[శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల గారు రచించిన ‘డిసెంబరు నెల’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
మాస సంచయంలో
మిగిలిన చివరి పుట
డిసెంబరు నెల
మరలి పోతానంటూ
మరల వచ్చేసింది.
మొన్న కురిసిన వానకు
నీరుదిగిన గోడకంటిన మరకలనంటించుకుని
అది సాధారణమైనట్టుగా
తారీఖు గళ్ళకు రాసి పూసింది.
చలివేకువ ఉదయంలో
బరువు కనులకు
మెలకువను తెచ్చింది.
గడచిన అనుభవాల వయసును పెంచి
హైరాన పడవద్దంటూ
కొక్కానికి మరల
కొత్తచొక్కాను తగిలించింది.
కిటికీ కవతల పూల మందారం చెట్టు
చలిని ఒడిలో దాచుకుని
ఎర్రని రెక్కలతో విరిసి
మౌనధ్యానం చేసింది.
మంచుతెరల వాకిట
పరచుకున్న పచ్చిక తివాచీ పైన
రాలిన ఎండుటాకొకటి
వర్తమానానికి తరగని విశ్వాసమిచ్చింది.
ఈ డిసెంబరు నెల మరలిపోతూ
తెగ సందడిని చేస్తుంది.
కన్య మేరి సుతుని ఆగమన సమీపానికి
గగన చుక్క మొలిచి
శాంతి సందేశ మిచ్చింది.
దూరాన చర్చి ప్రార్థనల
సంగీతం పశుల పాకలో శిశువును
ఒడికెత్తుకుంది.
కరుణ కాంతుల కొవ్వొత్తి కరిగి
దీన గాథల అంచులకు తాకింది
వెళ్ళి వస్తానని వీడ్కోలు చెబుతూ..
భేషజం లేని భావమొక్కటిగా
లోక దృష్టి నంతటిని
వెలుగు తీరాల కలలకు నిలిపింది.
ఈ డిసెంబరు నెల
మరలిపోతూ తెగ సందడిని చేసింది.
ఆ మూల మడిలో మొలకలెత్తిన
బంతి పూల మొక్క మొగ్గ తొడిగింది.