Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దినసరి కూలీ

[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘దినసరి కూలీ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ఎంత కష్టం.. ఎంత కష్టం..
దినసరి కూలీకి
రోజు గడవడం ఎంత కష్టం?
పనికోసం ప్రతి నిత్యం వేట..
పని దొరికిందంటే ఆ పూటకి పండుగే!
లేదంటే పస్తులతో జీవనపోరాటం..
ఖాళీకడుపుతో సహవాసం!

రోడ్డు పక్కన చేసే పనిలో..
ఎండా వానా చలి అనే భేదం లేకుండా శ్రమ
పొలం పనుల్లో..
మట్టి, బురద నిండిన చోట
ప్రకృతితో కలిసి
సేద్యం పనుల్లో ఒళ్ళంతా అలసేలా పని
ఖార్ఖానాల్లో..
జీవం లేని యంత్రాలతో యంత్రమై కష్టించడం
నుదుటన పట్టిన స్వేదాన్ని తుడుచుకునే లోగా
జలజలా కారే ఊటతో అవిశ్రాంత సమరం!

దేశాభ్యున్నతికి పట్టుగొమ్మలు వాళ్ళు..
శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకవాళ్ళు..
కష్టం అంటే గుర్తొచ్చే
దినసరి కూలీలు వాళ్ళు..
ఉన్నంతలో దర్జాగా బ్రతుకుతూ
నిర్భయంగా తలెత్తుకుని జీవించే
శ్రమనే దైవంగా నమ్ముకున్న ధీరులు వాళ్ళు!
జోబులు నిండకపోయినా
గుండెలనిండా ఆత్మవిశ్వాసాన్ని
నింపుకున్న పోరాటయోధులు వాళ్ళు!

Exit mobile version