[శ్రీ రాథోడ్ శ్రావణ్ రచించిన ‘దేశభక్తి కైతికాలు’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
శ్రీ రాథోడ్ శ్రావణ్ వృత్తిరీత్యా అధ్యాపకులు. ప్రవృత్తిరీత్యా కవి. కవిత్వాన్ని అందరికీ చేరువ చేయాలనే తపన గలవారు. ముత్యాలహారం అనే కవితా ప్రక్రియ సృష్టికర్త. ఇంకా పలు ప్రక్రియలలో కవిత్వం వెలువరించారు. ఇప్పటి వరకు 20 పుస్తకాలు ప్రచురించారు. ఈ ‘దేశభక్తి కైతికాలు’ 21వ పుస్తకం. కైతిక అనేది శ్రీ గోస్కుల రమేష్ సృజించిన కవితా ప్రక్రియ. పుస్తకం ప్రారంభంలోనే కైతికాల లక్షణాలు వివరించారు రాథోడ్ శ్రావణ్.
ఈ పుస్తకంలో భారతీయులుగా మనం నిత్యం స్మరించుకోదగ్గ మహనీయుల కృషిని సరళమైన పదాలలో కూర్చి కవితలల్లారు కవి. 38 మంది నేతల గురించిన కవితలున్నాయి ఈ పుస్తకంలో.
తొలి రెండు కవితల్లో దేశాన్ని, జాతీయ పతాకాన్ని ప్రస్తుతించారు. తరువాత వరుసగా, రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర, ఇక్బాల్, ఝాన్సీ లక్ష్మీబాయ్, భగత్ సింగ్, చంద్రశేఖర ఆజాద్, అల్లూరి సీతారామరాజు, టిప్పు సుల్తాన్, మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయి పటేల్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జవహర్లాల్ నెహ్రూ, బాబాసాహెబ్ అంబేద్కర్, వినోభా భావే, సరోజినీ నాయుడు, మదమ్ మోహన్ మాలవీయ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, లాల్ బహాదూర్ శాస్త్రి, డా. బి. రాజేంద్ర ప్రసాద్, చిత్తరంజన్ దాస్, పొట్టి శ్రీరాములు, కన్నెగంటి నాగేశ్వరరావు, ఠాను నాయక్, రాంజీ గోండ్, కుమ్రం భీమ్, కొలాం సూరు, కొండా లక్ష్మణ్ బాపుజీ, పి.వి. నరసింహారావు, కందుకూరి వీరేశలింగం, ఎపిజె అబ్దుల్ కలామ్, ఛత్రపతి శివాజీ, స్వామి వివేకానంద, జ్యోతిభా ఫూలే, విద్యాసాగర్, దయానంద సరస్వతి, అరవిందుడు, సేవాలాల్, సద్గురు రామారావు గార్లపై భావావేశం నిండిన 132 కైతికలు వ్రాశారు.
కొన్ని కైతికలను పరిశీలిద్దాం.
“భారతీయ జెండా
కులమతాలకు అతీతం
స్వేచ్ఛా శాంతుల గీతం
సస్య సమృద్ధికి ఊతం
వారెవ్వా! జాతీయ జెండా
రేపటి తరానికి స్ఫూర్తివంతం” (9)
ఈ కైతికలో భారత జాతీయ పతాకం లోని ప్రతీకలు చక్కగా వెల్లడయ్యాయి.
~
“ధైర్యానికి ప్రతీక
ఖడ్గమెత్తిన దుర్గా
దేశ భక్తిని చాటెను
జాతి బెబ్బులి తీరుగా
వారెవ్వా! ఝాన్సీలక్ష్మీ
నారి శౌర్య సాహస లక్ష్మీ” (23)
నాలుగు కైతికల్లో ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటాలను, త్యాగాలను మనమందుంచారు కవి.
~
“పూసిన పువ్వు నీవు
మెరిసిన మెరుపు నీవు
దీపానికి కాంతి నీవు
పారే సెలయేరు నీవు
వారెవ్వా! అంబేద్కర్
అసితహిత గుణాక్షర్” (58)
‘దీపానికి కాంతి నీవు’ అనేది అద్భుతమైన ప్రయోగం! డా. బి. ఆర్. అంబేద్కర్ కృషితో లభించిన అవకాశాలను అందుకుని విద్యావంతులై, తమ జాతి ఉన్నతికి ఎందరో దోహదపడ్డారు. ఎన్నో దీపాలకు మూల కాంతి అంబేద్కర్ అని ప్రస్తుతించడం ఔచితీమంతంగా ఉంది.
~
“పోరాట యోధుడు
ఠాను నాయక్ వీరుడు
నిజాంను వణికించిన
లంబాడి గిరిజనుడు
వారెవ్వా! ఠాను నాయక్
దున్నే వాడిదే భూమన్న నాయక్” (85)
~
“స్వాతంత్ర్య సమరంలో
నేటి నిర్మల్ జిల్లా
రాంజీ గోండు వీరుడు
పోరాటాల ఖిల్ల్లా
వారెవ్వా! ఆదివాసీ యోధుడా
తీర్చావుగా గోండుల వ్యథలను” (87)
~
“వీర రతన కొలాం సూరు
జోడెన్ఘాట్ ఊరు
నిజాం వ్యతిరేక పోరు
భీం, సూరుల భలే పోరు
వారెవ్వా! కొలాం వీర
ఆదివాసీ క్రాంతి ధీర” (90)
ఇలా గిరిజన దిగ్గజాల సేవలను నేటి తరం పాఠకులకు పరిచయం చేశారు.
~
“బెంగాలీ పద్మం
ఆధ్యాత్మిక కిరణం
రచనలో ఆనందం
ఆశ్రమాల స్థాపనం
వారెవ్వా! అరవిందుడు
అఖండ పాండిత్యుడు” (118)
అరవిందుని గురించి ఇంత తక్కువ పదాలలో, సంక్షిప్తంగా చెప్తూనే, వారి జీవితాన్ని ప్రదర్శించే పదాలను ఎంచుకోడంలో కవి ప్రతిభ వ్యక్తమవుతుంది. అరవిందము అంటే పద్మము అనే అర్థాన్ని బెంగాలీ పద్మంతో సూచించడం చక్కని పదప్రయోగం! పాండిత్యుడు అనే పదం బహుశా కైతికల నియమాల కోసం వాడి ఉంటారు. మామూలు పరిభాషలో పండితుడనే వ్యవహరిస్తాం.
~
చివరగా బంజారా గురువైన రామారావు గారిపై కైతికలతో ముగించారు. అప్పటి వరకు వ్రాసిన కైతికల్లో ఐదవ పాదంలో తొలి పదంగా ‘వారెవ్వా’ ఉపయోగించగా, ఈ కైతికలో మాత్రమే తమ జాతి గురువు గారిని సన్నుతిస్తూ ‘జయహో’ అనే జయధ్వానాన్ని ఉపయోగించారు.
“నిర్గుణ నిరంకారి
బాల బ్రహ్మచారి
జగదాంబ పూజారి
జీవితమే సంచారి
జయహో రామరాయా
దివ్య జ్యోతి ప్రచోదాయా” (125)
~
ఈ పుస్తకంలో కవి ఒక ప్రయోగం చేశారు. దేశ నాయకుల పేర్లు విషయ సూచికలో ఇచ్చి, వారిపై కైతిక ఉన్న పేజీలో వారి పేరు కాకుండా వారి ఫోటో/చిత్రం ఉంచారు. ఇది గొప్ప ఆలోచన! తెలిసిన దేశనాయకులను సులువుగానే గుర్తిస్తాము. కానీ పేరు తప్ప రూపం తెలియని నలుగురైదుగురు నేతల విషయంలో కాస్త ఇబ్బంది కావచ్చు. అయినా దీన్ని చక్కని ప్రయోగం గానే భావించాలి.
చివరలో కఠిన పదాలకు అర్థాలు ఇవ్వడం వల్ల కొన్ని పదాలను కవి ఏ అర్థంతో వాడారో గ్రహించే వీలు కలిగింది.
ఎందరో మహనీయులను మరోసారి స్మరించుకునే అవకాశం ఈ పుస్తక పఠనం ద్వారా కలుగుతుందనడంలో అతిశయోక్తి లేదు.
***
రచన: రాథోడ్ శ్రావణ్
ప్రచురణ: ఉట్నూరు సాహితీ వేదిక
పేజీలు: 96
వెల: ₹ 80
ప్రతులకు:
రాథోడ్ శ్రావణ్
ఇం నెంబర్ 2-2/1
ఐబి సుభాష్ నగర్ ఉట్నూర్
ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ
చరవాణి సంఖ్య: 9491467715
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.

