[శ్రీలక్ష్మి నందమూరి గారు రచించిన ‘ఎదురీత’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
కటిక చీకటి కమ్ముతున్నా,
గమ్యము వైపు కాలు కదుపుతున్నా.
తాత్వికత తట్టి లేపుతున్నా,
విశ్వాసపు మైకములో నిదురిస్తున్నా.
ఉబికే ఈడులో ఊబి వలే మునుగుతున్నా,
విజ్ఞతతో ఉరకలు వేస్తున్నా.
సూక్తులతో కర్ణభేరి కుటిలమైనా,
స్పూర్తితో జయభేరికై వింటున్నా.
స్వీయశోషణ బంధాలను బీటలు వార్చుతున్నా,
ప్రేమతో సేద్యం చేస్తున్నా.
ఆడంబరముల మేఘము మెరిపిస్తున్నా,
ఆత్మిక ఆనందముకై అన్వేషిస్తున్నా.
ఆంక్షలతో కంఠం కొరబోతున్నా,
హక్కులకై గళమెత్తి గర్జిస్తున్నా.
చరిత్ర అసాధ్యమంటున్నా,
నవ శకమునకై అలుపెరుగక ప్రయోగము చేస్తున్నా.
మూఢత్వముతో మేధస్సు పోగచూరుతున్నా,
వివేకముతో సత్యముకై శోధిస్తున్నా.
సమకాలీన స్వేచ్ఛా సంద్రములో ప్రవహిస్తున్నా,
ధర్మ మార్గము వీడకున్నా.
స్వార్థబలం దయను హరిస్తున్నా,
దైవత్వముతో చేయూతనిస్తున్నా.
భావావేశం శ్రుతి తప్పిస్తున్నా,
నిబద్దతతో తాళం వేస్తున్నా.
అవరోధాలు అర్రులు చాచినా,
ఆశయముకై మజిలీగా మలుచుతున్నా.
జయము జాడ తెలియకున్నా,
లక్ష్యముకై తపస్సు ఆపకున్నా.
ఎదురేదైనా
ఎదురీదుతూనే ఉంటా..