ఒకప్పుడు… అనుబంధాలు, ఆప్యాయతలు…
ఒకరికొకరు ప్రత్యక్షంగా ఎదురైనప్పుడు వ్యక్తపరుచుకుని…
సంతోషంగా పలకరించుకుని… మది నిండా సుమధుర జ్ఞాపకాలుగా మిగుల్చుకునేవారు!
మరి నేడు… ఎలక్ట్రానిక్ వస్తు మాయాజాలంలో నవ్య సమాజం…
అనుబంధాలు, ఆప్యాయతలు… ఫేస్‌బుక్, వాట్సప్‌లలో లైక్స్, షేర్స్‌గా మారిపోయాయి!
ముఖ పరిచయం… అయినా లేకపోయినా… ఖండాంతరాలలో వున్నా… ఒకరిని ఒకరు పలకరించుకునే అవకాశం…
కానీ… ‘ఈ’ బంధాలన్నీ…
పేకమేడల్లా కూలిపోకుండా… నీటి బుడగల్లా పగిలిపోకుండా… సజీవంగా నిలవాలంటే…
అందంగా చిగురించిన ప్రేమ, స్నేహం… నిజమైనదై వుండాలి… మనస్సు అంతరాలలో జనించినదై వుండాలి!
‘ఈ’ ప్రేమలు, స్నేహాలు, అనురాగాలు…
కలకాలం నిలిచివుండేలా…
నేటి తరం… ప్రత్యక్ష పరిచయాలకు విలువనిస్తూ…
అప్పుడప్పుడు లేదా వీలైనప్పుడు కలసి కబుర్లు చెప్పుకుంటూ సాగిపోతుంటే…
ఈనాడే కాదు.. ఏనాటికైనా అనుబంధాలు శాశ్వతమవుతాయి!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.