[మాయా ఏంజిలో రచించిన ‘This Winter Day’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]
(సూప్ ద్రవాన్ని కూడా మాయా కవిత్వీకరించిన తీరు ఈ కవితలో చూడవచ్చు.)
~
వంటగది సంసిద్ధంగా ఉంది
తెల్లని, ఆకుపచ్చని
నారింజ రంగుల కూరగాయలన్నీ
తమ తమ రుచులన్నింటినీ
సూప్ లోకి ధారపోసాయి
అలవాటుగా అవి చేసే త్యాగం
నా నాసికను పరిమళభరితం చేస్తూ
సూప్ ద్రవంలో మునకలేసేందుకు
నా నాలుకతో కవాతు చేయిస్తుంది
ఈ రోజు
నా గది కిటికీకి
నా సూప్ కి మధ్యన
వెండి చారల వర్షధార
విరుచుకుపడుతుంది!!
~
మూలం: మాయా ఏంజిలో
అనువాదం: హిమజ
మాయా ఏంజిలో రచనలు, పోరాట పటిమ అమెరికన్ జాతిని చెప్పలేనంతగా ప్రభావితం చేసాయి. ఆమె వారసత్వాన్ని అందుకొని ఎందరో ఉద్యమకారులు తయారయ్యారు.
అమెరికన్ ప్రభుత్వం మాయా ఏంజిలో quarter coin ని విడుదల చేసి మాయాని గౌరవించింది. ఆ నాణెం ఇంకా చలామణీలో ఉంది. పౌరహక్కుల ఉద్యమకారిణి, కవయిత్రి, రచయిత్రి, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను కలిగి ఉన్న మాయాకి దక్కాల్సిన గౌరవమే అని అమెరికన్లు ఆఫ్రికన్లు భావించారు.
Nevada కు చెందిన అమెరికన్ లాయర్, సీనియర్ యునైటెడ్ స్టేట్స్ సెనేటర్ అయిన Catherine Cortez Masto ఈ నాణేనికి సంబంధించిన బిల్లుని గట్టిగా బలపరిచింది.
2022 లో ఫిలడెల్ఫియా, డెన్వర్, San Francisco ల లోని టంకశాల ( mint) నుంచి ఆ నాణేన్ని విడుదల చేసింది ప్రభుత్వం.
మాయా స్వేచ్ఛగా భుజాలు పైకెత్తినట్టుగా, ఆమె వెనుక రెక్కలల్లార్చి ఎగురుతున్న పక్షి, ఉదయిస్తున్న సూర్యుడు- మాయా కవిత్వ ప్రేరణతో, మాయా ఆశావహ దృక్పథానికి, స్వేచ్ఛాభావనలకి ప్రతీకలుగా, ఆమె జీవించిన తీరుని ప్రతిబింబించేలా ఆ coin ని తీర్చిదిద్దారు. అది 25 సెంట్ల నాణెమే కావచ్చు గానీ స్వేచ్ఛా కాంక్షకి అమెరికా ఇచ్చిన నిర్వచనంగా చూడవచ్చు.
తన పేరు మీద నాణెం విడుదలైన గౌరవం దక్కిన మొట్టమొదటి నల్లజాతి మహిళ మాయా.
సుతిమెత్తగా కవిత్వం రాసే ‘హిమజ’ కవితా సంకలనం ‘ఆకాశమల్లె’కి కవయిత్రి మొదటి పుస్తకానికి ఇచ్చే సుశీలా నారాయణరెడ్డి పురస్కారం (2006), రెండవ పుస్తకం ‘సంచీలో దీపం’కు ‘రొట్టమాకు రేవు’ అవార్డు (2015) వచ్చాయి.
‘మనభూమి’ మాసపత్రికలో స్త్రీలకు సంబంధించిన సమకాలీన అంశాలతో ‘హిమశకలం’ పేరున సంవత్సర కాలం ఒక శీర్షిక నిర్వహించారు.
ప్రపంచ ప్రఖ్యాత ఆఫ్రో అమెరికన్ కవయిత్రి ‘మాయా ఏంజిలో’ కవిత్వాన్ని అనువదించి 50 వారాలు ‘సంచిక’ పాఠకులకు అందించారు.
ఇప్పుడు ‘పొయెట్స్ టుగెదర్’ శీర్షికన భిన్న కవుల విభిన్న కవిత్వపు అనువాదాలు అందిస్తున్నారు.