Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దోమల వల్ల వచ్చే వ్యాధులు

[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘దోమల వల్ల వచ్చే వ్యాధులు’ అనే రచనని అందిస్తున్నాము.]

దోమలు విశ్వమంతటా వ్యాపించి ఉన్నాయి. భూగ్రహం మీద దాదాపు వంద ట్రిలియన్ల దోమలున్నాయి. విశ్వంలో వీటి పుట్టుక వంద మిలియన్ సంవత్సరాలకు పూర్వమే జరిగింది. బ్రెజిల్, మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాలలో దోమలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి దోమలు లేని దేశమంటూ ఉన్నదా అంటే ఉన్నది. ప్రపంచంలో ఐస్‌లాండ్ అనే దేశంలో దోమలు లేవట. మనం అందరం అక్కడకు పారిపోతే దోమల బెడద నుంచి తప్పించుకోవచ్చు. ఎందుకు దోమల నుంచి తప్పించుకోవటమంటే దోమలు తెచ్చే ప్రమాదకర అంటువ్యాధుల వలన ప్రాణ ప్రమాదం సైతం ఉన్నది. మన చేతిలో చిటుక్కుమని చచ్చిపోయే దోమ మనిషి ప్రాణాలను తీయగలదంటే నమ్ముతారా! చూడండి దోమలు వ్యాపింపజేసే జబ్బుల వివరాలు.

సాధారణంగా దోమలు ఎక్కడ పడితే అక్కడ కనిపించినా ఎక్కువగా అపరిశుభ్ర వాతావరణంలోనూ, మురుగు కాలవలలోనూ తమ సంతానోత్పత్తిని జరుపుకోవటం వలన ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి మనిషి రక్తం తాగి బతుకుతాయి. రక్తమే వాటి ఆహారం దోమ రక్తాన్ని పీల్చేటపుడు కొన్ని క్రిములను రక్తంలో వదిలిపెడుతుంది. ఫలితంగా అనేక వ్యాదులు సంభవిస్తాయి. కొన్ని వ్యాధల వివరాలు తెలుసుకుందాం!

మలేరియా:

అనాఫిలస్ జాతికి చెందిన ఆడ దోమలు ఒక వ్యాధిగ్రస్థుణ్ణి కుట్టినపుడు, ఆ రక్తంతో పాటు వ్యాధికారక సూక్ష్మజీవుల్ని కూడా దోమ పీల్చుకుంటుంది. తిరిగి దోమ ఆరోగ్యవంతుడిని కుట్టినపుడు ఆ రోగకారక సూక్ష్మజీవులు మనిషి శరీరంలోకి వెళ్ళి వ్యాధిని కలగజేస్తాయి. ప్లాస్మోడియం జాతికి చెందిన ప్రోటోజోవన్ల వలన మలేరియా వ్యాధి వస్తుంది. ప్లాస్మోడియం దైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిషేరమ్ వంటి రకాల సూక్ష్మ జీవులు మనిషి శరీరంలో చేరి రోగ వ్యాప్తికి కారణం అవుతాయి. ఈ క్రిములు ప్రవేశించాక పది, పదిహేను రోజుల సమయం తర్వాత మలేరియా లక్షణాలు బయటపడతాయి. మలేరియా జ్వరం తీవ్రమైన చలి జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులతో మొదలవుతుంది. జ్వరం వచ్చినపుడు డాక్టరును సంప్రదించాలి. రక్త పరీక్ష చేయించుకోవాలి. క్రమం తప్పక చికిత్స చేయించుకోవాలి.

ఫైలేరియా:

క్యూలెక్స్ క్యుంకుఫాసియంటస్ అనే దోమలు కుట్టటం వలన ఫైలేరియా వ్యాధి సంభవిస్తుంది. కాళ్ళు ఏనుగు పాదాల వలె లావుగా అయిపోయి నడకకు ఇబ్బంది కలుగుతుంది. ఈ దోమలు మురుగు నీటి నిల్వలు మరుగు దొడ్లు వంటి కలుషితమైన నీటి కుంటల్లో ఎక్కువగా పెరుగుతాయి. దోమలు కుట్టే సమయంలో పైలేరియా కారక క్రీములు మానవుని లోని శోష నాళములలో చేరుతాయి. ఈ క్రిములు మానవుని శోష నాళాల్లోనే పెరిగి పెద్దగా మారతాయి. ఇది తమ పిల్లలను పెట్టుకుంటూ శోషరస కంతులలో పది సం॥ల పాటు సజీవంగా ఉంటాయి. ఇవి రాత్రి పూట మాత్రమే ఉపరితల రక్త ప్రసరణ వ్యవస్థలో సంచరిస్తాయి కాబట్టి రక్త పరీక్షలు రాత్రిపూట చేస్తారు. తరచుగా జ్వరం రావడం, చంకల్లో, గజ్జల్లో బిళ్ళలు కట్టడం వంటి లక్షణాలతో మొదలై ఏనుగు పాదంలా కాళ్ళు వస్తాయి. వ్యాధి ముదిరిన తర్వాత రక్త పరీక్షలు చేసినా క్రిములు కనిపించవు వ్యాధి తొలి దశలోనే రక్త పరీక్షలో వాటిని కనుగొనగలం.

డెంగ్యూ జ్వరం:

‘ఏడిస్ ఈజిప్టి’ అనే దోమల వలన ఈ డెంగ్యూ జ్వరం ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. తీవ్రమైన జ్వరంలో పాటు ఒంటిమీద ఎర్రటి దద్దుర్లు కనిపిస్తాయి. కండరాల నొప్పులు, తలనొప్పి కీళ్ళ నొప్పులు వంటివి వస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలి. ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గిపోయి. ఇంటర్నల్ హెమరేజ్ మొదలై చివరకు మరణం కూడా సంభవించవచ్చు. ఏడిస్ ఈజిప్టి అనే దోమలు పగలే కుడతాయి. ఇవి ఎయిర్ కూలర్ల లోనూ, ఫ్రిజ్జుల లోనూ పూలకుండీల కింద, ఖాళీ డ్రమ్ములు, పారేసిన కొబ్బరి బొండాలు, మూతపెట్టని వాటర్ ట్యాంకుల్లోనూ ఉండి పిల్లలను పెట్టుకుంటాయి. పొడుగు చేతుల చొక్కాలు, ప్యాంట్లు ధరిస్తే దోమల నుండి రక్షించుకోవచ్చు. శరీర భాగాలు పూర్తిగా కప్పేలా వస్త్రాలు వేసుకుంటే కొంత వరకు ఉపయోగం ఉంటుంది.

చికెన్ గునియా:

ఈ వ్యాధి ‘ఏడిస్’ అనే దోమ ద్వారా వ్యాపిస్తుంది. చలి, జ్వరం, తలనొప్పి, వాంతులు వచ్చినట్లు అనిపించడం, కీళ్ళనొప్పులు వంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. జ్వరం తగ్గినప్పటికీ ఈ వ్యాధిలో కీళ్ళ నెప్పులు చాలా కాలం వేధిస్తాయి. దోమతెరలు, దోమల నివారణ క్రీములు వాడి దోమల దాడి నుంచి తప్పించుకోవచ్చు

మెదడు వాపు వ్యాధి:

సెప్టెంబరు నుండి డిసెంబరు నెలల మధ్య ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది. వర్షాకాలం వలన మురుగు కాలవలు పొంగి పొర్లుతుండటం వలన వ్యాధులు పెరుగుతాయి. క్యూలెక్స్ దోమ మెదడు వాపు వ్యాధిని కలగజేస్తుంది. జపనీస్ బి వైరస్ అనే సూక్ష్మజీవి దోమల ద్వారా మనిషికి సంక్రమిస్తుంది. పందులు, పశువులు, గుర్రాలు కూడా ఈ వైరస్ ను శరీరంలో మోస్తాయి. దోమలు ఆయా రోగగ్రస్థ జంతువుల్ని కుట్టి ఆ తర్వాత ఆరోగ్యవంత మనుషులను కుట్టినందువల్ల మెదడు వాపు వ్యాధి వస్తుంది. జ్వరము, నిద్రమత్తు, ప్రవర్తనలో తేడాలు జబ్బు యొక్క తీవ్రతను తెలియజేస్తాయి. అపస్మారక స్థితికి వెళ్ళి చివరకు మరణం సంభవించవచ్చు.

కాలా జ్వరం:

లీష్మానియా అనే పరాన్న జీవి వలన ఈ వ్యాధి వస్తుంది. ఈ పరాన్నజీవి శరీర రక్షణ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. మానవుని చర్మంలోనే వృద్ధి చెంది లక్షణాలను చూపిస్తుంది.

అనాఫిలస్, క్యూలెక్స్, ఏడిస్ వంటి దోమలు ఎన్నో రకాల వ్యాధుల్ని వ్యాపింప జేస్తున్నాయి. భారతదేశంలో దోమల జాతులు, ఉపజాతులు నాలుగు వందలకు పైగా ఉన్నాయి. ఎక్కువగా ఆడ దోమలే మనుషులను కుడతాయి. కాబట్టి దోమలను నివారించడం ఒక్కటే మార్గం. నిలిచి ఉన్న నీటిని ఇంటి పరిసరాల్లో లేకుండా చూడండి. తలుపులు, కిటికీలకు కర్టెన్లు అమర్చుకోవాలి. గడ్డిపొదలను కత్తిరించాలి. దోమలు కుట్టడాన్ని నివారిస్తే చాలా వ్యాధులను అరికట్టవచ్చు.

Exit mobile version