Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎదిగివచ్చిన మాదిరాజు

[శ్రీ కోవెల సుప్రసన్నాచార్య రచించిన ‘ఎదిగివచ్చిన మాదిరాజు’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]

1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించింది. తెలంగాణా రచయితలు అందరూ కాళోజీతో సహా ఆంధ్రప్రదేశ్ అవతరణను ఆహ్వానించారు. ఆంధ్రభాషా సంస్కృతుల వికాసానికి దోహదమవుతుందీ రాష్ట్ర నిర్మాణమని నాటి భావన. సమాచార శాఖ డైరెక్టరుగా గోపీచంద్ వచ్చారు. ఆశాఖలో కుందుర్తి, గోపాల చక్రవర్తి, శీలా వీర్రాజు వంటివారు ఉద్యోగులుగా ఉన్నారు. అనువాద శాఖలో అధిపతిగా భీమన్న వచ్చారు. ఆకాశవాణిలో దాశరథితో బాటు క్రమంగా కృష్ణశాస్త్రి, మునిమాణిక్యం, బుచ్చిబాబు, స్థానం నరసింహరావు ఇత్యాదులైన దిగ్గజాలు – ఇంకా విడిగా అబ్బూరి రామకృష్ణారావు ఇలా ఎందరో ఎందరో తెలుగు సాహిత్యానికి ఒక వసంతం వచ్చినట్లుగా ఉన్నది ఆనాటి వాతావరణం.

నెమ్మదిగా వచన కవిత్వ ఉద్యమం పొటమరించసాగింది. మృదుభాష, దృఢ స్వభావుడు కుందుర్తి అందరిని కలుపుకొని పోతూ వచన కవిత్వమే కవిత్వానికి ప్రధాన వాహని అని ప్రచారం చేసేవాడు. తాను శక్తిమంతములైన రచనలు చేస్తూ వచ్చాడు. పద్దెనిమిది పర్వాలతో తెలంగాణా కావ్యం వెలువడింది. ఒకానొక సమపాద వ్యవస్థ, రూపకాలంకార బాహుళ్యము దాన్ని ఆమోదయోగ్యం చేశాయి. ఆధునిక వచన కావ్యరూపంలో ఇంకా స్పష్టమైన వ్యవస్థ ఏర్పడని స్థితిలో ఒక వస్తువు నాశ్రయించి అంతటి దీర్ఘమైన కావ్యాన్ని నిర్మించటం ఒక సాహసమే. సాఫల్యమే. ఆ తరువాత ‘యుగే యుగే’ వచ్చింది. నెమ్మదిగా కుందుర్తి తన ప్రగతివాద పరిమితులను ఛేదించుకొని రూపాన్ని నొక్కుతూ పట్టుబిగిస్తూవచ్చాడు. 1957లో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ అకాడమీ వార్షిక సమావేశాలు ఆంధ్రప్రదేశంలోని సాహిత్య పరులందరినీ ఏకం చేస్తూ ఒక ఉత్సవ వాతావరణాన్ని సమకూర్చాయి. 1957లోనే తెలంగాణా రచయితల సంఘం తన పరిమితులను విస్తరించుకొని ఆంధ్రరచయితల సంఘంగా రూపాంతరం చెందింది. అయితే దాశరథి, నారాయణరెడ్డి వంటి సృజనాత్మక రచయితలు చేతులలోంచి జారిపోవటంతో ఆంధ్ర రచయితల సంఘం తన మౌలిక స్వభావం కోలుపోయింది.

మాదిరాజు రంగారావు తన రచనలను 1954 ప్రాంతాలలో ప్రారంభించినా తెలంగాణం నుంచి వచ్చిన కవులలో ఒంటరిగా రూపనిష్ఠను కచ్చితంగా పాటించినాడు. కుందుర్తి ఉద్యమరూపకల్పన కంటే ముందే, తన నిరంతర కవితా వ్యాసంగాన్ని వచన పద్యంలోనే సాగించాలని నిశ్చయించుకున్నాడు. పద్యంలో చేరి మనం కొత్తగా సాధించగలిగింది ఏముంటుంది అన్నది ఆయన ఊహ కావచ్చు. ఏది ఏమైనా వచనమే ఆయనకు కావ్య మాధ్యమం అయింది. అయితే రంగారావు ఎప్పుడూ ప్రగతివాద కవుల, ప్రయోగవాద కవుల పరిమితులలో ఇమిడిపోలేదు. కాదు అని సంప్రదాయ మార్గంలో సాగిపోనూ లేదు. ఆయన జాతీయ ప్రజాస్వామ్య దృక్పథానికి అంకితమై ఈనాటికీ సాగిపోతున్నాడు.

1957లో ‘కిర్మీరం’ అనే పేర ఆయన కవితాసంపుటం తొలిసారిగా బయటకు వచ్చింది. దీన్ని శ్రీశ్రీకి అంకితం చేశాడు. ఆయన సాహిత్య సృజన ఎప్పుడూ నిరుద్ధం కాలేదు. ప్రవహిస్తూనే ఉన్నది నిరంతరంగా కిర్మీరం అంటే బహువర్ణ శబలచిత్రం. ఇదీ ప్రపంచం ఆయనకు. శిలా సదృశమైన ఏ స్థితిలోనూ నిలిచి ఉండలేదు.

‘వీచే గాలిలా మ్రోగే నదీ తరంగంలా దూకే జలధారాధునిలా మెరసే నవ విద్యుల్లేఖా పుష్పంగా హసిస్తూ నిత్యం చరించడం జీవసృష్టివైలక్షణ్యం’. (పే. 15) ప్రపంచాన్ని ఇలా ఆయన భావించింది ‘భిన్నత్వం అనిశ్చలత్వం క్షణ క్షణం వినూతనత్వం రూపరేఖలు మారే గుణం భౌతిక ప్రాపంచిక లక్షణం’ (పే. 14) ఇదీ ప్రపంచాన్ని గురించిన రంగారావు దృష్టి. సుమారు యాభై సంవత్సరములుగా సాగివస్తున్న రంగారావు సాహిత్య ప్రస్థానం మానవుడి అంతర్బహిర్జగత్తుల సమన్వయం కోసం సాగిస్తూవున్న కృషి.

1957 తరువాత 1962 వరకు రంగారావు ‘మేల్కొన్న ఆకాశం’, ‘మనో భూమికలు’, ‘అద్దంలో నీడలు’, ‘పృధ్వీగీతం’, ‘మాలో ఉదయం’ ప్రకటితమయ్యాయి.

1971లో రంగారావు ప్రకటించిన ‘మానవీయం’ తెలుగు సాహిత్యంలో విశిష్టునిగా ఆయనకు స్థానాన్ని కలిపించింది. అంకితంలో జగత్తును వివర్తంగా పేర్కొనటం ఆయనకు గల అద్వైత నిష్ఠను ప్రకటించింది. మానవ జీవనంలో ఆదినుంచి నేటివరకూ సాగిన వివిధ పరిణామాలు, విరోధాలు వివిధములైన అనుభవాలు సమగ్రంగా చిత్రించిన ఆధునిక కావ్యాలలో బహుశా ఇదే మొదటిది. ‘నేటి సంఘర్షణలోని క్లిష్టస్థితుల నుండి ఆగామి యుగంలో పునర్జన్మవలె కనిపించే మానవుని మహోదారరూపం, ఉదాత్తమైన మరో లోకాన్ని సృష్టించుకొని, విశ్వసంస్కృతి భూమికలో అవతరిస్తుందన్న ఆశతో కావ్యం ముగుస్తుంది’. ఆగామియుగం మానవుని ప్రస్తుత పరిమితులను ఛేదించే పునర్జన్మ. అది మహోదారం ఉదాత్తమైన మరోలోకం.

‘ఓ మైత్రీ రమ్యులారా! మీరే చెట్టెక్కి కూర్చున్నా ఇట్టే పట్టేస్తుంది ఉదయం. సిద్ధాంతాలు చర్చల సుడి గుండాలతో తలదూరిస్తే ఎక్కడ తేలేదీ లేదు. లోతు, ఎత్తు కలిగిన అనుభూతులు హేతువాద సమరేఖల కందవు. వ్యక్తుల సంస్కారంతో సమాజం సంస్కృతమవుతుంది. సమాజం ఎదుగూ బొదుగూలేని రాతిబొమ్మ కాదు. ఉదయం ఎర్రదనంతో పాటు వివిధ వర్ణాలూ ఉన్నవి సృష్టిలో జీవితం ఫొటోకాదు ఫ్రేములో బిగించటానికి’ రంగారావు తన కావ్యంలో ఇచ్చిన సందేశం పరిపూర్ణ జీవనావిష్కారాన్ని కాంక్షించేది.

భారతీయ తత్త్వ చింతనలో జగత్తును మిధ్యగా దుఃఖమయంగా భావించే దశ ఒకటైతే జగత్తును దివ్య చైతన్య మయంగా పరిణమింపజేసుకునే దిశమరొకటి. భక్తి ఉద్యమకాలం నుంచీ ప్రయత్న శీలంగా భారతీయ తాత్త్వికులు ఈ సమన్వయాన్ని లక్షిస్తున్నారు. వర్తమాన భారత సంస్కృతి వికాసంగా జగన్నిర్మాణాన్ని లక్షించారు. మాదిరాజు రంగారావు మానవీయం నిర్మించిందీ దృష్టితోనే. విరసం జన్మించిందీ ఇంచుమించుగా ఒకే కాలం కావటం గమనించదగ్గ అంశం.

1970 దాకా వచన కవిత్వం బలం పెంచుకుంటూ వచ్చింది. అరవైలలో ప్రచురితమైన ‘నవత’ లో కవితను గురించి తిలక్ వ్రాసిన గీతం దాదాపుగా సర్వామోదం పొందింది. ప్రయోగవాదం పేరుతో చేసే నానా బింబ సంక్లిష్ట సంయోజనాన్ని ఆయన నిరసించారు. కుందుర్తి ఈ మార్గాన్ని ఒక ఉద్యమంగా నిర్వహిస్తే తిలక్ ఒక కవిత్వచైతన్యాన్ని కలిగించాడు. తిలక్ ద్వారా వచన కవిత్వంలోకి అనుభూతి ప్రవేశించింది. ఆకృతిలో కాల్పనిక కవుల సౌకుమార్యం ఆవరించింది.

విమర్శకులు ఎంతగా కుంచించుకుని* రంగారావు కవిత్వాన్ని పేర్కొనకుండా ఉపేక్షించినా, ఆయన క్రమంగా స్వతంత్రంగా ఎదుగుతూ వచ్చాడు. ఈయన కవిత్వంలో ప్రధానంగా మూడు దశలు గమనించవచ్చు. ప్రారంభంనుంచి 1962 దాకా ప్రాథమిక దశ. ఈ కాలంలో కావ్యానికీ, కావ్యానికీ మధ్య కవి తనకు వెదుక్కుంటున్నాడు తన గొంతును పోల్చుకుంటున్నాడు. తనలోని పూర్వసంస్కారాల సంపుటినించి తనకు విడగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తన శైలిని నిర్మించుకుంటున్నాడు. రెండవదశ 1971వరకు ఈ దశలో కవి తన వ్యక్తిత్వంలో భావుకత, తాత్త్వికతలను స్వీయ చైతన్యంతో నిర్మించుకుంటున్నాడు. జాతీయ వాద పరిమితులను దాటి విశ్వచైతన్యంలో తనను అనుసంధించుకొనే ప్రయత్నంలో ఉన్నాడు. గతాన్నీ వర్తమానాన్ని గమనించి భవిష్యత్సేతువును సంధానించుకొంటున్నాడు. తొలి దశలోని తత్సమ బహుళ భాషనుంచి సరళమైన తెలుగులోకి ప్రసరిస్తున్నాడు.

మూడవ దశలో (1985 వరకు) కవి పరిణతుడు. బహు ప్రయోగకుశలుడు. విచిత్ర శిల్ప బంధురమైన శైలీ నిర్మాత. ఒకింత ఆధ్యాత్మచింతలోకి చొచ్చుకొని పోయి అక్కడ విశ్రమించనెంచేవాడు. వాక్యాలు పొడవుతగ్గాయి. వస్తు వైవిధ్యం పెరిగింది. జగత్తును అనంత ముఖంగా దర్శనం చేస్తున్నాడు. అయితే రంగారావు కవిత్వంలో ఆదినుంచి కానవచ్చే లక్షణం వాచ్యం కాకుండా భావాన్ని వెల్లడించే జాగ్రత్త గైకొనడం. ఇందుకోసం ఆయన ప్రకృతినించి ప్రతీకలను వాడుకుంటాడు. శ్రీశ్రీ మొదలైన ప్రగతివాద కవులు, కుందుర్తి మొదలైన వాళ్లు కూడా పౌరాణిక ప్రతీకలను వాడగా రంగారావు ఎప్పుడూ ఆ పని చేయడు.

ఇంద్రియ శక్తుల వశమై ఒక పార్శ్వం భౌతిక భూమి అవుతుంది ఇంద్రియ శక్తుల స్వాధీనంలో ఒక పార్శ్వం ఆత్మశిఖర మవుతుంది

మనస్సులో సూర్యుని అరుణ రశ్మిలో
హృదయంలో చంద్రుని సుధాకాంతిలో
భౌతికం నుండి మనిషి అతీతానికభిలాష పడేను నిరంతరం

(స్వేచ్ఛా కవిత్వం (2003) పే. 437)

Exit mobile version