Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దిగ్గజాలు

[డా. మామిడాల శైలజ గారు రచించిన ‘దిగ్గజాలు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక – సాహితీ ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 ఉగాది వచన కవితల పోటీలో బహుమతి పొందిన కవిత.]

తూర్పున ప్రభవిస్తాడు రవి!
జనజీవనంలోని అస్తవ్యస్తలను తూర్పారపడతాడు కవి!
సందుగొందు చేరలేకపోయినా సమస్త విశ్వాన్ని పాలిస్తారు ఒకరు!
అణువణువును శోధిస్తూ
రవికాంచని చోటును సైతం
కలం కళ్ళతో వీక్షిస్తారు మరొకరు!
పగటి వెలుగులకే పరిమితం ఒకరు!
దివారాత్రాలు జ్ఞాన దివిటీల ఉషస్సులను
వెదజల్లుతూనే ఉంటారు మరొకరు!
అంధకారాన్ని దునుమాడుతారు ఒకరు!
అవినీతిని చెండాడుతారు మరొకరు!
పుడమిపై జీవానికి ఆధారం ఒకరు
బడుగు జీవుల వ్యధలపై పోరాడుతారు మరొకరు!
ఏడుగుర్రాలతో ఏడేడు లోకాలను కాంతివంతం చేస్తారు ఒకరు!
కలంపాళి పదునుతో కుళ్ళు కుతంత్రాల
కుత్తుకలను ఉత్తరిస్తారు మరొకరు!
రవి లేకపోతే ప్రళయమే..
కవి ఉన్నచోట ప్రభాతమే..
సమస్త విశ్వంలోని అజ్ఞానాంధకార చీకట్లను చెరిపివేసి
దీప్తిమంతం చేయడంలో దిగ్గజాలే ఇరువురూ!

Exit mobile version