Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దొంగలకు విజ్ఞప్తి!

[శ్రీ కొండూరి కాశీ విశ్వేశ్వరరావు రచించిన ‘దొంగలకు విజ్ఞప్తి!’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

దొంగగార్లూ నమస్తే! మీరు తొందరపడి నా ఇంటి తాళం పగలగొట్టకండి. నా ఇంట్లో కనీసం అల్యూమినియం సామాన్లు కూడా లేవు. పొయ్యి లేదు, స్టవ్వు కూడా లేదు. నాకు వెండి బంగారముల మీద మోజు లేదు. ఎందుకంటే నేను సన్యాసిని. అందుకని పట్టుచీరలు కూడా ఉండవు. అసలు బీరువానే లేదు. మీకు కనీసం గెడ్డం గీసుకునే రేజరు, బ్లేడులు కూడా దొరకవు. ఎందుకంటే గెడ్డాలు, మీసాలు బాగా పెంచి సంవత్సరానికోసారి గుండు గీయించుకుంటాను. నా జుట్టుని మాత్రం అమ్ముకొని, ఆ డబ్బుతో నిశ్చంతగా జీవిస్తున్నాను. చింత లేనివాడే చక్రవర్తి.

ఇక ఎక్కడ అన్నదానాలు జరిగినా, అక్కడ రెండు పూటలకు కావలసినంత భోజనాన్ని ఫుల్లుగా లాగించేస్తాను. నా ఇంట్లో కరెంటు కూడా ఉండదు. అసలు కరెంట్ కనెక్షనే తీసుకోలేదు. ఎందుకైనా మంచిది, మీరు బీడీలు కానీ, చుట్టలు గానీ, సిగరెట్లు గానీ నా ఇంట్లో బాగా కాల్చండి. ఎందుకంటే ఈ మధ్యన దోమలు ఎక్కువగా దాడి చేస్తున్నాయి.

మీరు ఒకవేళ దురాశతో తాళం పగల కొట్టాలని ప్రయత్నిస్తే, మీకు కూడా నాకున్న అష్టదరిద్రాలూ చుట్టుకుంటూయని హెచ్చరిస్తున్నాను. నేను దరిద్రుడినే కావచ్చు, నా యింటి ముందున్న వారు సంపన్నులు. వాళ్ల సిసి టివి కెమేరాలలో మీరు రికార్డు అవుతారు, ఆపై పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఇక మీ ఇష్టం.

చివరిగా ఒక మనవి. మీరు మహా గజదొంగలుగా తులతూగాలంటే రెండు జతల బట్టలు, కొంత డబ్బు నా పాత పెట్టెలో పెట్టండి. కుదిరితే పులిహారా, బిర్యానీ, బ్రాందీ బాటిల్, మంచి నీళ్ళు నాకు దానం చేశారంటే, మీకు తక్షణమే ‘మహా గజదొంగల యోగం’ పడుతుందని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. నేను కూడా మిమ్మల్నీ, మీ నిజాయితీ దొంగతనాల్నీ దీవిస్తున్నాను. నేను పనిచేయలేకపోయినా, నా తెలివితేటలతో నిజాయితీగా జీవిస్తున్నాను.

నాకు డబ్బు, కీర్తి, సంసారం, ఆస్తులతో పనిలేదు, చింత లేని వారే చక్రవర్తులు. నా లోభత్వాన్ని, నిరాడంబరతనూ మెచ్చి ‘లోభ అకాడమీ’ వాళ్ళు నాకు సన్మానం చేశారు. వాళ్లు సన్మాన పత్రం ఇస్తానంటే వద్దన్నా. ఎందుకంటే నా ఆశయాలను ఇలా రాయించుకుని ఫ్రేమ్ కట్టుకున్నాను.

ఇక మీ ఇష్టం దొంగగార్లూ!

ఇట్లు

మీ నిశ్చింత చక్రవర్తి

Exit mobile version