1998లో వచ్చిన ‘ఖిలా’ సినిమా దిలీప్ కుమార్ కెరియర్లో ఆఖరి సినిమా. “సౌదాగర్” సినిమా తరువాత చాలా కాలం దిలీప్ కుమార్ మరే సినిమా చేయలేదు. ‘ఖిలా’లో డబల్ యాక్షన్‌తో మళ్ళీ తెర ముందుకు వచ్చిన దిలీప్ కుమార్‌తో ఇందులో చాలా మంది కొత్త నటులు కలిసి నటించారు. ఉమేష్ మెహ్రా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్లాప్ అయినా ఇప్పుడు చూస్తే వీరి కెరీర్ ద్వితియార్ధంలో వచ్చిన మిగతా సినిమాల కన్నా బావున్నట్లే అనిపిస్తుంది. ట్రెండ్ ప్రకారం సినిమాలు నడిచే క్రమంలో ఈ సినిమా అంతగా అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు కాని కథా పరంగా మంచి ప్రయత్నం గానే చెప్పవచ్చు.
జగన్నాధ్ సింగ్ అమర్నాధ్ సింగ్ ఇద్దరూ కవల సోదరులు. అమర్నాధ్ సింగ్ న్యాయమూర్తిగా పని చేస్తూ ఉంటాడు. అయితే జగన్నాధ్ సింగ్ మాత్రం పరమ క్రూరుడు, అతని వలన బాధపడిన వ్యక్తులు, నాశనమైన జీవితాలు ఎన్నో. అతని భార్య కూడా జగన్నాద్ సింగ్ కారణంగా నరకం అనుభవిస్తుంది. భర్త అక్రమాల కారణంగా విడిగా జీవిస్తుంటుంది. ఆమె కొడుకు అమర్ లారీ డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు. కూరగాయల వ్యాపారంలో ఒక బ్రోకరైన మంగల్ సింగ్ రైతుల హక్కుల కోసం పోరాడుతున్న సంఘం అధ్యక్షున్ని హత్య చేయిస్తాడు. ఆ హత్యా నేరం మరో నాయకుడి మీద పడుతుంది. ఈ హత్యను ప్రత్యక్షంగా చూసిన అమర్ పోలీసులకు మంగల్ సింగ్‌ను పట్టిచ్చినా ఆ హత్యానేరం తన మీదే వాళ్ళు వేసేటట్లు ఉన్నారని అర్థమయి మౌనంగా ఉండిపోతాడు.
ఇంతలో జగన్నాధ్ సింగ్ హత్యకు గురవుతాడు. అతను చనిపోయిన తరువాత అతని అంతక్రియల కోసం అమర్నాధ్ సింగ్, అమర్ దగ్గరకు వస్తాడు. కొడుకుగా తన బాధ్యత నిర్వర్తించమని అడుగుతాడు. తండ్రిపై కోపం తప్ప మరే భావం లేకపోయినా అమర్నాధ్ కోరిక మీద తల కొరివి పెడతాడు అమర్. అమర్నాధ్ సింగ్ శవం కాలుతున్నప్పుడు అతని వల్ల నష్టపోయిన యామిని ఆమె అన్న అక్కడకు వచ్చి మిఠాయిలు పంచి పెట్టాలని ప్రయత్నించడం చూసిన తరువాత జగన్నాధ్ సింగ్ ఎంతమందికి శత్రువో, అతనెంత క్రూరమైన జీవితం గడిపాడో అందరికీ అర్థమవుతుంది. అమర్నాధ్ సింగ్ తన వదినను, అమర్‌ని ఇంటికి తీసుకువస్తాడు. ఆ డబ్బు, ఆస్తి పాపపు సంపాదన అని అమర్ చెప్పినప్పుడు దాన్ని మంచి పనులకు ఉపయోగించమని కాని తన హక్కుని వదులుకోవద్దని అమర్‌కు చెప్పి ఆ ఇంట్లో ఉండడానికి తల్లి కొడుకుల్ని ఒప్పిస్తాడు అమర్నాధ్. అమర్నాధ్ కూతురు కూడా వీరితో కుటుంబ సభ్యురాలిగా కలిసిపోతుంది. అమర్నాధ్ సింగ్ భార్య కూడా జగన్నాధ్ సింగ్ కారణంగా అత్మహత్య చేసుకుందని, అందరూ అతని వలన గాయపడినవారే అయినా, కుటుంబ బంధాలని గౌరవించి, ఇప్పటికయినా కొత్త జీవితం మొదలెట్టి కలిసి ఒకటిగా జీవించాలని అమర్నాధ్ పడుతున్న తపన అందరికీ అర్థం అవుతుంది.
యామిని ఒక ప్రముఖ నర్తకి. ఆమెపై అత్యాచారం చేస్తాడు జగన్నాధ్ సింగ్. ఆమె అన్నను ఒక కేసులో జైలుకి పంపిస్తాడు. యామినికి ఒక కొడుకు పుడతాడు. యామినిని ఆమె అన్నను కొడుకుని కూడా అ ఇంటిలోకి ఆహ్వానిస్తాడు అమర్నాధ్. యామిని కొడుకుని చట్టపరంగా దత్తత తీసుకుని తండ్రి లేని లోటు తాను తీరుస్తానని అంటాడు. అయితే యామిని జగన్నాధ్ సింగ్ అరాచకత్వం వలన కాలు పోగొట్టుకుని కృతిమ కాలుతో జీవిస్తుందని తర్వాత తెలుస్తుంది.
జగన్నాధ్ సింగ్‌ని ఎవరు హత్య చేసారో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. ఆ హత్య చేసింది అమర్ అతని తల్లి అని పోలీసులు సాక్షాలతో అమర్నాధ్ వద్దకు వస్తారు. జడ్జిగా తన పదవికి రాజీనామా ఇచ్చి అమర్నాధ్ సింగ్, అమర్ తరుపున లాయర్‌గా కోర్టుకు వస్తాడు. జగన్నాధ్ సింగ్ తన భార్య తరుపు భూమి తన పేర రాయించుకోవడానికి భార్యను ఖిలాకి పిలుస్తాడు. అక్కడకు వచ్చిన అమర్ తల్లిపై జరుగుతున్న దాడి చూసి తట్టుకోలేక పోతాడు. అమర్ మధ్యలోకి రావడం చూసి జగన్నాధ్ తుపాకి తీస్తాడు. చివరకు ఆ తుపాకికి తానే బలి అవుతాడు. కాని పోస్ట్ మార్టం రిపోర్టు బట్టి జగన్నాధ్ సింగ్ హత్య అ రివాల్వర్‌తో జరగలేదని మరో రివాల్వర్‌తో జరిగిందని తెలుస్తుంది. చివరకు తెలివిగా అ హత్యానేరం మంగల్ సింగ్ వైపుకు మళ్ళిస్తాడు అమర్నాధ్.
మంగల్ సింగ్ భార్య నీలం జగన్నాధ్ సింగ్ సెక్రెటరీగా పని చేస్తూ ఉంటుంది. భార్యాభర్తలు గొడవ పడుతున్నప్పుడు అదను చూసి జగన్నాధ్ సింగ్‌ను చంపమని సైలెన్సర్ ఉన్న తన తుపాకి ఆమెకు ఇస్తాడు మంగల్ సింగ్. అయితే ఆ తుపాకి ఆమె వాడకముందే జగన్నాధ్ సింగ్ మరణిస్తాడు. మంగల్ సింగ్ ఆ హత్య చేసాడని నీలం, నీలం ఆ హత్య చేసిందని మంగల్ సింగ్‌లు అనుకుంటారు. వారిద్దరూ ఈ హత్య చేయలేదని యామిని ఈ హత్య చేసిందని అమర్నాధ్కి తెలుసు. కాని యామిని చేసినదాంట్లో తప్పేమీ లేదని ఆ ఇంట్లో అందరూ అనుకుంటారు. అలాగే రైతు సంఘం అధ్యక్షుడిని చంపిన మంగల్ సింగ్ చట్టం నుండి తప్పించుకోవడానికి ఎన్నో దొంగ సాక్షాలను కోర్టు ముందు హాజరు పరిచి బైటకు వచ్చాడు. అతనికి శిక్ష పడడం సబబు అని, అది జగన్నాధ్ సింగ్ హంతకుడిగా పడినా తప్పులేదని అమర్నాద్ సింగ్ కూడా ఒప్పుకుంటాడు. చివరకు చేసిన నేరానికి తప్పించుకున్నా చేయని నేరానికి మంగల్ సింగ్ జైలు పాలవుతాడు. కుటుంబ సభ్యులందరూ జగన్నాధ్ సింగ్ పాపాలనుండి విముక్తులయి ఒకటిగా కలిసిపోతారు.
ఈ సినిమాలో ఆరు పాటలున్నాయి. ఆనంద్ రాజ్ ఆనంద్ సంగీత దర్శకత్వంలో దేవ్ కోహ్లి రాసిన ఈ పాటలు పెద్దగా అలరించవు. యామినిగా రేఖ, అమర్‌గా ముకుల్ దేవ్, మిగతా పాత్రలలో మమతా కుల్కర్ణి, స్మిత జయకర్లు కనిపిస్తారు. హుమాయిన్ మిర్జా రాసిన మాటలు బావున్నాయి. కాని దిలీప్ కుమార్ డైలాగ్ డెలివరీని ఎంజాయ్ చేసిన తరం ‘ఖిలా’ సినిమా సమయానికి మరుగున పడి పోయింది. అప్పటి సినిమాలలో భాష చాలా మార్పులు చెందింది. అందుకే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులకు నచ్చలేదు. ప్రేక్షకుల టేస్ట్‌లో వచ్చిన మార్పు కారణంగా కూడా ఈ సినిమాని ఎక్కువ మంది అప్పట్లో మెచ్చలేదని అనిపిస్తుంది. కాని డైరెక్టర్ ఈ కథను చెప్పిన విధానం బావుంది. సినిమా మొదట్లో రైతు సంఘం అధ్యక్షుని హత్యను చివర్లో మంగల్ సింగ్‌ని జైలుకి పంపడానికి వాడుకోవడం బావుంది. ఆ సీన్ మొదట్లో ఎందుకొచ్చిందో సినిమా చివర్లో కాని అర్థం కాదు.
ఈ సినిమాకు మాటలనందించిన హుమాయిన్ మిర్జా దిలీప్ కుమార్ స్నేహితులు. అతని ప్రోద్బలంతో దిలీప్ కుమార్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారట. ఉమేశ్ మెహ్రా తండ్రి గారయిన ఎప్.సీ. మెహ్రాతో దిలీప్ కుమార్ కలిసి పని చేయాలని అనుకున్నారు. దానికి దిలీప్ కుమార్‌కి కొన్ని సంవత్సరాల క్రితం అడ్వాన్స్ కూడా ఇచ్చారట. అందులో అమితాబ్ దర్మేంద్రలు కూడా కలిసి నటించాలని నిర్ణయమయింది. యాష్ చోప్రా దర్శకత్వం వహించవలసిన ఆ సినిమా ఏవో కారణాల వలన ఆగిపోయింది. తండ్రికి ఇచ్చిన కమిట్మెంట్కి బదులుగా ఈ సినిమా కొడుకుకి చేసి దిలీప్ కుమార్ తనిచ్చిన మాట నిలుపుకున్నారు.
తన పాత పద్దతికి కట్టుబడి షూట్ చేసిన సీన్లను ప్రివ్యూ చూస్తానని దిలీప్ సాబ్ ‘ఖిలా’ సమయంలో పట్టుబట్టేవారట. సునీల్ దత్ ప్రివ్యూ ధియేటర్ జన్తాలో వాటిని చూసేవారట. ‘ఖిలా’ సినిమా దిలీప్ కుమార్ కెరియర్లో త్వరగా షూటింగ్ జరుపుకున్న చిత్రం కూడా అని ఉమేష్ మెహ్రా దిలీప్ కుమార్ మరణం తరువాత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దీనికి కారణం సినీ నిర్మాణంలో వచ్చిన మార్పులే. అయితే ఇవి దిలీప్ కుమార్‌ని అశ్చర్యానికి గురి చేసేవని, ఈ కొత్త విధానాన్ని ఆయన ‘ఖిలా’ సినిమా నిర్మాణంలో చాలా ఎంజాయ్ చేసారని ఉమేశ్ గుర్తుచేసుకున్నారు. దిలీప్ కుమార్‌తో కలసి పని చేయటం తన భాగ్యమని భావిస్తాడు ఖిలా దర్శకుడు ఉమేష్ మెహ్రా. ఈ సినిమాలో నటించేసరికి దిలీప్ కుమార్ వయసు 76 సంవత్సరాలు. సౌదాగర్ సినిమా చేసిన ఏడేళ్ళకు తరువాత ఈ సినిమా చేశారు. సినిమా షూటింగ్‌కు తాను పదకొండు గంటలకు వస్తానని, అయిదు గంటలకల్లా వెళ్ళిపోతానని కండిషన్ పెటారట దిలీప్ కూమార్. ఎప్పుడు అలసిపోతే అప్పుడే పాక్ అప్ చెప్పమన్నాడు ఉమేష్ మెహ్రా. అయితే, షూటింగ్ సమయంలో కొత్త నటులు దిలీప్ కుమార్ తన అనుభవాలు చెప్తూంటే ఆయన కాళ్ళ దగ్గర చుట్టూ కూచుని వినేవారట. అంతేకాదు, షూటింగ్ లొకేషన్లు చూసేందుకు ఉత్సాహంగా బయలుదేరేవారట. ఆధునిక సాంకేతిక ప్రగతి నచ్చి ఆయన ఒకోసారి రాత్రి పదకొండు వరకూ షూటింగ్లో పాల్గొన్నారట. ఆయనలో ఒక పసిపిల్లవాడి అమాయకత్వం వుందని, ఆయనతో కలసి పనిచేయటం పూర్వజన్మ సుకృత ఫలమని భావిస్తాడు ఉమేష్ మెహ్రా. ఆరంభంలో కొత్త దర్శకుడి దర్శకత్వమని అనుమానంగా వున్నా, ఎనిమిది నిముషాల రషెస్ చూసిన తరువాత ఇక అనుమానాలు తొలగి పూర్తిగా తనను నమ్మారని చెప్తాడు ఉమేష్ మెహ్రా.
ఈ సినిమా అప్పటికి దిలీప్ కుమార్ వయసు 76 సంవత్సరాలు. పెద్దవారయినట్లు స్పష్టంగా తెలుస్తున్నా మంచి ఎనర్జీతో పని చేసారాయన. ఈ సినిమా అప్పటికి సినిమా మేకింగ్‌లో చాలా మార్పులు వచ్చాయి. తన మొదటి సినిమా నుండి ఈ సినిమా దాకా టెక్నాలజీలో ఎన్నో మార్పులను గమనిస్తూ వాటితో ప్రయాణిస్తూ, ఆ మార్పులను అకళింపు చేసుకుంటూ నటించడం దిలీప్ సాబ్‌కి కూడా అంత సులువైన పని అయి ఉండకపోవచ్చు. ముఖ్యంగా తొంభైలలో చాలా త్వరగా టెక్నికల్ విభాగాలలో మార్పులు వచ్చాయి. పాత తరం నటుడిగా వాటిని అర్థం చేసుకుని దానికి అనుకూలంగా నటించడం వారికి కొంత శ్రమతో కూడిన పనే. దిలీప్ కుమార్ సినిమా జననం నుండి ఎన్నో మార్పులను స్వయంగా చూసి అనుభవించిన వ్యక్తి. మూడు తరాల నటులతో టేక్నీషియన్లతో పని చేసిన వారు. స్టూడియోలలోని సినీ నిర్మాణం నుండి ఔట్ డోర్ లోని నిర్మాణం దాకా పాలు పంచుకుని అందరూ నటులు కలిసి రిహార్సల్ చేసే స్థితి నుండి ఒక్కొక్కరూ విడి విడిగా షాట్ ఇచ్చి ఆ షాట్లను కలిపి ఎడిట్ చేసే స్థితి వరకు సినీ నిర్మాణంలో పాలు పంచుకున్న నటుడు ఆయన. తమకు అలవాటు లేని, అర్థం కాని, కంఫర్టబుల్‌గా అనిపించని పద్దతులను కూడా అంగీకరించి సినిమాలో తన పాత్రకు న్యాయం చేయవలసి రావడం కొంత కష్టంతో కూడిన పని అయినా ఖిలా సినిమాలో ఆయన తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారనే చెప్పవచ్చు. దిలీప్ కుమార్ సినిమాలను అధ్యయనం చేయటమంటే భారతీయ సినీ చరిత్రను అధ్యయనం చేస్తున్నట్టే. జ్వార్భాటా(1944) నుంచి ఖిలా (1998) వరకూ 54 ఏళ్ళు సినీ ప్రపంచం అడుగుతో అడుగు కలిపి ప్రయాణిస్తున్నట్టే.
“దిలీప్ కుమార్ సినిమాలను అధ్యయనం చేయడమంటే భారతీయ సినిమా చరిత్రను అధ్యయనం చేయడమే” – ఒక్క మాట లో మొత్తం చెప్పేసారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
దేశ విభజన విషవృక్షం-58
అస్తిత్వం..!!
స్వాతి కవితలు-4- Why
బామ్మగారూ – బుజ్జిదూడలు
జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-73
ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 32 – క్రాంతి
అందమైన మనసు-8
అన్నింట అంతరాత్మ-46: మీ ఆరోగ్యం నా కర్తవ్యం! ‘మందు’ను నేను!
ప్రకృతితో సంభాషణ
ముద్గలుడు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®