Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంపాదకీయం జూలై 2025

संतोषस्त्रिषु कर्तव्यः स्वदारे भोजने धने।
त्रिषु चैव न कर्तव्योऽध्ययने जपदानयोः॥

చాణక్య నీతి, 07,04

వ్యక్తి తనకున్న  భార్య, ఆహారం, ధనం లతో  సంతృప్తి చెందాలి. ఎప్పుడూ అసంతృప్తుడిగానే వుండాల్సిన విషయాలు, నిర్వహిస్తున్న కర్తవ్యం,  సాధించిన విద్య,  చేస్తున్న ధ్యానం, దానాలు.

పెద్దల మాటలు చద్ది మూటలు అంటారు. చద్ది అన్న పదమే పలకరానిది, వినరానిది అయిన కాలం ఇది. కాబట్టి పెద్దల మాటలనగానే పెదవి విరిచి, ముఖం చిట్లించి పలక కూడని మాట పలికినట్టు, అనరాని మాట అన్నట్టు చీదరించుకోవటం ఆనవాయితీ అయిన సమాజంలో పెద్దలు వేటితో  సంతృప్తి పడాలని చెప్పారో వాటితో అసంతృప్తి, ఏయే అంశాలలో అసంతృప్తితో వుండాలని చెప్పారో వాటితో సంతృప్తి పడటం సర్వ సాధారణం అవుతుంది.  అది ప్రస్తుతం సమాజంలో ఎటు చూసినా కనిపిస్తున్నది.

ఆహారంతో  సంతృప్తి లేదని అడుగడుగునా కనిపించే వివిధ స్థాయిల హోటెళ్ళు, వీధుల్లో పక్కన కనిపించే తిండి బళ్ళు నిరూపిస్తాయి. వీటితో పాటూ అడుగడుగునా కనిపించే కిటకిటలాడే మద్యం దుకాణాలు, ఆస్పత్రులు ఈ అసంతృప్తి ఫలితాలను గుర్తుచేస్తూనే వుంటాయి. ఇక ధనంతో సంతృప్తి లేదన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఉన్నత స్థాయి నుంచి అతి క్రింద స్థాయి వరకూ ప్రతి ఒక్కరూ అపరిమితమయిన, అంతం లేని, తీర్చలేని ధన దాహ రోగంతో బాధపడుతున్నారన్నది, అన్ని రంగాలలో, అన్ని స్థాయిలలో కనిపిస్తున్న అవినీతి అనంత స్వరూపం చెప్తూనే వుంది.

భార్య/భర్తతో సంతృప్తి చెందటం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రస్తుత సమాజంలో న్యాయస్థానాలే అక్రమాన్ని సక్రమం అంటూంటే, అక్రమాన్నే అభ్యుదయం అనుకునే దుర్బల మనస్కులు తమ బలహీనతలకు ఆదర్శం అనే ముసుగువేసి ప్రామాణికత సాధిస్తూంటే, సమాజం నిప్పులో దూకే దీపపుపురుగులా  అక్రమాగ్నులవైపు అతి వేగంగా పరుగిడుతూంటే, దిగజారుడుతనం, అసభ్యం, అనైతికం అన్న పదాల అర్థాలు శీర్షాసనం వేస్తున్న కాలం కళ్ళముందు కనబడుతూ జీవితాలు క్షణికావేషాలకు ఆవిరయిపోతూన్నాయి. నిరాశలు, నిస్పృహలు, అసంతృప్తులు, మానసిక దౌర్భాల్యాల నడుమ నిప్పులు చిమ్ములుంటూ నింగికి ఎగరాల్సిన జీవితాలు నెత్తురుకక్కుకుంటూ నేలకు రాలిపోతున్నాయి.

సమాజం ఇలాంటి అనైతిక, అవినీతి నిండిన, అనర్ధపు అనవసర ఆవేషాల,  దౌర్బల్యాల సమాజంలా దిగజారటంలో ప్రధాన పాత్ర సాహిత్యం పోషించటం అత్యంత బాధాకరమైన విషయం. సాహిత్య సృజన మానవ సంబంధాల్లో రాజీపట్ల  అసహనాన్ని, మంచి పట్ల అసహ్యాన్ని, ఉత్తమ వ్యక్తిత్వం పట్ల రోతనూ కలిగించే రీతిలో పధ్ధతి ప్రకారం చేస్తూ, తమకు వ్యతిరేక భావాలను వ్యక్తపరచే సాహిత్యాన్ని సాహిత్యంగానే గుర్తించేందుకు ఇష్టపడక , అనాగరికులకన్నా కనిష్టమైన సంకుచితత్వాన్ని ప్రదర్షించటం మరింత శోచనీయం.

మంచి సమాజం కోరే రచయితలు, భావి తరాలకు శాంతి, ప్రశాంతమయిన ఆనండకరమైన జీవితాన్ని అందించాలని ఆశించే సహృదయులైన రచయితలు ఆలోచించాల్సిన సమయం ఇదే. అందరూ కలసికట్టుగా ఉత్తమ సాహిత్య సృజనకూ, సమాజ హిత రచనల సృజనకూ నడుము కట్టల్సిన సమయమూ ఇదే. విప్లవం పేరిట, తిరుగుబాటు పేరిట తమ బలహీనతలకు సైద్ధాంతిక ముసుగులు కప్పి, ప్రామాణికత సాధించాలని ప్రయత్నిస్తున్న నీలినక్కల మనస్తత్వం ప్రదర్శిస్తున్న రచయితల ముసుగులు తొలగించి, మసకలు పోగొట్టి, భావితర హితం దృష్టిలో వుంచుకుని మంచిని పెంచే రచనలవైపు దృష్టి సారించాలి. అలాంటి వెన్నముక కల,  నిబద్ధతతో సృజించే రచనలకు సంచిక ఆహ్వానం పలుకుతున్నది.

విభిన్నమైన శీర్షికలతో, వినూత్నమైన రచనలతో, ఉత్తమ సాహిత్యాన్ని పాఠకులకు చేరువ చేయటం ద్వారా పఠనాసక్తిని పెంపొందించాలని, పాఠకులను ఆకర్షించాలని సంచిక ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే త్వరలో సంచిక వార పత్రికలోనే కాదు, మాస పత్రికలోనూ మార్పులు చేస్తున్నది.

తెలుగులోనే కాదు, హిందీ, ఇంగ్లీష్ రచనలను కూడా అందించే ప్రయత్నాలు చేస్తున్నది సంచిక. అలాగే, తెలుగులోని రచనలను ఇతర భాషల్లోకి అనువదించి అందించే ప్రయత్నాలూ చేస్తున్నది. ఇతర భాషల్లోని సమకాలీన రచనలను తెలుగులో అందించాలనీ ప్రయత్నిస్తున్నది.

త్వరలో సంచిక కథల పోటీని, కవితల పోటీనీ ప్రకటిస్తుంది.

అలాగే విభిన్నమైన సాహిత్య కార్యక్రమాలను జూమ్ ద్వారానూ, సభల ద్వారానూ నిర్వహించే పథకాలనూ వేస్తోంది సంచిక. ప్రయత్నం ఏం చేసినా అనుక్షణం పాఠకులకు ఉత్తమ రచనలను అందించాలని, మందార మకరందం లాంటి ఉత్తమ సాహిత్యపు తేనెను వెతికి వెతికి తెచ్చి మరీ అందించాలని ఆత్ర పడుతోంది. సంచిక ఈ ప్రయత్నాలకు పాఠకాదరణ లభిస్తుందనీ, ఉత్తమ సాహిత్యానికి తెలుగు పాఠకులు ఎప్పుడూ పట్టం కడతారన్న విశ్వాసం సంచికకు వుంది.  ఇందుకు రచయితలనుంచి, పాఠకులనుంచీ సహాయ సహకారాలు, ఉత్సాహ ప్రోత్సాహాలను సంచిక అభ్యర్ధిస్తున్నది.

1 జూలై 2025 నాటి ‘సంచిక మాసపత్రిక’లోని రచనలు:

సంభాషణం:

ధారావాహిక:

కాలమ్స్:

పరిశోధనా గ్రంథం:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కథలు:

కవితలు:

పుస్తకాలు:

బాలసంచిక:

అవీ ఇవీ:

~

English Section:

~

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

Exit mobile version