[శ్రీమతి గీతాంజలి రచించిన ‘దుఃఖమే ఏకాంతం!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]
ఒంటరితనం కోరుకుంటాం..
మనది తన్హాయి దిల్ అనుకుంటాం.
ఎవరూ అక్కర్లేదు అనుకుంటాం.
కానీ మనకి మనుషులే కావాలి
మనల్ని గాయపరిచే మనుషులు కావాలి
ఆ గాయాల్ని దోసిట పట్టి
పొగిలి పొగిలి ఏడవడమే కావాలి
ఒంటరితనం అనుకుంటాం కానీ..
ఎక్కడ ఒంటరిగా ఉంటాం చెప్పండి..
ఒంటరితనంలో..
మనల్ని మనం
వెయ్యి ముక్కలుగా విరగ్గొట్టుకుంటాం..
వెయ్యి మనుషులం గా మారిపోతాం..
మనతో మనమే మాట్లాడుకుంటాం..
ద్వేషిస్తాం.. స్వంత గాయాలు చేసుకుంటూ.. రోదిస్తాం..
అందుకే దగ్గరికి రానిధ్ధాం.. మనుషుల్ని..
రంగు రంగుల మనుషుల్ని..
ముళ్లున్న మనుషుల్ని.
రంగులు మార్చే..
ముళ్ళతో గుచ్చే మనుషుల్ని..
వాళ్ళ గాయాల్ని ఏకాంతంలో
తలుచుకుంటూ దుఃఖించడానికి.
అవును.. దుఃఖమే ఏకాంతం!
శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ త్వరలో రానున్నది. ఫోన్: 8897791964