామ్మోహనరావు కూడా మూడే మూడు ఇడ్లీలు వడ్డింప చేసుకొని తింటున్నారు. సువర్ణ దైనందిన పనులు పూర్తిచేసుకొని టిఫిన్ కోసం భోజనశాలకు రాగానే మేమిద్దరం టిఫిన్ చేయటానికి కూర్చున్నాము. రొంగలి సూర్యనారాయణ, భారతమ్మ దంపతులు కూడా వచ్చి మా పక్క సీట్లలో కూర్చున్నారు. టిఫిన్ అనంతరం చాలా చిక్కటి టీ, కావాల్సిన వారికి పాలు సర్వ్ చేశారు.
నేనూ, సువర్ణా అల్పాహారం ముగించి బయటికి వచ్చేటప్పటికి నాగమల్లి చెట్టు నీడలో వున్నారు అద్దేపల్లి వారు.
“మీ దంపతులను చూస్తుంటే చాలా సంతోషంగా వుంది. మీ కృషి వల్ల అందరూ చాలా ఆనందంగా మంచి పాలూ పెరుగు తాగుతున్నాము” అన్నారు.
“మాదేం లేదు రావుగారూ! అంతా ఆ ప్రణవానందుల కృప, మాతాజీ సద్విద్యానందుల ఆశీర్వాదం” అన్నాను.
“అయితే.. మీ మీద ఆశ్రమవాసుల్లో, పనివాళ్ళలో, హాస్టల్ పిల్లల్లో ఎంత ప్రేమ పెరుగుతుందో.. అదే విధంగా మీ సేవల వల్ల నష్టపోయిన కొద్ది మందిలో అసూయ, ద్వేషం పెరుగుతున్నాయి. ఎలా కసి తీర్చుకోవాలన్న కుట్రలు జరుగుతున్నాయి. జాగ్రత్త” అన్నారు.
“చిత్రంగా వుందే? వివరంగా చెప్పండి” అడిగాను.
“సమయం వచ్చినప్పుడు వివరాలు మీకే తెలుస్తాయి. వేచి చూడండి. అన్నీ మీ మంచికే” అని నవ్వుతూ వెళ్లిపోయారు.
ఇంతలో టిఫిన్ పూర్తి చేసిన రొంగలి సూర్యనారాయణ భారతమ్మ దంపతులు రావడంతో నల్గురం కలసి గోశాలకు వెళ్లిపోయాము. గోశాలలోని కృష్ణ మందిరాన్ని శుభ్రంగా తుడిచేసాడు రాంసింగ్. అక్కడ కూర్చున్నాము నల్గురం. రాంసింగ్ బుల్లి దూడలతో ఆడుకొంటున్నాడు బయట. టిఫిన్ చేసి వచ్చిన పనివాళ్లు గోవుల్ని ఇప్పి మేపుకు తోలుకెళుతున్నారు.
***
కాకినాడ నుండి కాటమరెడ్డి, తమ్మిన శ్రీధర్ బాబు, సుందర నిత్యానందరావు, నూలు నారాయణ వచ్చి మాతో పాటు కూర్చున్నారు. కొంత మంది ఆశ్రమవాసులు కూడా జాయిన్ అయ్యారు. సీట్లు నిండిపోయాయి. ఎవరైనా వస్తే నేలమీద కూర్చోవాల్సిందే! అప్పుడొచ్చాడు తాను పెద్ద సేవకుడిని అని పోజు కొట్టే ఎక్కు మూర్తి. క్రింద కూర్చోవడం నామోషీగా భావించి తిరిగి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే ఒక సంవత్సరం వయసు వుండే కుక్క పిల్ల వచ్చి తలుపు గోకుతోంది. మా సువర్ణ వెళ్లి తలుపు తీసింది. లోపలికి వచ్చిన అది తిన్నగా కృష్ణుని విగ్రహానికి మూడు ప్రదక్షిణాలు చేసి వచ్చి నేనూ సువర్ణ కూర్చున్న ఆసనాల దగ్గర కూర్చుంది. అందరూ చిత్రంగా చూసారు. మాకు మాత్రం అది ఒక ధర్మ దేవతలా అనిపించింది! సువర్ణ చెప్పిన గణేశ స్తోత్రంతో ప్రారంభమైన సత్సంగంలో విష్ణు సహస్రనామాల పారాయణం ముగిసి ప్రశ్న ఉత్తర కార్యక్రమం చేపట్టారు.
“మనిషి రోజులో ఆరు గంటలు నిద్ర పోతాడనుకొందాం! మిగిలిన పద్దెనిమిది గంటలు ఏం చేస్తుంటాడు? ఈ ప్రశ్నకు జవాబు మా భారతమ్మ తప్ప ఎవరైనా చెప్పవచ్చు” అడిగారు దొంగల సూర్యనారాయణ నాందీ ప్రస్తావనగా!
“ఏం చేస్తామండి? తినడం, తిరగడం, ఏదో పని చేసుకోవడం, కొంత మంది పిచ్చోళ్ల గురించి ఆలోచించడం చేస్తుంటాము” చెప్పాడు కాటంరెడ్డి.
“ఏ పిచ్చోళ్ల గురించి?” అడిగారు రొంగలి వారు.
“ఈ భూమి గుండ్రంగా వుంది, సూర్యుడు ఉదయించడు – అస్తమించడు అని వాదించే పిచ్చోళ్ల గురించి” అన్నాడు కాటమరెడ్డి.
“అవును లే! మంచోళ్ళకి పిచ్చోళ్ళు ఎలా కనిపిస్తారో, పిచ్చోళ్ళకి మంచోళ్ళు కూడా అలానే పిచ్చోళ్ళలా కనిపిస్తారు” అన్నాడు రిటైర్డ్ ఫిజిక్స్ లెక్చరర్ సుందర నిత్యానందరావు ఉక్రోషంగా.
“మీరు ఎన్ని రకాలుగా వాదించుకున్నా భూమి గుండ్రం గానే వుంటుంది. సూర్యుడికి ఉదయాస్తమయాలు వుండవు. ఇప్పుడు నేను చెప్పేది విని ఆలోచించండి.
మనిషి తన నిద్రా సమయం తప్పించి మిగిలిన సమయం అంతా తన ఇంద్రియాలతో విషయాలను గ్రహిస్తూ, భోగిస్తూ ఉంటాడు. కళ్ళతో నామ రూపాలను చూస్తుంటాడు, మక్కుతో గంధాన్ని గ్రహిస్తూ, నోటితో రుచులను గ్రహిస్తూ, చెవులతో వింటూ, చర్మంతో స్పర్శను తెలుసుకుంటూ ఉంటాడు. ఆలోచించండి అవునో కాదో!” వివరించారు రొంగలివారు.
మళ్ళీ రొంగలివారే.. “ఇక్కడ కూర్చున్న మనమంతా సమానమే! ప్రశ్న ఎవరైనా అడగొచ్చు.. దానికి సమాధానం ఎవరైనా చెప్పొచ్చు. ఆల్ ది పర్సన్స్ అర్ యాక్సఫ్టుబుల్ బట్ దెయిర్ ఐడియాస్ అర్ నాట్ యాక్సెప్టబుల్” చెప్పారు.
“ఈస్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ట్రూత్ అండ్ గాడ్?” ఇంగ్లీష్ అప్పారావు ప్రశ్న.
“ఎస్. గాడ్ ఈస్ నాట్ ట్రూత్. ఇట్ ఈస్ యాన్ ఐడియా! బట్ ట్రూత్ ఈస్ గాడ్!” తమ్మిన శ్రీధర్ బాబు జవాబు.
“సంసారం అంటే ఏమిటి? దాన్ని నెగ్గుకు రాలేమా?” నూలు నారాయణ ప్రశ్న.
“సంసారము యొక్క ధర్మములు సుఖము – దుఃఖం, కోరికలు – భయాలు! కష్టాలు అంటేనే ‘సంసారం’. సంసారంలో వున్న ప్రతీ వాడూ శివుడే. అంటే విషాన్ని గొంతులో ఉంచుకొన్నవాడే! సంసారం అనే తుపాను నుండి బయట పడాలంటే సత్సంగం అనే నావ కావాలి. రంగులరాట్నం ఎక్కాలనుకొనే వాడు సంసారి, దూరంగా ఉండి గమనించాలనుకొనేవాడు సాక్షి. సాక్షిగా ఉండటం ద్వారా సంసారాన్ని నెగ్గుకు రావచ్చు” రొంగలి వారి జవాబు.
“ఆశ్రమ జీవితంలో వుండే మనకు పాతిక చీరలు, పది డ్రెస్సులు వుంటే సరిపోతుందా?” మాయా దేవి ప్రశ్న.
“చూడు మాయా! నీలాంటి బీకే ఆశ్రమంలో ఉన్నా రంగుల రాట్నం ఎక్కినా ఒక్కటే! నిజానికి ఆశ్రమంలో వుండే ఆడాళ్లకు ఒంటి మీద ఒకటి, దండెం మీద ఒకటి చీరలు వుంటే సరిపోతుంది” బీకే భరతం పట్టేసింది రొంగల భారతమ్మ.
“దేవుడికి జీవుడికి తేడా ఏమిటి బాబూ?” అడిగాడు తన చెవిటి మిషను సరిచేసుకుంటూ గునివాడ అప్పలరాజు.
“ఎరుకకు అజ్ఞానాన్ని జోడిస్తే జీవుడు. జ్ఞానం జోడిస్తే దేవుడు” రొంగలి వారి జవాబు.
“బాబూ! మనిషి చనిపోయాక దేవుడి దగ్గరకు వెళతాడా?” అప్పలరాజు.
“మనిషి దేవుడి దగ్గరకు ఎప్పుడూ వెళ్ళడు. తెలుసుకొంటే దేవుడు మనిషి లోనే ఉంటాడు. సృష్టి క్రమంలో ఏది వచ్చిందో అదే పోతుంది. ఆత్మ ఎక్కడినుండి రాలేదు కాబట్టి ఎక్కడికీ పోదు. అయితే ఈ శరీరం పంచ భూతాత్మకం కాబట్టి ఆ పంచ భూతాలనే దేవుడిగా భావిస్తే, ఈ శరీరం పడిపోయిన తర్వాత వాటి లోనే విలీనం అవుతాయి. కాబట్టి మనిషి మరణించిన తర్వాత దేవుణ్ణి చేరతాడు అని, దేవుడిది దేవుడికి ఇచ్చేయాలి అని అర్థం చేసుకుంటారు. కానీ దేవుడు పలాన చోట ఉంటాడు అనే భావనే తప్పు. నేను అనే భావన ఎక్కడ వుంటే దేవుడూ అక్కడే!దేహంగా నేను ఆకాశంలో వున్నాను. ఆత్మ చైతన్యంగా నేను ఉంటే ఆ ఆకాశమే నాలో వుంటుంది. ఏదీ ఇదమిత్థంగా నిర్దేశింప శక్యం కానిది ఆత్మ లేక దేవుడు. దేవుడికి మనస్సు వుండదు. అందుకే కోపం, భయం, రాగ ద్వేషాలు వుండవు. కానీ మతం దేవుడికి పై వన్నీ కల్పిస్తుంది! తెలుసుకొంటే దేవుడికీ నీకు తేడా లేదు” రొంగలి వారు వివరించారు.
మా కాళ్ళ దగ్గర కూర్చున్న ధర్మరాజు (ధర్మదేవత) చెవులు రిక్కించి వింటున్నాడు!
“నాన్నగారూ! కర్మలు జీవిని బంధిస్తాయా?” అడిగింది సువర్ణ.
“అవునమ్మా! తప్పక బంధిస్తాయి” రొంగలవారు.
“కర్మ సిద్ధాంతం ఆవశ్యకత వుందా నాన్నగారూ?” సువర్ణ.
“అదే లేదని నమ్మిననాడు అనేక అనర్థాలు, ఆత్మహత్యలు జరుగుతాయి” రొంగలి సూర్యనారాయణ.
“కర్మల వల్ల పునర్జన్మ కలుగుతుందంటారు కదా? అందుకని కర్మలు మానేస్తే..?” సువర్ణ.
“కర్మలు మానరాదు. వాటి ఫలితాల్ని ఈశ్వరునికి సమర్పణ చేయాలి. కర్తృత్వ, భోక్తృత్త్వ భావాల్ని విడిచిపెట్టేయ్యాలి. కర్మ ఫలితాల ఎడ సాక్షీభావాన్ని ఏర్పరచుకోవాలి” చెప్పారు.
“ఋణాలు-పునర్జన్మలపై వ్యాఖ్యానించండి” సువర్ణ.
“ఇవి రెండు రకాలుగా ఉంటాయి. బాకీ వసూలుకు జన్మించడం, బాకీ చెల్లుబాటు చేయడానికి జన్మించడం” చెప్పారు రొంగలివారు.
“ఇంకా..?” సువర్ణ.
“సనాతన ధర్మం ప్రకారం పితృ ఋణం, దైవ ఋణం, ఋషి ఋణం, మనుష్య ఋణం ఉంటాయి. ఇవన్నీ తప్పక తీర్చు కోవాల్సిన ఋణాలు” రొంగలి వారు.
“జన్మలో దుర్లభమైనవి ఏమైనా ఉన్నాయా?” సువర్ణ.
“వివేక చూడామణి ప్రకారం ‘దుర్లభం త్రయమే వై తద్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయః’!!” చెప్పారు.
“నా చివరి ప్రశ్న. జీవుల్లో ఏ జీవి జన్మ మంచిది?” సువర్ణ.
“జంతునాం నర జన్మ దుర్లభం అంది శాస్త్రం. గీత ప్రకారం కూడా తనను తాను ఉద్ధరించుకొనే అవకాశం ఒక మానవునికే వుంటుంది. మానవ జన్మ లభించింది తనను తాను ఉద్ధరించుకోవడానికే గాని ఇతరులను ఉద్ధరించడానికి కాదు” చెప్పారు.
ప్రార్థన చేయించి సత్సంగాన్ని ముగించారు. అందరూ వారి వారి కుటీరాలకు బయలుదేరారు. ధర్మరాజు మమ్మల్ని అనుసరించింది. ఒక కొత్త బంధం!!!
అప్పటికే మా కుటీరంలో చిట్టీ అని పిలుచుకొనే కుక్క పిల్ల ఒకటుంది. దానికి ఇప్పుడిది తోడు! చిట్టిని కోతుల దగ్గరనుండి రక్షించి తెచ్చి పెట్టుకున్నాము. ఇప్పుడు దానికి తోడు ధర్మరాజు వచ్చాడు. ఈ రెండిటిని కలిపి చిట్టిరాజు అని పిలుసుకోవచ్చు. కొద్ది సేపట్లోనే రెండూ ఫ్రెండ్స్ అయి పోయాయి. చిట్టి తన అట్టపెట్టి ఇంటిలో రాజుకు చోటు ఇచ్చింది. రెండిటికీ ఒకే ట్రే లో పిడిగ్రీ పెడితే కలిసి తిన్నాయి ఆనందంగా! మనుషులు కూడా ఇలా కలసి మెలసి వుంటే ఎంత బాగుంటుంది అనిపించింది.
కుటీరం తలుపు చెప్పుడైంది. నరసింహామూర్తి.
“మీతో మాట్లాడాలి రెడ్డిగారూ!” అన్నాడు.
లోపలికొచ్చి కూర్చున్నాక “చెప్పండి!” అన్నాను.
“ఏం చెప్పమంటారు. ఆశ్రమాలు కూడా సంసార కూపాలైపోయాయి. ఇక్కడ కూడా కుట్రలు, కుహకాలు” అన్నాడు.
“విషయం చెప్పండి మూర్తి గారూ!” అన్నాను.
“మీ దయ వల్ల పాడి పెరిగింది. మంచి మజ్జిగ, పెరుగు కావాల్సినంత తాగగలుగుతున్నాము. గోశాలకు మీ నిఘా వల్ల అంతకు ముందు లబ్ది పొందుతున్నవారు ఇప్పుడు నష్టపోతున్నారు. వారంతా కలసి కుట్రలు పన్నుతున్నారు” అన్నారు.
“ఎవరండీ వారు?” అడిగాను.
“ఆశ్రమ వాసుల్లో శేషారత్నం, మాయాదేవి, పనివాళ్ళలో కొందరు” అన్నారు.
“మావల్ల వారు ఏమైనా నష్టపోతున్నారా?” అడిగా.
“గోశాల వెనుకనుంచి దారి వున్న శేషారత్నం కుటీరానికి రోజూ పాతిక లీటర్ల వరకూ వచ్చి చేరుతుండేవి. అక్కడినుండి వాళ్ళు పంచుకొనేవారు. మీ రాకతో వాళ్ళ పనికి అడ్డుకట్ట పడిందిగా, మిమ్మల్ని ఎలాగైనా ఆ పొజిషన్ నుండి తప్పించాలని వారు కుట్రలు పన్నుతున్నారు. మీరు జాగ్రత్తగా వుండండి” అన్నాడు.
“చూడండి మూర్తి గారూ! మేము నిజాయితీతో పని చేస్తాము. ఏం జరిగినా అది మా మంచికే అనుకుంటాము. యదేవ భవతి తదేవ మంగళాయ” అన్నాను. హెచ్చరించి వెళ్లిపోయారు మూర్తి గారు.
***
ఎవరి కోసమూ ఆగని కాలం ముందుకు పరుగెడుతుంది. చిట్టి, రాజులు మంచి స్నేహితులయ్యాయి. తెల్లవారు ఝామున నాతో పాటే అవి కూడా గోశాలకు వచ్చేస్తున్నాయి. గోశాల లోకి పాముల్ని గాని, పిల్లుల్ని గానీ, కాకుల్ని గానీ వాటికి పరిచయమున్న వారిని తప్పించి ఇతరులనెవ్వరిని లోనికి రానివ్వడం లేదు. అవధూత రాంసింగ్‌తో వాటికి మంచి స్నేహం కుదిరింది. రాంసింగ్‍కు ఏ ఆహారం దొరికినా మూడు భాగాలు చేసి తింటున్నారు. వాటి విషయంలో రాంసింగ్ జడ భరతుడే అవుతున్నాడు. కుటీరానికి వచ్చేసిన తర్వాత కుటీరాన్ని కాపలా కాస్తున్నాయి. వాటిని చూసి మా బాధల్ని మర్చిపోయి సంతోషంగా బ్రతికేస్తున్నాము. అవి లేని జీవితాన్ని అసలు ఊహ కూడా చేయలేము. మాకొచ్చే సందేహం ఒక్కటే. వాటికి మేము ఋణపడుతున్నామా? లేక అవి తమ ఋణాన్ని తీర్చుకుంటున్నాయా? అర్థం కావడం లేదు. మా కుటీరం దగ్గరకు ఏ విషపు పురుగు వచ్చినా చంపేస్తున్నాయి. డౌటే లేదు వాటికి మేమే ఋణపడిపోతున్నాము!!
ఆ రోజు 11-04-2013, నేషనల్ పెట్ డే! చింతపల్లిలో గిరిజన సంత జరుగుతుంది. నేనూ సువర్ణా ఏ వారము కూడా సంతకు వెళ్లడం మిస్ అవ్వము. కుటీరానికి చిట్టిని, రాజును కాపలా ఉంచి మేము సంతకు వెళ్ళాము. వాటికి కావాల్సిన ఆహారం నీళ్లు కుటీరం బయట వ్యవస్థ చేసాము. ఆ రోజు సంతలో చిట్టికి, రాజుకు అలంకరించడానికి పూసల దండలు, వాటికి పనికొచ్చే వస్త్రాలు కొన్నాము. ఆ రోజు సంతకు వాటి కోసమే వెళ్ళాము.
చిట్టి రాజులకు అనేక రకాల వస్తువులతో రాత్రి తొమ్మిది గంటలకు ఆశ్రమ గేటు దగ్గర ఆటో దిగాము. ఎడమ కన్ను అదిరింది. మనసు కీడును తలుస్తుంది. కరెంటు పోయింది, చిమ్మచీకటి. సెల్లులో టార్చ్ ఆన్ చేసి కుటీరం వైపు వెళ్ళాము. ఏదో అసహజంగా అనిపించింది వాతావరణం. కుటీర సమీపంలో లోకొచ్చేటప్పటికి ఒక్కసారిగా కరెంటు వచ్చింది. మైండ్ బ్లాక్ అయిపోయిన సంఘటన. రాంసింగ్ కుటీరం మెట్టు మీద కూర్చుని వున్నాడు. అతనికి ఒకవైపు చిట్టి, రాజు నోటి నిండా రక్తంతో కలిసిన నురగలతో పడివున్నాయి. మరోవైపు భయంకరమైన ఒక నల్ల త్రాచు పీలికలై చచ్చి పడి వుంది.
రొంగలి సూర్యనారాయణ, భారతమ్మ, ఇంగ్లీష్ అప్పారావు, చెవిటి అప్పారావు, అద్దేపల్లి వారు అక్కడే వున్నారు. మేము తెచ్చిన అలంకార సామాగ్రి రాంసింగ్ చేతిలో పెట్టాము. వాటిని చిట్టీ, రాజుల శవాలకు అలంకరించాడు. వాటిని తన భుజంపై పెట్టుకొని నాగుపాము పీలికల్ని ఒక వస్త్రంలో కట్టుకొని చేతితో పట్టుకొని ఆశ్రమ ఉత్తరం వైపున్న గడ్డ వైపు బయలుదేరాడు. మేమంతా రామ నామం చెబుతూ అతనిని అనుసరించాము.
స్వస్తి.