[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘దేహమే దేవాలయం’ అనే రచనని అందిస్తున్నాము.]
శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అనది శాస్త్ర వచనం. అంటే ఈ దేహం మాత్రమే ధర్మసాధనకు, ఉన్నత లక్ష్యాల సాధనకు ఉపకరిస్తుంది. ఈ శరీరమనే నౌక సహాయం తోనే మానవులు అతి దుర్లభమైన ఈ సంసారమనే సాగరాన్ని దాటగలుగుతున్నారు. ఈ జీవితంలో జనన మరణ స్థితితోపాటు, అంతిమంగా మోక్షం పొందాలంటే, అది ఈ శరీరమనే నౌకతోనే సాధ్యపడుతుంది. అందుకే ఈ శరీరాన్ని నిర్లక్ష్యం చేయకుండా, సాధనకు అనుకూలంగా ఉంచుకోవడం ప్రథమ కర్తవ్యం.
కొన్ని శాస్త్రాలు ఈ శరీరాన్ని అతి లోలత్వంతో గారాబం చేయవద్దని కూడా హెచ్చరిస్తున్నాయి. అంటే ఈ శరీరాన్ని సకల భోగభాగ్యాలను అనుభవించడానికి అలవాటు చేస్తే, అతి నిద్ర, బద్ధకం, చంచలత్వం వంటి వికారాలకు లోబడి తద్వారా మనస్సులో తామసిక, రాజసిక గుణాలు ప్రవేశిస్తాయి. అప్పుడు ఇక సత్వ ప్రధానమైన మనస్సుతో సాధన చేయడం అసాధ్యం. ఇంద్రియాలను నియంత్రించకుండా, కోరికలకు దాసోహమైతే, దేహం దాని ప్రయోజనాన్ని కోల్పోతుంది.
శ్లోకం:
దేహో దేవాలయః ప్రోక్తో, జీవో దేవః సనాతనః।
త్యజేదజ్ఞాన నిర్మాల్యం, సోऽహం భావేన పూజయేత్॥
ఈ శ్లోకం ప్రకారం, పవిత్రమైన దేవాలయం బయట ఎక్కడో లేదు, మన శరీరమే అసలైన ఆలయం. ఈ ఆలయంలో కొలువై ఉన్న దైవం మరెవరో కాదు, శాశ్వతుడైన జీవుడు . అంటే, మన అంతరంగమే దైవ నివాసం.
ఈ సిద్ధాంతం మనకు రెండు ముఖ్యమైన విషయాలను బోధిస్తుంది:
శారీరక పవిత్రత: శరీరాన్ని ఆలయంగా భావించినప్పుడు, దానిని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా, పవిత్రంగా ఉంచుకోవడం మన ధర్మంగా మారుతుంది.
ఆంతరంగిక సాధన: బయటి దైవాన్ని వెతకడం మానేసి, మనలో ఉన్న అజ్ఞానాన్ని, దురాశను (నిర్మాల్యాన్ని) తొలగించాలి. ‘నేనే ఆ పరమాత్మను’ అనే ‘సోऽహం’ భావనతో (ఆత్మ సాక్షాత్కారంతో) అంతరంగంలోనే దైవాన్ని పూజించాలి.
అందుకే, ధర్మసాధన, జ్ఞాన సముపార్జనలకు ఈ దేహాన్ని సాధనా మందిరంగా గౌరవించి, దానిని ఆరోగ్యంగా ఉంచుకోవడం మన మొదటి కర్తవ్యం.
దేహమే దేవాలయం అనే ఉపనిషత్తు వాక్యం ప్రకారం మన దేహం కేవలం భౌతిక నిర్మాణం మాత్రమే కాదు, ధర్మాన్ని, ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ఉపకరించే పవిత్రమైన ఆలయం. అందుకే, ఈ శరీరాన్ని అత్యంత గౌరవంగా, జాగ్రత్తగా చూసుకోవాలి. దేవాలయాన్ని ఎలాగైతే శుభ్రంగా, పవిత్రంగా ఉంచుతామో, అలాగే మన శరీరాన్ని వ్యాయామం, సరైన ఆహారం, యోగా మరియు మంచి ఆలోచనలతో దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఎందుకంటే, దేహమనే ఈ ఆలయం ఆరోగ్యంగా ఉంటేనే, దానిలో నివసించే ఆత్మ ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంటుంది. ఈ దేహమనే సాధనం బలంగా ఉంటేనే, మనం సంసార సాగరాన్ని దాటి, ఈ జీవిత లక్ష్యాన్ని చేరుకోగలం. కాబట్టి, ఈ పవిత్ర దేహాన్ని తాత్కాలిక భోగాలకు ఉపయోగించే వస్తువుగా కాకుండా, ఉన్నతమైన సాధనా మందిరంగా భావించాలి.
మరొక ఉపనిషత్తు వాక్యం “ఇత్తిష్టత జాగ్రత ప్రాప్య వరాన్నిబోధిత” అని చెబుతోంది. అంటే దేహం, ఇంద్రియాలు, మనోబుద్ధుల పటుత్వం తగ్గకముందే మానవులు ఆత్మజ్ఞాన సాధనకు ఉపక్రమించాలని ఈ వాక్యం అర్థం. యౌవనం, చురుకుదనం ఉన్నప్పుడే ఆధ్యాత్మిక లేదా ధార్మిక లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నించాలి. వృద్ధాప్యం, రోగాలు దేహాన్ని ఆక్రమించకముందే సాధన చేయాలి.
అరిషడ్వర్గాలకు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు) లోనయి సాధనకు ఆలస్యం చేస్తే, అనేక రోగాలు ఈ శరీరాన్ని ఆక్రమించి చివరకు ఈ నౌకకు చల్లులు పడే ప్రమాదం ఉంది. అప్పుడు ఆలస్యం చేసామని చింతించి అసలే లాభం లేదు. అందుకే వివేకానంద వంటి మహనీయులు “బలమే జీవితం, బలహీనతే మరణం” అని చెప్పి, దేహాన్ని దృఢంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో నొక్కి చెప్పారు. ఉపవాసాలు, వ్యాయామం, యోగా వంటి పద్ధతుల ద్వారా దేహాన్ని సాధనకు అనువుగా తీర్చిదిద్దుకోవాలి.
ఇక మరొక ఉపమానంలో ఈ దేహాన్ని ఒక బండితో, మనస్సును దానిని నడిపే గుర్రంతో పోల్చారు. ఈ ఉపమానంలో ఆత్మను బండిలోని ప్రయాణీకుడిగా, బుద్ధిని సారథిగా, ఇంద్రియాలను గుర్రపు పగ్గాలుగా పోల్చారు. కేవలం దేహానికి (బండికి) మాత్రం ప్రాధాన్యత ఇచ్చి, మనసును (గుర్రాన్ని) నియంత్రించకుండా విడిచిపెడితే, అది గుర్రానికి ముందు బండిని కట్టినదానితో సమానం. అంటే ప్రయోజనం లేని పరుగు అవుతుంది. అందువలన మానసిక సమత్వం, అంతరంగ శాంతి కోసం మనస్సును నియంత్రిస్తూ, బుద్ధి అనే సారథి ద్వారా దేహమనే బండిని అతి జాగ్రత్తగా గమ్య స్థానానికి చేర్చాలి. అప్పుడే ఈ మానవ జీవితం ధన్యమవుతుంది. ధర్మసాధనకు దేహాన్ని ఒక పవిత్ర సాధనంగా భావించాలి తప్ప, కేవలం భోగ వస్తువుగా పరిగణించకూడదు.
