అనంతమైన కేన్వాసు మీద చిత్రకారుని ఆగిపోని కుంచె…
కనువిందు కలిగిస్తూ క్షణ క్షణం మారుతున్న దృశ్యాలు.
ప్రకృతి అందాలకు నిలయమై స్పందించే మనసుకు ఉల్లాసమై…
దివినుండి భూలోకానికి దిగి వచ్చిన సుందర స్వప్నం.
పచ్చని కొండల మీదుగా పయనించే తెల్లని మబ్బులు….
ఒయ్యారాల మలుపులతో మిడిసిపడే నదీ ప్రవాహాలు.
పడవలలో విహరించే యాత్రీకులు….
పరవశించిపోతారు తరంగాల గల గలలు వింటూ.
మబ్బులతో పోటీ పడుతూ విహరించే నంగనాచి విహంగాలు ….
అదునుచూసి చేపలను వేటాడుతాయి.
దేశాలకు సరిహద్దులు లేవంటూ స్నేహ హస్తం ఇస్తుంది….
అనంతమైన రవాణా రైలు బండి కూతపెట్టి పరుగులు తీస్తూ.
నది ఒడ్డున నా ఇంటినుంచి ప్రతిరోజూ కనిపించే ఈ దృశ్యాలు….
నా కవితలకు స్ఫూర్తిదాయకాలు భవితకు సోపానాలు.
మనసు పాట పాడునని కనులు మాటలాడునని ఎవరో అన్నారు …..
అది నిజమేనని ఇప్పుడు ఈ అనుభవం చెపుతోంది.
ఏనాడూ అనుకోలేదు నాకు ఇలాంటి అవకాశం వస్తుందని…..
అలాంటి అవకాశం ఇచ్చిన నా బంగారు తల్లికి ప్రేమతో.
ఇది సుందర దృశ్య కవిత. వాషింగ్టన్ స్టేట్ నుండి.
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.