[డా. జి వి పూర్ణచందు గారు రచించిన -డా. పోచిరాజు శేషగిరిరావు సాహితీ వైభవం- అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
స్వాతంత్ర్యానికి పూర్వమే, ఆంధ్ర రాష్టావతరణ కన్నా పూర్వమే తెలుగుని అధికార బాషగా చేయటాన్ని అంత గట్టిగా ప్రతిపాదించిన వారు వేటూరి ప్రభాకరశాస్త్రిగారు. ఆ విషయాన్ని లోకానికి వెల్లడి చేసినవారు డా. పోచిరాజు శేషగిరిరావుగారు.
“తెలుగు అధికార భాష కాక తప్పదనీ, కోర్టులలో, కార్యాలయాలలో సమస్త రాజకీయ వైజ్ఞానిక విషయాలలో తెలుగు రావాలని 1945లో తిరుపతి ఓరియంటల్ కళాశాల వజ్రోత్సవములలో ప్రభాకరశాస్త్రిగారు తమ భావములను నిర్నిబంధముగా వెల్లడించినారు. ఆనాటి సభా వేదికపై నున్న వైస్రాయి కౌన్సిల్ సభ్యులు శ్రీ ఆర్కాటు రామస్వామి మొదలియారు. మదరాసు విశ్వవిద్యాలయోపాధ్యక్షులు శ్రీ ఆర్కాటు లక్ష్మణ స్వామి మొదలియారు గారు తమ హర్షామోదములను ప్రకటించారు”. (అధ్యాపకులలో అమృత మూర్తులు)
వేటూరి వారి శిష్య సంతతి
ప్రభాకరశాస్త్రిగారి యోగ శిష్యులలో కొత్త వెంకటేశ్వరరావు, కొత్త రామ కోటయ్య, అర్చకం ఉదయగిరి శ్రీనివాసాచార్యులు, ఏం. ఎల్. నారాయణ రావు, వెన్నెలకంటి మునిక్రిష్టయ్య, గాలి బాల సుందరరావు, తిమ్మావఝుల కోదండ రామయ్య, సింగరాజు సచ్చిదానందం, పోచిరాజు శేషగిరిరావు, శ్రీమతి కల్పవల్లి, శ్రీమతి చంద్రకాంతమ్మ మొదలైన వారున్నారు. వీళ్ళని యోగప్రభాకర కిరణాలు అనేవాళ్లు.
పెద్దాపురం సాహితీ ప్రముఖులు
డా. పోచిరాజు శేషగిరిరావు పెద్దాపురం సాహితీమూర్తుల్లో ప్రముఖులు. ఏనుగు లక్ష్మణకవి, వేదుల సత్యనారాయణ శాస్త్రి, మల్యాల జయరామయ్య, అల్లంరాజు లక్ష్మీపతి, పోచిరాజు శేషగిరిరావు, మధునాపంతుల వేంకట పరమయ్య, వడలి సుబ్బారాయడు, పంపన సూర్యనారాయణ, కామ్రేడ్ యాసలపు సూర్యారావు వీరంతా పెద్దాపురం కేంద్రంగా తెలుగు సాహితీ సుసంపన్నతకు కారకులైన వ్యక్తులని కృష్ణబాబు వ్రాసిన -పెద్దాపురం సాహితీ మూర్తులు- పుస్తకం పేర్కొంది.
1990 భారతిలో -మరుగున పడిన మల్యాల జయరామయ్య- అనే వ్యాసంలో అలవోకగా తెలుగు కవుల జీవన విధానం గురించి ఆయన చేసిన వ్యాఖ్య 35 యేళ్ళ తరువాత ఈనాటికి మరింత బాగా వర్తిస్తుంది. “తెలుగునేలలో ఏ మల్లాది రామకృష్ణశాస్త్రో, కాటూరి వేంకటేశ్వర రావో వంటి, జీవికకు తడవుకో నవసరంలేని వసతి వాడులు కలవారే కొద్దిమందో తక్క తక్కిన కవులు పండితులూ అంతా ఏదో ఉపాధికి మార్గం చూచుకొని అందులో కుదురుకొని ఆ తర్వాత తమతమ కభిమతాలైన సాపితీపథంలో సంచారం చేసినవాళ్ళూ, పేరు ప్రతిష్ఠలు గడించినవాళ్లున్నూ” అని! కవిత్వమే జీవికగా కలిగిన వారెవరూ లేరని దీనర్థం. సినీ కవులకు ఈ విషయంలో మినహాయింపు. మనం విలువలతోనూ వలువలతోనూ కూడిన సాహిత్యం గురించి మాట్లాడుకుంటున్నాం!
ప్రముఖ పరిశోధకులు
పరిశోధకుల్లో శోధకులు మరింత ఉన్నతంగా ఉంటారు. వేమన సర్వజ్ఞుల గూర్చి గంధం అప్పారావు, ధూర్జటి గురించి టి. బి. యం. అయ్యవారు, పొన్నెకంటి హనుమంతరావు, పెద్దన గూర్చి సాళ్య కృష్టమూర్తి, కోలాచలం నాటకాల గూర్చి యస్, గంగప్ప, బసవేశ్వర వచనాల గురించి బాడాల రామయ్య, విజయ విలాసం గూర్చి కలిదిండి వెంకటరాజు; వేలూరి శివరామశాస్త్రి గురించి జంధ్యాల మహతి శంకర్, వేటూరి ప్రభాకర శాస్త్రి గురించి పోచిరాజు శేషగిరిరావు శ్రీశ్రీ గురించి మిరియాల రామకృష్ణ శోధించారు. వీళ్లు స్వకీయమైన శోధకులు. ఎత్తిపోతల పథకాలకు అతీతులు. -వేటూరివారి సారస్వత వరివస్య- పోచిరాజువారి సిద్ధాంత గ్రంథం.
వేటూరి ప్రభాకరశాస్త్రి జీవిత చరిత్ర
“కవితలో – పరిశోధనలో – సాహిత్య విమర్శలో – గ్రంథ పరిష్కరణలో, సంకలన గ్రంథ ప్రచురణలో, శాస్త్ర వాజ్మయ సంశోధనలో – దేశి, మార్గ సాహిత్య వివేచనా పటిమలో – శాసన వాజ్మయ పరిష్కారంలో – చరిత్ర పరిశోధనలో = లిపి సంస్కరణలో – జానపద సాహిత్య సమారాధనలో – ఆంధ్ర సంస్కృతి వికాసానికి కైంకర్య మొనరించడంలో – గాలికి చెదరి, జనుల నోళ్ళలో నాని, తాటియాకుల్లో చివికి, స్మృతిపథమే వాసస్థానంగా బ్రతుకుతున్న చాటుపద్యాల నేర్చి కూర్చి, సంధానించి ప్రకటించుటలో- ప్రభాకరశాస్త్రిగారిని ఏ వైపు నుండి చూసినా ఏడు నిలువుల ఎత్తున సాక్షాత్కరిస్తారు. కలం పట్టనపుడెల్తా కలకాలం నిలిచే క్రొత్త సంగతు లెన్నో త్రవ్వి పోసిన విశిష్ట ప్రజ్ఞా దురంధరులు..
జీవితంలోనూ, సాహిత్యంలోనూ ఉత్తమ విలువలను దర్శించి, రెండింటిలోనూ పరమార్టం తఅచి చూచిన మహావ్యక్తి-సాహిత్యానికి ఒక | పయాజనం ఉండాంలని వారి నిండు నమ్మకం ! సజాతీయ విజాతీయ భాషా సాహిత్యాల అంచులు మాట, లోతులు తీసి, సాదృశ్యవైదృశ్యాలను సమ్యగ్దృష్టితో మధించి, మీదు కట్టిన మేలి మీగడలతో తెలుగు తేటలను గూర్చి, తేర్చి తెలుగు జాతి కందిచ్చుట ఆయన ఉపజ్ఞ. అట్టి సమన్వయమే రసప్రలుబ్దులకు పరిశోధన పరాయణులకు రసాయనమని ఆయన ఆజ్ఞ” అంటారు తన గురుదేవులు, సాహితీ ప్రియంభావుకులందరికీ గురువు వేటూరి ప్రభాకరశాస్త్రి గారి గురించి వేటూరి ప్రభాకరశాస్త్రి జీవితము-వాఙ్ఞ్మయ సేవ” గ్రంథంలో శ్రీ పోచిరాజు శేషగిరిరావు.
“రసమయమైన మీ హృదయ రమ్య సరోవరమందు హంసనై
మసలిన నాటి దృశ్యములు మర్మ ములన్ గదలించి వైచుచున్
విసపు కణమ్ము భాతి పరివేదనముం గలిగించి నా హృదిన్
మసిగ నొనర్చుచున్నయవి మాటికి మాటికి జ్ఞప్తి వచ్చుచున్”
అంటూ వేటూరివారి మరణానికి సంతాపం ప్రకటీస్తూ తన గురుదేవుయ్లకు నివాళి అర్పించారు.
కాదంబరి వ్యాస సంపుటి
మధుమంజరి వ్యాస సంపుటి, ఆనందవల్లి ఖండకృతి, ముక్తాలత గేయకవిత, కాదంబిని సాహిత్య వ్యాసాలు, శారదా మంజీరాలు (సాహితీ మూర్తుల జీవన చిత్రణ), తేజో వలయాలు భక్త కవుల చరిత్రలు, వీరి రచనలలో కొన్ని కాగా, వేటురి వారి సారస్వత వరివస్య వీరి సిద్ధాంత వ్యాసగ్రంథం. తెలుగు విశ్వవిద్యాలయం కోసం వేటూరి వారి జీవితం సాహిత్యం పేరుతో అనేక కొత్త సంగతులను వెలుగులోకి తెచ్చారు. వేటూరి వారి గురించే కాదు, శ్రీనాథుడి గురించి ఒక సమగ్ర అవగాహన కావాలంటే పోచిరాజువారి -కాదంబిని- సాహిత్య వ్యాగ్రంథం చదవాలి. శ్రీనాథుని వాగ్వైభవం, ఆయన వ్యక్తిత్వం, జీవిత విశేషాలెన్నో పోచిరాజు వారు నిర్మలమైన అద్దంలో ప్రతిబింబింపచేస్తారు.
ఇది రెండు భాగాల వ్యాసనంపుటి. మొదటిభాగం శ్రీనాధుని వాగ్వైభవం, శ్రీనాధుని వ్య క్షిత్వం, జీవిత విశిషాలు నిర్మలమైన అద్దంలో ప్రతికృతిలాగ చూపుతుంది. రెండవ భాగంలో ఆంధ్రసాహిత్యంలో గ్రామకరణాలు, మీసాల కవిత-, సాహిత్య నందనంలో చారు (నారి) కేశాలు, జీవితము- కళ, సాహిత్యము: విలువలు, పొగక్రోవి; కవితారసపు జల్లులు, పెద్దావుర సంస్థానము: సొహిత్యపోషణ – అనే వ్యాసాలు ఉన్నాయి.
శ్రీనాథుని రచనలు, ఆశ్రయం వర్ణణవైభవం వగైరా వివరించి చెప్పడం పోచిరాజు శేషగిరిరావుగారి సాహిత్య హృదయశక్తికి ప్రతిబింబంగా కనిపిస్తుంది. శ్రీనాధుణ్ణి గురించి తెలునుకోవాలనే ఆశగలవారికి బాగా ఉపయోగించే వ్యాసాలున్నాయి. యువతరం భాషాభిమానులకు ఎంతో ఉపకారి యీగ్రంథం.
రెండవ భాగంలో వ్యాసాల్లో ‘మీసాల కవిత’ – ఓర్పుగా, చదవవలసేది. ఈ వ్యాసంలో కూడా శ్రీనాథుడిదే అగ్రపీఠం. ఆయా కవుల గ్రంథాలలో ఉన్న మీసాల ప్రసక్తికి సోదాహరణంగా చూపుతూ ఆధునిక కవుల చాటువులను చూపుతూ పౌరుషాన్ని ప్రశంశిస్తూ వ్రాశారు.
దానివంటిదే ‘పొగక్రోవి’- వ్యాసం ధూమపానాన్ని ఖండిస్తూ వ్రాసిన రచన. పొగ త్రాగనివాడు దున్న పోతైపుట్టున్ _ వంటి చాటువులు గుదికూర్చి వ్రాసిన వ్యాసం ఇది.
చివరి వ్యాసం పెద్దాపుర సంస్థానాధీశులూ వారిలో కొందరు కవులూ ఆ సంస్థాధీశుల ఆశ్రయం పొందిన ఏనుగు లక్ష్మణకవి వంటి కవులూ ఆ వ్యాసం వల్ల తెలుస్తారు-శేషగిరిరావుగారు ఈ వ్యాస సంపుటిలో ఉపయోగించిన భాష చాలవరకు గ్రాంథికమే అయినా సుకుమారంగా, సర్వజనామోదకరం గా ఉంటుంది!
జీవిత చరిత్రల రచయితగా పోచిరాజువారు.
పోచిరాజువారు బాధ్యత కలిగిన సామాజిక కవి కూడా! – తేజో వలయాలు – ఏకనాథుడు, మురారి, బాపు లాంటి సంస్కర్తల చరిత్రల్ని వివరించేప్పుడు హరిజనుల విషయాన్ని ఆయన ప్రేమపూర్వకంగా వ్రాయటాన్ని గమనించవచ్చు. ఏకనాథుడి కథలో హరిజనుల్ని ఆదరించిన కారణంగా బ్రాహ్మణ వెలిని ఎదుర్కొనటం, చివరికి నిందించినవారే పశ్చాత్తప్తులు కావటాన్ని రమణియంగా చిత్రిస్తారు.
జీవిత చరిత్రలు ప్రభావం కలిగించేవిగాను, మన పూర్వుల పట్ల గౌరవం కలిగించేవిగానూ ఉండాలని ఆయన లక్ష్యంగా ఈ రచన చేశారు. యాఙ్ఞవల్క్యుడి నుండి మహాత్ముడివరకూ ఎందరి జీవితాలనో ఆయన స్పృశించారు. మతమూ మనశ్శాంతీ అనే వ్యాసంలో మతానికీ సైన్సుకీ ముడి కుదురుతుందంటారాయన. మతం మనిషికి మానసిక ప్రశాంతత నిస్తుందన్నారు.
నన్నయ గురించి
పోచిరాజు వారికి నన్నయ, కాళిదాసు, గాంధీ మహాత్ముడంటే ఎంత ప్రీతో గోదావరి అంటే అంత భక్తి.
1-4-1981లో నన్నయ గురించి -పదార్చన- పేరుతో ఆయన వ్రాసిన ఖండకృతిలో ఈ పద్యం చూడండి:
“మద మాతంగ తురంగ కాంచన లసన్మాణిక్య గాణిక్య సం
పదలం దేలు చళుక్యవల్లభుఁడు ప్రాపై నిల్వ, వాగ్వైదుషీ
పదవిభ్రాజితుఁడైన నన్నయకవి ప్రాలేయ శైలమ్ము – నె
మ్మది వేయేండ్లకు మున్ను భారతము నిర్మాణించె నుడ్డోలుఁడై”.
కాళిదాస విలాసం
1978 మే నెల భారతిలో – కాళిదాసవిలాసాన్ని ఒక పద్యంలో పోచిరాజువారు ఎంత గొప్పగా వర్ణించారో చూడండి:
“ఒక ‘యక్షకాంత’ ప్రియునికినై విరహమ్ము
పడి మేఘమాలతో పంపె వార్త
ఒక తలోదరి -మాళవికి రసోత్తర నాట్య
భంగిమచేత సంబరము కూర్చె
ఒక యప్సరఃకాంత యునికి ఆశమవాటి
లావణ్యవిణ హేలగను మీటె
ఒక్క యూర్వశి- వికమోర్వీశు తన దృగ్వి
లా సమ్ముతోడ లాలసుని జేసె
ఊహ చేసిన మూర్తులై యుండు నొక్కొ
ఈహతో సృజియించిన వేమొ యివ్వి!
వాస్తవజగొన నీకు సంప్రాప్తమయిరొ!
భోగపుష్కల! ఏమి చెప్పుదుము మేము?”
మహాత్మాగాంధీ గురించి
గాంధీ మహాత్ముని పైన భారతిలోనే వ్రాసిన ‘చంద్రునికో నూలుపోగు’ కవిత:
సత్య దేవతా చరణాబ్ది చంచరీక
మతుల హింసారహిత విష్టవాత్మకమ్ము
ఆత్మ తేజః ప్రదీప్త మహామహమ్ము
హిమగిరి సమమ్ము గాంధిజీ విమలయశము,
అతనిజాడలు జాతి జీవితమునందు
చెరగనేరని ముద్రతో చెన్నుమీరె
అతని జీవనసరణి ప్రహర్ష ఫణితి
భారతీయుల వారసత్వమ్ముగాగ
బోసినవ్వులతోన పులకించె విశ్వమ్ము
కాంతివర్షము మేన గదిరిసట్లు
దండి సత్యాగ్రహ ధగధగ ధ్ధగలలో
జాతీయతారేఖ సంతరిల్లె”
కోనసీమ ముంపుపై
1987 కోనసీమపై ప్రకృతి పగబట్టినట్టు విజృభించటం గోదావరి ఊళ్ళకు ఊళ్లను ముంచెత్తటం ఇంకా యావదాంధ్రులకూ గుర్తుండే ఉండి ఉంటుంది. 12-8-1987 ఆంధ్రపత్రిక భారతి సారస్వత సంచిక – కుపిత గోదావరి- కవితలో:
“కాట నొక్కడు ఆనకట్టను కట్టి | క్రమబద్ధమొనర్పగ
గౌతమీ తీరాన ప్రజలకు అన్నవస్త్రము లబ్బె నిండుగ,
పాత నదివని ఎఱుకచాలని పాలకులె అశ్రద్ధ చేసిరొ!
ఊరకుండిరో తాముపేక్షగ? ఏరులెచ్చటి కెగిరిపోవని?
గండ్లు పూడ్చుచు ఇండ్లు కట్తిన ఆర్యులున్నారనుచు కోపమ?
కూడు గూడును కోలుపోయిన గోడు గుడిబెడు ప్రజలపైనా?
ఎందుకీ ఆగ్రహము తల్లీ! తాపము ముడుపుము సైపు ప్రజలను!
వేదనాదము లుప్పతిల్లిన కోనసీమను ఊళ్లకూళ్లే
ముంచినావే వరద బురదను? పోలవరము పెకల్చినావే!
ధవళగిరి నీ వరద ధాటికి దద్దరిల్లినదంటతల్లీ!
పొంగి పొరలిన అపశ్రుతులకు-నింగిదాకు నహంకృతులకును
శిక్ష యిడియా! నదీమాతా! కక్షబూనకు, సాగరమ్మును
చేరుకొమ్మా! చేదుకొమ్మా! దీనమానవకోటి నెల్లను”
అని ఆగ్రహించిన గోదావరిని శాంతించమని కోరతారాయన. గోదావరి దారి సముద్రం వైపే గానీ ఊళ్ల వైపు కాదంటూ! (సాహిత్య వ్యాస సంవుటి. డా॥ పోచిరాజు శేషగిరిరావు వ. పెద్దాపురం)
అనుభూతి కవిత
1971 ఏప్రియల్ భారతిలో ‘అనుభూతి’ కవిత
“నిద్దురవోవ నాఙ్ఞయిడె-
నే శయనించితి నందుపొందుగన్
సురుచిర తావకీన సుమసుందర
నవ్య మరంద మాథురీ
భరిత దృగంచలోద్గత నవ
ప్రభలన్ దిలకించుఁ గోర్కి నం
బరమున వ్రాలితిన్ లలిత
మంజుల మార్దవమౌ పదద్వయిన్
గరములు మోడ్చి-భక్తి
యెనికిమ్మెసగన్ నయనాంచలమ్ములన్.”
స్నానసుందరి కవిత
స్నానసుందరి 1974-75 ఆంధ్రపత్రిక ఉగాది సంచిక
“నల్లనల్లని యిరులు పల్లవాధర కురులు
కబరీభరమ్ముగా సొబగు లూర్చుచు నుండె
వేణికాబంధ మింపూను మల్లెల దండ
తో సువాసింపంగ నా సుదతి హొయలొలికె
ఈ కేళ కూళిలో లోకమోహన మైన
ఈ విలాసిని జలప్లావనమొనర్చె”
పోచిరాజువారు పుస్తక రచన మీద పెద్దగా మనసు పెట్టిన వాడు కాదు. ఒక విధంగా అది సాహిత్యపరమైన లోపమే! పత్రికల్లో అడపాదడపా కవితలు, పద్యాలు గేయాలు, వ్యాసాలు వ్రాయటం మీదే ఎక్కువ దృష్టిపెట్టారు. ఆయన సమాకాలికులు సన్నిహిత మిత్రులు ఆచార్య తిరుమల రామచంద్ర స్థాయి కలిగిన శోధకుడైనప్పటికి వారనుసరించిన పుస్తకరచన మార్గంలోకి ఈయన వెళ్ళలేదు. చాలా సందర్భాల్లో తిరుమల రామచంద్ర గారు పోచిరాజువారి రచనలను ఉటంకించటం ఇందుకు సాక్షి.
పోచిరాజువారి రచనలు అచ్చయిన పత్రికలు కొన్ని మాత్రమే డిజిటలైజ్ అయి ఆర్కయివ్సులో కొచ్చాయి. అలా రాకుండా అనంత వాయువుల్లో కలిసిపోయిన రచనలు ఎన్నో!
విశ్వనాథవారి కల్పవృక్షంలో తార పాత్రపైన ఆయన చేసిన విశ్లేషణ అద్భుతమైనది!
“విశ్యనాథ తీర్పులో తార ధీధురీణ. మనస్విని “సర్వాంగ నుందరి. చతుర, జాచిత్య నెరింగిన పొడ” వాలి అన్నటు “తపస్విని” తార ప్రస్తావన రామాయణంలో కిష్కింధ కాండలో ఈ నాలుగు మూడు చోటులందే ఉన్నది. అయిసా తారను సజీవంగా రామాయణంలో నిలబెట్టిన కీర్తి శ్రీ సత్యనారాయణగారిది. ఏయే పాత్రల నెటుల ఎంతెంత పరిధిలో దిద్దవలెనో సంభాషణవల్ల నేమూర్తి కట్టించవలెనో (తిక్కన తీర్చి నట్లు లెస్స యెరింగిన మేటికవి. రన భావ సామగ్రికి దోహద కారియగునట్లు పాత్రలు దిద్దుట శ్లాఘనీయమైనది. ఆ పని విశ్వనాధ దక్షతతో నిర్వహాంచినాడు” అని ప్రశంసిస్తారు.
పోలీలనే బొబ్బట్లు
“నేతితో తడిసినవి నోటిలో కరగునవి తెలుగు పబ్బములలో చవులూరు బొబ్బట్టు
తేనె ధారలు చదిమి తీర్చినారెవ్వరో! ఊటలూరును నోరు ఉత్పుకత చూచినన్
తినగ తినగను తీపి చెడని వీ బొబ్బట్లు!తెలుగు రసనా తపఃఫలములీ బొబ్బట్టు!
బొబ్బట్ట సై సెదోడు పోళి కన్నడములో ఎబ్బెట్టు లేకుండా ఎన్నైన తినవచ్చు!”
డా. పోచిరాజు శేషగిరిరావుగారు ‘బొబ్బట్లు-మంచినీళ్లు’ పేరుతో 1983 ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో వ్రాసిన ఒక ఖండకావ్యంలో ఈ పద్యాలు తేలికైన భాషలో అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. ఎంత తిన్నా తీపి చెడని తెలుగువారి రసనాతపఃఫలాలుగా బొబ్బట్లను వర్ణిస్తాడు కవి. ఎబ్బెట్టు లేకుండా బొబ్బట్లు ఎన్నైనా తినవచ్చునంటున్నాడు. దక్షిణ భారతదేశపు భక్ష్యాల చక్రవర్తి బొబ్బట్టు.
ప్రాచీన కావ్యాలలో అంగరొల్లెలు, చర్పటి, అంగరపోళికలనే పేర్లతో కనిపించే వంటకం ఈ బొబ్బట్టే! అంగరొల్లె, ఛర్పటీ బాగా ప్రాచీన కాలం నాటి పేర్లు కావచ్చు. పూపః, అపూపః, పిష్టకః, పోలికా, కరంభళ ఇలాంటి పేర్లతో కూడా బొబ్బట్లను సంస్కృతంలో పిలుస్తారు.
తెలుగుతనాన్ని ఆరాధించిన ఒక మహాకవి పోచిరాజు శేషగిరిరావు. వేటూరి ప్రభాకరశాస్త్రిగారి శిష్యుడు కావటమే తన జన్మ ధన్యతగా భావించిన వారాయన. వేటూరివారి రచనలపై విశ్లేషణలతో నడిచిన మణిమంజరి పత్రికకు తిరుమలరామచంద్రగారితో కలిసి సంపాదకత్వం వహించారు.
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.
