Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దేశ విభజన విషవృక్షం-61

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

 

1932లో కమ్యూనల్ అవార్డు రావడంతోనే హిందూ సమాజంలో కూడా విభజనకు బీజం వేసింది. ప్రత్యేక ఎలక్టొరేట్ల ద్వారా మతాల వారీగా, కులాల వారీగా ఒక స్పష్టమైన విభజనరేఖ గీసింది. 1931లో లండన్‌లో జరిగిన రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీ గారితో పాటు అంబేద్కర్, సరోజినీ నాయుడు, మహమ్మద్ అలీ జిన్నా లాంటి వారు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారికంగా హాజరైంది మహాత్మా గాంధీ ఒక్కరే. మిగతా వారంతా వేర్వేరు సెక్షన్లకు ప్రతినిధులుగా హాజరయ్యారు. ఒకరు లిబరలిస్టులుగా, ఒకరు ముస్లింగా మరొకరు నిమ్న కులాలకు ప్రతినిధిగా, ఒకరు విశ్వ విద్యాలయాల ప్రతినిధిగా, ఒకరు బ్రిటిష్ ఇండియా ప్రతినిధిగా, ఒకరు ఇండియన్ క్రిస్టియన్లకు ప్రతినిధిగా.. ఇలా పలువురు ఈ కాన్ఫరెన్సుకు హాజరయ్యారు. ముస్లింలు ఈ దేశంలో పనితనాన్ని బట్టి, ప్రతిభను బట్టి గౌరవం ఉండేది తప్ప.. కులాలు, మతాలను బట్టి ఎన్నడూ లేదు. ఇందుకు అనేక ఆధారాలున్నాయి. ముస్లింలు చొచ్చుకొని వచ్చాక మత విభజన రేఖ మాత్రమే ఏర్పడితే.. బ్రిటిషర్లు వచ్చిన తరువాత.. వందలాది విభజన రేఖలు అదే పనిగా గీసేశారు. బ్రిటిష్ వాళ్ల కాన్ఫరెన్సులన్నీ కూడా ఈ గీతల ఆధారంగానే సాగాయే తప్ప ఐక్యత ఆధారంగా సాగలేదు. అదే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మనం యథాతథంగా అంగీకరించి అదే మూస పద్ధతిలో అనుసరిస్తూ పోవడం వల్ల ఈ అంతరాలు రోజు రోజుకూ పెరిగిపోయి.. పూడ్చలేని అగాధాలు ఏర్పడ్డాయి. ఇవాళ ఎన్నికల రాజకీయాల కారణంగా సమాజం అన్ని రకాలుగా ముక్కలు చెక్కలుగా కనిపిస్తున్నది. రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో కమ్యూనల్ అవార్డు గురించిన చర్చ ప్రధానంగా జరిగింది. మహాత్మాగాంధీ గారు.. ఇన్ని రకాలుగా వర్గాలను ఏర్పాటు చేసి ప్రతినిధులను పిలవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. భారత జాతీయ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుందని స్పష్టం చేశారు. హిందువులలో అంటరానివారు.. హరిజనులను వేరు చేసి చూడటం ఎంతమాత్రం సరికాదని తేల్చి చెప్పారు. వారంతా హిందువులేనని స్పష్టంగా పేర్కొన్నారు. ముస్లింలు, ఇతర మతాలకు ప్రత్యేక రక్షణలు, నియోజకవర్గాలు ఏర్పాటు చేయడాన్ని కూడా ఆయన సమర్థించలేదు. కానీ.. గాంధీ వాదనకు వీసమెత్తు ప్రాధాన్యం కూడా లభించలేదు. ఏ ఖిలాఫత్ ఆందోళనకు మద్దతు కోసం గాంధీగారిని వాడుకున్న ముస్లిం నాయకులు గాంధీగారి ఈ వాదనలను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. ముస్లిం నాయకులు గాంధీ గారిని పూర్తిగా తీసి పడేశారు. అటు అంటరాని వారి విషయంలోనూ మహాత్మాగాంధీతో డాక్టర్ అంబేద్కర్ ఘర్షణ పడ్డారు. తరువాత ఏడాదికి పూణా ఒడంబడిక ద్వారా వీరిద్దరు తమ విభేదాలను పరిష్కరించుకున్నారు. అది వేరే సంగతి. రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు రెండు వారాలకు ముందే యూకేలో లేబర్ పార్టీ ప్రభుత్వం పడిపోయి.. కన్సర్వేటివ్‌లు అధికారంలోకి వచ్చారు. అప్పుడు మనకు వైస్రాయ్‌గా కన్సర్వేటివ్ నాయకుడు రామ్సే మెక్ డొనాల్డ్ ఉన్నారు. ఈయన కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. ఈయనే మైనార్టీ హక్కుల పరిరక్షణ పేరుతో ముస్లింలకు ప్రాతినిథ్యం కోసం (మిగతా మతాలు కూడా ఉన్నాయి) కమ్యూనల్ అవార్డును రూపొందించాడు. గాంధీజీ ఒఠ్ఠి చేతులతో భారత్‌కు తిరిగి వచ్చారు. సదస్సులో ఆయన మాటకు విలువే లేకుండా పోయింది.

మూడో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు నవంబర్ 17, 1932న ప్రారంభమైంది. ఈ సమావేశానికి గాంధీజీ కానీ, కాంగ్రెస్ ప్రతినిధులు ఎవరూ కూడా హాజరు కాలేదు. రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో తమకు అనుకూలంగా వచ్చిన కమ్యూనల్ అవార్డుతో ముస్లిం నేతలకు మరింత ఉత్సాహం వచ్చింది. దీంతో రెండు దేశాల సిద్ధాంతం పురుడు పోసుకొన్నది. మహమ్మద్ అలీ జిన్నా హిందువులతో కలిసి జీవించజాలమని విస్పష్టంగా తేల్చి చెప్పాడు.

కూర్చున్నవారిలో ఎడమవైపు తొలి వ్యక్తి చౌదరీ రహమత్ అలీ, మధ్యలో మహమ్మద్ ఇక్బాల్, కుడివైపున ఖ్వాజా అబ్దుల్ రహీం. ఇతర యువ ముస్లిం కార్యకర్తలు 1932 నాటి ఫొటో..

కానీ.. కాంగ్రెస్ వారికి మాత్రం సంతుష్టీకరణ భ్రమలు తొలగిపోలేదు. 1933లో పాకిస్తాన్ (ఇంగ్లిష్‌లో ముందుగా వాడిన పేరు Pakistan) పేరు పుట్టింది. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదువుతున్న రహమత్ అలీ షా ఈ పాకిస్తాన్ అన్న పేరును తొలిసారి ఖాయం చేశారు. ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడూ సాధించలేము. ముందుగా ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలతో కలిపి ప్రత్యేక ఇస్లాం దేశాన్ని సాధించాలని రహమత్ అలీ షా పిలుపునిచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్‌ను సాధించాల్సిందేనని పేర్కొన్నారు. దక్షిణాసియాలో ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని పిలుపునిచ్చాడు. 1933లో చౌదరీ రహమత్ అలీ షా ఒక కరపత్రం రూపంలో విడుదల చేశాడు. ‘Now or never.. are we to live or perish forever’ అని స్పష్టంగా పేర్కొన్నాడు.  కేంబ్రిడ్జి యూనివర్సిటీలో న్యాయ విద్య చదువుతున్న సమయంలోనే ఆయన ఈ కరపత్రాన్ని విడుదల చేశాడు. రహమత్ అలీ షా విడుదల చేసిన కరపత్రంలో పాకిస్తాన్ ఆవశ్యకత గురించి చెప్పటంతో పాటు.. భారతదేశంలోని ఇతర ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలను కూడా ప్రత్యేక దేశాలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ అంటే ఇవాళ వికీపీడియాలో కనిపించే అర్థం వేరే ఉంటుంది. ‘Pakistan is both a Persian and Urdu word… It means the land of the Paks, the spiritually pure and clean.” Etymologists note that پاک pāk, is ‘pure’ in Persian and Pashto and the Persian suffix ـستان -stan means ‘land’ or ‘place of’.

ఈ నిర్వచనాన్ని కూడా రహమత్ అలీ షా నే  ఖరారు చేశాడు. పాకిస్తాన్ అన్న పదం పర్షియా, ఉర్దూ పదం. పాక్ అంటే స్వచ్ఛమైనది.. స్తాన్ అంటే భూమి. స్వచ్ఛతకు స్థానమైనది అని అర్థం. కానీ రహమత్ అలీ షా యే పాకిస్తాన్ అన్న పదాన్ని ఏ విధంగా ఖరారు చేశాడో చూడండి. పాకిస్తాన్‌లో.. p అంటే పంజాబ్, a అంటే అఫ్గానియా.. (నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్), k అంటే కాశ్మీర్, s అంటే సింధ్, tan అంటే బలూచిస్తాన్.. ఈ విధంగా పాకిస్తాన్ పేరు ఖరారైంది. ఆ తరువాత 1947లో పాకిస్తాన్ ఏర్పడినప్పుడు కాశ్మీర్ మినహా మిగతా ప్రాంతాలన్నీ కూడా పాకిస్తాన్ లో అంతర్భాగమైనాయి. రహమత్ అలీషా విడుదల చేసిన ఈ కరపత్రాన్నే పాకిస్తాన్ డిక్లరేషన్ గా పేరు పొందింది.

‘Our religion and culture, our history and tradition, our social code and economic system, and our laws of inheritance, succession and marriage are fundamentally different from those of most peoples living in the rest of India. The ideals which move our people to make the highest sacrifices are essentially different from those which inspire the Hindus to do the same. These differences are not confined to broad, basic principles. Far from it. They extend to the minutest details of our lives. We do not inter-dine; we do not inter-marry. Our national customs and calendars, even our diet and dress are different.’ (Choudhry Rahmat Ali in January 1933)

అంతే కాదు.. ముస్లిం ఇండియన్ నేషనలిజంగా తన సిద్ధాంతాన్ని రహమత్ అలీ బలపరచుకున్నాడు.

“for so firm was the grip of ‘Muslim Indian Nationalism’ on our young intellectuals at English universities that it took me (Rahmat Ali) more than a month to find three young men in London who offered to support and sign it.”

ఆ తరువాత అతని రాజకీయ ప్రత్యర్థులతో సహా పాకిస్తాన్ అన్న పదాన్ని వినియోగించడం మొదలు పెట్టారు. ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తావించాలి. పాకిస్తాన్ ప్రతిపాదనకు సమర్థనగా ఉండటం కోసం ఈ రహమత్ అలీ భారతదేశం అనే భావననే తిరస్కరించాడు. అసలు భారతదేశం అనే భావనను ముందుగా సృష్టించింది బ్రిటిష్ వారేనని పేర్కొన్నాడు. బ్రిటిష్ వారి సామ్రాజ్యవాదానికి గులాంగిరీ చేయడం కోసం భారత జాతీయ కాంగ్రెస్ ఉద్భవించిందని, అంతే తప్ప భారతీయత అన్నది మిథ్య అని తేల్చేశాడు. భారతదేశం అనేక రకాలైన దేశాలు, జాతులు, మతాలతో కూడిన ఖండంగా పరిగణించాడు. ముస్లింలు, సిక్కులు, అఛూత్ (అంటరానివారు), రాజ్‌పుత్‌లు, మరాఠాల ప్రత్యేక దేశాల సమాహారమే తప్ప ‘ఇండియనిజం’ అన్న మాట కేవలం బ్రిటిష్ వారు పుట్టించిందేనని అన్నాడు. కాబట్టే ముస్లింలు అధిక జనాభా ఉన్న ప్రాంతాలను ముస్లింలకు ఇచ్చేయాల్సిందేనని.., రహమత్ అలీ తన వ్యాసాల్లో పదే పదే డిమాండ్ చేస్తూ వచ్చాడు. ఆల్ ఇండియా అన్న మాటే అసంబద్ధమైందని కూడా అన్నాడు. ఇప్పుడు 75 ఏండ్ల తరువాత ఈ దేశంలోని హేతువాదులు, కమ్యూనిస్టులు, లిబరలిస్టులు, రేషనలిస్టులు.. ఇదే వాదనను కంటిన్యూ చేయడం మనకు తెలిసిన విషయమే. ఇదేమీ రహస్యమేమీ కాదు. ఇంటర్నెట్‌లో గూగుల్ ను అడిగినా దీని గురించిన సమాచారం లభ్యమవుతుంది.

రహమత్ అలీకి ముందే.. 1930లో మహమ్మద్ ఇక్బాల్… (ఇవాళ మనం సారే జహాసే అచ్చా అన్న పాట పాడుకుంటున్నామే.. ఆ గీత రచయిత ఈయనే.) దాదాపుగా రహమత్ అలీ ఆకాంక్షనే వ్యక్తం చేశారు. 1930, డిసెంబర్ 29 న జరిగిన ముస్లిం లీగ్ సమావేశంలో అధ్యక్షోపన్యాసం చేశాడు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి చదవండి.

‘I would like to see Punjab, North-West Frontier Province, Sindh and Baluchistan amalgamated into a single State. Self-government within the British Empire, or without the British Empire, the formation of a consolidated North-West Indian Muslim State appears to me to be the final destiny of the Muslims, at least of North-West India.’

సరిగ్గా ఇదే అంశాన్ని రహమత్ అలీ రెండేళ్ల తరువాత తన కరపత్రంలో పేర్కొన్నాడు. మూడో రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ పాకిస్తాన్ డిక్లరేషన్ గురించిన చర్చ విస్తృతంగా చర్చకు వచ్చింది. ముస్లిం విద్యార్థులు  ఇస్లాం దేశం కావాలని బలంగా కోరుకొంటున్నారని ముస్లిం ప్రతినిధులు వాదించారు. అప్పటికి ఆ కాన్ఫరెన్సు పాకిస్తాన్ అన్న మాటను పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. ఈ చర్చకు ప్రాధాన్యం ఇవ్వలేదు. దానిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఆ తరువాత మూడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుల సారాంశంగా ప్రత్యేక ఎలక్టొరేట్లతో కలిసి ఒక చట్టం ఏర్పాటు చేశారు. అది 1935 నుంచి అమలు లోకి వచ్చింది. అదే 1935 ఇండియన్ యాక్ట్. ఇందులోని చాలా చాలా చట్టాలు ఇప్పటికీ ఈ దేశంలో అమలు అవుతున్నాయి.

పాకిస్తాన్‌తో పాటుగా రహమత్ అలీ షా ప్రతిపాదించిన అంశాలు ఇంకా ఉన్నాయి. అనేక మ్యాపులను విడుదల చేశాడు. దక్కన్, బెంగాల్ రీజియన్‌ను ముస్లిం హోం ల్యాండ్‌గా అభివర్ణించాడు. బెంగాల్ మొత్తాన్ని ‘బంగిస్తాన్’గా ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని తన రాతల్లో పిలుపునిచ్చాడు. మొత్తం దక్కన్ ప్రాంతాన్ని ‘ఉస్మానిస్తాన్’ గా మరో దేశం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాడు. రహమత్ అలీ ప్రతిపాదించిన బెంగాల్ (బంగిస్తాన్)తోపాటు, అస్సాం, అరుణాచల్, నాగాలాండ్, త్రిపుర, మిజోరాం, హర్యానా, పంజాబ్, హైదరాబాద్ (ఉస్మానిస్తాన్), జునాగఢ్, భోపాల్.. ప్రాంతాలన్నీ తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. వీటన్నింటికీ రకరకాల పేర్లు పెట్టాడు. హైదరిస్తాన్, సిద్దికిస్తాన్, ఫరూకిస్తాన్, ముయినిస్తాన్, మాప్లిస్తాన్, షఫీయిస్తాన్, నాసరిస్తాన్, అఛూతిస్తాన్  (అంటరాని వారి దేశం) ఇలా చాలా పేర్లతో అఖండ భారతంపై ఆకుపచ్చ బొమ్మలు గీశాడు. ఇతని మ్యాపుల్లో భారత ఉపఖండం పేరును ‘పాకాసియా’ అని మార్చేశాడు. ఇండియా (india) అన్న పదంలో d అన్న అక్షరాన్ని మార్చేసి డినియా (dinia)గా మర్చేశాడు. ఈ డినియా అనేది పాకిస్తాన్, ఉస్మానిస్తాన్, బంగిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది.

ఇక పైన చెప్పిన బంగిస్తాన్ అనేది తూర్పు బెంగాల్, అస్సాం బీహార్‌తో కలిసి స్వతంత్ర దేశంగా ఏర్పడాలని ప్రతిపాదించాడు. హైదరాబాద్ స్టేట్‌ను సంపూర్ణ ఇస్లామిక్ రాజ్యంగా ఉస్మానిస్తాన్ పేరుతో ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని సూచించాడు. అదే జరిగి ఉంటే.. ఇవాళ ఈ రచయిత కూడా ముస్లిం అయి ఉండేవాడేమో.. ఈ రహమత్ అలీ అనే వాడు ఎలాంటి వాడంటే.. ఎక్కడా కూడా భారత్, హిందూ అన్న పదాలు వినపడకుండా కనుమరుగు కావాలని ప్రయత్నించాడు. భారత దేశానికి మూడు వైపులా ఉన్న సముద్రాల పేర్లను కూడా బంగియాన్ (బంగాళాఖాతం), పాకియాన్ (అరేబియా సముద్రం), ఉస్మానియాన్ (హిందూ మహాసముద్రం) గా మార్చాలని ప్రతిపాదించాడు. ఈ మ్యాపులను రూపొందించడానికి రహమత్ అలీ తన పొజిషన్‌ను కూడా ప్రకటించుకొన్నాడు. సిద్ధికిస్తాన్, నాసరిస్తాన్, షఫీయిస్తాన్ జాతీయ ఉద్యమాల వ్యవస్థాపకుడు అని తనను తాను ప్రకటించుకొన్నాడు.

ఇదే ప్రతిపాదన ఆ తరువాత క్రమంగా బలపడుతూ వచ్చింది. 1940 నాటికి వాళ్ల డిమాండ్ పెరుగుతూ వచ్చింది. మీరు కొంచెమైనా ఊహించగలుగుతున్నారా? ఒకవేళ ఇవే డిమాండ్లు వాస్తవంగా పరిణమించి ఉంటే.. భారతదేశం ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించగలమా? అత్యంత భయంకరమైన పరిస్థితి. ఎంత దారుణంగా ఉండేది.. ఈ దేశం ఎన్ని ముక్కలుగా ఉండేదో ఆలోచిస్తేనే భయమేస్తుంది. ఇదే నిజమైతే.. ఇక భారతదేశం అన్న మాటకు.. అస్తిత్వానికి ఉనికే లేకుండా పోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. పర్షియా, సౌదీ మాదిరిగా భారతదేశమూ చచ్చిపోతుంది. అంతకుమించి మరేమీ ఉండదు. కానీ, ఈ చర్చ దేశ విభజన జరిగేంత వరకూ కొనసాగుతూనే ఉన్నది. కానీ పాకిస్తాన్ పేరును ఖాయం చేసిన రహమత్ అలీకి మాత్రం స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తన దేశంలోనే దిక్కు లేకుండా పోయింది. పాకిస్తాన్ ఏర్పడిన తరువాత రహమత్ అలీ లాహోర్‌కు వెళ్లాడు. కానీ అతనికి పాకిస్తాన్ ఏర్పడిన తీరు ఎంతమాత్రం నచ్చలేదు. తాను 1933లో ఊహించుకున్న పాకిస్తాన్ కాకుండా ఒక చిన్న ముక్క మాత్రమే పాకిస్తాన్ గా ఏర్పడటాన్ని ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోయాడు. ఇలాంటి పాకిస్తాన్ ఏర్పాటును అంగీకరించిన జిన్నాను తీవ్రంగా తప్పుపట్టాడు. ఇతని కార్యకలాపాలను పాకిస్తాన్ ప్రభుత్వం ఎంతమాత్రం సహించలేకపోయింది. చివరకు ఏ పాకిస్తాన్ పేరును రహమత్ అలీ సృష్టించాడో అదే పాకిస్తాన్ నుంచి దేశ బహిష్కారానికి గురయ్యాడు. అతనికి సంబంధించిన వస్తువులన్నింటినీ అప్పటి ప్రధాని లియాఖత్ అలీఖాన్ జప్తు చేశాడు. కట్టుబట్టలతో.. ఒంటరిగా తిరిగి బ్రిటన్‌కు వెళ్లిన రహమత్ అలీ కేంబ్రిడ్జిలోని ఎడ్వర్డ్ వెల్బోర్న్ లోని ఎమ్మాన్యుయెల్ కాలేజీలో అనాథలా చనిపోయాడు. చివరకు అతని అంత్యక్రియలకు, వైద్యానికి అయిన ఖర్చులను పాకిస్తాన్ హై కమిషనర్ చెల్లించారు.

ఈ దేశంలో రామాయణాన్ని చదివేవారు.. శ్రీరాముడిని ఎలుగెత్తి జై శ్రీరామ్ అని పిలిచేవారు ఒక్కరు ఉన్నా సరే.. ఈ దేశానికి ఏమీ జరుగదన్న విశ్వాసమే ఈ దేశాన్ని నిలబెట్టింది. అదే ఈ దేశం గొప్పతనం. అందుకే.. ఈ దేశం ఈ మాత్రమైనా మిగిలి ఉన్నది. ఎప్పటికీ ఉండిపోతుంది. ఇది శాశ్వతం. సనాతనం.

(సశేషం)

Exit mobile version