‘ఘర్ కీ ఇజ్జత్’ 1948లో వచ్చిన సినిమా. ఈ సినిమాలో దిలీప్ కుమార్‌తో పాటు నటించిన హీరోయిన్ ముంతాజ్ శాంతి. 1943లో ఈవిడ అశోక్ కుమార్‌తో నటించిన ‘కిస్మత్’ సినిమా మూడు సంవత్సరాలు ఏకబిగిన కలకత్తాలో రాక్సీ థియేటర్ లో ప్రదర్శింపబడి అతి పెద్ద రికార్డు సాధించింది. ఈ రికార్డు ఆ తరువాత 32 సంవత్సరాలకు ‘షోలే’ సినిమాతోనే బ్రేక్ అయ్యింది. అలా ముంతాజ్ శాంతి హిందీ సినీ చరిత్రలో నిలిచిపోయారు. తెలుగులో ఈ ‘కిస్మత్’ సినిమానే ‘భలే రాముడు’ అని అక్కినేని సావిత్రి గార్లతో రీమేక్ చేసారు. దిలీప్ కుమార్ ముంతాజ్ శాంతి కలిసి నటించిన ఒకే ఒక సినిమా ‘ఘర్ కీ ఇజ్జత్’. ఈవిడ 1950లో తన భర్త వాలీ ముహమ్మద్ ఖాన్‌తో పాకిస్తాన్ వెళ్ళిపోయారు. వాలీ ముహమ్మద్ ఖాన్ కూడా హిందీ సినిమా దర్శకులు, రచయిత.
‘ఘర్ కీ ఇజ్జత్’ కథ ఇప్పటి తరానికి పెద్దగా నచ్చదు. ఒక ధనిక కుటుంబంలో ఇద్దరు అక్కా తమ్ముళ్ళు చంద్ర ఇంక రాధిక. రాధిక వివాహం చమన్‌తో అవుతుంది. చమన్ ఆ ఇంటికి ఇల్లరికపు అల్లుడుగా తీసుకురాబడతాడు. అతని చేత ఇంటి పనులు చేయిస్తూ అత్తగారు ఎన్నో రకాలుగా అవమానిస్తూ ఉంటుంది. చమన్ మంచివాడు, పెద్దల ఎడల గౌరవం ఉన్నవాడు. చాలా అవమానాలు సహిస్తూ ఉంటాడు. రాధికకు తన తల్లి తండ్రుల గురించి తెలుసు. ఆమె భర్త మంచితనాన్ని అర్థం చేసుకుంటూ ఉంటుంది. అదే ఇంట్లో ఉంటే తన భర్త ఎన్నో బాధలు పడవలసి వస్తుందని, ఆమె తల్లి తండ్రులను ఎదిరించి మరో ఇల్లు చూసుకుని తన భర్తతో వెళ్ళిపోతుంది. అంతే కాదు ఇన్సూరెన్స్ కంపెనీలో చేరి భర్తతో పాటు తాను కష్టపడి డబ్బు సంపాదించడం మొదలెడుతుంది. ఆడపిల్ల ఉద్యోగం చేయడం ఏంటన్న తల్లి తండ్రులకు తాను తన భర్తకు అండగా ఉన్నానని అది తప్పు కాదని వాదిస్తుంది కూడా. రాధిక చమన్ ఇద్దరూ కూడా మధ్య తరగతి మనుష్యులుగా జీవిస్తూ సంతోషంగా ఉంటారు.
లాయర్‌గా చదువు పూర్తి చేసుకుని చంద్ర ఇంటికి వస్తాడు. అక్క బావలు వేరే వెళ్ళారని తెలిసి వారిని కలుసుకుంటాడు. హాయిగా ఉన్న ఆ దంపతులను చూసి సంతోషిస్తాడు. తల్లి అహంకారం, తండ్రి ఆలోచనలేనితనం తెలిసిన రాధిక వారిని పెద్దగా పట్టించుకోదు. తన గౌరవం నిలుపుకుంటూ ఆ ఇంటి కూతురుగా తన బాధ్యతలను నెరవేరుస్తూ ఉంటుంది. రూపా అన్న మోతీ, తమ్ముడు గులాబ్‌తో ఒక స్కూలు నడుపుతూ ఉంటుంది. పేద కుటుంబానికి చెందిన వీరి మధ్య చాలా ప్రేమ ఉంటుంది. మోతీ చేత ఇన్సురెన్స్ చేయిస్తాడు చమన్. అలా ఆ కుటుంబంతో పరిచయం ఏర్పడుతుంది చంద్రకు. స్కూలు కోసం చందాలు పోగు చేయడానికి రూపా ఇచ్చిన నాట్య ప్రదర్శన తరువాత ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాని అక్కా బావలతో చెబుతాడు చంద్ర. తల్లి తండ్రుల మనస్తత్వం తెలిసిన రాధిక చమన్లు మాటల్లో పెట్టి ప్రేమ విషయం పెద్ద వారికి తెలుపకుండా ఇది పెద్దలు కుదుర్చిన వివాహం అన్నట్లుగానే పెళ్ళి పెద్దలుగా వారే ఉండి ఈ పెళ్ళి జరిపిస్తారు.
వివాహం తరువాత తన కోడలి పేదరికం గురించి పూర్తిగా తెలుసుకున్న చంద్ర తల్లి ఆమెను ఎన్నో సార్లు అవమానిస్తుంది. ఇంట్లో కోడలిని రాచి రంపాన పెడుతుంది. తన మాటలతో, లౌక్యంతో భార్యాభర్తల మద్య దూరం పెరిగేలా చెస్తుంది. వారిద్దరూ సరదాగా బైటకు వెళ్ళనీయకుండా ప్రతి విషయంలో అడ్డుపడుతుంది. చంద్ర తల్లికి ఎంతగానో నచ్చచెప్పాలని చూస్తాడు. అతని లాయర్ తెలివితేటలు ఆ ఇంటి రాజకీయాలలో పని చేయవు. కొడుకుగా తల్లి తండ్రులను అంతకన్నా ఎదిరించలేక భార్యను వారి నుండి రక్షించుకోలేక ఇబ్బంది పడుతుంటాడు. వ్యాపారంలో ఒక లక్ష నష్టం వచ్చిందని తెలిసి కోడలి పాద మహిమ అంత దరిద్రంగా ఉందని అత్త రూపని ఆడిపోసుకుంటూ ఉంటుంది. పల్లె నుండి చెల్లిని చూడాలని వచ్చిన అన్నదమ్ములను ఇంట్లో ఉండనివ్వదు. అన్నకు ఒక పూట భోజనం పెట్టలేని తన అసహాయ స్థితికి కుమిలిపోతుంది రూప. ఆమె తమ్ముడికి డబ్బు సహయం చేసిందని రూపని అవమానిస్తూ ఆ చిన్న పిల్లాడిని అత్త కొట్టి ఇంటి నుంచి పంపేస్తుంది. చివరకు ఒక పూజారిని పిలిపించి రూప నష్టజాతకురాలని ఆమె భర్తతో దూరంగా ఉండాలని చెప్పిస్తుంది అత్త. రూప దీనికి ఒప్పుకోదు, కోపంతో ఇల్లు వదిలి అన్న దగ్గరకు వెళ్ళిపోతుంది. కాని అన్న ఆమెకు వివాహం తరువాత అంతా అత్తగారిల్లే అని చెప్పి తిప్పి పంపిస్తాడు. తిరిగి వచ్చిన రూప అత్తగారి మాట విని భర్తతో దూరంగా ఉండడం మొదలెడుతుంది.
చంద్ర తల్లితో ఈ విషయంలో విభేదిస్తాడు. చివరకు రూప కూడా ఇది అతని బాగు కోసమే అని చెప్పినప్పుడు కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. ఒంటరితనాన్ని భరించలేక తాగుడు, జూదం అలవాటు చేసుకుంటాడు. చివరకు రాధిక గట్టిగా తల్లికి తండ్రికి బుద్ది చెప్పి, చంద్రను తిట్టి తన దగ్గరకు తీసుకుని వెళ్ళిపోతుంది. గదిలో బంధించి ఉంచిన రూపను తల్లిని బెదిరించి బయటకు తీసుకువచ్చి అన్నను వదినను కలుపుతుంది. చివరకు రాధిక తల్లి తండ్రులు కూడా వచ్చి కోడలికి క్షమాపణ చెప్పుకుని ఇంటికి తీసుకువెళతారు.
ఈ సినిమాలో చంద్రగా దిలీప్ కుమార్, రాధికగా మనోరమ నటించారు. మనోరమ ఆ తరువాత ఎన్నో హాస్య పాత్రలు చేసారు. ఐరిష్ తల్లి, భారతీయ క్రిస్టియన్ తండ్రికి పుట్టిన ఎరిన్ ఐసాక్ డానియల్స్ బాల నటిగా సినిమాలలోకి ప్రవేశించారు. లాహోర్‌లో పుట్టి అక్కడే నాట్యం నేర్చుకుని సినిమాలలో మనోరమ పేరుతో నటిస్తున్న ఆమె దేశ విభజన తరువాత బొంబాయి వచ్చారు. పంజాబీ భాషలో ఒక హిట్ సినిమా ఇచ్చిన తరువాత ‘ఘర్ కీ ఇజ్జత్’లో దిలీప్ కుమార్ అక్కగా చేసారు. తరువాత చాలా సినిమాలలో విలన్‌గా కమెడియన్‌గా నటించారు. చాలా టీవీ సీరియల్స్‌లో కూడా నటించారామె. ‘సీతా ఔర్ గీత’ సినిమాలో హేమమాలినిని సతాయించే అత్తగా చేసి చాలా పాపులర్ అయ్యారు ఆమె. మనోరమ నటించిన ఆఖరి సినిమా దీపా మెహతా ‘వాటర్’, ఇది 2005 లో వచ్చిన సినిమా. హింది సినిమాలో పెద్ద స్టార్లందరితో నటించారామె.
ఇందులో చమన్ పాత్రలో నటించిన గోపే పూర్తి పేరు గోపే విషన్ దాస్ కమ్లాని. హిందీ సినిమాలలో కమెడియన్ గా వీరికి మంచి పేరు ఉంది. లావుగా ఉన్న ఆయన శరీర ఆకృతి కూడా కామెడీ పాత్రలకు జీవం పోసేది. విలన్‌గా కూడా చేస్తూ అందులో కూడా కామెడీని పండించే ప్రయత్నం చేసారాయన. సన్నగా ఉండే యాకూబ్ అనే మరో నటుడితో కలిసి లారల్ అండ్ హార్డీలుగా కామెడీ పండించారు గోపే. తెలుగులో మన రమణారెడ్డి, రేలంగిలను పోలి ఉండిన ఈ జంట కొన్ని మంచి సినిమాలు చేసారు. దిలీప్ కుమార్‌తో ఈ సినిమా తరువాత ‘తరానా’, ‘అర్జూ’లలో కూడా నటించారు గోపే. ఆ రెండు సినిమాలలో హీరోయిన్లు మధుబాల, కామినీ కౌషల్‌ను పెళ్ళి చేసుకోవాలనుకునే వ్యక్తిగా వారిని హీరో నుండి దూరం చేయడానికి కుట్రలు పన్ని అభాసు పాలయ్యే పాత్రలు చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
దిలీప్ కుమార్ తన కెరీర్లో బలహీనమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలను చాలా చేసారు. వారి సినిమాలన్నీ గమనిస్తే అసలు హీరోయిక్ ఎలిమెంట్ లేని పాత్రలను మిగతా వారి కన్నా తన కెరీర్ మొదటి భాగంలోనే దిలీప్ కుమార్ చేయడం చూస్తాం. శరత్ నవలా నాయకుని లక్షణాలతో ఆయన సినిమాలలో హీరోలు కనిపిస్తారు. కెరీర్ రెండవ భాగంలో పగ ప్రతీకారం నేపథ్యంలో బలమైన హీరోయిక్ పాత్రలను వేసారు. అవి వాస్తవానికి కొంత దూరంగా ఉన్నా ఈ రెండు విభిన్న శైలులలో కూడా అతను అదే స్థాయి ఫెర్మామెన్స్ ఇవ్వగలిగారు. పల్లెటూరి వ్యక్తిగా గ్రామీణ యాసలో గొప్పగా నటించిన ఆయనే యాభై లలో వచ్చిన చాలా సినిమాలలో యూరోపియన్ వస్త్రధారణతో కనిపిస్తారు. అంటే ప్రతి సీన్లో కోటు టై లతో అంతే కన్విన్సింగ్‌గా కనిపిస్తారు ఆయన. అప్పటి సామాజిక పరిస్థితులు, ఒక పక్క పాశ్చాత్య సంస్కృతి పట్ల ఆసక్తి, మరో పక్క నేటీవిటీ పై ఇష్టం ఈ రెండిటిని ఒకే రకంగా బాలెన్స్ చేసుకోగలిగారు ఆ తరం నటులు. ప్రస్తుతం మనం ఇప్పటి సినిమాలలో మిస్ అవుతున్న విషయం కూడా అదే. ఈ రెండు రకాల పాత్రలను కూడా అంతే కన్విన్సింగ్‌గా నటించిన నటులు హిందీ సినీ రంగంలో దిలీప్ కుమార్, రాజ్ కపూర్, బల్రాజ్ సహానీల పేర్లు ప్రధానంగా గుర్తుకువస్తాయి. . మిగతా వారు తరువాత ఒక మోల్డ్ని ఎంచుకుని తమ కంపర్ట్ జోన్లో ఉంటూ నటించారు. ‘ఘర్ కీ ఇజ్జత్’ సినిమాలో యూరోపియన్ దుస్తులలో ఇంగ్లీషు విద్యను అభ్యసించిన అప్పటి నాగరిక యువకుడిగా కనిపిస్తారు దిలీప్ కుమార్. ఇప్పుడు నెట్లో ఆయన యువకుడిగా కనిపిస్తున్న చిన్నతనపు ఫోటోలలో చాలా ఫోటోలు ఈ సినిమాలోనివే. ఈ సినిమాలో ముంతాజ్ శాంతి తెరపై కనిపించినప్పుడల్లా, కిస్మెత్ సినిమాలోని ఘర్ ఘర్ మె దివాలీ హై పాటను నేపథ్యంలో వినిపించటం ఆ సినిమా పాపులారిటీనీ, ఆమె పాపులారిటీనీ చూపిస్తుంది. ఈ సినిమాలో దిలీప్ కుమార్ నటన రొటీన్ నటన అని, దిలీప్ కుమార్ జూ నుంచి తప్పిపోయి వచ్చిన ఎలుగుబంటిలా వున్నాడనీ ఆ కాలపు విమర్శకులు విమర్శించారు. సినిమాను సైతం చెత్తగా కొట్టివేశారు. ఫిల్మ్ ఇండియా రివ్యూ మాటల్లో….To sum it up, the picture is a boring trash with not a moment of relief. It can neither entertain the film-goer nor pay the film exhibitor .
‘ఘర్ కీ ఇజ్జత్’ సినిమాకు దర్శకత్వం వహించింది రామ్ దర్యాని. పండిత్ గోబింద్రం సంగీతం ఇచ్చిన పాటలు అప్పటి గ్రామఫోన్ పాటల స్టైల్లో వినిపిస్తాయి. రఫీ, శంషాద్ బేగం, మీనా కపూర్, జీ ఎమ్. దుర్రాని పాడిన పాటలు ఇప్పుడు కొంత అర్థం అయీ కానట్లు ఉంటాయి . పాటలను రాసింది ఐ. సి. కపూర్. మొత్తం పదకొండు పాటలున్నాయి ఈ సినిమాలో.
‘ఘర్ కీ ఇజ్జత్’ 1948లో వచ్చింది. అదే సంవత్సరం మహాత్మా గాంధీ హత్య జరిగింది. ఒక దేశభక్తి గీతంలో మహాత్మా గాంధీ అంత్యక్రియలను చూపిస్తారు ఈ సినిమాలో. ఈ సినిమా జనవరి 16, 1948న రిలీజ్ అయిందని గూగుల్ చెబుతుంది. కాని గాంధీ హత్య 30 జనవరి న జరిగింది. గాంధీ అంత్యక్రియలు ఈ సినిమాలో చూపించారంటే ఇది 30 తరువాతే రిలీజ్ అయి ఉంటుందని అనిపించింది. నెట్లో ఉన్న సమాచారాన్ని రీ చెక్ చేసుకుని వాడుకోవాలన్నదాన్ని ఈ సమాచారం మరోసారి నిరూపిస్తుంది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
భ్రాంతి
సంచికలో 25 సప్తపదులు-12
మహాభారత కథలు-11: గరుత్మంతుడు-దేవతలు యుద్ధము
తెలుగు పలుకుబడిలో అమ్మయ్య పదము
‘సాఫల్యం’ – సరికొత్త ధారావాహిక – త్వరలో – ప్రకటన
కలవల కబుర్లు-41
తుమ్మల సీతారామమూర్తి కనకాభిషేక సన్మాన సంచిక-14
కావ్య పరిమళం-3
“నీంద్” : నిద్ర
జీవన రమణీయం-11
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®