Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

డైరీలో కొత్త పేజీ

[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘డైరీలో కొత్త పేజీ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

కొత్త రోజు మేల్కొన్నప్పుడల్లా
తేదీ మారుతుంది తిథీ మారుతుంది

డైరీలో
కొత్త పేజీ తెరుచుకుంటుంది

నిన్నటి పేజీలోకి తొంగి చూడను
గతం గాభరా పెడుతుంది

ఒకవేళ తొంగి చూడాల్సి వస్తే
తడిసి ముద్దయిన నిన్నటి అక్షరాల్ని
దండెం మీద ఆరేసి
నగ్నంగా నిలబడిపోతాను

నిన్నటి రోజు మరింత మెరుగ్గా
గడిపి వుండాల్సిందన్న ఊహే గందరగోళ పరుస్తుంది

అట్లని నిన్నకి మొన్నకు పెద్ద తేడా లేదు

డైరీలోని మాటలన్నీ చిందరవందర
అక్షరాలన్నీ కాకిరి బీకిరి

డైరీలో ఇవ్వాల్టి పేజీలో
అక్షరాల్ని కొత్తగా రాయాలనుకుంటాను
పొందికగా పేర్చాలనుకుంటాను

రాత్రికి రాత బల్ల ముందు కూర్చున్నపుడు తెలుస్తుంది
ఇది పునర్జన్మో పునరావృతమో

కొత్త రోజు తెరుచుకున్నప్పుడల్లా
కొత్త ఊహలు సరికొత్తగా తెరుచుకుంటాయి
నేనేమో కొత్త అనుభవాల్ని చూస్తూ

ఆకాశంలో చుక్కల్లా
కొత్త అక్షరాల్ని వెతుక్కుంటాను

Exit mobile version