Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దిశ-2: ఏం అంటున్నాం?

“పిల్లల ఎదురుగా మాట్లాడే మాటలు వాళ్ళ మనస్సు మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. ‘ఏం మాట్లాడుతున్నాం’ అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి” అంటున్నారు అనంతలక్ష్మి ఈ వారం ‘దిశ‘ కాలమ్‌లో.

పెద్దలు తాము ఇతరులని చూసి వాళ్ళ లాగా ఉండటానికి ప్రయత్నం చెయ్యటంతో పాటు పిల్లల విషయంలో కూడా అట్లాగే ప్రవర్తించటం గమనిస్తాం. పిల్లలని ఇతరులతో పోల్చి వాళ్లలాగా ఉండమని చెపుతూ ఉంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని వికసించకుండా చేసినట్టు అవుతుంది. వాళ్లు ఎలాగూ రాముడిలాగా ఉండమన్నా ఉండరు. వాళ్ళ దాకా ఎందుకు? పెద్దలు మాత్రం ఒక్క విషయంలో నైనా రాముడి లాగా ఉండగలుగుతున్నారా? అట్లా ఉండటం వల్ల కలిగే ప్రయోజనం ఏదో సందర్భంలో వాళ్ళ మనస్సుకి హత్తుకునే విధంగా, బోధించినట్టు కాక తెలియచెప్పాలి. కొంతమంది రావణుణ్ణి ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రయత్న పూర్వకంగా కృషిచేసి మరీ వాళ్ళకి మనస్సుకి హత్తుకునేట్టు ఆ విషయాన్ని చెప్పినవారు ఉన్నారు. అది సరి కాదని చెప్పటానికి ముందు మనకి తెలియాలిగా! కనక పిల్లలేదో పాడైపోతున్నారు, యువతరం భ్రష్టుపట్టి పోతోంది అని అనే వాళ్ళు ఈ విషయంలో తామేం చేశారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది.

పిల్లలని ఇతరులతో పోల్చే వాళ్ళు తాము చదువుకొనే రోజుల్లో ఎంత బాగా, శ్రద్ధగా చదివింది గుర్తు చేసుకోవాలి. తమకి ఎన్ని మార్కులు వచ్చింది, ఎన్ని మార్లు నాన్న చేత చీవాట్లు తిన్నదీ జ్ఞాపకం చేసుకుంటే బాగుండు. అయినా ఒకళ్ల లాగా మరొకళ్ళు ఎట్లా ఉంటారు? అట్లా ఉంటే సృష్టి సౌందర్యం తగ్గిపోదూ? భిన్నత్వమే జీవన సౌరభం కదా! ఒక పాశ్చాత్య తత్వవేత్త చెప్పినట్టు చెట్లెక్కటంలో పోటీ పెడితే చేప ఎప్పటికీ గెలవదు. దాని సామర్థ్యం నీటిలో ఈదటంలో ఉంటుంది. ఈ సమర్థతని, అభిరుచిని గమనించగలిగితే వాతలు పెట్టుకున్న నక్కల సంఖ్య తగ్గుతుంది.

అందరు ఇంజనీర్లో అయితే రోగం వస్తే మందిచ్చే వాళ్ళెవరు? అందరు డాక్టర్లే అయితే దేశాన్ని రక్షించే దెవరు? అందరు రక్షణ శాఖలో ఉంటే ప్రభుత్వ యంత్రాంగం ఎవరు నడుపుతారు? అందరు ప్రభుత్వోద్యోగాలే చేస్తామంటే పంటలు పండించే వాళ్ళెవరు? అందరు బహుళజాతి సంస్థలలో పని చేసే వారే అయితే భారతదేశం కోసం పనిచేసే వాళ్ళెవరు? ప్రతిభ విదేశాలకి ఎగిరిపోతే మిగిలిన వాళ్లెవరు? అక్కడ పనికి రాని వాళ్ళతో మనం సద్దుకోవాలా?

ఈ దేశంలో పన్ను కట్టక తప్పించుకునే అవకాశంలేని ఉద్యోగులు కట్టిన పన్నుతో చదువుకుని ఒక్క సెంటు కూడా ఖర్చుపెట్టని దేశాభివృద్ధికి మీరేందుకు దోహదం చెయ్యాలి? అని యువతరానికి చెప్పిన వాళ్ళు ఎవరు? విదేశాలకి వెళ్ళి అక్కడి సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చి మన దేశాభివృద్ధికి తోడుపడమని సున్నితంగా నైనా, అన్యాపదేశంగా నైనా చెప్పిన వాళ్ళున్నారా? పిల్లలు అంటే డాలర్లు కాసే చెట్లుగా భావించే తల్లితండ్రులుండి, ఊహ తెలిసినప్పటి నుండి అవే భావాలు మనస్సులోకి జొప్పిస్తు ఉంటే దానికి తగినట్టే తయారవుతారు పిల్లలు. తరవాత ఏమనుకుని ఏం లాభం? తల్లితండ్రులలో ఎవరో ఒకరికి తీవ్ర అనారోగ్యం చేస్తేనో, కాలం చేస్తేనో రమ్మంటే – “మేం వచ్చి చేసేది మాత్రం ఏముంది? డాలర్లు పంపుతాం, వైద్యమో, కార్యక్రమాలో లోటు లేకుండా ఘనంగా చెయ్యండి” అని అంటున్నట్టు సమాచారం. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? వాళ్ళని ఆ విధంగా తయారు చేసింది ఎవరు? మైనపు ముద్దల్లాగా ఉన్న వయసులో ఇటువంటి భావాల ముద్రలు పడేట్టు మాట్లాడింది ఎవరు?

పిల్లల ఎదురుగా అనాలోచితంగా కానీ, కావాలని కానీ అన్న మాటలు వాళ్ళ మనస్సు మీద తెలియకుండానే ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. కనక, దేని గురించి అయినా ‘ఏం మాట్లాడుతున్నాం’ అన్న దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Exit mobile version