అనువాదం అనేది ఒక కళ. ఒక భాషనుంచి వేరొక భాషలోకి అనువదించేటప్పుడు ఆ రెండుభాషలూ మాట్లాడే ప్రాంతాల సంస్కృతీ, సాంప్రదాయాల గురించి అనువాదకునికి ఒక అవగాహన వుండాలి.
అంతే కాకుండా మూల రచయిత చెప్పిన విషయాన్ని భావం చెడకుండా అనువదించే భాషలో చెప్పగలిగే భాషాపటిమ వుండాలి. అలాగ అనువదించే భాషలోని చక్కటి పదాలతో చెప్పడమన్నది యే కొద్దిమందికో మాత్రమే తెలుస్తుంది.
కానీ మన దగ్గర అస్తమానం మారిపోయే ఈ మాధ్యమాల కోసం ఆ మధ్య డిగ్రీ చదువుతున్నవారికి కొన్ని ఇంగ్లీషు పాఠ్యపుస్తకాలని తెలుగులోకి అనువదించారు. కొన్ని కొన్ని సాంకేతికపదాలు (టెక్నికల్ టెర్మ్స్) తెలుగులోకి అనువదించినవాటికన్నా ఇంగ్లీషులో వున్నవే బాగా తెలుస్తాయి.
ఉదాహరణకి రైల్ అంటే అర్ధమైనట్టు ధూమశకటమంటే అర్ధం అవదు కదా!
ఇలా ఒక భాషనుంచి ఇంకో భాషలోకి అనువాదాలు చేసేటప్పుడు కొన్ని కొన్ని మాటల అర్ధాలు మారిపోతుంటాయి. అలాంటివి వింటుంటే భలే నవ్వొస్తుంది.
ఈ సందర్భంగా మా ఫ్రెండ్ చెప్పిన ఒక విషయం ఇక్కడ పంచుకోకుండా వుండలేకపోతున్నాను.
ఇంగ్లీషులో “వైర్‌లెస్” (wireless) అన్న పదం వుంది. దానిని తెలుగులో అనువదించాలి.
ఎలాగ అనువదించాలా అని మహా ఆలోచించారుట ..
“వైర్” అంటే యేమిటీ.. “తంతి” అని కదా.. మరి “లెస్” అంటే యేమని చెప్పాలి?
ఒక మేథావి దానిని యిలా అనువదించారుట..
వైర్ అంటే తంతువు.. లెస్ అంటే లేకపోవడం.. అంటే తెలుగులో వైర్లెస్ అంటే “వితంతువు” అని చెప్పారుట..
–
–
దేవుడా, రక్షించు నా భాషను..
జీ ఎస్ లక్ష్మి హాస్య ప్రియురాలు. నవ్విస్తూనే చేదు నిజాలను నిక్కచ్చిగా ప్రదర్శిస్తారు, నవ్వుతూనే కొరడాతో కొట్టినట్టు. వీరి కథలు పలు బహుమతులను పొందాయి. వీరు కథల సంకలనాలను ప్రచురించారు.