[వివిధ జంతువుల ప్రత్యేకతలను చిన్న వ్యాసాలుగా బాలబాలికలకు అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.]
పిల్లలూ!
మాములుగా మనందరికీ ఎలుగుబంట్లు గురించి తెలుసు. శ్రీరాముడికి సాయం చేసిన జాంబవంతుడు గురించీ తెలుసు. కాని ధృవపు ఎలుగుబంటి గురించి తెలియదు.
ధృవపు ఎలుగుబంట్లు ధృవ ప్రాంతాలలోనే నివసిస్తాయి. ధృవాలలోని అతిశీతల శీతోష్ణస్థితి తట్టుకునేందుకు వీలుగా వీటి శరీరం నిర్మితమై వుంటుంది. దీని సైజు చూస్తే మనకు తెలిసిన అడవి ఎలుగుబంటికి రెండితలు పెద్దగా వుంటుంది. ఎందుకంటే? పెద్ద పరిమాణంలో వున్న జంతువు శరీర ఉష్టాన్ని తక్కువ రేటులో కోల్పోతుంది గదా!
దీని చర్మం తెల్లగా, మందంగా వుంటుంది. ఈ చర్మం వేడిని బయటకు పోనివ్వదు. చలిని లోపలికి రానివ్వదు. శరీరాన్ని ఎప్పుడూ వెచ్చగా వుంచుతుంది. అందుకే ఈ ఎలుగుబంటిని దట్టంగా ఉండే మంచు, ఉధృతంగా వచ్చే మంచు తుఫానులు, నీళ్ళు జివ్వుమనిపించేంత చలి ఏమీ చేయలేవు. రక్తం గడ్డకట్టించే మంచు మీద – మంచు రాళ్ళ మీద కూడా ఇది ఆహారం కోసం హాయిగా తిరుగుతుంది. నిద్రపోతుంది గదా!
ధృవాల్లో చెట్లుండవు. కాబట్టి ఇది మాంసాహారాన్నే ఆరగిస్తుంది. సీళ్ళను విపరీతంగా తింటుంది. ఆహారాన్ని వేటాడేటప్పుడు గబగబా పరుగులు పెడుతూ వేగంగా మంచునీటిలో లోతుకు మునుగుతూ-ఈదుతూ వుంటుంది. సీలు దొరకగానే హాయిగా దానిని భోజనం చేసేసి అక్కడే నిద్రపోతుంది. నిద్ర లేవగానే ఆకలేస్తుంది. మళ్ళీ హాయిగా వేటాడి ఏదో ఒక జంతువును తింటుంది.
సముద్రపు నీటి అడుగున – మంచుక్రింద వున్న సీళ్ళను వేటాడటంలో ఇది అవలంబించే ఒక పద్ధతి చాలా విడ్డూరంగా వుంటుంది. మంచు నేల మీద ఉండే బొరియలను గమనించి వాటి దగ్గర తన శరీరం నుండి వెలువడే సువాసన భరిత పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఈ వాసనకు ఆకర్షింపబడిన సీళ్ళు బయటకు వచ్చి ఎలుగుబంటికి దొరికిపోతాయి. కొంచెం తల మాత్రం పైకి పెట్టి చూసినా చాలు అది ఎక్కువ బరువున్నా దానిని పట్టుకుని కాలిగోళ్ళతో గాయపరచి హాయిగా తినేస్తుంది.
చలి విపరీతంగా ఉండే రోజుల్లో ఆహారం అసలు దొరకనప్పుడు ఈ ఎలుగుబంటి మంచు బొరియలలో శీతాకాలపు సుషుప్తావస్థను గడుపుతుంది.
మానవులు వీటిని వేటాడుతుంటారు. దీని శరీరం, చర్మం, కొవ్వు, ఎముకలు, దంతాలు మానవులకి అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. దీని దంతాలు ఏనుగు దంతాలలా విలువైనవి.
దీనిని చూస్తే మీకు ఏమనిపిస్తుందర్రా! ఆటవిక మానవుడిలా సంచరిస్తూ, శీతల ప్రదేశాలలో వాతావరణాన్ని అనువుగా చేసుకుని తను జీవిస్తూ, మానవులకి ఉపయోగపడుతుంది కదూ!