Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఈ దేశానికి మనమేమివ్వాలి?-2

[శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన ‘ఈ దేశానికి మనమేమివ్వాలి?’ అనే నాటకం అందిస్తున్నాము. ఇది రెండవ భాగం.]

***

సత్యం: మేడమ్! నేను మీతో కాసేపు మాట్లాడవచ్చా?

ధృతి: తప్పకుండా విలేఖరిగారూ! మీరు మేము ప్రజలకు చెప్పాలనుకునేవి పత్రికా ముఖంగా చేరవేస్తుంటారు. అలాంటి మిమ్మల్ని ఎలా కాదనగలం?

సత్యం: మీరు మీ విధులను వందశాతం పూర్తి చేస్తున్నారు..

ధృతి: అది మా కర్తవ్యం కదా!

సత్యం: ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు?

ధృతి: ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలు పెడుతున్నాది. అవి వారికి సక్రమంగా చేరుతున్నాయా లేదా పరిశీలించాలనుకుంటున్నాను.

సత్యం: అవునండీ అది ఎంతో ముఖ్యమైనది. మధ్యలో దళారులే మారు పేరుతో వాటిని మింగేస్తున్నారు. మాకు తెలిసినంతవరకూ మేము బయట పెడుతూనే ఉంటాం.

ధృతి: మీ వల్ల కూడా మాకు కొన్ని తెలుస్తూ ఉంటాయి.

సత్యం: మీరేమీ అనుకోనంటే ఒక పర్సనల్ విషయం అడగాలని..

ధృతి: అడగండి.

సత్యం: మళ్ళీ ఏమీ అనుకోరుగా.

ధృతి: లేదు.

సత్యం: అందరూ ఫంక్షన్‌కి వచ్చినప్పుడు పట్టుచీరలు కట్టుకుంటారు. మీరు మాత్రం సాదాసీదాగా వస్తారు.

ధృతి: అదా! నేను ఇంకేదో అనుకున్నాను. దుస్తులను బట్టి గాక మన వ్యక్తిత్వాన్ని బట్టి మనల్ని గుర్తించాలి అనుకునే మనస్తత్వం నాది.

సత్యం: మీ లాంటి వారు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం.

ధృతి: మా డ్రెస్సింగ్ సంగతి వదిలేసి మేము చేసే పనులు ఎలా ఉన్నాయో అన్న దాని మీద ఎక్కువ శ్రద్ద పెట్టండి. ఇది నా సలహా.

సత్యం (సిగ్గుపడుతూ): అలాగే నండీ. చివరి ప్రశ్న, మీ ధ్యేయం ఏమిటి?

ధృతి: ఏ రోజు ఏం చెయ్యాలనిపిస్తే అది చేసుకుంటూ పోవటమే.

సత్యం: ఏమైనా మీరు మిస్ అయ్యారా?

ధృతి: రాని వాటి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోను. నాకు ఏది దక్కాలో అది తప్పక దక్కుతుంది. అది చాలు నాకు. అదే నాకు సంతృప్తి నిస్తుంది.

సత్యం: ఓ మంచి మనసుతో మాట్లాడిన అత్మసంతృప్తి నాకు దక్కుతుంది మీతో మాట్లాడితే. ముందు ముందు కూడా మీరిలాగే ఉండాలని కోరుకుంటున్నాను.

ధృతి: మంచిదండీ.

సత్యం: సెలవ్.

***

శౌర్య: కేక్ కటింగ్‌తో పిల్లలంతా చాలా సంతోషంగా ఉన్నారు.

ధృతి: అవును. అవి వాళ్ళకు అందని ద్రాక్షలుగా!

శౌర్య: మీరు అనుకుంటే ఆకాశంలో నక్షత్రాలను కూడా దింపెయ్యగలరు.

ధృతి: ఏదీ! పోటో లోనా?

శౌర్య: మీరెలా అనుకున్నా సరే!

ధృతి: సరే! నేనో విషయం అడగనా?

శౌర్య: అడగండి. దానికి సందేహం ఎందుకు?

ధృతి: నా విషయంలో నీ అభిప్రాయం?

శౌర్య: నా అభిప్రాయమా? ప్రత్యేకంగా చెప్పేది. ఏముంది? మీతో మాట్లాడిన ఎవరైనా మీరు మంచి వాళ్ళని చెప్పేస్తారు.

ధృతి: మనం పెళ్ళి చేసుకుందామా?

శౌర్య: మామ్! జోకులెయ్యటానికి కూడా కొంత ఉండాలి.

ధృతి: జోక్ కాదు శౌర్యా, నేను నిజంగానే అడుగుతున్నాను.

శౌర్య: నా కంటే ఎంతో మంచి వాళ్ళు కూడా దొరుకుతారు.

ధృతి: బలవంతం లేదు. కప్పదాటు వ్యవహారం వద్దు. ఇష్టమా? కాదా?

శౌర్య: మీరే మరోసారి ఆలోచించుకోండి అంటున్నా.

ధృతి: అంటే నీకు అభ్యంతరం లేదనేగా!

శౌర్య: చందమామ తనంతట తను చేతుల్లో వాలుతాను అంటే వదిలేసే వాళ్ళు ఎవరు ఉంటారు?

ధృతి: చాలా రోజులు తీసుకుంటావు అనుకున్నా.

శౌర్య: నవ్వు.

ప్రజ్ఞ: ధృతీ!

ధృతి: ఆఁ! చెప్పు ప్రజ్ఞా!

ప్రజ్ఞ: కేక్ అందరికీ పెట్టేసాను.

శౌర్య: మరి నేను వస్తాను.

ధృతి: అలాగే.

ప్రజ్ఞ: ఏమన్నాడు?

ధృతి: ముందు ఒప్పుకోలేదు కానీ తర్వాత సరేనన్నాడు.

ప్రజ్ఞ: నేను చెప్పలా ముందే. మా ధృతమ్మ పెళ్ళికూతురాయెనే. మా ధృతమ్మ పెళ్ళికూతురాయనే! (పాటలా పాడుతుంది)

ధృతి: ఉష్! అప్పుడే ఎవరికీ చెప్పకు. ముందు అమ్మకి, బాబాకి చెప్పాలి.

ప్రజ్ఞ: అలాగే, తొందరలో మన ఇంట ఓ శుభకార్యం జరగబోతోందన్న మాట.

ధృతి: ఒకటి కాదు రెండు.

ప్రజ్ఞ: ఓ! ఇంకొకరున్నారా? ఎవరు? నాకు తెలియకుండా?

ధృతి: అది నీకే.

ప్రజ్ఞ: నాకా!

ధృతి: ఇద్దరమూ ఒకేసారి చేసుకుందాం. అదీ మన ఈ ప్రాంగణం లోనే!

ప్రజ్ఞ: అయితే ఆ ఛాయిస్ నీదే.

ధృతి: నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, మాట్లాడుతారు అమ్మ.

ప్రజ్ఞ: అహఁ! ఎవరూ లేరు,

ధృతి: అయితే నేనే నా భుజస్కంధాల మీద ఆ పనిని వేసుకుంటాను.

ప్రజ్ఞ: అప్పుడైతేనే నేను నిశ్చింతగా ఉండగలుగుతాను.

***

భాను: ధృతి ఫోను చేసింది.

చంద్ర: ఏమిటి విశేషాలు?

భాను: శౌర్యని చేసుకుంటానంటోంది. అబ్బాయి ఎలాంటి వాడో విచారణ చెయ్యండి.

చంద్ర: నాకు తెలిసిన వాడే. మంచి బుద్ధిమంతుడు. అయినా ధృతి సెలెక్షన్‌కి వంక పెట్టటానికి ఉండదు.

భాను: అయినా ముందు వెనుక తెలుసుకోవటం మన బాధ్యత కదా.

చంద్ర: అవును

భాను: ప్రజ్ఞకు కూడా తనతో పాటే వివాహం చేద్దామని, వరుడ్ని చూడమని చెప్పింది.

చంద్ర: మనకు తెలిసిన వాళ్ళకు చెబుదాం.

భాను: ఇద్దరూ దారిలో పడితే అంటే చాలు.

చంద్ర: దారిలో పడటమేమిటి భానూ! వాళ్ళే ఎందరికో దారి చూపుతుంటే.

భాను: అబ్బా! ఏదో మాట వరుసకి అన్నాను లెండి.

చంద్ర: ఓహో. అలా అంటావా.

భాను: ఆఁ! అంతే!

చంద్ర: ఆఁ! అన్నట్లు గుర్తొచ్చింది భానూ. మొన్నీ మధ్య నా చిన్ననాటి స్నేహితుడొకడు వాళ్ళ అబ్బాయికి మంచి అమ్మాయి ఉంటే చెప్పమన్నాడు.

భాను: మరింకేం ప్రజ్ఞ విషయం చెప్పండి.

చంద్ర: దీనినే అంటారు వెతకబోయిన తీగ కాలికి తగలడమని.

భాను: అబ్బాయి ఏం చేస్తుంటాడు?

చంద్ర: టీచర్.

భాను: మరి ఇకనేం? ఇది వరకు బ్రతకలేక బడిపంతులు అనేవారు. ఇప్పుడు వాళ్ళకి వచ్చినన్ని జీతాలు మరెవరికీ రావటం లేదు.

చంద్ర: అబ్బో! నీకు లోకజ్ఞానం పెరిగిపోయిందే?

భాను: ఇది అందరికీ తెలిసిన విషయమే.

చంద్ర: వాళ్ళిద్దరికీ కూడా నచ్చాలిగా.

భాను: ముందు మీరు విషయం కదపండి. పనులన్నీ వాటికవే అయిపోతాయి.

చంద్ర: అలాగే. ఇప్పుడే ఫోను చేస్తాను వాడికి.

భాను: ఆ! ఆ చేత్తో ధృతికి కూడా చెప్పండి. ఒకసారి ఇంటికి రమ్మని.

చంద్ర: అప్పుడే ఈ విషయం చెప్పేస్తావా. ఏమిటి?

భాను: చెబితే ఏమవుతుంది?

చంద్ర: ఆశలు రేపినట్లవుతుంది. ముందు వాళ్ళలో మాట్లాడనీ, వాళ్ళు చూద్దామంటే అప్పుడు చెబుదాం.

భాను: ముందర కాళ్ళకు బంధం వెయ్యటంతో మీరు ఫస్టు.

చంద్ర: లేడికి లేచిందే ప్రయాణం నీది కాదూ.

భాను: ఆఁ! మరే.

చంద్ర: మనద్దరికీ ఇది మామూలేగా!

(చంద్ర, భానుమతిల నవ్వులు వినిపించాలి).

***

ధృతి: ప్రజ్ఞా! అమ్మా వాళ్ళు నీకు ఒక సంబంధం చూసారట. వాళ్ళు నీ ఫొటో చూసి ఒప్పుకున్నారట. బాబా వాళ్ళింట్లోనే నీకు పెళ్ళిచూపులు రేపు. ఏమంటావ్?

ప్రజ్ఞ: అలాగే.

ధృతి: అబ్బాయి ఎవరు, ఏమిటి అని ఏమీ అడగవా?

ప్రజ్ఞ: ఎందుకు? వాళ్ళూ, నువ్వు చూసారంటే అతన్ని చూడకుండా అయినా తాళి కట్టించేసుకుంటా.

ధృతి: అంత గుడ్డి నమ్మకం ఎవరి మీద పెట్టుకోకూడదే.

ప్రజ్ఞ: ధృతీ! నిన్ను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్లే.

ధృతి: అయినా చెప్పాల్సిన బాధ్యత నాకుందిగా.. అతను టీచర్. బాగానే సంపాదిస్తున్నాడు. వాళ్ళు ఊ అంటే, నీకూ నచ్చితే నువ్వు అదృష్టవంతురాలివే.

ప్రజ్ఞ: అంతా దైవేచ్ఛ!

ధృతి: అలా అని అబ్బాయిని చూడటం మానెయ్యకు.

ప్రజ్ఞ: అలాగే. చూస్తాను.

ధృతి: వీలయితే మాట్లాడుకోండి. ఒకరి భావాలు ఒకరికి సరిపోతాయో లేదో కూడా గమనించుకోండి.

ప్రజ్ఞ: నీ ఇష్టం.

ధృతి: నీకు నచ్చితేనే ఒప్పుకుందాం. రేపు అతనితో కాపురం చెయ్యాల్సింది నువ్వు. మేము కాదు.

ప్రజ్ఞ: అబ్బా! చిన్న పిల్లకి చెప్పినట్లు చెప్పకు.

ధృతి: చెప్పాల్సిందే. లేకపోతే రేపు అన్నీ నువ్వు చూసుకుంటావని నేను పట్టించుకోలేదు అంటే నేనొప్పుకోను.

ప్రజ్ఞ: సరే.

ధృతి: నిజమే చెప్పాలి.

ప్రజ్ఞ: ఈ విషయంలో నన్ను అనుమానించకే.

ధృతి: నీకు బాగా మొహమాటం ఎక్కువ. అందుకే ఇన్ని ముందు జాగ్రత్తలు.

ప్రజ్ఞ: తెలుసు

ధృతి: అమ్మ ఎప్పుడెప్పుడు ఈ విషయం చెప్పేద్దామా అని ఆత్రుత పడిందట.

ప్రజ్ఞ: అయితే?

ధృతి: బాబా మాత్రం వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఒప్పుకున్నాక చెబుదామని ఆపారట.

ప్రజ్ఞ: అదే మంచిది కదా.

ధృతి: నిన్న రాత్రి వాళ్ళు ‘ఊ’ అనగానే అమ్మ నాకు చెప్పేసింది.

ప్రజ్ఞ: నువ్వు నాకు చెప్పేసావు.

ధృతి: అంతేకదా!

ప్రజ్ఞ: అన్నీ సవ్యంగా జరగాలి. అసలే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వాళ్ళం.

ధృతి: ఏం భయపడకు. నేనున్నానుగా.

***

చంద్ర: పిల్లలూ! వాళ్ళకు మీరు నచ్చేసారట.

భాను: ఇక మీరు ఊ అంటే మంగళవాద్యాలు మ్రోగించటమే.

ధృతి: రిజస్టర్ మేరేజ్ చేసుకుందాం.

భాను: అదేమిటలా? అలా ఎవరూ లేని వారిలా? అక్కడ నుంచీ సర్టిఫికేట్ తెచ్చుకుందురు.

చంద్ర: అవును. పెళ్ళి మాత్రం ఘనంగా చెయ్యాలి.

ధృతి: ఆర్భాటం నాకూ ఇష్టం లేదు.

భాను: కానీ మాకుంది. ఈ విషయంలో మీ మాట వినేది లేదు.

ధృతి: వినాలి అమ్మా.

భాను: లేదు. ప్రతిసారీ నీ మాట మేము వినటమే. ఈసారి మా మాట నువ్వు వినాలి.

ధృతి: ఉహు. నన్ను ఇరకాటంలో పెట్టద్దమ్మా.

భాను: ఇక మీరే చూసుకోండి. నేను అలిగాను. లోపలికి వెళ్ళిపోతున్నాను.

ధృతి (వెనకనే వెళుతూ): అమ్మా! అమ్మా!

చంద్ర: వాళ్ళిద్దరికీ అది మామూలే.

ప్రజ్ఞ: నాకిలాంటివి చూస్తే భయం.

చంద్ర: ఇద్దరిలో ఎవరు రాజీ పడతారో అన్నది మాత్రం మనకు సస్పెన్స్.

ప్రజ్ఞ: అంతేనా?

చంద్ర: అంతే!

ప్రజ్ఞ: ఏమిటి? లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎంతకీ బయటకు రావటం లేదు.

చంద్ర: కోర్ట్ ఈజ్ అడ్‌జర్న్‌డ్.

ప్రజ్ఞ: హఁ! హఁ! హఁ!

చంద్ర: భానూ! భానూ!

భాను: వస్తున్నా! ఏమిటి?

చంద్ర: ఇంతకీ ఏమి తేల్చారు?

భాను: రాజీ కుదరలేదు.

చంద్ర: అలా అయితే ఎలా?

ధృతి: అమ్మే నా మాట వినాలి.

చంద్ర: ధృతీ! అఫీసులో అందరి నోటా నీ మాటే. ధృతి లాంటి కలెక్టరు ఇప్పటి దాకా ఎవరూ లేరని.

ధృతి: మునగ చెట్టు ఎక్కిస్తున్నారా?

చంద్ర: లేదు. అక్కడ అంతలా చేసే నువ్వు ఇక్కడ ఇంత బెట్టు చేస్తే ఎలా అని?

ధృతి: నా సంగతి చిన్నప్పటి నుంచీ మీకు తెలిసిందే కదా బాబా.

చంద్ర: కొన్ని వేడుకలు ముచ్చట మళ్ళీ మళ్ళీ రావు, పొదుపు అన్ని వేళలా (మధ్యలోనే ఆపేస్తూ)

ధృతి: మంచిది కాదంటే ఎవరూ ఒప్పుకోరు.

చంద్ర: ఈ విషయంలో ఎవరైనా ఒప్పుకుంటారు.

ధృతి: నేను తప్ప.

చంద్ర: ప్రజ్ఞా! నవ్వు చెప్పు.

ప్రజ్ఞ: ధృతి ఏదంటే అదే నేనూ.

చంద్ర: హతోస్మి!

***

ధృతి: శౌర్యా! ఏమిటలా చూస్తున్నావ్?

శౌర్య: ఏ అలంకారం చేసుకోకపోయినా ఎలా బాగుంటారా అని.

ధృతి: ఇంకా మీరు ఏమిటి?

శౌర్య: కొంత సమయం పడుతుంది. పెళ్ళయ్యాక చూద్దాం.

ధృతి: నేను మొండినయితే నువ్వు జగమొండివి.

శౌర్య: పోనీ అలానే అనుకోండి.

ధృతి: వివేక్ గురించి తెలుసుకున్నావా?

శౌర్య: ఆఁ! మంచివాడని తెలిసింది. ప్రజ్ఞ విషయంలో ఏం భయపడక్కర్లేదు.

ధృతి: అదే మనకు కావల్సింది. తన మనసులో మాట చెబుతుందో లేదో అని నేను చాలా భయపడ్డాను.

శౌర్య: నేనెంతో అదృష్టవంతుణ్ణి.

ధృతి: ఎందుకట?

శౌర్య: ప్రక్కవాళ్ళను జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు పార్టనర్స్ అయితే జీవితంలో మరేమీ అక్కర్లేదట.

ధృతి: అబ్బో!

శౌర్య: అలాంటి అమ్మాయివే నువ్వు,

ధృతి: అంత ఏమీ లేదు.

శౌర్య: ఎంత ఉందో మేం చెప్పాలి.

ధృతి: ఒప్పుకోవల్సిందేనా?

శౌర్య: ఏమిటో! ఇప్పటికీ నేను మీకు సరైన జోడీని కాదనిపిస్తుంది. అనవసరంగా ఒప్పుకున్నానా అని కూడా!

ధృతి: అలా నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు.

శౌర్య: ఏమో!

ధృతి: ధనం కన్నా గుణం ముఖ్యం. ఎంత డబ్బుంటే మాత్రం ఏం లాభం సుఖం లేనప్పుడు.

శౌర్య: కాలు కదపాలంటే ఇప్పుడు అంతా డబ్బు తోనే.

ధృతి: అబ్బా! నా దగ్గర ఆ డబ్బు విషయం తప్ప ఇంకేదన్నా మాట్లాడు.

శౌర్య: తప్పు చేసిన వాళ్ళను అసలు వదలద్దన్నారట. అందరినీ గడగడలాడించేస్తున్నారట.

ధృతి: తప్పదు. ఈనాడు అమ్మాయిలు ధైర్యంగా బయటకు రావాలంటే అలాంటి నిర్ణయాలు తీసుకోవల్సిందే.

శౌర్య: అవును.

ధృతి: అన్యాయం ఉన్న చోట నేనుండను. ఎవరైనా న్యాయానికే కదా పీట వేయాలి.

శౌర్య: ఒక వేళ ఎవరైనా ఇది కాదంటే బయట పడలేరు.

ధృతి: భలే చెప్పావు శౌర్యా.

శౌర్య: మీకన్నానా?

ధృతి: అయినా మనలో మనకి పోటీ ఏమిటి?

శౌర్య: అవును. భార్యాభర్తల మధ్య స్నేహభావమే ఉండాలి.

ధృతి: ఎన్నాళ్ళకు నీ నోటి నుంచీ ఇలాంటి మాట విన్నాను.

శౌర్య: మరి అదే!

ఇద్దరి నవ్వులు వినిపించాలి.

***

ధృతి: ఏంటి విశేషాలు ప్రజ్ఞా?

ప్రజ్ఞ: ఏమున్నాయి? మన పెళ్ళని పిల్లలు కూడా సంబరపడుతున్నారు.

ధృతి: ఇంకా

ప్రజ్ఞ: వాళ్ళంతా కొత్త బట్టలు కొనేసుకున్నారు. ఈ విషయంలో వివేక్ బాగా సాయం చేసాడు.

ధృతి: ఇక ముందు కూడా శౌర్య, వివేశ్ కూడా ఇలాగే సహకరించాలి.

ప్రజ్ఞ: వివేక్ కూడా అదే అన్నాడు.

ధృతి: అడ్డం పడే వాళ్ళు మన జీవితంలోకి వస్తే ఇక అంతా శూన్యమే..

ప్రజ్ఞ: అందుకేగా అదే భావాలు ఉన్న వాడిని వెతుక్కుని మరే కట్టుకోబోతున్నావ్.

ధృతి: అవును ప్రజ్ఞా. నా కన్నా శౌర్య సమాజం పట్ల ఎక్కువ బాధ్యత చూపిస్తాడు.

ప్రజ్ఞ: మన అదృష్టమే వీళ్ళిద్దరూ దొరకటం.

ధృతి: అసలు కలలో కూడా పెళ్ళి ఆలోచన లేని మనను అమ్మాబాబా కలిసి మంటపం దాకా లాక్కు వచ్చేసారు.

ప్రజ్ఞ: మొత్తానికి ఇక్కడే పెళ్ళి చెయ్యటానికి అమ్మని ఒప్పించావుగా.

ధృతి: మరి పిల్లలు సరదా పడుతున్నారు. ఒకటే గోల. ఒప్పుకోక తప్పలేదు.

ప్రజ్ఞ: వాళ్ళద్దరి రుణం మనం జీవితంలో తీర్చుకోలేం.

ధృతి: వాళ్ళది తీర్చలేని రుణం. అది అలా ఉండటమే నా కిష్టం.

ప్రజ్ఞ: అందుకే నువ్వంటే నా కిష్టం.

***

చంద్ర: చీరలకు మాచింగ్ జాకెట్లు అన్నీ కుట్టించేసావా?

భాను: ఆఁ! ప్రతీదానికే అడ్డం పడటమే. వాళ్ళిద్దరూ.

చంద్ర: ఏమని?

భాను: సింపుల్. సింపుల్ అని.

చంద్ర: నువ్వు ఊరుకోవుగా

భాను: అస్సలు.. (వత్తి పలుకుతూ)

చంద్ర: నువ్వు ఎలాగైనా గ్రేటోయ్

భాను: అదేం లేదు. ధృతినే గ్రేట్. నాకు మంచి కూతురయ్యింది.

చంద్ర: అవును, ధృతి మన చిట్టి తల్లి. ఏమంటూ మన జీవితాలలోకి వచ్చిందో గానీ వసంతాన్ని తెచ్చింది.

భాను: అందుకే చూడండి, బ్లౌజులు మగ్గం వర్కుతో ఎంత అందంగా చేయించానో!?

చంద్ర: నువ్వు సూపరోయ్.

భాను: ఇద్దరికీ ఒకే డ్రెస్సులు కావాలి అంది ధృతి. అదొక్కటే తన కండీషన్.

చంద్ర: సమానత్వం .

భాను: వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళని మించి ఉంటారు. నాకయితే ఎంత ముచ్చట వేస్తుందో?

చంద్ర: అవును భానూ.

భాను: ఎంత వద్దనుకున్నా ముఖ్యమైన వాళ్ళ లిస్టే చాలా ఉంది. భోజనాలకు ఏర్పాట్లు అన్నీ పూర్తయినట్లేగా.

చంద్ర: ఆఁ! ఎప్పటి కప్పుడు అన్నీ చూసుకుంటున్నాను. మరిచిపోతానని భయం ఉందిగా నాకు.

భాను: పిల్లలందరూ కూడా పెళ్ళికి వస్తున్నారు. మనకు అదో స్పెషల్,

చంద్ర: వాళ్ళ ద్యాసలో పడి ధృతికి ఏమన్నా తక్కువ చేస్తే ఊరుకోను.

భాను: భలేవారే అందరి మంచి కోసం ప్రతి క్షణం ఆలోచించే ధృతికి అన్యాయం చేస్తే భగవంతుడు నన్ను క్షమిస్తాడా? (కాస్త నవ్వుతూ)

చంద్ర: అవును ధృతి మానవత్వం మూర్తీభవించిన పరిపూర్ణ సౌరభం.

భాను: అబ్బో, మీలో కవిగారు దూరారా ఏమిటి?

చంద్ర: మరి నీకేనా ఆ క్రెడిట్. ధృతి దగ్గర నేను కూడా తీసుకోవద్దా?

భాను: అబ్బా ఆశ.

చంద్ర: ఏం కుదరదా?

భాను: కుదరనే కుదరదు.

చంద్ర: సరే. సరే. కబుర్లు ఆపి పనులు చూద్దాం.. రోజులు దగ్గరికి వచ్చేస్తున్నాయి.

భాను: అవునవును రోజులు వేగంగా కదిలిపోతున్నాయి.

చంద్ర: పట్టుకుందామా?

భాను: వదలకుండా చూసుకుంటే చాలు.

చంద్ర: హఁ! అవును (నవ్వుతూ)

భాను: నవ్వు.

***

పెళ్ళి బాజాలు వినిపించాలి

ధృతి: అమ్మా! బాబా! మమ్మల్ని ఆశీర్వదించండి.

చంద్ర, భాను: పిల్లా పాపలతో కలకాలం చల్లగా వర్ధిల్లండి.

ధృతి: అవును నాకు ఎందరో పిల్లలు. రోజు రోజుకూ వారి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.

చంద్ర: అందరు ఆడపిల్లల్లా ధృతిని ఆశీర్వదించకూడదోయ్.

భాను: మరెలా?

చంద్ర: సమాజ శ్రేయస్సు కోసం మరింత పాటు పడు తల్లీ అని దీవించాలి.

భాను: అది ఎప్పుడూ మన మనస్సు లోనే ఉంటుందిగా.

ధృతి: అవునమ్మా.

చంద్ర: పిల్లలూ! మీరందరరూ కూడా కొత్త దంపతులను ఆశీర్వదించండి.

భాను: ఈ రోజే వీళ్ళిద్దరి జంటలకు శోభనం కూడా ఏర్పాటు చేసేసాను.

చంద్ర: ఇంకేం మనమంతా పక్కకు తప్పుకోవల్సిన సమయం వచ్చేసింది.

భాను: అంతే కదా!

(బోలెడు మంది నవ్వులు ఒక్కసారే వినిపించాలి)

* సమాప్తం *

Exit mobile version